కలిసి పెంచుదాం!! - చాందినీ బళ్ళ

Let's grow together !!

"నైరా, లే, టైమ్ అవుతుంది. లెమ్మని పాపని లేపి "ఫ్రెష్ అవ్వు, బస్ వచ్చే టైమ్ అయింది" అన్నాడు అరుణ్. "అప్పుడేనా, కాసేపు బజ్జుంటా" అంటూ గారాలు పోయి కళ్ళు నులుముకుని మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టింది నైరా. "లే నాన్నా, లే, లేట్ అయితే అమ్మ తిడుతుంది" అన్నాడు. "అమ్మకి ఎలా తెలుస్తుంది, ఎప్పుడో సాయంత్రం చూస్తుంది నన్ను, సరేలే" అంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ బాత్రూం లోకి వెళ్ళి రెడీ అయ్యి హల్ లోకి వచ్చేసరికే బాక్స్ లు సర్ది రెడీగా ఉంచాడు అరుణ్. తండ్రి కూతురు ఇద్దరూ గబగబా తిని, తలుపు వేసి పరిగెత్తారు. పాపని బస్ ఎక్కించి, తను కార్ తీసి బయల్దేరే ముందు "డాడీ, సోమవారం సాయంత్రం ఐస్ క్రీం ఇప్పించాలి, సరేనా" అంటూ బై చెప్తున్న కూతుర్ని చూసి నవ్వుకున్నాడు. అప్పటికే ఆఫీసులో ఉన్న అభినయకు ఫోన్ వైబ్రేషన్ వినిపించి చూసుకుంది. "ఈరోజు నీదే పికప్ బాధ్యత, గుర్తుందా" అని అరుణ్ నుండి మెసేజ్. "హా గుర్తుంది, థాంక్ యూ" అని తిరిగి పంపింది. "ఎవరే, బాయ్ ఫ్రెండ్ ఆ", అంది కన్నుకొడుతూ స్నేహితురాలు నళిని. "లేదు, అరుణ్" అంది చిరునవ్వుతో. "హమ్మా తల్లీ, మీరు నాకు అర్దం కారు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా ఉంటారా" అంది వేళా కోళంగా. "విడిపోతే ఇద్దరూ అసహ్యించుకునే స్థాయిలో తిట్టుకోవాలా, మామూలుగా ఉండటంలో తప్పేముంది, ఆ స్థాయి రాకూడదు అని విడిపోయాం" అంది అభినయ. "లేదు అభి, ఈ తరంలో విడాకులు తీసుకుంటున్నారు, అంటే పెద్దల్లో కొట్టేసుకుని, తిట్టేసుకుని భరణం అని ఏవేవో కేసులు, పోలీసులు,కోర్టులు గొడవ. మీరిలా ఉండటం ఆశ్చర్యం" అంది నళిని. "హ్మ్మ్, మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. మా ప్రేమకు ప్రతిరూపం నైరా. అరుణ్ మంచి తండ్రి అని నమ్మకం నాకు ఉంది. మా ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వస్తె పాప ఎందుకు బలి అవ్వాలి. తండ్రి ప్రేమ కావలిగా దానికి. అందుకే జాయింట్ కస్టడీ తీసుకున్నాం. ఒకరిని ఒకరు అసహ్యించుకునే స్థాయికి చేరుకుంటం అని భయమేసి విడిపోయాం. అరుణ్ మంచివాడు అని నీకు తెలుసుగా" అంది అభినయ. "అవును, మరి కలిసే ఉండచ్చుకదా, స్నేహంగా ఉండగలిగితే కలిసి ఎందుకు ఉండలేరు" అంది నళిని. "చెప్పలేను, ఉండలేము అంతే, ప్రేమ, పెళ్ళి తర్వాత హక్కులా మారుతుంది. అది హద్దు దాటితే ఎవరిది పై చెయ్యి, అనే భావన మొదలయి పోటిలా మారుతుంది" అంది నిట్టూరుస్తూ. "హ్మ్మ్, సరే, సారి, ఈ విషయాన్ని మాట్లాడినందుకు" అంది నళిని "పర్వాలేదు, వెనక మాట్లాడే కన్నా అడిగితేనే మంచిది" అంది చిరునవ్వుతో అభినయ. "నేను, అరుణ్ మంచి భార్య భర్తలు అవ్వలేకపోయినా, మంచి తల్లితండ్రులు అవ్వాలనుకున్నాం,అందుకే ఇద్దరం పాపని జాగర్తగా చూస్కుంటున్నాం. అది ఎదిగాక అర్దం చేసుకుంటుంది అని నమ్మకం." అని పనిలో పడింది. **** అభినయ, అరుణ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయిదేళ్ళు గడిచాయి. నాలుగేళ్ళ ముద్దులొలికే పాప నైరా. మూన్నాళ్ళ ముచ్చటలా విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ విడిపోయారు. ఎవరికి వారే ఒంటరిగా ఉంటున్నారు. పాప విషయంలో మాత్రం కలిసి కట్టుగా ఉంటున్నారు. **** ఎవరైనా విడాకులు తీసుకున్నారు, పోలీస్ కేస్ అయింది, జైల్లో పెట్టారు, భరణం, ఇవన్నీ విన్నాక నాకు మొదట గుర్తొచ్చేది వాళ్ళ పిల్లలు. ఏమి ఎరుగని పసిబిడ్డలు. అవి వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపుతాయి మనం ఊహించలేం. ఒకరి మిద ఒకరు పంతం, ద్వేషం పెంచుకుంటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం మరింత కష్టం అవుతుంది. దాని వల్ల వాళ్ళ ఆలోచనా ధోరణి, ప్రవర్తన దెబ్బతింటుంది.పిల్లల్లో మానసిక ఎదుగుదల చాలా దెబ్బ తింటుంది అని చాలా రీసెర్చ్ లలో తేలింది. హానికరంగా ఉన్న తల్లి, తండ్రి గురించి మాట్లాడడం లేదు నేను, అభిప్రాయాలు, అహం అడ్డు వచ్చి విడిపోయిన పిల్లలు ఉన్న జంటల గురించి మాత్రం చెబుతున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరి మనసుని అయినా బాధించి ఉంటే మన్నించండి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.