రాత్రి పన్నెండు గంటలు దాటింది, గుడి ప్రాంగణమంతా నిశ్శబ్ధంగా ఉంది. ధ్వజస్థంబానికి వేలాడుతున్న ఆకాశదీపం, కునికిపాట్లు పడుతూ కొండెక్కడానికి సిద్ధమౌతుంది. అక్కడక్కడ మిణుకు మిణుకు మని వెలుగుతున్న కొన్ని దీపాలు జోగుతూ, నిద్రలోకి జారుకుంటున్నట్లున్నాయి. కార్తీకమాసపు చలికి, ఊరంతా పెందలాడే నిద్రలోకి జారుకుంది. ఇదే అదుననుకున్నాడేమో, ఓ దొంగ మెల్లగా నక్కి నక్కి గుడి ప్రహరీ గోడ నీడ వెంట అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, చప్పుడు కాకుండా మెల్లగా ప్రహరి దూకి, ఒక్కక్షణం అలాగే కదలకుండా కూర్చొని చూసాడు. ఏ అలికిడి లేదు, చెట్లపై పక్షుల రెక్కల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్ధంగా ఉంది. మెల్లగా లేచి, మెత్తగా కాలి ముని వ్రేళ్ళపై నడుస్తూ గుడిలోని హుండీ దగ్గరకు వచ్చి, ఒక్కసారి చుట్టూ పరిశీలనగా చూసాడు. ఎవరు లేరని నిర్ధారించుకొని, ఒక్కసారి స్వామి వైపు తిరిగి దండం పెట్టుకున్నాడు. తన దగ్గరున్న పరికరాలను చాకచక్యంగా వాడుతూ, హుండీని శబ్ధం రాకుండా తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు. స్వామికి ఎదురుగా వ్రేలాడుతూ, ఎప్పుడూ భక్తుల కోరికలను స్వామికి గుర్తుచేస్తూ, ఘణ ఘణ మని మ్రోగే..., నాకు దొంగ చేస్తున్న పని చూసి, బిగ్గరగా ...... "స్వామి".., అని అరవాలనిపించింది. కానీ ......, అయ్యో!, పొద్దస్తమానం అభిషేకాలు, పూజలు, భక్తుల మొరలు విని అలసిపోయిన , నా....స్వామి పవళించి వుంటారు, నిద్రాభంగమైతే ఎలా..? వద్దనుకొని ఆగిపోయాను. కానీ నా ఆరాటంలో, నాకు నేనుగా మ్రోగలేనన్న విషయం కూడా నాకు స్ఫురణకు రాలేదు. కానీ, ఈ ఘాతుకాన్ని ఎలాగైనా నిలువరించాలని, అటు ఇటు కదలటానికి ప్రయత్నించాను.., నా శరీరం కదలటం లేదు!,. ఎవరో కదిలిస్తేగాని మ్రోగలేని నేను మ్రోగేదెట్లా?, ఈ ఉపద్రవాన్ని ఆపేదెట్లా?, దేవుడా! నువ్వేదిక్కు అనుకున్నాను. అవును! నా నాలుకపై సరస్వతి ఉంటుందంటారుగా.., తల్లి ఒక్కసారి నినదించవమ్మా! .., ఈ ఘోరకలిని ఆపవమ్మా...,అని తల్లికి మొర పెట్టుకున్నాను. నా ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని.., అలాగే పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులకు నిలయమని ఆంటారే!, మరి మీలో ఏ ఒక్కరైనా నా మొర ఆలకించి,ఈ అన్యాయాన్ని ఆపలేరా...? అని ఘోషించాను. ప్రతిరోజు హారతి సమయంలో గణ.. గణ.. గణ .. మని మ్రోగి, స్వామి దర్శనానికి "రండి రండి" అని ముక్కోటి దేవతలను నా ఘంటానాధంతో ఆహ్వానిస్తానే.., మీలో ఒక్కరన్నా నా మొర ఆలకించలేరా?, అని ఆర్తిగా.., అందరిని వేడుకున్నాను. అయిపోయింది!.., అంతా అయిపోయింది!!.., దొంగ హుండీలోని ధనం మొత్తము దోచుకొని వెళ్లిపోయాడు. ఇంతటి ఘోరాన్ని చూస్తూ సాక్షిభూతంగా నిలబటం తప్ప, నేను మరేమీ చేయలేక పోయానని బాధపడ్డాను. నాకు నేనుగా కదలలేని, సమయానికి మ్రోగలేని నా అచేతనావస్తను చూసి.., నాపై నాకే జాలివేసింది. ఆనోట, ఈనోటా అందరికి ఈ దొంగతనం వార్త తెలిసినట్లుంది, అంతా గుంపులుగా దేవాలయానికి వచ్చి వింతగా చూస్తున్నారు. "దేవుడన్నా భయం లేకుండా పోతుందని" ఒకరంటే, "కలికాలం అంతా ఆ పైవాడే చూసుకుంటాడాని". , మరొకరు..ఇలా గుంపులో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పోలీసులు, పంచుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. పనివాడు, పూజారి, ట్రస్టీ ..,ఒక్కొక్కరుగా పోలీసులకు దొంగతనాన్ని గురించిన వివరాలు వివరిస్తున్నారు. కానీ...కానీ...అక్కడ జరిగిందొకటి, వారు చెప్పేదొకటి. అందరూ కలిసి, కట్టుకథలు అల్లి మరీ చెపుతున్నారు!. అక్కడ సాక్షం చెప్పే వాళ్లంతా దొంగలే, కానీ అక్కడ జరిగిన దొంగతనానికి దొరల్లా వారే సాక్షాలు చెపుతున్నారు. దీనినే 'కంచే చేనును మేసిన చందం'...అంటారు కాబోలు అనిపించింది. ఆసలేం జరిగిందంటే..., "ఆ రాత్రి దొంగ వెళ్లిపోయిన తరువాత.., ముందుగా గుడి శుభ్రం చేసే పనివాడు వచ్చాడు , హుండీ పగిలి ఉండటం చూసాడు, ముందుగా ఒక్కింత ఆశ్చర్యపోయినా!, వెంటనే తేరుకొని, అక్కడక్కడా దొంగ హడావిడిలో పారేసుకొని వెళ్లిన డబ్బులు.., హుండీలో మిగిలిన డబ్బులు మొత్తం తీసుకొని జెబుల్లో దాచుకున్నాడు. తరువాత విషయాన్ని గుడి పూజారికి చెప్పాడు. పూజారి భయపడిపోయి.., వెంటనే విషయాన్ని ట్రస్టీ గారికి చెప్పాడు. ట్రస్టీ హుటాహుటిన వచ్చి, పూజారిని బెదిరించి, ఆశపెట్టి, ప్రలోభపెట్టి. నయాన్నో భయాన్నో ఒప్పించి, పనిలో పనిగా గర్భగుడి తాళాలు కూడా పగులగొట్టి, గుడిలోని హుండీ..స్వామివారి నగలు అన్ని మాయం చేశారు. మొత్తం దొంగతనమంతా దొంగ ఖాతాలో వేసి చేతులు దులుపుకొన్నారు. ఎంత దుర్మార్గులు వీళ్లంతా అనిపించింది. పాపం ఆ దొంగ ఆకలిమంటకో..మరెందుకో గాని, ఏదో కొంత దొంగతనం చేసాడు. కానీ, ఈ మేకవన్నె పులులు, గోముఖ వ్యాగ్రాలు, పైకి దొరల్లా చలామణి అవుతూ., గుడిని కాపాడాల్సిన భాద్యతలో ఉండి కూడా, జరిగిన దొంగతనాన్ని ఆవకాశంగా తీసుకొని, దేవుని సోమ్మంతా దొంగల్లా దోచుకొని దొరల్లా చలామణి అవుతూ, సాక్షాత్తు భగవంతుణ్ణి నిలువుదోపిడి చేసి, ఆయనకే శఠగోపం పెట్టారు. దొంగను మించిన దొంగలు అసలు వీళ్ళను మనుషులని అనాలా!!. నాకు వాళ్ళచేసే పనులు చూసి అసహ్యం వేసింది. పాపం... వీళ్ళకన్నా ఆ దొంగేనయం అనిపించింది. కనీసం దొంగతనం చేసినా, భయానికో... భక్తిక్తో గాని, స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, పాశ్చత్తాపంతో స్వామికి దీనంగా మొర పెట్టుకున్నాడు. "సామే జానెడు పొట్టకూటికోసం కక్కుర్తి పడ్డాను, నన్ను నమ్ముకున్న నా పెండ్లాo పిల్లలు నాలుగు దినాలుగా పస్థులున్నారు సామే, ఈ ఒక్కపాలికి నన్నొగ్గేయి సామి. జాతరకొచ్చి గుండు కొట్టించుకొని, జుట్టుకాయ కొట్టి నీ మొక్కు చెల్లించుకుంటాను సామే" అని భక్తితో మొక్కుకున్నాడు. కానీ..., మరి వీళ్ళు.., నయవంచకులు, సమాజంలో పెద్దమనుషుల ముసుగులో తిరగాడే దోపిడీ దొంగలు. అందుకే.... స్వామి...ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన ఆ దొంగను వీలైతే క్షమించు తండ్రి!, కానీ, ఈ ముసుగు దొంగలను మాత్రం వదలకు స్వామి, వదలకు, అని ప్రార్ధించాను. ఎవరో...కొట్టగానే 'ఠంగు ' మని మ్రోగాను...'గంట మ్రోగితే సత్యం అంటారుగా'!" మరి చూద్దాం ఆ దేవుడు ఏంచేస్తాడో.., ఏమౌతుందో. .....