జీవన శైలి - బుద్దవరపు కామేశ్వరరావు

life style

అది నగరంలోని ఓ ప్రశాంత వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో కట్టిన ఒక వృద్ధారామం. చుట్టూ ప్రహారీ గోడ, మెయిన్ గేటు తెరిచి లోపలికి ప్రవేశించగానే, ఎడమవైపు ఓ ముప్పై అడుగుల దూరంలో ఆఫీసు గది, దాని వెనక వరుసగా ఓ పది గదులు. ఈ గదులను నామమాత్రపు సొమ్ము తీసుకుని వృద్ధ దంపతులకు ఇస్తారు. వాటి వెనుక మెడిటేషన్ గది. ఇక గేటుకి కుడి వైపు ఓ పది గదులు. వీటిలో ఓ ఐదు గదులు ఎవరి ఆదరణకు నోచుకోని వృద్ధులైన వితంతువులకు, ఇంకో ఐదు గదులు అనాధలైన వృద్ధులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో గదిలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీటి వెనుక కిచెన్, డైనింగ్ హాలు, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. అన్ని గదులలోనూ మంచాలు, టీవీ, ఎటాచ్ బాత్రూమ్ లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకసారి ఆ ప్రాంగణంలో అడుగు పెట్టిన ఎవరికైనా, అక్కడి వాతావరణం, సదుపాయాలు, ఆప్యాయతలు చూసి, తాము కూడా ఆ ఆశ్రమంలో చేరితే బాగుండును అని అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. ***** ***** ***** ***** అదిగో ...ఆ ఆశ్రమంలో భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న వాకింగ్ ట్రాక్ మీద రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారు వృద్ధ దంపతులైన డెబ్బై ఐదేళ్ల రావుగారు, డెబ్బై ఏళ్ల రాణెమ్మ గారు. "ఏమండీ, ఉమ్మడి కుటుంబాలలో పుట్టి పెరిగిన మనం, అసలు ఎప్పుడైనా అనుకున్నామా ? ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఇలా అనాధలుగా ఉండాల్సి వస్తుందని ?" "రాణీ, ఇంక అదే పనిగా ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోకు. కాలంతో పాటు మనమూ మారాలి. చూడు, మన తల్లిదండ్రులు అధిక సంతానానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ మనం మటుకు ఇద్దరితో సరిపెట్టాం. మన పిల్లలైతే కేవలం ఒకరితోనే. అయినా, ఇక్కడ మాత్రం మనకు ఏం తక్కువ? అందరం ఒకే వయసు వాళ్ళం. హాయిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టు, కబుర్లు చెప్పుకుంటున్నాం." అన్నారు రావుగారు. "ఏంటండీ బావగారూ, ఇంకా వాకింగ్ పూర్తి అవ్వలేదా ? " రావుగారి దంపతులను అడిగారు, బిల్డింగుల మధ్య ఉన్న పార్కులో ఒక సిమెంట్ బల్లమీద కూర్చున్న రామం గారు. "లేదు బావగారూ ! సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు మా పెద్దబ్బాయి అమెరికా వెళ్లాడు. మేము అక్కడికి వెళ్లడమే కానీ వాడు మళ్ళీ రాలేదు. ఇదిగో మీ అక్కయ్య అది తలుచుకుని బాధ పడుతూంటే , ఇదిగో ఇలా బయటికి తీసుకువచ్చా." "అక్కయ్య గారూ, మాకు ధైర్యం చెప్పవలసిన పెద్దవారు మీరే అలా బాధ పడితే ఎలా ? ఇక్కడ మనకు లోటు ఏముంది? మన పిల్లల్లాగ బ్రో, ఆంటీ, అంకుల్ అని పిలుచుకోకుండా, అందరమూ హాయిగా అక్కా, చెల్లీ, బావా, అన్నయ్య అంటూ వరసలు పెట్టి పిలుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాం. పిల్లలు దగ్గర ఉంటే ఈ స్వేచ్ఛ ఉంటుందా ? అసలు వాళ్ళ భావాలతో మన భావాలు కలుస్తాయా?" "బాగానే ఉంది కానీ, ఒక్కడివే కూర్చున్నావు మా మరదలు ఏది తమ్ముడూ ?" "రేపు, లండన్ లో ఉంటున్న మా అబ్బాయి పుట్టినరోజు, గదిలో ఉండి వాడితో ఫోన్ లో మాట్లాడుతోంది. దూరంగా ఉంటేనే కదా బంధాలు దగ్గిరయ్యేది అక్కయ్యగారూ ! సరే ఇక నేను వెళ్తాను బావగారూ ! ఎందుకంటే రేపు ఉదయం మెడిటేషన్ క్లాస్ నేనే కండక్ట్ చేయాలి " అంటూ అక్కడి నుంచి కదిలేరు రామంగారు. ***** ***** ***** ***** "అందరిదీ ఒకటే బాధ, పిల్లలకు దూరంగా ఉన్నామని. అంటే మన తరం పెంపకంలో తేడా ఉంది అంటారా ?" అడిగారు రాణెమ్మ, నడుస్తూనే. "మనం సరిగ్గానే పెంచాం. అక్షర క్రమంలో అమ్మ, ఆవు అని మనం నేర్పితే వాళ్లు పెద్ధయ్యాకా వాటిని అమెరికా, ఆస్ట్రేలియా అని అర్ధం చేసుకుని వాళ్ళ దోవ వాళ్ళు చూసుకున్నారు." "అంటే, అమ్మ, ఆవు ఎప్పటికైనా వట్టి పోయేవే అని వాళ్లకి ముందే తెలుసేమోనండీ. అందుకే ఇలా వదిలించుకున్నారేమో ?" "అలా ఎందుకు ఆలోచిస్తావు రాణీ? మనం ఉద్యోగం కోసం మన తల్లిదండ్రులను పల్లెటూరులో వదలి పట్నానికి వచ్చినట్టు, మన పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ దేశం వదలి విదేశాలకు వెళ్లేరు అనుకోవచ్చుగా ! మనకు ఆ విదేశీ జీవనశైలి నచ్చక వచ్చేసాం కానీ వాళ్ళు వదిలించుకున్నారని ఎందుకు అనుకోవాలి". అనునయించారు రావు గారు. ***** ***** ***** ***** "కమలా, ఏంటమ్మా ? ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ" నడక ఆపి, మెడిటేషన్ గది నుంచి బయటకు వస్తున్న ఆమెను అడిగారు రాణెమ్మ, "ఏమీ లేదు పిన్ని గారూ ! రేపు సాయంత్రం ఇక్కడ హరికథ చెప్పాలి కదా ! దానికి ఓ సారి రిహార్సల్ చేస్తున్నా. అంతేకాదు, అసలు కుటుంబం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నాకు, ఇలాంటి ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉండే అవకాశం కల్పించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను" అని చెప్పి అక్కడ నుండి బయలుదేరింది కమల. ***** ***** ***** ***** "చూసావా ! ఆ కమల ఎంత ఆనందంగా చెబుతోందో, ఇక్కడ ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టు ఉందని. అది తృప్తి పడడమంటే !" చెప్పారు రావుగారు నడక కొనసాగిస్తూ. "సర్లెండి, కానీ మనవళ్లకి కధలు చెప్పడం లాంటి సరదాలు ఇక్కడ తీరవుకదా ?" "ఏమిటోయ్, నీ ఛాదస్తం. ఇంకా ఈ రోజుల్లో బామ్మల కధలు వినే పిల్లలెవరున్నారు? మన కాలంలో అయితే ఈ టీవీలు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి, అమ్మమ్మలు చెప్పే సంగతులు ఆసక్తిగా వినేవాళ్లం. అంతెందుకు, పిల్లలిద్దరి దగ్గిరా ఆరేసి నెలలు ఉండి వచ్చాం. నువ్వు కధలు చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్క మనవడైనా విన్నాడా ? ఇప్పుడు అమ్మమ్మ డ్యూటీ గూగులమ్మ చేస్తోందోయ్." "సర్లెండి, ఆ మామిడి చెట్టు కింద ఓ పది నిమిషాలు కూర్చుని లోపలికి వెళ్దాం పదండి." ***** ***** ***** ***** "అయితే, పిల్లలను పెంచి పెద్ద చేయడమే మన బాధ్యత. అంతే తప్ప వారి నుంచి ఎటువంటి ప్రేమ ఆశించకూడదంటారు. అంతేనా మీరు చెప్పేది ?" అడిగారు రాణెమ్మ గారు చెట్టు క్రింద ఉన్న బల్లమీద కూర్చుంటూ. "ఏదీ ఆశించి చేయకూడదంటాను. మాటవరసకి ఈ మామిడి చెట్టు చూడు. ప్రస్తుతానికి బోసి పోయి ఉంది. కొన్నాళ్ళకి చిగురిస్తుంది. తర్వాత కాయలు, పండ్లు అందిస్తుంది. ఒక్క పండు కూడా తాను రుచి చూడదు. నేను అనుభవించని ఈ పండ్లు ప్రజలకు ఎందుకు ఇవ్వాలి అని చిగురించడం మానేస్తుందా ? ఫలితం ఆశించకుండా ఫలం అందివ్వడమే దాని పని. మనమూ అంతే." సోదాహరణంగా వివరించారు రావు గారు. ***** ***** ***** ***** "బాబాయ్ గారూ, ఈ రోజు వచ్చిన అన్ని డొనేషన్లకు రశీదులు రాసి ఉంచాను. అలాగే ఉదయం డాక్టర్ గారు రాసిచ్చిన మందులు తెప్పించి అందరి గదులకీ పంపించాను. రేపు ఎమ్మెల్యే గారు మన ఆశ్రమం చూడ్డానికి వస్తున్న సందర్భంగా కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచా. మరి వెళ్తాను, ఇదిగో ఆఫీసు తాళాలు" అంటూ మామిడి చెట్టు వద్దకు వచ్చి,.... తమ పేర్లు కలిసి వచ్చేలా *జీవన శైలి* వృద్ధారామం అనే ఆశ్రమం స్థాపించి, ఓ యాభై మందికి ఆశ్రయం కల్పించి, అలాగే తనకే కాకుండా, తన లాంటి ఇంకో నలుగురికి ఉపాధితో పాటు ఆశ్రయం కూడా కల్పించిన *జీవనరావు* మరియు *శైలజా రాణి* దంపతులకు నమస్కరించి, రెండు భుజాల కింద పెట్టుకున్న కర్రల సాయంతో అక్కడ నుంచి కదిలాడు ఆఫీసు మేనేజర్, చిన్నప్పుడే వచ్చిన పోలియో వలన చచ్చుబడిపోయిన తన కాలుని ఈడ్చుకుంటూ. "ఏమండీ, నాదో చిన్న సందేహం. మనం ఎలాగూ జీవితంలో చివరి అంకానికి వచ్చేసాం. రేపు ఇదే ఇబ్బంది మన అబ్బాయిలకి వస్తే వాళ్ల పరిస్థితి ఎంటంటారు ?" అడిగారు శైలజారాణి. "అందుకే కదోయ్. సగం పొలం అమ్మేసి, ఆ డబ్బుతో, మిగతా పొలంలో ఈ *జీవనశైలి వృద్ధారామం* కట్టేను. అవసరమైతే వాళ్ళూ ఇక్కడికి వచ్చి ఉంటారు" చెప్పారు జీవనరావు గారు, భార్యను దగ్గరకు తీసుకొని సముదాయిస్తూ. వీరి మాటలు విని, ఎన్నో సంవత్సరాలుగా అదే చెట్టు మీద నివాసం ఉంటున్న ఓ పక్షుల జంట గూటిలో దూరంగా పడుకున్న తమ పిల్లలను ప్రేమగా ఇంకా దగ్గరకు తీసుకున్నాయి.

***** *** శుభం *** *****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.