వేయికన్నుల వెలుగు - కావ్యరాము

The light of the thousand eyes

నాన్న......! నాన్న.....!! నాకు స్కూల్లో 2వ ర్యాంక్ వచ్చింది మా మాస్టార్లు అందరూ నన్ను మెచ్చుకున్నారు.... ఇదుగో నాన్న నాకు బహుమతి కూడా ఇచ్చారు అంటూ ఎంతో ఆనందంగా నాన్న చేతిలో పెడుతున్న కొడుకు అభినవ్ కి వీపు పై వాతలే మిగిలాయి.. క్షణం కూడా ఆలోచించక బెత్తం పట్టుకొని మొదటి ర్యాంక్ ఎందుకు రాలేదురా అంటూ బెత్తంతో బాదుతూనే ఉన్నాడు తండ్రి రామయ్య.... కుటుంబమంతా వద్దని వారించినా వినని రామయ్య గదిలోకి తీసుకెళ్లి కర్కశంగా ప్రవర్తించడం చూసిన అభి వెన్ను చూపాడు తండ్రికి. మరో నాలుగు దెబ్బలు కొట్టినా పర్వాలేదని...అందరూ నోరెళ్లబెట్టారు అభినవ్ చేసిన పనికి... మరుసటిరోజు నుండి పుస్తకాలు అవతల పడేసి చదవడమే మానేశాడు... ఏంట్రా అభి బడికెళ్లవా అంటే చదివినా కొడతాడు, చదవకపోయిన కొడతాడు మా నాన్న అని వెర్రి నవ్వు నవ్వి ఆటకు పోయేవాడు.... ఏదో నామమాత్రానికి అమ్మను బాధపెట్టడం ఇష్టం లేక బడికెళ్తూ హాజరు వేపించుకొని తోటివాళ్ళ సాయంతో అడపాదడపా చదువుకుంటూ వస్తూ అటు దొర్లుతూ,ఇటు దొర్లుతూ చివరికి పదవ తరగతి వరకు వచ్చిన అభినవ్ కి ఆఖరి పరీక్షలు అయిపోయాయి.... ఎలాగోలా పాస్ మార్కులతో గట్టెక్కినా అసలైన ఇంటర్ చదువు మొదలైంది.... అప్పుడే ఫ్రెండ్స్, కాలేజ్ అనే కొత్త వాతావరణం ఎటూ కానీ టీనేజ్ పిల్లల మనసుల్ని తప్పుదోవ పట్టిస్తూ చివరికి అభినవ్ ని మొదటి సంవత్సరం పరీక్షలను తప్పించింది... తండ్రి కోపానికి మరోసారి బలయ్యేలా చేసింది.... హాస్టల్లో చేర్పించి అభినవ్ ని ఒక మొండివాణిగా పరిచయం చేసాడు తండ్రి.. భయంతోనో,భక్తితోనో ఈ సారి ఇంటర్ పరీక్షలు పాస్ అయ్యాడు... అయినా నిరాశే నాన్న దగ్గర. ఈ సారి అభినవ్ నిస్సహాయత తెగింపుగా మారి హాస్టల్ ని, ఏకంగా ఇంటినే వదిలిపెట్టేలా చేసింది... ఇంటిని విడిచిన అభినవ్ చాలా అగచాట్లు పడి నిరాశతో ఏడుస్తూ ఉండగా ఒక పెద్దమనిషి వచ్చి ఇలా అడిగాడు... ఏమిటి నాయన ఇలా ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నావ్ అనగానే..అభినవ్ తన పరిస్థితిని వివరించగా.... ఒక చిన్న నవ్వు నవ్వి ఓస్ దీనికా ఇంత దిగులు...!! సరే ఒకటి చెప్పు చదువు అంటే నీ ఉద్దేశ్యం ఏంటి...?? ఏముంది ఆ పుస్తకాలు పట్టుకొని చదువుకొంటూ బట్టీ పట్టడమే అది నాతో కాకే మా నాన్న నన్ను కొడుతూ ఉంటాడు.... వాళ్లతో,వీళ్ళతో పోలుస్తారు ,నాకేం తెలివి ఉంది,నేనెంత బాధపడతానో ఆయనకు అవసరం లేదు. చదువు చదువు ఎందుకు నన్ను నరకంలోకి తోసే ఈ చదువు అంటే నాకు అసహ్యం. అందుకే ఇంట్లోనుండి పారిపోయి వచ్చాను.... ఇక్కడికొచ్చాక నాకు ఏం తోచట్లేదు.వారం గడిచింది... కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది... అందుకే ఇక్కడ కూర్చున్నా.... అంటూ గుక్కపడుతూ ఏడుస్తూ చెప్పాడు. తప్పు నాయన నీ ఆలోచన తప్పు మీ నాన్న నీ భవిష్యత్తు బాగుండాలని అని ఉంటాడు.. కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావ్..... చదువు మనిషి జ్ఞానాన్ని పెంచుతుంది.... బయట సమాజంలో మనం ఎలా మెదలాలో నేర్పుతుంది... ఒక క్రమశిక్షణను అలవడేలా చేస్తుంది... చదువు అంటే పుస్తకము మాత్రమే కాదు... నీకున్న జ్ఞానం,నువ్వు నేర్చుకున్న నైపుణ్యం... కానీ మా నాన్నకి ర్యాంక్లు కావాలి అందుకేగా చిన్నప్పటి నుండి నన్ను కొడుతూనే ఉన్నాడు... సమాజంలో అందరి ముందర నా బిడ్డ గొప్ప అని చెప్పుకోవాలి అని ఎవ్వరికి ఉండదు అలాగే నీ తండ్రి కూడా.... నువ్విలా పిచ్చోడిలా ఏడుస్తూ ఉంటే నీ సమస్యను తీర్చేవాళ్ళెవ్వరు.... పైనికి రాళ్లే రువ్వుతారు.. నువ్వు అన్నట్టు చదువు అంటే పుస్తకం పట్టుకొని బట్టి పట్టడమే కాదు చదువంటే.... నీకున్న తెలివితో సమాజానికి ఉపయోగపడే విధంగా నీ మేధో సంపత్తి ని పెంచుకోవడమే... నీలోనూ ఓ ప్రతిభ దాగుంది.. అది ఎవరు గుర్తించనట్టున్నారు... నువ్వే చెప్పు నీకు ఏ పని చేయడం అంటే చాలా ఇష్టం....?? నాకు పనికిరాని వస్తువులను ఉపయోగించి రకరకాల ఆకృతులుగా కట్టడం మహా ఇష్టం.. మా నాన్న నన్ను తిట్టిన ప్రతిసారి మూలనపడి ఉన్న సామాను దూరంగా తీసుకెళ్లి కోపంతో,నాన్నపై కోపం చల్లారే వరకు ఏదొకటి కట్టేవాడిని..దాన్ని చూసి అందరూ అద్భుతం అనేవారు మా నాన్న తప్ప.. మెచ్చుకోకపోగా చేసిన వాటిని చెల్లాచెదురుగా పడేసేవాడు... ఎప్పుడు పక్కవాళ్ళతో పోల్చేవాడు. అందుకే నాకు దేనిపై,ఈ జీవితంపైనే ఆసక్తి లేకుండా పోయింది.... నీ పరిస్థితి అర్థమైంది నాయనా సరే..!! నే చెప్పిన చోటుకి వస్తావా నీకు అక్కడ అన్ని వసతులతో పాటు నీకిష్టమైన చదువు చెప్పిస్తారు.... హాస్టల్లోనా నా దగ్గర డబ్బులు లేవు కదా.? పర్లేదు నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయు అని ఆ పెద్దాయన అనగానే సరే అని తలూపాడు... ఆ పెద్దమనిషికిచ్చిన మాట ప్రకారం హాస్టల్ లో చేరాడు.. తన అభిరుచి ప్రకారం ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ లో చేరాడు... నాలుగు సంవత్సరాల తర్వాత... ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ గా పేరుపొందిన అభినవ్ ఇప్పుడు ఒక మంచి నిపుణుడైన ఇంజనీర్.. అదే కాలేజ్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఒక మంచి కంపెనీ అభినవ్ కి ఆఫర్ లెటర్ ఇచ్చింది.. కాలేజీ యాజమాన్యం చేత పట్టా అందుకొన్న అభినవ్ ఆ పెద్దమనిషి దగ్గరికి వెళ్లి తన విజయాన్నిసంతోషంగా పంచుకోవాలనుకున్నాడు కానీ అతని సమాచారం ఎవరిని అడిగినా తెలిదన్నారు... చేసేదేమీ లేక కాల్ లెటర్ తో ఉద్యోగంలో చేరడానికి సన్నద్ధం అయ్యాడు.. ఆ కంపెనీ లో అడుగుపెట్టిన అభినవ్ కళ్ళు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా అయిపోయాయి... కారణం.. ఆ కంపెనీ లోగో,ఐకాన్ లో ఒక చిత్రం.... అవును.. తనకు జ్ఞానబోధ చేసిన ఆ పెద్దమనిషే..... ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పరుగుపరుగున క్యాబిన్ లోనికి వెళ్ళేసరికి అభినవ్ అమ్మానాన్నలు కనిపించారు... నాలుగేళ్లుగా దూరమైన కొడుకుని కళ్లారా చూసుకొని ఆనందంతో కన్నీటి పర్యంతమైంది.. తండ్రి కొడుకుని చూసి వేయికళ్లవెలుగును చూసినట్లుగా తను చేసిన తప్పును ఒప్పుకొని అభినవ్ తలను నిమిరి దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు.... ఏమీ అర్థం కానీ అభినవ్ మాత్రం అమ్మని చూసిన ఆనందంలో మైమరచిపోయాడు.... కొన్ని క్షణాల అనంతరం అభినవ్ పేరు పిలవగానే లోనికి వెళ్లిన అభినవ్ కి నోట మాట రాలేదు... ఆ రోజు సాదాసీదాగా ఉన్న మనిషి ,ఇప్పుడు ఈ క్షణం దర్జాగా ఉన్న ఆయనను చూసి చేతులతో నమస్కారం చేసాడు...మై డియర్ అభినవ్ రా వచ్చి కూర్చో అంటూ సైగ చేసాడు.... ఆ రోజు చూసిన చిరునవ్వే ఈ రోజు కూడా ఉంది... సర్...!! ఆ రోజు నన్ను కాపాడింది మీరే కదా..?? నేను చాలా వెతికాను మీకోసం... ఎందుకు అభినవ్ రుణం తీర్చుకోడానికా అంటూ గట్టిగా నవ్వాడు.... అది సర్.....!! అభినవ్ ఆ రోజు నేను నిన్ను చూడకపోయుంటే ఒక మంచి ఇంజినీర్ ని కోల్పోయేవాన్ని మొట్టమొదటిసారి నిన్ను చూసింది మీ ఊళ్ళోనే వ్యాపారపనుల నిమిత్తం అక్కడికొచ్చిన నేను ఏదో అర్థం లేని ఆవేశంతో నువ్వు చేస్తున్న పనుల్ని చూసి ఆశ్చర్యపోయాను.ఆ వయస్సులోనే నీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.... కానీ అదే నువ్వు కొన్నిరోజుల తర్వాత మాసిన బట్టలతో, ఏడుస్తూ అలా చెరువు అంచున కూర్చొని ఉంటే చూడలేక నీ దగ్గరికి వచ్చాను... అప్పుడు అసలు విషయం తెలిసింది..అలా నిన్ను మా హాస్టల్ లో చేర్పించి మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి వాళ్ళు చేసిన తప్పుని అర్థమయ్యేలా వివరించాక నీకు అయ్యే అన్ని ఖర్చులు నీ తండ్రే చెల్లించాడు..నేను మాట సాయం చేశానంతే...ఏమైనా చేయాలి అనుకుంటే అది మీ నాన్నకే రుణం తీర్చుకో అంటూ చెప్పిన ఆ పెద్దమనిషి కాళ్లపై అమాంతం పడిపోయాడు అభినవ్.. తండ్రి రామయ్య కొడుకుని దగ్గరికి తీసుకొని అభి... నేను చాలా తప్పు చేసాను రా నన్ను క్షమిస్తావు కదూ....మొదటి ర్యాంక్ వస్తేనే జీవితంలో పైకొస్తారు ,లేకపోతే ఎందుకు పనికిరాకుండా పోతారు అన్న అర్థం లేని సిద్ధాంతాలను నీపై రుద్ది నిన్ను చిత్రహింసలు పెట్టాను.బతకడానికి కావాల్సిన తెలివితేటలు ఉంటే ఎంత కష్టమైన చదువైన ఇష్టంతో సాధ్యం అని నువ్వు నిరూపించావ్.. నిన్ను ఎవరితో పోల్చి నానామాటలు అన్నానో వాళ్ళు ఏ పనిపాట లేక ఇప్పుడు అవస్థలు పడుతున్నారు... నిన్న వాళ్లే వచ్చి నిన్ను మెచ్చుకుంటూ ఉంటే ఒకింత గర్వపడిన, నువ్వు ఇంత వాడివి అయ్యావంటే దానికి కారణం నేనే అని అంటుంటే సిగ్గుతో తలదించుకోకుండా ఉండలేకపోయాను.. పిల్లలకి చదువు విలువ,గొప్పతనం చెప్పే ప్రయత్నం చేయాలి కానీ లేనిపోని ఆంక్షలు పెట్టి వాళ్ళమనసుల్ని ఛిద్రం చేయకూడదు అని నువ్వు మాకు దూరంగా వెళ్లిన నాడు అర్థమైంది.ఇలా మాలాగా ప్రతి తల్లితండ్రి చేసే పొరపాటు ఇదే... అందుకే నన్ను క్షమిస్తావు కదా అభి... ఊరుకోండి నాన్న మీరేం తప్పు చేయలేదు ఒక తండ్రిగా మీ ఆరాటం అర్థం చేసుకునే వయసులో లేని నేను మీపై కోపం పెంచుకొని పారిపోయాను...తప్పు నాది కూడా.మీరే నన్ను క్షమించాలి అంటూ తండ్రి భుజాలపై చేతులేసి కొడుకుగా భరోసా ఇస్తూ ,ఒక బాధ్యతను తీసుకున్న వాడిలా హుందాగా ముందుకు నడిచాడు అభినవ్.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.