శుభ్రతే ఆరోగ్యం - బొందల నాగేశ్వరరావు

Hygiene is health

నేను ఓ గంట పర్మిషనుతో ఇంటికి వస్తూ అక్కడే వున్న ఓ నర్సరీలో రెండు గులాబి మొక్కలను కొన్నాను. వాటిని నా ఇద్దరు కూతుళ్ళయిన యజ్ఞ,ప్రజ్ఞల చేత ఇంటిలో వున్న కుండీల్లో పెట్టించాలను కొంటూ ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్లు నొక్కాను. పరిగెత్తినట్టు వచ్చిన నా పెద్ద కూతురు జాగ్రత్తగా తలుపు తీసి చూసి" ఏంటమ్మా !అవేంటీ?ఆ చేతిలోవున్నవి గులాబి మొక్కలా?"అని అడిగింది. "అవును"అన్నాను నేను. "అయితే మాకు తినటానికి ఏమీ తేలేదా?"ప్రశ్నించింది. "తెచ్చానులే!మొదట వీటిని మీ అక్కచెల్లెళ్ళచేత ఆ కుండీల్లో ఎరువు వేసి పెట్టించి నీళ్ళు పోసి ఎండ తగిలే చోట వుంచాలి" అన్నాను. "అలాగా" "అవును.అవి కాస్త పెద్దవై మొగ్గలు తొడిగి పూలు పూస్తే నీకు పాపకు తల్లో తురిమి మీ అందాన్ని నేను చూసుకోవాలి.ఓకే"అని నవ్వి"ఇంతకు పాపేది?"అని అడిగాను. "పడగ్గదిలో చదువుకొంటోంది" అంటూ వెళ్ళి తన చెల్లి ప్రజ్ఞను తీసుకు వచ్చింది. ముగ్గురం కలసి పెరట్లోకి వెళ్ళాము.పిల్లలిద్దరూ సంతోషంతో నేను చెప్పినట్టుగా మట్టి,ఎరువు కలగలుపుతో కుండీలను నింపారు. చెరో మొక్కను చేతికిచ్చాను. ఇద్దరూ చెరో కుండీలో వుంచి నీళ్ళు పోశారు.ఇద్దరూ...' ఆ మొక్కలు అప్పుడే పెద్దవై మొగ్గలు తొడిగి అందమైన గులాబీలు పూయగా వాటిని కోసుకొని తల్లో పెట్టుకొన్నంతగా' సంబరపడిపోయారు.నాకూ ఎంతో ఆనందం కలిగిందప్పుడు.పనైపోయిన తరువాత నిముషాల మీద పెద్ద పిల్ల వెళ్ళి టాప్ ఓపెన్ చేసి చక్కగా ముఖం,కాళ్ళు చేతులను కడుక్కొని టవల్తో తుడుచుకొని వెళ్ళి సోఫాలో కూర్చొంది. చిన్నపిల్ల అలాగే ఆ మట్టి చేతులను తన షర్టుకు తుడుచుకొని వెళ్ళి సోఫాలో కూర్చొంది. నేను ఇద్దరినీ గమనించాను. ఆఫీసునుంచి వస్తూ తెచ్చిన పొకోడీలను రెండు పళ్ళెల్లో పెట్టుకొని వచ్చి వాళ్ళకు ఎదరే వున్న సోఫాలో కూర్చొని చెరో పళ్ళెం చేతికిచ్చాను. చిన్న పిల్ల అత్రుతగా తీసుకొని తినబోయింది. అప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని"అగమ్మా! ముందు వెళ్ళి అక్కలా ముఖం,కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకొని వచ్చి పకోడీలు తీసుకు తిను. ఎందుకంటే నీ చేతులతో ఎరువు,మట్టిని కలిపి ఆ కుండీలో వేశావు.ఆ కలిపిన మట్టిలో బోలెడు జెర్మంసు అంటే కంటికి కనబడని పురుగులు వుంటాయి.అవి నీ చేతులకు అంటుకొని వుంటాయి.ఆ చేతులతో ఈ పొకోడీలను తిన్నావంటే పొకోడీలతో పాటు ఆ జర్మంసు కూడా నీ కడుపులోకి వెళ్ళిపోతాయి. తద్వారా జ్వరం,దగ్గు జలుబని రకరకాల వ్యాధులు వస్తాయి.అందుకే ఎప్పుడూ కాళ్ళు, చేతులను శుభ్రంగా వుంచుకోవాలి. అప్పుడే నువ్వుఆరోగ్యంగా వుంటావు. లే!...వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకొని వచ్చి కూర్చొని పకోడీలు తిందువుగాని. నేను ఈ లోపు అక్కకు,నీకు పాలు కలుపుకు వస్తాను" అంటూ చిన్నపాపను టాప్ వద్దకు తీసుకు వెళ్ళాను.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.