డామిట్ కథ అడ్డం తిరిగింది - పి.వి.రమణ

Dammit's story turned sour

" లా. లా ..లాల..లా..." హుషారుగా కూనిరాగం తీసుకుంటూ సీటులోకి వచ్చాడు శంకర్. " ఏంటోయ్ ! అంత ఖుషీగా ఉన్నావు? కొంపదీసి చెల్లెమ్మ పుట్టింటికి వెళ్లిందా ఏటి ?" పక్క సీటులోని నరేంద్ర కూపీ లాగాడు. " కొంపతీసి కాదు కొంపదీయకుండానే పార్వతీమాత అదే శంకర్ శ్రీమతి పుట్టింటికివెళ్ళిందోయ్ " రామారావు సమాధానం చెప్పాడు. " అయితే ఇంకేం మనకి లైన్ క్లియర్ అన్న మాట చతుర్ముఖ పారాయణానికి ." సుబ్బారాయుడు తీర్మానించేసాడు. " ఏమోయ్ శంకర్ నిజమేనా ? లేక గతసారిలాగా ఇదో హంబక్కా?" అనుమానంగా చూసాడు. నరేంద్ర . " ఛ ! ఆపు ! నీకన్నీ అనుమానాలే. అసలు నీకు నరేంద్ర కాదు శంకేంద్ర అని పేరు పెట్టాల్సింది" కసిరాడు సుబ్బారాయుడు . " గతసారి ఇలాగే వాడి శ్రీమతి పుట్టింటికి వెళ్ళిందని మందుబాటిల్స్ పేకముక్కలు అన్నీ రడీ చేసుకొని శంకర్ ఇంటికి వెడితే వాడి శ్రీమతి తలుపు తీసి మనందరికీ ముక్కచీవాట్లు పెట్టి తలంటిన సంగతి మరిచిపోయావేంటి ?" చిన్నమొహం చేసుకొని అన్నాడు నరేంద్ర. " అప్పుడంటే సరిగ్గా మా ఆవిడ బయలుదేరే సమయానికే వాళ్ళ నాన్న ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు. అందుకే ప్రొగ్రామ్ కేన్సిల్ చేసుకుంది ." శంకర్ సంజాయిషీ ఇచ్చాడు . " అవును మరి మీ ఆవిడ ప్రొగ్రామ్ కేన్సిల్ చేసుకున్న సంగతి మాకు చెప్పాలి కదా ?" సుబ్బారాయుడు నిష్ఠూరంగా అన్నాడు. " ఆ రోజు ఇంటికి వెళ్లేవరకు నాకే తెలీదు." " అవును సుబ్బా ! పాపం మనోడు ఆనందంతో ఎగురుకుంటూ బేగ్ లో ఓ ఫుల్ బాటిల్ పెట్టుకొని వెళ్లాడు. తీరా ఇంటికెళ్లాక శ్రీమతిని చూడగానే గతుక్కుమన్నాడు. వీడి తడబాటుని చూసి ఆవిడ బేగ్ చెక్ చేసింది. ఇంకేముంది గురుడు అడ్డంగా దొరికిపోయాడు. సరిగ్గా వాడికి తలంటుతున్న సమయంలోనే మనం వెళ్లాం. పనిలోపనిగా మనకీ తలంటి అక్షింతలు వేసేసింది. " వివరించాడు రామారావు . " ఇప్పుడు మాత్రం పక్కా ! వాళ్ల అన్నయ్య కొడుకు పెళ్లి .వారంరోజులు ముందే రమ్మని ప్రాధేయపడ్డాడు మా బావమరిది. " శంకర్ ఘంటాపథంగా చెప్పాడు. " మరి నువ్వు కూడా రేపటి నుండి వారం శలవు పెట్టావు కదా ?" నరేంద్ర అనుమానం . " అక్కడే ఉందోయ్ అసలు కిటుకు. ఇక్కడేమో పెళ్ళికని శలవు మంజూరు చేయించుకున్నాను. అక్కడేమో ఇన్స్పెక్షన్ అని తప్పించుకున్నాను." చిటికె వేస్తూ ముగ్గురి మిత్రుల వైపూ చూసాడు శంకర్ . " ఏమో అనుకున్నాంగానీ ఇటువంటి విషయాలలో నీ బుర్ర పాదరసం గురూ " సుబ్బారాయుడు ఉబ్బేసాడు శంకర్ ని " సరే మరి మనకు శలవు ఎలా ?" దీర్ఘం తీసాడు నరేంద్ర . " అరే నీకు తెలీదా ? ఇప్పుడు నీకో మెసేజ్ వచ్చింది చూడు మీ తాత పరమపదించారని " అన్నాడు రామారావు . " అదేంటి ? మా తాతలిద్దరూ ఎప్పుడో పైకెళ్ళిపోయారు కదా ?" తెల్లబోతూ అన్నాడు నరేంద్ర . అవునోయ్ ! ఆ సంగతి నీకూ నాకూ తెలుసు గానీ మన బుద్దావతారంకి తెలీదు కదా ?" " మధ్యలో ఈ బుద్దావతారం ఎవరు ?" నరేంద్ర మొహంపై ప్రశ్నార్ధకం పూసింది. " ఇంకెవరు ? మన బాసే !!" " మన బాసు పేరు గౌతమ్ కదా ?" " ఆ గౌతముడే ఈ బుద్దుడు." " మన బాసుకి పెద్దలంటే విపరీతమైన గౌరవం . దాన్ని మనం ఇలా కేష్ చేసుకుంటున్నామన్న మాట ." నవ్వుతూ చెప్పాడు రామారావు . " మరి మీ సంగతో ?" అయిష్టం గానెే అన్నాడు నరేంద్ర . " ఇది మరీ బాగుందోయ్ ! తాతలు నీకే ఉన్నారేటి ? నాకూ ఉన్నారు "అన్నాడు సుబ్బారాయుడు . " నువ్వూ తాతకే డిసైడ్ అయిపోయావా ? అయితే నేను నాన్నమ్మని తెచ్చుకుంటాను. " అన్నాడు రామారసవు నవ్వుతూ. " శంకర్ ! పేకముక్కలతో పాటు చికెన్ ముక్కలు కూడా ఉండాలి మరి. " నరేంద్ర కోరికల చిట్టా విప్పాడు. " స్విగ్గీలు జొమోటోలు ఉండగా కక్కాముక్కలకి కరువేంటోయ్ " సుబ్బారాయుడు సమర్ధించాడు. " ఏమండోయ్ మీ నలుగురినీ అయ్యగారు మొన్నటి ఫైల్స్ పట్టుకుని రమ్మంటున్నారు. " అటెండర్ రంగయ్య పిలుపుతో నలుగురూ కబుర్లు కట్టిపెట్టి ఫైల్స్ పట్టుకొని ఆఫీసర్ గదిలోకి అడుగు పెట్టారు. " ఆ ఏంటి సంగతులు ? మొన్న డిస్కస్ చేసిన నోట్ ఫైల్స్ మీ బుద్దావతారంకి చూపించండి ." కూల్ గా అన్నాడు గౌతమ్ . నలుగురూ ఒక్కసారి తృళ్ళిపడి ముందు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తరువాత అటెండర్ రంగయ్య వైపు కొరకొరా చూసారు . " ఆ అన్నట్లు నరేంద్రా ఇందాక ఏదో మెసేజ్ వచ్చిందయ్యా ! మీ తాతగారు కాలం చేసారట. వెళ్లు .వెళ్లి ఓ వారం రోజులుండి కార్యక్రమాలు అన్నీ పూర్తి చరెదుకొని రా ." " మరి మీ సంగతేంటి ? శంకర్ కి నిన్ననే శలవు మంజూరు అయిపోయింది. మీరిద్దరూ కూడా త్వరగా డిసైడ్ అవండి. తాతల్ని, నాన్నమ్మల్ని మరీసారి చంపడానికి. " క్రమంగా గౌతమ్ మొఖం ఎర్రబారుతోంది కోపంతో. "అసలు సంగతి మీకు తెలీదు కదూ! మార్కెట్ లోకి కొత్తగా నానో సి . సి . కెమెరాలొచ్చాయి. మన సెల్ లో లాగానే చాలా చిన్న కెమెరాలు అయినా చాలా క్లారిటీ ఉంటుంది . నిన్న ఆదివారం కదా మన ఆఫీస్ లో సెట్ చేసాము. చుస్తారా ఒకసారి " అంటూ ఎదురుగా ఉన్న సిస్టమ్ ఆన్ చేసాడు. " బై ది బై మీకు వారం రోజులు శలవేం సరిపోతుంది ? నలుగురినీ సస్పెండ్ చేసతున్నాను. కావలసినన్ని రోజులు హాయిగా ఆడుకోండి పేకముక్కలతో. ఇంక మీరు వెళ్లొచ్చు "

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.