జగదీశ బాబా - చెన్నూరి సుదర్శన్

Jagadisha Baba

“ఏమండీ.. మిమ్మల్నే.. వింటున్నారా! ఎన్నాళ్ళని ఇలా ఒకరి ముఖం మరొకరం చూసుకుంటూ కూర్చుంటాం” అంటూ అసహనంగా ముఖం పెట్టింది అనసూయ.

‘అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావే..!’ అన్నట్టుగా ముఖం చిట్లించాడు మురహరి. ఆముఖాన్ని అర్థ చేసుకుంది అనసూయమ్మ.

“మీరేమీ ప్రయత్నాలు చెయ్యలేదని అనడం లేదండీ.. మానవ ప్రయత్నాలన్నీ మసకబారి పోయాయి. ఇక మిగిలింది అతీంద్ర శక్తుల్ని అడగాలి.. అన్నట్టు చెప్పడం మరిచాను. ములుగు దగ్గర జంగాల పల్లిలో జగదీశ బాబా ఉన్నాట్ట. అతనికి సర్వం తెలుసనీ అంతా అనుకుంటున్నారు. ప్రజలు అతనికి తమ ఆపదలు చెప్పుకుంటే పరిష్కార మార్గాలు చూపుతున్నాట్ట. దొంగల పాలైన సొమ్ము జాడ చెప్పి పోలీసులకు సాయ పడ్తున్నాట్ట. దేశం ఏమూలన ఏమున్నదో ఇట్టే చెప్పేస్తున్నాట్ట. ఓ మారెళ్ళి మన మనోహరు జాడ గురించి కనుక్కోండి” అంటుంటే ఆమె గొంతు జీర పోయింది. కళ్ళల్లో నుండి సన్నని కన్నీటి ధారలు. కడకొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటోంది. అలాంటి దృశ్యాన్ని గత పది సంవత్సరాలుగా చూస్తున్నా.. ఈ సారి ఎందుకో లోలోన ఏడ్చీ, ఏడ్చీ ఎండి పోయిన మురహరి కళ్ళు కాస్త మెత్తబడ్డాయి.

“సరే అనూ.. ఇప్పటికే శతకోటి ప్రయత్నాలు చేశాం. దీంతో శతకోటిన్నొక్కటి అవుతుంది అంతే. ఏం ఫరవా లేదు. నీ మనసు కష్టపెట్టుకోకు. ఆ ఊరే మన దేవరాజుది. ముందుగా వెళ్లి వాణ్ణి జగదీశ బాబా గురించి ఆడిగి తెలుసు కుంటాను. అసలే రోజులేం బాగు లేవు. అంతా దొంగ బాబాలు పుట్టుకొస్తున్నట్లు వార్తలు ఎన్ని వినడం లేదు” అంటూ అనసూయమ్మను ఊరడించాడు. ‘ఈయనగారు ఏనాడు ఎవరిని నమ్మాడు గనుక’ అన్నట్టు నిట్టూర్చింది అనసూయమ్మ. కాని దేవరాజు పేరు విన్న అనసూయమ్మ మనసుకు కాస్త సాంత్వనం చేకూరింది. అతను వారి కుటుంబ స్నేహితుడు. మహా మేధావి. ఈ మధ్యనే రాక చాలా రోజులవుతోంది.

మరునాడు ఉదయమే మురహరి బస్సులో బయలు దేరాడు. జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి దేవరాజు కోసం అటూ, ఇటూ చూశాడు. ‘ఫోన్ చేశానే.. ఇంకా రాలేదేమి’ అని మనసులో అనుకుంటూ.. నడక ప్రారంభించాడు. అక్కడి నుండి దాదాపు కిలోమీటరు పైగా నడిస్తే గాని ఊరు తగులదు. మరో సారి ఫోన్ చేద్దామని తన జేబులో సెల్ ఫోన్ తడుముకుంటూ.. నాలుగడుగులు వేశాడో లేదో.. ఎదురుగా దేవరాజు టూ వీలర్ మీద రావడం కనబడింది. చెయ్యి ఊపాడు. అయినా తనను చూసి ఆగుతాడనుకున్న దేవరాజు తనని దాటేసి వెళ్తూండడంతో..

“ఒరేయ్.. దేవా” అంటూ గట్టిగా కేకేశాడు. దేవరాజు బండి ఆపి వెనుదిరిగి చూసి లిప్తకాలం నిర్ఘాంత పోయాడు. దగ్గరికి వస్తూ.. “మురా.. నువ్వేనారా!” అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టేడు. పొడువాటి గెడ్డెం నిమురుకుంటూ ముసి, ముసి నవ్వులు నవ్వసాగాడు మురహరి.

“అయితే ఆరోజునుండీ ఇంకా గెడ్డం, మీసాలు తీయలేదన్నమాట” అనుకుంటూ.. బండికి స్టాండు వేశాడు.

“నేను ఆరోజే చెప్పాను గదరా.. నా కొడుకు దొరికే వరకు ఇవి తీయనని”

“ఏదో మాటవరుసకన్నావనుకున్నాను గాని ఇలా భీష్మ ప్రతిజ్ఞ చేశావనుకోలేదురా. నిన్ను హరిహరాదులు కూడా గుర్తుబట్టలేరు. అంతగా మారి పోయావురా. సరే బండెక్కు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ బండి స్టార్టు చేశాడు.

ఇల్లు చేరుకోగానే వీరి కోసమే ఎదురి చూస్తున్న దేవరాజు భార్య లలిత “ఏమండీ.. మురహరి అన్నయ్య రాలేదా..” అంటూ అడిగింది.

“బాగా తేరిపారా చూడు. మీ అన్నయ్యనే తీసుకొచ్చా..” అంటూ దేవరాజు నవ్వసాగాడు. లలిత కొయ్యబారి పోయింది.

“చెల్లెమ్మా.. నేనేరా..” అంటూ.. దేవరాజు నవ్వులో శృతి కలిపాడు మురహరి. లలిత ఇంకా నమ్మకం కలగడం లేదన్నట్లుగా కనురెప్ప వాల్చకుండా చూస్తూ.. చూస్తూ.. చివరికి చిరునవ్వు నవ్వింది. హమ్మయ్య గుర్తు పట్టిందని తృప్తిగా ఇద్దరు గాలి పీల్చుకున్నారు.

భోజనాలయ్యాక తాను వచ్చిన పని చెప్పి జగదీశ బాబా గురించి ఆరా తీశాడు మురహరి. జగదీశ బాబా మీద తనకు సదభిప్రాయము లేదంటూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పూసగృచ్చినట్లు వివరించాడు దేవరాజు.

“నాకు తెలుసులేరా.. నేనేమో.. ఎవరినీ నమ్మను. నువ్వేమో సైన్సు తప్ప మరేదీ నమ్మవు. సరే గానీ నా మనోహరు నాకు దొరికితే చాలు. ఈసారికి ఈ ఒక్క సాయం చేసి పెట్టురా దేవా.. నా తరఫున నువ్వే బాబాను మనోహరు ఆచూకి గురించి అడగాలి. వాడు ఇంట్లో నుండి ఎప్పుడు పారి పోయాడు.. ఎందుకు పారి పోయాడు.. ఎప్పుడు తిరిగి వస్తాడు.. అసలు వాస్తాడా రాడా!.. ఇప్పుడు ఎక్కడున్నాడు. క్షేమంగా ఉన్నాడా.. ఇందులో ఏ కొన్నింటికైనా బాబా చెప్పే సమాధానాలతో నాకు తృప్తి కలిగితే కొంత వరకు నమ్మవచ్చు. వాని గురించి అడగాలంటేనే నాకు దుఃఖమాగదు. నేను అడుగలేనురా..” అంటుంటే మనోహరు కళ్ళు చెమ్మగిల్లాయి.

“అన్ని ప్రశ్నలా!.. ప్రశ్నకు వేయి రూపాయలు చొప్పున ముందే సమర్పించుకోవాలి” అని మరికొన్ని ఆశ్రమ నియమాలు చెప్పాడు దేవరాజు. సరే..! తప్పదన్నట్టు తలూపాడు మురహరి.

ఇరువురు బండి మీద జగదీశ బాబా ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమం ఖాసిందేవ్ పేటకు వెళ్ళే దారిలో దాదాపు ఒక కిలోమీటరు దూరాన ఊరి చెరువు దాపున ఉందని చెబుతూ.. బండి స్టార్ట్ చేశాడు దేవరాజు.

“ఇంట్లో లలిత ముందు చెప్పడం బాగుండదని బాబా గురించి నీకు కొన్ని రహస్యాలు చెప్పలేదురా మురా. జగదీశ బాబా మీద నేను రహస్యంగా సమాచారం సేకరిస్తున్నా. సంతానం సాఫల్యమనే ఎర జూపి ఆడవారిని లోబరచుకుని వారి మీద అఘాయిత్యాలు చేస్తున్నాడని తెలిసింది. కాని అతణ్ణి నిందితుడుగా రుజువు చెయ్యడానికి ఏ స్త్రీ ముందుకు రాదు కదా..! అయినా నా ప్రయత్నంలో నేనున్నాను. కొన్ని వీడియోలూ సంపాదించాను. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు రావడం ఒకందుకు మంచిదే అయిందిరా.

నా సాయం కావాలని ఎవరు వచ్చి నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్ళినా, ఆయా తేదీలు.. అడిగిన ప్రశ్నలు.. వాని ఫలితాలు అన్నీ ఈ డైరీలో వ్రాస్తున్నాను” అంటూ బండి ముందు కవరులో ఉన్న డైరీని ఒక చేత్తో తట్టుతూ చూపించాడు దేవరాజు.

“నాకూ కుతూహలంగానే ఉందిరా. మనోహరు విషయంలో బాబా ఏం చెబుతాడో.. విని అది తప్పైతే అక్కడే నిలదీస్తాను” అంటూ దేవరాజుకు మద్దతుగా తన నిర్ణయాన్ని జోడించాడు మనోహరు.

నేరుగా ఆశ్రమ నిర్ధేశిత స్థలంలో బండి నిలిపి తన డైరీ తీసుకున్నాడు దేవరాజు. మనోహరు బండి దిగి ఆశ్రమాన్ని తెరిపారగా చూడసాగాడు. విశాలమైన స్థలంలో అత్యంత సుందరంగా ఉంది ఆశ్రమం. ఇరువురు కలిసి ఆశ్రమ నియమావళిని పూర్తి చేసి లోనికి వెళ్ళారు. ఒక వసారాలో జగదీశ బాబా ప్రవచనాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రవచనాల అనంతరం భక్తుల సందేహాలు.. సమాధానాల కార్యక్రమం అరగంట సేపు కొనసాగి టీ బ్రేక్ ఇచ్చారు. భక్తులంతా ఆశ్రమ క్యాంటీన్ లో టీ ఆస్వాదించారు. కాసేపు సేద దీరి కొందరు వెళ్లి పోయారు. తమ ఆపదలు విన్నవించుకునే వారు మాత్రమే తిరిగి వచ్చి వసారాలో ఆసీనులయ్యారు. కాసేపటికి జగదీశ బాబా రావడంతో అంతా లేచి నిలబడి జేజేలు పలికారు.

జగదీశ బాబా ప్రశాంత వదనంతో వచ్చి ఉచితాసనం మీద ఆసీనుడయ్యాడు. బాబా గొప్ప అనుభవజ్ఞుడని గెడ్డం, మీసాలు చాటి చెబుతున్నాయి.

అతని అంతరంగిక శిష్యుడు శివానందం చేతిలో ప్రశ్నలు అడుగబోయే భక్తుల పేర్లు గలిగిన రిజిస్టర్ ఉంది. ప్రశ్నోత్తరాల నియమ, నిబంధనలు వివరించి వరుస క్రమలో పేర్లు పిలువసాగాడు. ఒక్కొక్క భక్తుడు లేచి బాబా గారికి నమస్కరిస్తూ.. తమ బాధలను చెప్పుకోసాగారు. జగదీశ బాబా ప్రశాంతంగా వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. తరుణోపాయాలు చూపసాగాడు.

దేవరాజు ఏకాగ్రతగా డైరీలో వ్రాసుకుంటున్న వాడల్లా.. తన పేరు పిలవగానే సవినయంగా లేచి నిలబడ్డాడు. గొంతు సవరించుకుని.. “జగదీశ బాబా.. హన్మకొండ దగ్గర ఆరేపల్లెలో నా స్నేహితుడు మురహరి తన కొడుకు మీద బెంగతో మంచాన పడ్డాడు. మీరు దివ్య దృష్టితో అన్ని వివరాలూ చెబుతారని.. తెలుసుకొని రమ్మని నన్ను పంపించాడు. అతను తిరిగి వస్తే తప్ప నా స్నేహితుడు మాకు దక్కడు. దయచేసి మురహరిని దక్కించుకునే మార్గం చూపండి” అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాడు. దేవరాజు లేచి నిలబడి బాబా గారిని గారు అనలేదని.. నమస్కరించ లేదని.. శివానందం మిర్రి, మిర్రి చూడసాగాడు. అది గమనించి లోలోన నవ్వుకున్నాడు దేవరాజు.

జగదీశ బాబా కళ్ళు మూసుకుని కాసేపు దీర్ఘంగా ఆలోచించి.. తిరిగి కళ్ళు తెరిచాడు.

“భక్తా.. మనిషికి ఆశ సహజమే గాని, తన కొడుకు తిరిగి వస్తాడనే అత్యాశ అతని దుఃఖానికి మూలమవుతున్నది. తాను చేజేతులా చేసుకున్న పాప ఫలమది. మురహరి ఎవరినీ నమ్మడు. చివరికు అతని కన్నకొడుకు మనోహరును గూడా నమ్మక పోవడంతో.. అవమానంగా

భావించిన మనోహరు రెండు వేల పదవ సంవత్సరంలో ఇంటి నుండి పారిపోయాడు”

“ఎందుకు పారి పోయాడో కారణం చెప్పండి బాబా.. నాకు తెలియక అడుగుతున్నాను. మురహరి అడిగినా చెప్పడం లేదు” అంటూ మరో ప్రశ్న అడిగాడు దేవరాజు.

“నేను చెప్పానుగదా.. మనోహరు పదవ తరగతి అనుత్తీర్ణుడయ్యాడు. మళ్ళీ శ్రద్ధగా చదివి ఉత్తీర్ణుడవుతానని చెప్పినా నమ్మక రోజూ తిట్టేవాడు మురహరి. ఆ తిట్ల దండకానికి చదువు మనసునకెక్కక ఆ సంవత్సరమూ పోయింది. దాంతో మురహరి కొడ్తాడేమో! ననే భయంతో మనోహరు పారిపోయాడు”

“మళ్ళీ తిరిగి వచ్చే అవకాశముందా బాబా.. క్షేమంగా ఉన్నాడు గదా.. ఇప్పుడు ఎక్కడున్నాడు? మేము వెళ్లి తీసుకుని రావచ్చా! లేక తనే వస్తాడా? ఎప్పుడొస్తాడు” అంటూ దేవరాజు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కోటా అయిపోయిందన్నట్టుగా సంకేతాలివ్వసాగాడు శివానందం.

జగదీశ బాబా ప్రశాంతంగా దరహాసం చేస్తూ.. “ఈ ఆతృత, ఆవేదన మనోహరును చేజార్చుకున్నప్పుడుండాలి. ఇంత అనర్థం జరిగేది కాదు గదా..! అయిన ఆ దైవ సంకల్పం మేరకు జరగాల్సింది జరిగి పోయింది. మనోహరు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు మనుజేంద్రుడయ్యాడు. మానవ కళ్యానార్థం నిరంతరం శ్రమిస్తున్నాడు. మీరు వెళ్ళినా రాడు. తనూ రాలేని పరిస్థితి. అతని గురించి మర్చి పోవడం క్షేమదాయకమని మీ మిత్రునుకి చెప్పండి” అంటూ.. మరో పేరు చదువమన్నట్టుగా శివానందం వంక చూశాడు జగదీశ బాబా.

ఉన్నఫళంగా ఉప్పెనెలా ఎగిసి పడుతూ లేచాడు మురహరి.

“ఒరేయ్! మనోహరూ.. జగదీశ బాబా అని దొంగ బాబా అవతారమెత్తి.. ఎన్నికొంపలు కూలుస్తావురా.. జబ్బా..! ” అంటూ సింహంలా జూలు విదిల్చుతూ గర్జించాడు మురహరి. శివానందం గడ, గడ లాడి పోతూ.. ఒక్క ఉదుటున లోనికి పరుగెత్తాడు. దేవరాజు మ్రాన్పడి పోయాడు.

“పాపం.. ఈ భక్తుని కుమారుడు గూడా అదృశ్యమయ్యాడేమో..! ఆవేదనతో అలా అరుస్తున్నాడు” అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించసాగాడు. జగదీశ బాబా.. ఆ గొంతు గుర్తు పట్టాడు. తన మీద ప్రయోగించే ఆ జబ్బా.. అనే ఊత పదం మురహరి తప్ప ఎవరూ వాడరని లోపల వణకు పుట్టింది. భక్తులంతా ఒక్క సారిగా నిలబడ్డారు. వారిలో అలజడి ఆరంభమయ్యింది. దేవరాజుకు సీను అర్థమయ్యింది. ఇలాంటి సమయం కోసమే తానూ ఇన్నాళ్ళుగా వేచి ఉన్నది. ఇక బాబా బండారం ఆధారాలతో సహా బయట పెట్టాలని డైరీ తిరుగెయ్యసాగాడు.

“ఈ దొంగ బాబాకు మీరంతా భక్తులమని చెప్పుకోవడం సిగ్గు చేటు. వీడెవడో గాదు. నా కన్నకొడుకే.. వాడు చెప్పినట్టే రెండు వేల పదిలో పదవ తరగతి తప్పితే తాట వొలుద్దామనుకున్నా.. వాడది పసిగట్టి పారిపోయాడు. ఎంతైనా కడుపు తీపి. నాకొడుకు నాకు దక్కాలని అంత వరకు ఈ గడ్డం మీసాలు తీయనని తీర్మానించుకుని గత పదేండ్లుగా వెదుకుతూనే ఉన్నాను. వాని తల్లి బాబా దగ్గరికి పోయి కనుక్కొని రమ్మని పదే, పదే ఏడుస్తుంటే నా స్నేహితుణ్ణి తీసుకుని వచ్చాను” అంటూ దేవరాజు వైపు తిరిగి బాబా గురించి చేస్తున్న పరిశోధన అందరికీ చెప్పమన్నట్లు సంకేతాలిచ్చాడు.

ఇంతలో పోలీసులు ఆశ్రమలోకి రావడం.. “ఎవర్రా.. పోలీసులకు ఫోన్ చేసింది” అంటూ గావు కేక రూపంలో అరిచాడు జగదీశ బాబా.

“జగదీశ బాబా.. మీ మీద దాడి జరుగుతుందేమోననే అనుమానంతో పోలీసులకు నేనే ఫోన్ చేశాను” అంటూ వినమ్రంగా చేతులు కట్టుకున్నాడు శివానందం.

వంటనే దేవరాజు చెయ్యి పైకెత్తి.. “నేను ములుగు జూనియర్ కాలేజీలో సైన్సు పాఠాలు చెప్పే లెక్చరర్ని. మన ప్రాంతంలో కొత్తగా బాబా అవతారమెత్తాడని తెలిసి శివానందాన్ని పంపించాను. శివానందం ఎవరో కాదు నాశిష్యుడే.. తన తెలివి తేటలతో జగదీశ బాబా దగ్గర ఆనతి కాలంలోనే అత్యంత చనువు ఏర్పర్చుకున్నాడు. బాబా చేసే అకృత్యాలన్నీ.. వీడియోలు తీశాడు. భక్తులు అడిగే ప్రశ్నలు.. బాబా సమాధానాలన్నీ ఈ డైరీలో వ్రాశాను. కాకతాళీయంగా కొందరికి మేలు జరిగిందే తప్ప బాబా గొప్పదనమేమీ లేదు.. డబ్బు దోచుకోవడం తప్ప.

మనోహరును ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నేను గుర్తు పట్ట లేక పోయాను. కాని ఈ రోజు మురహరి రావడం.. బాబా తన కొడుకు మనోహరని గుర్తు పట్టడం.. మన ప్రాంతానికి పట్టిన శని విరగడయ్యింది. మనం విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మక మూఢ నమ్మకాలలో మునిగి ఉన్నంత కాలం ఇలాంటి బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు” అంటూ తన దగ్గరగా వచ్చి నిలబడ్డ శివానందాన్ని ఆప్యాయంగా హత్తుకున్నాడు దేవరాజు.

మురహరి చెప్పుతీసుకుని జగదీశ బాబాను కొట్టబోతుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. భక్తుల మధ్య జగదీశా బాబా చేతికి సంకెళ్ళు పడ్డాయి. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.