రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు వీడు ఇక్కడిక్కూడా దాపురించాడా? ఏడీ...కొంపలోనే ఉన్నాడా?కొంపతీసి కొంపలచుట్టూ సంచారానికి పోయాడా?" అనుకుంటూ కళ్ళకి అరచేతిని చూరల్లే అడ్డం పెట్టుకుని ఇంటి గేటు మీద అరటి తొక్కలా వేలాడుతూ బయటకు చూస్తున్న పరమేశాన్ని వీపు మీద ఎవరో చరిచేసరికి వెనక్కి తిరిగాడు.. "ఏవిటోయ్! ఈ వయసులో సర్కస్ ఫీట్లు చేస్తున్నావ్ అసలే రేకు గేటు ఊడిపోగలదు.అదే గేటు గీసుకుంటే తోలు ఊడిపోగలదు" అంటూ ఫక్కున నవ్వాడు సుందరం ఉడతల్లే చెంగున గేటు మీద నుంచి కిందకి దూకి "అబ్బే ఏం లేదు..బయట ఏదో చప్పుడైతేనూ... అవునూ ఇంట్లోకి నువ్వెప్పుడొచ్చావ్ ..భలే..నేను చూడనేలేదు హి హి.."అన్నాడు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ.. "నేను రావడమూ అయింది.మా చెల్లమ్మ చేతి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగడమూ అయింది."అన్నాడు సుందరం "ఏవండీ! మీరూ అన్నయ్యగారూ సిద్దిపేటలో పనిచేసేటప్పుడు ఒకే రూమ్ లో వుండేవారుట కదండీ..చెప్పనే లేదు" సీరియల్ మధ్యలో హఠాత్తుగా కనిపించే యాడ్ లా బయటకొచ్చింది తులసి . "ఆ ఉన్నాం ..నెల్లాళ్ళు..."అన్నాడు "ఆయన చేసిన సాహస కార్యాలు వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది.ఒంటిమీద వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయ్,ఉత్సాహం ఉరకలేస్తోంది ..."అంటూ ఇంకా ఏమేమో చెపుతోంది తులసి . "ఒంటిమీదవేనా?తలమీద వెంట్రుకలూ, జడ కూడానా"అన్నాడు పరమేశం పళ్ళు పటపటలాడిస్తూ. "ఒకసారి మీరిద్దరూ బొగతా వాటార్ ఫాల్స్ చూద్దామని వెళ్లారుటగా.మీరు స్నానం చేస్తుంటే తుండు ఊడిపోతుంటే కట్టుకోబోయి పట్టుతప్పి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంటే అన్నయ్యగారు వెంటనే నీళ్లలోకి డైవ్ చేసి దూకి, ఆయన పంచె మీ నడుముకు చుట్టి మిమ్మల్ని అమాంతం భుజాన వేసుకుని తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారుట. మీరు స్పృహతప్పి పడిపోతే ఆయన ప్రాణవాయువు ఊది మిమ్మల్ని బతికించారుట ఇంత జరిగినా నాకొక్క ముక్క కూడా చెప్పలేదేవండీ. అన్నయ్యగారు నా పసుపు కుంకాలు కాపాడిన దేవుడు." అంటూ పదిరోజుల పాటు రాని కుళాయిలోంచి నీళ్లు ఒక్కరోజులో గంటసేపు ఏకధారగా కారినట్టు ముక్కు చీత్తూ చెపుతున్న భార్య తులసి వంక అపరిచితుడు వెళ్ళిపోయాక రామం సదాఫ్ వంక అమాయకంగా మొహంపెట్టి చూసినట్టు చూసాడు పరమేశం.. "సిద్దిపేటలో ఇద్దరం పనిచేసిన మాట నిజమే కానీ ,ఇదంతా ఎప్పుడు జరిగిందోయ్"అంటూ బుర్రగోక్కున్నాడు పరమేశం. "అన్నయ్యా!వదినా పిల్లలూ వచ్చేదాకా మధ్యాన్న భోజనం మనింట్లోనే చేయండి"అంటూ ఆఫరిచ్చింది తులసి.. "లేదు చెల్లాయ్!మనింట్లో కాఫీ,పక్కింట్లో టిఫిన్ వత్సలమ్మ గారింట్లో భోజనం,విశ్వం గారింట్లో రాత్రి టిఫిన్ కి రమ్మని ముందే చెప్పాశారు. నేను వస్తానోయ్ పరమేశం"అంటూ చెప్పి వెళ్ళిపోతున్న సుందరం కేసి పిచ్చెక్కినట్టు చూసాడు ఒకరోజు సాయంత్రం పరమేశం ఆఫీసునుంచి వచ్చేసరికి తనింట్లోనే చుట్టు పక్కల ఆడవాళ్ళందరితో సుందరం మీటింగ్ పెట్టాడు. తులసి అందరికీ కాఫీలు అందిస్తోంది ఆ దృశ్యం చూసేసరికి చిర్రెత్తుకొచ్చింది పరమేశానికి కోపాన్ని బయట పడనీకుండా "ఏవిటీ ఆడంగుల సమావేశం అద్భుతంగా జరుగుతున్నట్టుంది.మగవాడిని మధ్యలో వచ్చి మీ చర్చకు ఆటంకం కలిగించలేదుకదా?"అంటూ సెటైర్ విసిరాడు.. "అన్నయ్యగారి లాంటి ధైర్యసాలితో మాట్లాడుతుంటే మా ముంజేతులకి కూడా మీసాలు మొలుస్థాయి .తెలుసా."అంటూ సెటైర్ ని రివర్స్ లో తిప్పి కొట్టింది తులసి. జుట్టు నిక్కపొడుచుకోటాలూ,ముంజేతి మీసాలూ, జడలు ఊడల్లా ఊగటాలూ ఇవన్నీ కాష్మోరా కథల్లో చదివినట్టు గుర్తు వస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది పరమేశానికి.. "అవును మరిదిగారూ !సుందరం గారు వయసులో వున్నప్పుడు వంద కొబ్బరికాయల్ని పళ్ళతోటే పీచు వొలిచేశారుట..తెలుసా?"అంది కాంపౌండ్ గోడ పక్కన వుండే రాజేశ్వరి. "అయితే మీ చెట్టు కొబ్బరికాయలు తెచ్చి ఒలిపించుకోక పోయారా?"అన్నాడు కోపాన్ని తమాయించుకుంటూ "ఏవిటండీ మీ సన్నాయి నొక్కుళ్ళు... రాజేశ్వరక్కా!ఈయనకి అసలు కొబ్బరికాయ కొట్టటం కూడా రాదు తెలుసా!మొన్నటికి మొన్న దేవుడికి కొబ్బరికాయ కొట్టమంటే టిక్కీ టిక్కీమని పది దెబ్బలక్కూడా పగలకొట్టలేక పోయారు.పదకొండో దెబ్బకి కాస్త చిట్లి బీటిచ్చి,అరచేతి చర్మం చిప్పల మధ్య ఇరుక్కుపోయింది కుర్రో మొర్రో అంటుంటే నేనే బలవంతంగా చిప్పల్ని విడదీశాను.. నెత్తురు కారిపోయిందనుకో..రెండ్రోజులు అన్నం ముద్దలు కలిపి నేనే పెట్టాను.అవీ మీ మరిది సాహస కార్యాలు."అంటుంటే ఆడాళ్లందరూ ఒకటే నవ్వులు. వాళ్ళందరి మధ్యన రాయబారం కృష్టుడల్లే రాజసం వెళ్లబోస్తున్న సుందరాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. ఒక సందర్భంలోఅక్కడున్న మహిలందరిచేతుల్లో పెద్ద పెద్ద తావళాలు ఉన్నట్టు...వాటిని తిరగేసి మరగేసి కొడుతూ సుందరానికి భజన చేస్తున్నట్టూ అందరి చెవుల్లో పెద్ద పెద్ద మందారపూలు ఉన్నట్టూ కనపడేసరికి ఒక్కసారి తలవిదిలించి కళ్ళు నులుముకుని మళ్లీ చూసాడు పరమేశం. అంతా మామూలుగానే కనబడింది . బాబోయ్ ఇక్కడుంటే పిచ్చెక్కుతుందని వచ్చిన దారినే బయటకు వెళ్ళిపోయాడు పరమేశం. బయట రోడ్డుమీదకు వెళ్ళేసరికి ఆపరేషన్ థియేటర్ ముందు ఆందోళనగా తిరిగే బిడ్డ తండ్రల్లే ఇంటి ముందు పచార్లు చేస్తూ కనిపించాడు వెనక వీధి రాఘవులు... అప్పటికే పచార్లు చేసి చేసి కాళ్ళు పీకి పక్కింటి మెట్ల మీద చేరగిలబడ్డారు రమణ ,విశ్వం. వరలక్ష్మీ వ్రతకల్పంలో చారుమతీ దేవి ఇంటి ముందు వాళ్ళ వాళ్ళ భర్తలు వచ్చి నిలబడి ఎదురు చూసినట్టు పరమేశం ఇంట్లో చేరిన ఆడంగుల భర్తలు పాపం బయటే నిరీక్షిస్తున్నారు... పరమేశం కూడా వాళ్ళతో చేరాడు.. విశ్వం కూర్చున్న వాడల్లా గభాల్న లేచి "ఇంట్లోకి పాము వస్తే ఎవరైనా పావులవాడిని పిలుస్తారు.పావుని పట్టిస్తారు అంతేగానీ పావుని మెళ్ళో వేసుకుని నృత్యం చేస్తారుటయ్యా..ఈ వింత ఎక్కడన్నా కనీ వినీ ఎరుగుదుమా...ఆ సుందరం చేశాడట.మా ఆవిడ నా దుంపతెంపుతోంది . నిన్న ఇంట్లోకి ఎలిక వచ్చి సోఫాకింద నక్కింది. పాము డాన్స్ కాకపోయినా ఆ ఎలికను పట్టుకుని మెలికల డాన్స్ చేయమంటుంది. తను వీడియో తీసి ఫేస్బుక్ లో అప్ లోడ్ చేస్తుందిట. ఇదంతా ఏవిటంటావ్?" శూన్యంలోకి చూస్తూ గొణుక్కున్నాడు విశ్వం.. "ఇదేం చూశావ్..ఒడ్లని అరచేతిలో పోసుకుని నలిపి నలిపి పొట్టు తీసి బియ్యంగా మార్చాడుట ఆ సుందరం. మా ఆవిడ నా చేతుల్లో పొట్టు మినప్పప్పు పోసి చాయ మినప్పప్పు చేస్తేగానీ వల్లకాదని పీకలమీద కూర్చుంది.అక్కడికీ నా శాయశక్తులా ఓ గుప్పెడు పప్పు పొట్టు తీసాను.చేతులు చూడండి ఎలా పొట్రేగి పోయాయో.. వా...వా..."అంటూ తన గోడును వెళ్లగక్కారు రమణ. "ఇహ లాభంలేదు.మనం అందరం ఒక్కటై ఆ సుందరం ఆగడాలు అరికట్టాలి . ఏంచేద్దామో చెప్పండి కామ్రెడ్స్"అన్నాడు ఎర్ర చొక్కా వేసుకున్న విశ్వం బిగించిన పిడికిలిని ఆకాశంవైపుకు చూపిస్తూ.. రాఘవులు,విశ్వం,రమణ,పరమేశం ,రాజేశ్వరి మొగుడు అందరూ కలిసి ఒకరిభుజాలమీద ఒకరు చేతులేసుకుని ,తలలు కిందకివంచి సమాలోచన మొదలు పెట్టారు.. ఎండపెట్టిన పిండి బేసినిలో తలలు వంచి ముక్కులు పెట్టిన కాకులు బొక్కటం అయ్యాక తలపైకెత్తి రెక్కలు కొట్టుకున్నట్టు ఒక్కసారిగా అందరూ గట్టిగా నవ్వారు. అది వాళ్ళలోంచి పుట్టుకొచ్చిన ప్రతీకార నవ్వు..... ఈ రహస్య ఒప్పందాన్ని కోడ్ వర్డ్స్ ద్వారా సుందరం బాధితులందరికీ చేరవేయాలని తీర్మానించారు.. ఆరోజు ఆదివారం. ఆ కాలనీలో అన్నికుటుంబాలవాళ్లూ ఒక్కచోటే చేరి లంచ్ చేయాలని ఫిక్స్ చేసుకున్నారు.. కాలనీ ఆడవాళ్ళందరూ సుందరాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.. యాభై కొబ్బరికాయలు గుట్టగా పోశారు.. పాములవాడు నాదస్వరం మెళ్ళో వేసుకుని పాముబుట్ట చంకలో పెట్టుకుని వచ్చి సిద్ధంగా వున్నాడు. "భోజనకార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తే,మీరెవరూ ఊహించని మరొక ప్రత్యేక కార్యక్రమం ఉంది..త్వరగా కానీయండి.."ఆంటూ తొందర చేసాడు విశ్వం.. ఇంతలో కెవ్వు... కెవ్వు.. కేవ్వూ ..అంటూ అరుస్తూ భోజనాల విస్తళ్ళ మధ్య గంతులేస్తూ ఒక కాలితో నేతి గిన్నెనీ మరో కాలితో నీళ్ల చెంబునీ తన్నేసి రొప్పుతూ ఓ మూల నక్కాడు సుందరం. ఏం జరిగిందో అని అందరూ భయం భయంగా చూస్తున్నారు... "ఏ పామో తేలో కుట్టినట్టు అంతలా అరిచారేంటి అన్నయ్యగారూ ?"అంది తులసి కంగారుగా విశ్వం మెల్లిగా వెళ్లి పాము బుట్ట కాస్త తెరిచి చూసాడు.. అది మన్ను తిన్న పామల్లే బద్ధకంగా నిద్రపోతోంది... "ఏవైంది ?ఏవైంది"?..అంటూ అందరూ అదే ప్రశ్న. ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు "సుందరం లాంటి ధైర్యవంతుడే భయపడ్డాడంటే అక్కడ ఖచ్చితంగా పెద్ద అనకొండ వచ్చి ఉంటుంది.వెతకండి"అంది కామేశ్వరి కుర్చీ మీదకి ఎక్కి నుంచుని. ఇంటిముందు ఆటోఆగడంతో అందరూ అటువైపు చూసారు.. అందాకా ఓ మూల కూర్చున్న సుందరం పరుగున వెళ్లి భార్య సుందరి వెనకాల నక్కాడు. "ఎవరు ఎవరండీ! చంటిపిల్లాడిలాంటి నా భర్తను భయపెట్టేందుకు బొద్దింకను చూపెట్టిందీ.చూడండి పాపం ఎలా వణికిపోతున్నారో.. ఇంట్లో ఒక్కరూ ఉండలేక మీ అందరిమధ్యా ఉంటూ నేను లేని ఈ నాలుగు రోజులూఎలాగో నెట్టుకొచ్చారు. పదండి మనింటికి పోదాం." అంటూ భర్తని పట్టుకుని ఇంట్లోకి తీసుకెళుతున్న సుందరికేసి అవాక్కయి చూస్తుండి పోయారు అందరూ. ముందుగా తేరుకున్న ఆడవాళ్లు ఎలర్ట్ అయ్యారు సుందరాన్ని చూపించి తమ భర్తలతో కుప్పిగంతులేయించి, చెమ్మచెక్కలాడినందుకు భారీమూల్యం చెల్లించాల్సి వస్తుందని ఒక్కక్కరుగా మెల్లిగా జారుకున్నారు . సుందరం ఎత్తులన్నీ చిత్తుచేసేందుకు సమావేశాలూ ,చర్చలూ వ్యూహారచనలూ చేసుకుంటే ఫస్ట్ బాల్ కి క్లిన్ బౌల్డ్ అయ్యాడేంటి ఈ సుందరం అనుకుంటూ మళ్లీ చర్చల్లో మునిగిపోయారు.. భార్యలు తమమీద చేసిన దాస్టీకాన్ని మర్చిపోయారు పాపం మగవాళ్ళు ...ఎప్పుడూ ఇంతే...