ఆ రోజు శనివారం,శంకర్రావు గారు ప్రక్కింటిలోంచి వినిపిస్తున్న 'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం'వింటూ నిద్ర లేచారు. శంకర్రావు గారి గురించి చెప్పాలంటే ఆయన పది సంవత్సరాల క్రితమే, ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి, పదవీ విరమణ పొంది విశ్రాంత జీవితం గడుపు తున్నారు. సహృదయుడు,మితభాషి. స్వచ్ఛమైన తెలుగు వాడైనా, ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నైకు వచ్చి యాభై ఏళ్ళుగా అక్కడే స్థిరపడి పోయాడు. గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా, తను చేసే చిన్న ఉద్యోగం లోనే స్థిరపడి కేవలం పదిహేనువేల జీతం తోనే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి చేసి, అత్తారింటికి పంపించేసాడు. చివరగా పుట్టిన సుపుత్రుణ్ణి ఇంజనీరింగ్ చదివించాడు. స్వంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కోడలు కూడా అక్కడే వున్నది. ఇదీ శంకర్రావు గారి నేపధ్యం! ఇక ప్రస్తుతానికి వస్తే, రోజూ ఉదయం నిద్ర లేవగానే నలభై ఐదు నిమిషాలపాటు వాకింగ్ కు వెళ్ళడం ఆయన దినచర్య లో భాగం. అయితే ఐదునెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' కారణంగా వాకింగ్ కు బయట పార్కుకి వెళ్ళడం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఇంటిముందున్న ముప్పైఅడుగుల పొడవైన ఖాళీస్థలం లోనే అటూయిటూ నడిచి యీ రోజు కూడా వాకింగ్ అయిందనిపించు కున్నాడు. ఇంటిలోపల హాలులో కూర్చుని, 'ప్రాణాయామం'... ఆపై కాలకృత్యాలు ముగించుకొని,భార్య పార్వతమ్మ వడ్డించిన టిఫిన్ పెసరట్టు తిని, కాఫీ తాగి,తాపీగా వాలుకుర్చీలో వాలిపోయాడు. తెలుగులో వార్తలకోసం టి.వి ఆన్ చేసాడు. శంకర్రావు అయిదు దశాబ్దాలుగా చెన్నై లో వుంటున్నా,తమిళ వార్తలకంటే రోజూ తెలుగులో వార్తలు వినడానికే చాలా ఇష్టపడతాడు. ముఖ్యంగా రాజకీయ విశేషాలు! అలా టి.విచూస్తూ ఎంతసేపయ్యిందో తెలీదు,భార్య పార్వతమ్మ వచ్చి"ఏవండోయ్, బియ్యం డబ్బాలో బియ్యం అయిపోవచ్చాయి ఆ వెంకటేశ్వర్లుకి ఫోన్ చేసి, బియ్యం మూట ఒకటి తెచ్చియ్యమనండి.రెండు మూడు రోజులుగా చెబుతున్నా వినిపించు కోరేంటి?" అని గద్దించేసరికి, "అవును మర్చి పోతున్నానే!.. ఉండు... ఇప్పుడే ఫోన్ చేస్తాను" అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. వెంకటేశ్వర్లు శంకర్రావు గారింటికి సుమారు పాతికేళ్ళుగా బియ్యం సప్లై చేస్తున్నాడు. మనిషి చాలా నిదానస్తుడు. శంకర్రావు గారింటికి ఒక కి.మీ దూరంలోనే చిన్న బియ్యం కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. కష్టపడి పైకి రావాలనే మనస్థత్వం గలవాడు. శంకర్రావు గారికి మంచి బియ్యం, సన్నటి బియ్యం తెచ్చిస్తాడు.అందువల్లనే ఇన్నేళ్ళుగా ఇంకెవ్వరి దగ్గరా బియ్యం కొనకుండా, వెంకటేశ్వర్లుకే ఫోన్ చేసి బియ్యం తెప్పించుకుంటారు శంకర్రావు గారు. ఎప్పటిలాగే, యీరోజుకూడా వెంకటేశ్వర్లు ఫోన్ నెంబర్ కి కాల్ చేసాడు. అవతలి వ్యక్తి ఫోన్ తీసాడు. "వెంకటేశ్వర్లూ! నేను శంకర్రావు గారిని, మాకు పాతిక కేజీల పచ్చిబియ్యం మూట ఒకటి యీ రోజు తీసుకొచ్చి యివ్వు మరిచిపోకుండా" అని చెప్పాడు. అయితే అవతలి వ్యక్తి గొంతు వెంకటేశ్వర్లుది కాదు! "ఏం బాబూ, వెంకటేశ్వర్లు లేడా? మీరెవరు? అని అడిగాడు శంకర్రావు. "లేరు అంకుల్, నేను వారి అబ్బాయిని. మా నాన్న గారు చనిపోయి రెండు నెలలయింది" అంటూ దీనంగా సమాధానం వచ్చింది. శంకర్రావు గారికి కొద్ది క్షణాలు నోట మాట రాలేదు! చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు.అదేమిటి! చనిపోవడమేంటి! చాలా చిన్న వయసు, నలభై ఐదు ఏళ్ళే వుంటాయి అతనికి. ఆరోగ్యంగా వుంటాడు. ఇంతలో ఏమైంది అతనికి? ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తాడు అనుకుంటూ తేరుకుని, "ఏమైంది బాబూ, ఏం జరిగింది? ఎలా చనిపోయాడు మీ నాన్న?" అంటూ ఆరా తీసారు శంకర్రావు గారు. "మా అమ్మ గారికి 'న్యూరో ప్రాబ్లం' ఐతే గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చాము. ఆపరేషన్ జరిగింది. ఆమెను డిశ్చార్జి చేసే లోగా,మానాన్న రోజూ ఆస్పత్రికి వెళ్లి వస్తున్నందువలన ఆయనకి అకస్మాత్తుగా 'కరోనా మహమ్మారి' అంటుకుంది. ఆయనతోపాటు మా అమ్మ గారికీ అది సంక్ర మించింది. ఇద్దరూ అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇంకా రెండు రోజుల్లో మా నాన్నను డిశ్చార్జి చేస్తామని కూడా చెప్పారు. ఇంతలో, ఒకరోజు ముందుగానే మా నాన్న గారు చనిపోయారని నాకు పిడుగు లాంటి వార్త అందింది! చనిపోవడానికి కారణం కూడా వాళ్ళు నాకు సరిగ్గా వివరించలేదు. ఇంతలో రెండవరోజునే మా అమ్మ కూడా 'కరోనా' వలన మరణించారు. నా బాధ వర్ణనాతీతం, ఎలాగో దుఃఖ్ఖాన్ని దిగమింగుకుని, మా నాన్న గారి బియ్యం వ్యాపారం నేనే చూసుకుంటున్నాను" అంటూ వివరించాడు వెంకటేశ్వర్లు కొడుకు. పేరు విజయకుమార్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అతనికి ఒక చెల్లెలు కూడా వుంది. కాలేజీలో బి.ఎస్.సి చదువుతోంది. వీరి కుటుంబ వివరాలు శంకర్రావు కి కూడా బాగా తెలుసు. ఆ అబ్బాయిని ఇంజనీరింగ్ లో చేర్చడానికి, డొనేషన్ కోసం వాళ్ళ నాన్న రెండున్నర లక్షలు అప్పు చేసిన విషయం కూడా శంకర్రావుతో అప్పుడప్పుడు వాళ్ళ నాన్న ప్రస్తావించి విచారించేవాడు. యీ విషయాలన్నీ శంకర్రావు గారికి గుర్తొచ్చి మనసు వికలమైంది. ఎలాగో తేరుకుని, ఆ అబ్బాయికి ఇంటి అడ్రస్, వివరాలు చెప్పి బియ్యం తీసుకురమ్మని చెప్పి ఫోన్ పెట్టేసాడు. యీ వెంకటేశ్వర్లు అకాల మరణం గురించి శంకర్రావు, పార్వతమ్మలు చాలాసేపు బాధ పడ్డారు. అతనితో పాతికేళ్ల అనుబంధం మరి! శంకర్రావు గారి మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. యీ మహమ్మారి 'కరోనా' ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తుంది?ఎంతమంది పసిపిల్లలను అనాధలుగా చేస్తుంది? ఎందరు స్త్రీలను విధవలుగా చేసి ఎన్ని కుటుంబాలను అధోగతి పాలు చేస్తుంది? ఈ మహమ్మారి బారినపడి మరణిం చినవారి మృతదేహానికి అంత్యక్రియలు, కర్మకాండ చేసుకునే అవకాశం కూడా వారి కుటుంబాలకు దక్కదు కదా! ఏమిటీ ఘోరం? ఈ కనిపించని శతృవుకు అంతమెప్పుడు? సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన అగ్రదేశాలే దీని తాకిడికి విలవిల లాడుతున్నాయే! శాస్త్రజ్ఞులు దీనిని అరికట్టే 'వాక్సిన్' విజయవంతంగా కనిపెట్టగలరా? భగవంతుడా మానవాళిని రక్షించు. "సార్, బియ్యం తెచ్చాను సార్" అంటూ విజయకుమార్ పిలిచిన పిలుపుతో శంకర్రావు యీ లొకంలోకి వచ్చిపడ్డాడు. తేరిపార చూసాడు. బయటి గేటు తీసుకుని ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్, భుజాన బియ్యం మూటతో అతను వస్తుంటే, శంకర్రావు గారికి ,భుజాన వున్నది బియ్యం మూటలా కాదు! ఒక కుటుంబ బరువు బాధ్యతలు ఆ కుర్రాడు మోస్తున్నట్లుగా అనిపించింది. ఒక ఇంజనీర్ కావలసిన యువకుడు భుజంపై బియ్యం మూటతో తాపీగా అడుగులు వేస్తూ దగ్గరికి వస్తున్నాడు. అయితే ఆ అడుగులలో ఆత్మ విశ్వాసం నిండుగా వుంది. అతణ్ణి అలాగే చూస్తూ స్థాణువులా వుండిపోయారు శంకర్రావు గారు!... 'టి. వి' లోంచి, 'ఇంతేరా ఈ జీవితం! తిరిగే రంగుల రాట్నము, నడిచే రంగుల రాట్నము' అంటూ పాత సినిమా లోని పాట వినిపిస్తోంది!. ************************