" ఇంతకూ ఏం చేద్దామంటావురా నాన్నని" అరగంటసేపు తర్జనభర్జనల తరువాత అడిగాడు వంశీధర్, తమ్ముడు వసంత్ ని. " ఈ మాయదారి వైరస్ ప్రభావం తగ్గేవరకు నాకు తెలిసిన డాక్టర్ గారి ఆసుపత్రిలో ఉంచుదాము. తరువాత సంగతి తరువాత" తన నిర్ణయం చెప్పాడు వసంత్. అనుకున్నదే తడవుగా డెబ్బది సంవత్సరాల యశోధనరావును, వాళ్ళకు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డులో ఉంచడానికి తీసుకుని వెళ్ళారు. ఆసుపత్రికి పరీక్షలకని చెప్పి గదిలో తనను విడిచి వెళ్తున్న కొడుకులను పిలిచి అడిగాడు యశోధనరావు. " ఇదేమిటిరా. నాకు ఏవో పరీక్షలు చేయిస్తానని చెప్పి, లక్షణంగా తిరిగేనన్ను ఇక్కడ ఇలా గదిలో బంధించారు" అనడిగాడు కొడుకులను. " మీకు ఇక్కడే అన్ని పరీక్షలు చేస్తారట. ఒక రెండు రోజులు ఇక్కడే ఉండండి. మేము వచ్చి తీసుకెళతాం. అంతవరకు మీ బాధ్యత అంతా డాక్టర్ గారు చూసుకుంటారు. మొండి చేయకుండా వాళ్ళు చెప్పినట్లు వినండి." అని తండ్రి సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయారు ఇద్దరూ. మంచం మీదనుంచి లేచి బయటకు రాబోయాడు. తలుపు రాలేదు. ఒక్కసారి గదంతా కలయచూశాడు. చాలా అందంగా, శుభ్రంగా ఉంది. కానీ కొడుకులు చేసిన పనే నచ్చలేదు. ఊరంతా కరోన అని గుప్పుమంటున్నది. కాలు బయటపెట్టకుండా లాక్ డౌన్ పెట్టారు నాలుగురోజుల నుంచి. ఇంట్లో వాళ్ళు తనను బయటకు పోనివ్వడం లేదు. అయినా అరగడం లేదని చెప్పి ఉదయం ఆరు గంటలలోపే వాకింగ్ పేరుతో శీను గాడిని కలిసి వస్తున్నాడు. ఎందుకో వాడిని ప్రతిరోజు కలవడం ఒక బలహీనంగా మారింది. ఎలాగూ ఏడు వరకు దొంగతనంగా తెరిచిన టీ బంకులో టీ తాగి హాయిగా ఇంటికి వచ్చేవాడు. అలాటి వాడిని తెచ్చి ఇరికించారని చిందులు తొక్కసాగాడు యశోధనరావు ***** పిచ్చెక్కిపోతున్నది, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నెలరోజులు ఈ గదిలో బంధించబడి. ఏవరో ఒకరు రావడం సమయానికి ఫలహారం, కాఫీ, భోజనం ఇవ్వడం, ఏమడిగినా సమాధానం చెప్పకుండా వెళ్ళడం. ఒక పరీక్ష లేదు పాడు లేదు. అంతా మోసం. అవును ఇదంతా నా కొడుకులు చేసిన మోసం. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు వాళ్ళ స్వేచ్ఛకు నేను అడ్డమని, నాకు పొరపాటున వ్యాధి సోకితే సేవ చెయ్యవలసి వస్తుందనీ, తనను ఇక్కడ అనాథగా వదిలి వెళ్ళారు. ఆలోచించేకొద్దీ కొడుకుల కుట్ర అర్థం కాసాగింది యశోధనరావుకు. గుండె విలవిలలాడింది. తననిక ఇలాగే వదిలేస్తారా? ఏమో? దుర్మార్గులు. భయంతో పాటు బాధకూడ కలిగింది అతనికి. కళ్ళు చెమర్చాయి. ఇంతలో తలుపు చప్పుడయింది. ఎదురుగా కొత్త వ్యక్తి. బాగా పరిచయమున్న ముఖంలా అనిపించింది. మండుతున్న కోపంలో మెదడు మొద్దుబారింది. " నన్ను ఇక్కడ బంధించి నెలరోజులు కావస్తున్నది. చచ్చాడో, బ్రతికున్నాడో చూసిరమ్మని పంపారా నా కొడుకులు నిన్ను. నువ్వేనా ఇక్కడ డాక్టరు. చూసి రమ్మన్నారా లేక ఏ ఆశ్రమానికో అప్పచెప్పమన్నారా? నెలరోజులుగా నరకం చూస్తున్నాను. టెలివిజన్ చూడటం తప్ప ఏంచెయ్యడానికి లేకుండా చేశారు. దీనికంటే ఇంత విషమిచ్చి చంపకపోయారా" అగ్గి మీద గుగ్గిలమయ్యాడు యశోధనరావు. నవ్వుతూ వచ్చి యశోధనరావు పక్కన కూర్చున్నాడతను. " మామయ్యా నన్ను గుర్తుపట్టలేదా. ముప్ఫై సంవత్సరాల క్రితం మేము, మీరు ప్రక్క ప్రక్క పోర్షన్లలో ఉండేవారం. గుర్తొచ్చానా. నేను పరంధామయ్యగారి అబ్బాయి అవినాశ్ ను" నవ్వుతూ చెప్పాడతను. " అరె నువ్వట్రా. అమ్మ,నాన్న బాగున్నారా? ఎంతకాలమయిందిరా. నువ్విక్కడ.." ఆశ్చర్యపోతూ అడిగాడు. " నేను ఇక్కడికి వచ్చి సంవత్సరమయింది. సొంత క్లినిక్ తెరిచాను. వసంత్ ను ఈ మధ్యే కలిశాను. ఇప్పుడు మీరున్నది మా ఇంట్లోనే, నా స్పెషల్ రూమ్ ఇది" " చూశావటరా వీళ్ళు ఎంత పని చేశారో. నన్ను అనాథను చేసి ఇక్కడ పారేశారు. పైగా దీనిలో నిన్ను పావుగా వాడుతున్నారు. చూశావా ఎంత అన్యాయం" వాపోయాడు యశోధనరావు. " మీరు పొరపడుతున్నారు అంకుల్. ఈ పథకమంతా నాదే. నన్ను క్షమించండి. ఊరంతా కరోనా ఉంది. లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఎవరినీ బయటకు వెళ్ళవద్దన్నది. కానీ మీరేమో ఉదయాన్నే బయటకు వెళ్ళి స్నేహితులను కలిసి, ఎంచక్కా టీ తాగి వస్తున్నారు. మీరు చేసేదంతా ఒకరోజు వసంత్ గమనించాడు. మీకు చెప్పే ధైర్యం లేక, చెప్పినా వినరని తెలిసి నాకు మొర పెట్టుకున్నాడు. ఈ వ్యాధి మీ వయసు వారికి అంటుకుంటే తట్టుకోవడం కష్టమని, ఏదో ఒక మార్గం చూడరా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేనే ఆలోచించి మిమ్మల్ని ఇక్కడ దించమని, ఏ లోటూ లేకుండా చూసుకుంటానని చెప్పాను. ఈ రోజుతో మీ అజ్ఞాతం ముగిసింది. వసంత్ వాళ్ళు వస్తారిప్పుడు. సారీ అంకుల్ మిమ్మల్ని కాపాడుకోవడానికి వేరే దారి దొరకలేదు" అంటూ కాళ్ళకు నమస్కరించాడు. వాకిలి దగ్గరికి అప్పడే చేరిన కొడుకులిద్దరు కూడ వచ్చి తండ్రి పాదాలను పట్టుకున్నారు. "నాన్నా, అమ్మ ఎలాగూ లేదు. ఉన్న మిమ్మల్ని కూడ దక్కించుకోలేకపోతే మేము బ్రతకడం వృధా అనిపించి ఇలా చేయాల్సివచ్చింది. తప్పు చేశామా నాన్నా" భోరుమన్నారిద్దరూ. "లేదురా. నా ఆలోచనే తప్పు. మీ మనస్తత్వం తెలిసి కూడ తప్పుగా ఆలోచించాను. నా అంత అదృష్టం ఎంతమందికుంటుంది. మీరు చేసింది కరెక్టే" అంటూ అందరినీ దగ్గరకు తీసుకున్నాడు యశోధనరావు ఆనందంతో. ********** అయిపోయింది*********