రాఘవ 9వ తరగతి చదువుతున్నాడు. అత్యంత ధనవంతుల కుమారుడు. తల్లిదండ్రుల శ్రద్ధ వల్ల అతడు చదువులో ఆ తరగతిలో అందరికంటే తెలివైన విద్యార్థి. అందుకే ఆ తరగతికి నాయకునిగా ఉండేవాడు. తల్లిదండ్రులు ప్రతిరోజూ రాఘవకు కొంత డబ్బు ఇచ్చి పాఠశాలకు పంపేవారు. అయితే రాఘవ ఆ డబ్బులను తానొక్కడే వాడుకోకుండా తన స్నేహితులకు అవసరమైనవి కొనిచ్చేవాడు. అందువల్ల రాఘవకు స్నేహితులు పెరిగారు. చాలామంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాఘవను బాగా పొగిడి లబ్ది పొందేవారు. రాఘవ చాలా అందగాడని, దాన గుణంలో అతడిని మించేవారు ఎక్కడా ఉండరని, చదువులో అతడికి అతడే సాటి అని ఇంకా రకరకాలుగా పొగిడేవారు. దీంతో రాఘవకు ఎంతో గర్వం పెరిగింది. తనను పొగిడే వారినే వెంట తిప్పుకుంటూ వారికే కావలసినవి కొనిచ్చేవాడు. ఒకరోజు అదే తరగతిలో రెండవ ర్యాంకు విద్యార్థి, తన సత్ప్రవర్తనతో అందరు ఉపాధ్యాయుల మనసు, తోటి విద్యార్థుల మనసు గెలుచుకున్న విద్యార్థి సుధామ రాఘవ వద్దకు వచ్చి, ఇలా అన్నాడు. "మిత్రమా! నీ చుట్టూ చేరి, నిన్ను రోజూ పొగుడుతున్న వారంతా నీ స్నేహితులు కారు. స్వార్థపరులు. నీ డబ్బులు కోసమే నీతో స్నేహం చేసి, నిన్ను పొగుడుతూ లబ్ది పొందుతున్నారు. నువ్వు డబ్బులు ఇవ్వనినాడు వారు నీ ముఖం చూడరు. అయినా మనలోని లోపాలను ఎత్తిచూపుతూ మన ప్రవర్తనను సరిదిద్దుకోమని, మన శ్రేయస్సు కోసం అవసరమైన సలహాలను ఇచ్చేవారే నిజమైన స్నేహితులు. అందులో భాగంగా వారు కఠినంగా మాట్లాడినా, సౌమ్యంగా సలహాలను ఇచ్చినా వారినే మనం నమ్మాలి. ఇలాంటి స్వార్థపరులను నమ్మి ముందుకు పోవడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే!" అని. అప్పుడు రాఘవ ఎంతో కోపంగా "చదువులో నిన్ను మించానని, నీకంటే నాకే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని అసూయ నీకు. నిన్ను మించిన స్వార్థపరుడు ఇంకెవ్వడూ ఉండడు. ఇంకోసారి నా స్నేహితులను నిందిస్తే నీ మర్యాద దక్కదు." అని అన్నాడు. రాఘవ సుధామతో మాటలు మానేశాడు. అంతేకాదు సుధామ గురించి అందరికీ చెడుగా ప్రచారం చేస్తున్నాడు. రాఘవ ప్రవర్తనకు బాధపడిన సీనియర్ విద్యార్థులు ఎంతోమంది సుధామ సరిగానే చెప్పాడని, ఆలోచించమని సలహా ఇచ్చారు. వారికీ దూరంగా ఉంటున్నాడు రాఘవ. ఇది తెలిసిన ఒకరిద్దరు ఉపాధ్యాయులు రాఘవను పిలిచి, సుధామ ఇచ్చిన సలహానే ఇస్తారు. కాలం గడుస్తున్నది. వేసవి సెలవులు ముగిసి, మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఇప్పుడు రాఘవ 10వ తరగతి.కానీ రాఘవ మునుపటిలా ఉత్సాహంగా ఉండటం లేదు. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. వెంట డబ్బులూ తెచ్చుకోవడం లేదు. "ఏమైందిరా ఇలా ఉన్నావు?" అని అడిగాడు సుందర్. రాఘవ బోరున ఏడుస్తూ "మా వ్యాపారం దెబ్బ తిన్నదిరా! ఇప్పుడు బాగా నష్టాలలో ఉన్నాము. అప్పుల బాధలు ఎక్కువైనాయి." అన్నాడు. మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు సుందర్. ఈ విషయం క్రమంగా అందరికీ తెలిసిపోయింది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుంటే బయట ఐస్ క్రీమ్ బండి కనబడింది. చాలామంది కొనుక్కొని తింటున్నారు. రాఘవ సత్యంను పిలిచి, "మిత్రమా! నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టరా!" అని బ్రతిమాలాడు. "ఛీ! నువ్వు నాకు మిత్రునివా! నీలాంటి పేదవాళ్ళు మాతో కలవవద్దు." అని దూరంగా వెళ్ళాడు. అప్పుడు సుధామ వచ్చి రాఘవకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు. సుందర్, సత్యం వంటి ఎంతో మంది ఒకప్పుడు రాఘవను బాగా పొగిడి, అతని ద్వారా మేలు పొందినవారే! అలా మేలు పొందిన వారంతా ఇప్పుడు రాఘవకు దూరంగా ఉంటున్నారు. ఆ బాధతో క్రమంగా రాఘవకు చదువుపై ఏకాగ్రత పోయింది. మార్కలలో చాలా వెనుక పడ్డాడు. ఒకటవ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు దిగజారాడు. సుధామ తరగతి నాయకుడు అయ్యాడు. సుధామ రాఘవను కలిసి, "నువ్వు ఇలా చదువులో వెనుకబడటం ఏమీ బాగాలేదు. నిన్ను కాదని నాయకత్వ బాధ్యతలు చేపట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాయకునిగా ఉండటమే ఈ తరగతికి అలంకారం. డబ్బులు పోయాయని విచారిస్తే మళ్ళీ వస్తాయా? మరింత కష్టపడి చదివాలి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలి. అప్పుడు నీకు పూర్వం వైభవం వస్తుందిలే." అని అన్నాడు. సుధామ రాఘవలు కలిసి చదువుకోవడం మొదలు పెట్టారు. సుధామ నిరుపేద కుటుంబంలోని వాడైనా రాఘవకు కావలసిన ఆర్థిక సహాయం చేసేవాడు. సుధామ ప్రయత్నం వలన రాఘవ మునుపటి కన్నా తెలివైన విద్యార్థి అయినాడు. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు శాతం మార్కులు వస్తున్నాయి. విద్యా సంవత్సరం ముగింపుకు దగ్గరకు వచ్చింది. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి వారికి వీడుకోలు పార్టీ ఇస్తున్నారు. విద్యార్థులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. రాఘవ వంతు వచ్చింది. "ప్రియమైన మిత్రులారా! మీతో అబద్ధం చెప్పినందుకు మీరంతా నన్ను క్షమించాలి. నిజానికి మాకు వ్యాపారంలో నష్టమూ రాలేదు. మేము పేదవారిమీ కాలేదు. ఎంతో మంది శ్రేయోభిలాషుల సలహాలు విన్నాక నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకుందామని ఈ నాటకం ఆడాను. ముఖ్యంగా సుధామ లాంటి మంచి మిత్రులపై దుష్ప్రచారం చేసినందుకు నన్ను మరింత క్షమించాలి. అందరూ స్వార్థ బుద్ధిని విడిచి పెట్టండి. మనలో భేదాలను వదిలి స్నేహభావంతో మెలగండి. నేటి నుంచి సుధామ నేను మిత్రులమే కాదు. సొంత అన్నదమ్ములం. సుధామను మా తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకున్నారు. భవిష్యత్తులో అతనికి పెద్ద ఉద్యోగం వచ్చే వరకు అతని ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చంతా తామే భరిస్తామని ప్రకటించారు." అని మాట్లాడినాడు. ఆశ్చర్యంలో తేరుకుని అందరూ హర్షధ్వానాలు చేశారు.