మనసు వక్రిస్తే - శింగరాజు శ్రీనివాసరావు

If the mind is distorted

సుమారు నాలుగు నెలల క్రితం మా ఇంటికి ఎదురుగా ఉండే అపార్టుమెంటులో నుంచి ఒక అందమైన యువతి రావడం చూశాను. సుమారు ముప్పది సంవత్సరాల వయసు ఉండవచ్చు. చూడ చక్కదనం అనేకంటే అందగత్తె అని అంటే సరిగ్గా సరిపోతుంది. అంతకు ముందు ఎప్పుడూ ఆమెను చూసిన దాఖలు లేవు. ఆమె ప్రక్కనే చిన్నపిల్ల, స్కూలు బ్యాగు తగిలించుకుని ఉంది. సంతూర్ సోప్ యాడ్ లోలా ఇద్దరూ ఒకటే పోలిక. బహుశా పాపను స్కూలులో దించడానికి వెళ్తుందేమో అనుకున్నాను. కానీ గేటు బయట నిలబడి దేనికోసమో చూస్తున్నట్లనిపించింది. ఆమె అందాన్ని ఇంకొంచెం దగ్గరగా చూస్తే బాగుండుననిపించి రోడ్డు మీదకు వచ్చి నిలుచున్నాను. ఆమె నన్ను చూసింది. తల ప్రక్కకు తిప్పి ఓరకంట ఆమెను గమనిస్తున్నాను. ఆమె నన్ను నిశితంగా చూసింది కొద్దిసేపు. అది గమనించాను. అంతలో స్కూలు బస్సు వచ్చింది, చూపులకు అడ్డంగా. బస్సు వెళ్ళిన తరువాత చూశాను. ఆమె లోపలకు నడుస్తూ వెళుతోంది. ఒక్కసారి వెనుకకు తిరిగితే బాగుండు అనుకున్నాను. సరిగ్గా పది అడుగులు వేసి వెనుకకు తిరిగి నావైపు చూసింది. నవ్విందో, లేదో కనిపించలేదు గాని, ఒక్క క్షణం నన్ను చూసినట్లనిపించింది. బాగుండదేమో అనుకుని నేను లోపలికి వచ్చేశాను. అదే సమయానికి ప్రతిరోజు నేను బయటకు రావడం ఆమెను చూడడం, ఆమె విరిసీ విరియని నవ్వుతో పలకరించడం పరిపాటి అయిపోయింది. అలా ఒక వారం జరిగిపోయింది. ఆ నవ్వుకు అర్థమేమిటి, సహజమా లేక ఏదైనా మనసులో ఉందా. నాకు అంతుబట్టడం లేదు. ఈ మధ్య కాలంలో నేను చదువుతున్న యూట్యూబ్ కథలలో గానీ, మీడియాలో వచ్చే క్రైం కథలలో గానీ, అన్ని అక్రమ సంబంధాలూ పెళ్ళయిన ఆడవాళ్ళకు, పెళ్ళికాని యువకులకూ మధ్యే. నిజం చెప్పొద్దూ, నా మటుకు నాకు అందగాడిననే నమ్మకం ఎక్కువ. దానికి కారణం లేకపోలేదు. నేను చదువుకునే రోజులలోనే కాదు ఇప్పుడు కూడ నాకు ప్రపోజ్ చేస్తున్న యువతుల సంఖ్య ఎక్కువే. కానీ నాకెవరూ నచ్చట్లేదు. మొట్టమొదటి సారి ఆమె నచ్చింది. నా అందానికి సరిదీటైన అందం ఆమెది. పెళ్ళికాకపోయి ఉంటే ఆమెను నేనే ప్రపోజ్ చేసేవాణ్ణి. ఇంతలో ఎవరో చెంప మీద ఛెళ్ళున కొట్టినట్టనిపించింది. ఇంకెవరు నా అంతరాత్మ. పెళ్ళయిన పిల్ల మీద అలాంటి ఆలోచనలు తప్పన్నది. నిజమే. ఈ దిక్కుమాలిన కథలు చదవడం మొదలెట్టినప్పటి నుంచే ఈ ఆలోచనలు. సర్దుకుని ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పాను. కాని ఒక రోజు.... ****** దగ్గరే కదా బండి తీయడమెందుకని కిరాణా కొట్టుకు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ప్రత్యక్షమయింది ఆమె. నావైపు చూసి నవ్వింది. నేను కూడ బాగుండదని ఓ పలకరింపు నవ్వు పారేశాను. కానీ మనసు మాత్రం ఆమె నాతో మాట్లాడితే బాగుండుననిపించింది. దూరంగా కంటే దగ్గరగా చూస్తుంటే మునుపుకంటే చాలా అందంగా అనిపించింది. " మేము, ఇదో కనిపిస్తున్న అపార్టుమెంటులో ఉంటాము. అదే మీ ఇంటి ఎదురుగా ఉన్నది కదా అందులో" కోయిల చిన్నబోతుందా అన్నంత తీయగా మాట్లాడింది ఆమె. మనసు 'యాహూ' అని అరిచింది. యూ ట్యూబులో చదివిన అనేక శృంగారకథలలో మధ్య వయసున్న ఆడవాళ్ళు యువకులను బుట్టలో వేసుకోవడానికి ముందు వారే చొరవ తీసుకుని దగ్గరవుతారట. అంటే ఈమెకు నామీద..... 'ఒరేయ్ నువ్వు లక్కీరా జాకీ' ఎగిరిపడింది మనసు. "అవునాండి" అన్నాను తెలియనట్లుగా " మరీ అంత అమాయకంగా మొహం పెట్టకండి. రోజూ పాపను స్కూలుకు పంపే సమయానికి మీ వరండాలో నిలుచుని చూస్తారుగా" వేసింది చురక. గతుక్కుమన్నాను. " అబ్బే అదేం కాదండి. సరిగ్గా ఆ సమయం నేను పేపర్ చదివే టైం. అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ నిలుచుని అలా రోడ్డువైపు చూస్తాను. అంతే. బహుశా అది మీరు పాపను వ్యాను ఎక్కించే వేళ కాబోలు" తెలివిగా మాట్లాడాను. " మీరు నన్నసలు చూడలేదన్నట్టుగా ' అవునాండి ' అంటేను అలా అన్నాను. సారీ. మీరేం చేస్తుంటారు." " దానిదేముంది లెండి. నేను ఉద్యోగప్రయత్నాలలో ఉన్నాను" "మీ పేరు" " జానకిరాం" " ఏం చదివారు?" "యం.బి.ఏ" "ఓ. బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్నారా" " అవునండి" " నా పేరు సునంద. మా వారు ఏక్సిస్ బ్యాంకులో చేస్తున్నారు. మీరు ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తారా లేక ప్రభుత్వ బ్యాంకులలోనేనా" " అదేంలేదండీ. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఒకటిగానే ఒత్తిడి తెస్తున్నాయి. దేనిలోనైనా ముందు చేరితే, తరువాత మంచి బ్యాంకికి మారవచ్చు" " మావారి బ్యాంకులో ఖాళీలు ఉన్నాయేమో అడగమంటారా" " విత్ ప్లెజర్. ముఖపరిచయంతోనే ఇంత సహాయం చేస్తామంటున్నారు." " మీరు బ్యాంకులో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండడం, మావారు బ్యాంకర్ కావడం యాదృచ్ఛికమే కదా. నేనూ ఊహించలేదు. చూడబోతే మంచి కుర్రాడిలా ఉన్నారనిపించింది. హెల్ప్ చేద్దామని" చిన్న నవ్వు నవ్వింది. అయ్యబాబోయ్ ఎంతలా కలిసివచ్చింది. ఇంత త్వరగా లైన్ క్లియరవుతుందని ఊహించలేదు నేను. పడిపోయింది ఆంటీ అనుకున్నాను, నా పఠనానుభవాన్ని బేరీజు వేసుకుని. " థాంక్సండి. మీరు నాకు సహాయం చేస్తున్నందుకు. నన్ను వచ్చి సార్ ను కలవమంటారా" చొరవ తీసుకున్నాను. " మీకు అభ్యంతరం లేకపోతే రండి. మా ఫ్లాటు నెంబరు 401. ముందు వచ్చి మీ వివరాలన్నీ నాకు ఇవ్వండి. మీ బయోడేటా చూశాక మా వారే చెప్తారు, మీరు ఎప్పుడు కలవాలో" " ఓ. తప్పకుండానండి. మరోసారి థాంక్స్" " మోస్ట్ వెల్ కం. వస్తాను. వీలుచూసుకుని రండి" అని మరో చిరు దరహాసాన్ని నా ముఖాన రువ్వి వెళ్ళిపోయింది ఆమె. ఎక్కడలేని ఆనందం నా మనసును కమ్మేసింది. వాళ్ళాయన లేని సమయం చూసి వెళ్ళాలి. ఆలస్యం అమృతం విషం అన్నారు కదా. రేపు మంగళవారం. ఆయన ఎలాగూ ఆఫీసుకు వెళతారు, పాప స్కూలుకు వెళుతుంది. ఆమె ఒక్కతే...యాహూ....ఊహలలోకి వెళ్ళిపోయాను. ****** సరిగ్గా పదకొండు గంటలకు ఆమె ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను. రెండు నిముషాల తరువాత తలుపు తెరుచుకుంది. తీసింది ఆమెకాదు, ఒక ఆజానుబాహుడు. పచ్చని పసిమిఛాయ. చూడగానే స్ఫురద్రూపి అనిపించాడు. ఈయన ఎవరబ్బా, కొంపదీసి వాళ్ళాయన కాదుగదా. ఛ. కాలం గాడిదను తొక్కింది. ఆంటీతో కాలం గడపాలనుకుంటే వీడెవడు మధ్యలో. " రండి. మీరు జానకిరాం గారా" అడిగాడతను " అవునండి" నాలుక తడారిపోయింది. " సునంద చెప్పింది. రండి. కూర్చోండి. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీలాంటి వాళ్ళే మా బ్యాంకకు కావాలి. సారీ చెప్పలేదు. నాపేరు సుమంత్. సునంద నా శ్రీమతి" చక్కగా నవ్వుతూ చలాకీగా మాట్లాడుతున్నారు. అయిపోయింది గోల్డెన్ ఛాన్స్ మిస్సయింది. అయినా ఆఫీసుకు వెళ్ళక ఇంట్లో ఎందుకు తగలడ్డాడో. " హలో జానకిరాం. వెంటనే వచ్చేశారే. ఈ స్పీడు వుంటేనే జీవితంలో దూసుకు వెళ్ళగలరు. నాకెందుకో మీరు వస్తారని అనిపించి, తనని నేనే ఆఫీసుకు కొంచెం ఆలస్యంగా వెళ్ళమన్నాను." అంటూ వచ్చి సుమంత్ పక్కన కూర్చుంది. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఎందుకో నా యూట్యూబ్ పాండిత్యమంతా తప్పనిపించసాగింది. " ఏం తీసుకుంటారు. కాఫీనా, టీనా" అడిగింది సునంద " అబ్బే ఏమీ వద్దండి " మొహమాటం నటించాను. వచ్చిన పని కానపుడు ఏదయితేనేం అనుకున్నాను. " పర్లేదు చెప్పండి" " టీ" అన్నాను తప్పదనుకుని. ఆమె లోనికి వెళ్ళింది. " జానకిరాం. మీరు యం. బి. ఏ లో స్పెషలైజేషన్ ఏం తీసుకున్నారు" అడిగాడతను " ఫైనాన్స్" " వెరీగుడ్. మా రిక్వైర్ మెంట్ కూడ అదే. నీకు జాబ్ చూసే బాధ్యత నాది" హామీ ఇచ్చాడు. గదంతా ఒకసారి కలయచూశాను. గోడమీద ఒక ఫొటో మీద నా చూపులు ఆగిపోయాయి. ఆశ్చర్యపోయాను. ఎక్కడో చూసినట్లు అనిపించింది. " ఏమిటలా చూస్తున్నారు. ఆ ఫొటో మా సునంద తమ్ముడిది" అని లేచి వెళ్ళి ఫొటోను తీసుకొచ్చాడు సుమంత్. చేతిలోకి తీసుకుని పాలించి చూశాను. నా పోలికలు చాలా వరకు ఉన్నాయి అతనిలో. ఏదో గందరగోళం తలెత్తింది నాగుండెలో. " అది మా తమ్ముడి ఫొటో. వచ్చి పోయి వీ వయసే ఉంటుంది. మిమ్మల్ని మొదటిసారి చూసినపుడు నేను పట్టించుకోలేదు. తరువాత ఒకసారి మా పాప అన్నది. "అమ్మా. ఎదురింటి అంకుల్ అచ్చు మామయ్యలా ఉన్నాడు కదూ" అని. మర్నాడు కొంచెం దగ్గరకు వచ్చి చూశాను. మీరప్పుడు ఫోనులో మాట్లాడుతున్నారు. మీ తలకట్టు, నుదురు, నవ్వు అచ్చు మా తమ్ముడిలాగే వుంది. ఇంటికి వచ్చి సుమంత్ కు చెప్పాను. తనే మిమ్మల్ని ఇంటికి పిలవమన్నారు. అందుకే చొరవచేసి మీతో మాట కలిపాను. మీ అవసరం కూడ తెలిశాక ఉభయతారకంగా ఉందని పిలిచాను" టీ ట్రే టేబుల్ మీద పెడుతూ అన్నది సునంద. ఆమె మాటలు నాకు రుచిచడం లేదు. ఆశలన్నీ కూలిపోయినట్లు అనిపించింది. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా. మనసు పరిపరివిధాల ఆలోచించసాగింది. " ఏమండీ జానకిరాం గారు" పిలిచాడు సుమంత్ " సారీ సర్. ఫొటో చూసి షాకయ్యాను. ఇంతకు మీ తమ్ముడు ఎక్కడుంటాడు" మనసు ఉగ్గబట్టుకు అడిగాను. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చెయ్యి పైకి చూపింది. " లేడు జానకిరాం. వాడు లేడు. ప్రేమ పరాజయం. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా రెండేళ్ళయింది" కల్పించుకున్నాడు సుమంత్ " సారీ అండీ " " మిమ్మల్ని చూసిన తరువాత తనకు మీలో తన తమ్ముడు కనిపించాడు. మీతో మాట్లాడాలని తహతహలాడింది. కానీ మీరేమనుకుంటారోనని భయపడింది. నేనే ప్రోత్సహించి పంపాను. తమ్ముడంటే తనకు ప్రాణం జానకిరాం. ఈరోజుకు కూడ వాడిని తలుచుకుంటే చాలు ఏడుస్తుంది. మిమ్మల్ని చూసిన తరువాత తనకు తమ్ముడు లేని లోటు తీరిందనుకుంటున్నది. మీరు ప్రతిరోజు పాపను వ్యాను ఎక్కించే సమయానికి బయట ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుంటారట. ప్రతిరోజు మిమ్మల్ని చూడాలని తనే వస్తుంది బయటికి. నేను వెళ్తానన్నా " వద్దు. మా తమ్ముడిని చూడాలి నేనే వెళ్తానంటుంది." అని చెప్తున్నాడు సుమంత్. నా మెదడు మొద్దుబారిపోయింది. ఛ. ఎంత వక్రంగా ఆలోచించాను. ఒక పెళ్ళయిన ఆడపిల్లను గూర్చి..ఛీ..ఛీ... ఏమయిపోయింది నా సంస్కారం. చెత్తకథల ప్రభావం నాలోని సంస్కారాన్ని, విజ్ఞతను చంపేసింది. ఆమె తనలో తన తమ్ముడిని చూసుకుంటుంటే, నేను ఏమిటిలా పశువులా. నా మీద నాకే అసహ్యం వేసింది. ఎంతటి పవిత్రబంధాన్ని ఊహించుకుంది తను. తన కళ్ళలో కనిపించే ఆప్యాయతను చూడలేకపోయాను నేను. కబోదినయ్యాను. " అవును జానకిరాం. మీకు అభ్యంతరం లేకపోతే నిన్ను తమ్ముడూ అని పిలవవచ్చా" ఆమె స్వరంలోని అనురాగానికి నా మనసు కరిగిపోయింది. నా కళ్ళు చెమర్చాయి. ఇంతకాలం నేను ఒక్కడినే. నాకూ ఒక అక్కో, చెల్లో ఉంటే బాగుండేదని అమ్మతో అంటుండేవాడిని. ఆ లోటు ఈ రోజు తీరింది. నా మనసులోని చెడు భావనలు నశించిపోయాయి. ఇప్పుడు నాకు ఆమెలో అందం కనిపించడం లేదు. ఒక దేవత కనిపిస్తున్నది." అక్క". ఎంత తీయని పిలుపు. ఇంతకాలం తను పిలవాలని తపించిపోయిన పిలుపు. " అక్కా" అన్నాను అప్రయత్నంగానే. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. " తమ్ముడూ" అంటూ దగ్గరకు వచ్చి నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇప్పుడు ఆమెలో నాకు అమ్మ కనిపిస్తున్నది. ఆ కళ్ళల్లో అభిమానం కనిపిస్తున్నది. నాలోని తామసం నశించింది. వయసు మీద చెడు ఆలోచనల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమయింది. ఇంతలో బయటనుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ పాప. వస్తూనే "హాయ్ అంకుల్ " అంది. " జానకిరాం. ఇది మా ముద్దుల కూతురు స్నిగ్ధ" చెప్పాడు సుమంత్. " అంటే నా ముద్దుల కోడలన్న మాట" అన్నాను దగ్గరకు రమ్మని పిలుస్తూ " వెళ్ళమ్మా. అంకుల్ మనవాడే " అంది సునందక్క. " అంకుల్ కాదక్కా. మామయ్య" అన్నాను స్వచ్ఛమైన మనసుతో. " ఇకనుంచి నన్ను మామయ్యా అని పిలవాలమ్మా" అన్నాను పాపను దగ్గరకు తీసుకుంటూ. " ఓకె మామయ్యా" అంటూ ఒళ్ళోకి చేరింది స్నిగ్ధ. అందరం హాయిగా నవ్వుకున్నాం. మనసులో భావాలు స్వచ్ఛంగా ఉంటే చాలు, అందరూ మనవాళ్ళుగానే కనిపిస్తారు అనిపించింది నా మనసుకు. ****** అయిపోయింది********

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.