"రేపు మన దేశ స్వాతంత్ర్యదినోత్సవం కదా నువ్వు రేపు బడికి వెళ్తున్నావా...!"అని అడిగాడు తాతయ్య. "లేదు తాతయ్యా కరోనా వ్యాప్తి ఎక్కువగా వుంది కాబట్టి రేపు పిల్లలం బడికి వెళ్లం కానీ మా ఉపాధ్యాయులు అంతర్జాల తరగతులు నిర్వహణకు,దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న తరగతుల సమాచారం ఇచ్చి పుచ్చుకోడానికి ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహాలలో మా పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య దృశ్యాలు పెడతారు వాటిని నేను చూస్తాను...అలా ఈసారి ఆ వేడుకదర్శనం వినూత్నం" అని నవ్వుతూ అంది భారతి. "బాగున్నాయమ్మా...మీ పాఠశాల ఏర్పాట్లు కరోనా వ్యాప్తి సమయంలో పిల్లలు,వృద్ధులు ఇంటి బయటకు రాకపోవడమే మేలు"అని అన్నాడు తాతయ్యా. "తాతయ్యా మీకు స్వాతంత్రాల అల్లూరి సుభాష్ భగత్ భీంరావు అన్న పేరు ఎలా వచ్చింది"అని అడిగింది భారతి. "మంచి ప్రశ్నే వేశావు,మా తాత స్వాతంత్ర సమరయోధుడు,అతనికి అల్లూరి సీతారామరాజు,భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,కొమరంభీం వంటి సాయిధ స్వతంత్ర యోధులంటే మహా ఇష్టం,అంతే కాదు భీంరావు అంభేడ్కర్ అన్నా అతనికి ఇష్టమే అందుకే అన్ని పేర్లూ కలిసి రావాలని గమ్మత్తుగా ఇలా పేరు పెట్టారు నాకు నిజానికి మన ఇంటిపేరు గతంలో వేరే ఉండేదట మా ముత్తాత సుబ్బారావు అప్పట్లో స్వాతంత్య్రం సాధనకై ఉత్తేజ ఉపన్యాసాలు ఇచ్చేవాడట అప్పుడు జనాలు అతన్ని స్వాతంత్రాల సుబ్బారావు అనేవారట స్వాతంత్య్రం భావంపై ఎక్కువ మక్కువ వున్న మా ముత్తాత మన ఇంటిపేరుని స్వాతంత్రాల అని మార్చాడట అప్పటినుండి అదే మన ఇంటిపేరుగా కొనసాగుతుంది"అని అన్నాడు తాతయ్య. "అద్భుతం,అయితే మన పూర్వీకులు స్వాత్రంత్ర సమరయోధులు,అభ్యుదయవాదులు,విప్లవకారులు అన్నమాట"అని బిగ్గరగా నవ్వింది భారతి. "అన్నమాటే కాదు ఉన్నమాటే,మనకి వేలాది ఎకరాల భూమి ఉండేది,దాన్ని మా తాతలనాడే పేదలకి ఉచితంగా పంపిణీ చేశారు మనవాళ్ళు"అని అన్నాడు తాతయ్యా. "మీ తాతయ్యా కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారట"అని అంది భారతి. "అవును బ్రిటీష్ సైనికుల కాల్పుల్లో చనిపోయారు. అప్పటికి నేను పుట్టి ఒక సంవత్సరం కూడా కాలేదు"అని కాస్తా గంభీర స్వరంతో అన్నాడు తాతయ్యా. "సరే తాతయ్యా...ఇప్పుడు ఆ టాపిక్ వదిలేద్దాం,నేను ఈసారి స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మన ఊర్లోని పారిశుధ్య కార్మికులకు పదివేల రూపాయలు సాయం చేద్దాం అనుకుంటున్నాను"అని అంది భారతి. "పది వేలా...అంత డబ్బు ఎక్కడిది"అని అడిగాడు తాతయ్యా. "కీడ్డీ బ్యాంకులో నేను దాచుకున్నది కొంత,అమ్మా నాన్నల వద్ద దోచుకుంది కొంత...మూడేళ్ళుగా దాచుకుంటే, దోచుకుంటే ఇప్పటికి పదివేలు అయ్యాయి"అంది భారతి గలగలా నవ్వేస్తూ... "అయితే నీకన్నా నేను తక్కువ అవుతానా నేనూ ఒక లక్ష రూపాయలు పారిశుధ్య కార్మికులకి నీతోపాటు సాయం చేస్తాను"అని నవ్వుతూ మీసాలు తిప్పాడు తాతయ్యా. "మీకు లక్ష ఎక్కడిది మిలటరీ సర్వీసు నుండి రిటైర్ అయిపోయి చాలా కాలం అయ్యింది కదా"అని అంది భారతి. "పెన్షన్ డబ్బుల్లోంచి మీ నాన్నమ్మకి తెలీకుండా కొంచెం కొంచెం నొక్కేస్తుంటాను కదా అలా పొగయ్యాయి ఈ లక్ష రూపాయలు"అని నెమ్మదిగా అన్నాడు తాతయ్య. "తాత...మనవరాలు పొదుపు కథలు బాగున్నాయి కానీ కరోనా కాలంలో రేపటికల్లా పేద సాధలకు మీ సహాయం చేరే మార్గం గురుంచి ఆలోచించండి మరి"అని అంటూ అక్కడకి వచ్చాడు భారతి నాన్న,అతనివెంట భారతి అమ్మ,నాన్నమ్మ కూడా అక్కడకు వచ్చారు. "ఇప్పటికి దొరికారు తోడుదొంగలు"అని అంది భారతి నాన్నమ్మ నవ్వుతూ... "మేము దొంగలం కాదు,స్వాతంత్రాల వంశోద్ధారకులం,దొరలం"అని నవ్వుతూ మీసాలు తిప్పాడు తాతయ్యా. అందరూ హాయిగా నవ్వుకొన్నారు. "నాకో ఆలోచన వచ్చింది,నేను ఈ మధ్య రాసిన 'అభ్యుదయం'సినిమా కథకి పారితోషకంగా ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి,మీ డబ్బులతో కలిపి తొమ్మిది లక్షల పదివేలు అవుతుందీ..."అని అంటూ భార్యవైపు,అమ్మవైపు చూసాడు భారతి నాన్న. "సరే...నేనూ అత్తయ్య కలిసి తొంభైవేలు సమకూర్చుతాము,మొత్తం పదిలక్షలు అవుతుంది"అని అంది భారతి తల్లి. "అలాగారే...నువ్వు ఉపాధ్యాయుడవు కాబట్టి ఏదో మంచి పథకం ఆలోచించు,పది మందికి మేలు జరగాలి" అని అంది భారతి నాన్నమ్మ. "సరే...నేను ఒక పథకం ఆలోచించాను,ఒక విద్యానిధి ఏర్పాటుచేద్దాం,మనం సమకూర్చే పదిలక్షలతో ముందు ప్రారంభిద్దాం,ఒక జాతీయ బ్యాంకులో ఈ నిధిని ప్రారంభిద్దాం,రేపటికి రేపే ఆదరాబాధరాగా ఎవరెవరికో డబ్బులు పంచడం కన్నా అర్హుల దీర్ఘకాల సంక్షేమం ఆలోచిద్దాం,మన బంధుమిత్రులల్లో మనలా ఆలోచించేవారు కొంత సాయం చేస్తే ఆ నిధిని పెంచుకుంటూ వెళ్దాం,పారిశుధ్య కార్మికుల పిల్లలకే కాకుండా బడుగు బలహీన వర్గాల్లో అర్హుల పిల్లలకు ప్రతి సంవత్సరం విద్యావైద్య అవసరాలకు సాయం చేద్దాం"అని అన్నాడు భారతి తండ్రి. "ఇప్పుడు మన స్వాతంత్రాల ఇంటిపేరు మరొక్కసారి మెరిసింది...తాతయ్యా మీసాలులా"అని అంది భారతి. అప్పుడు ఆ కుటుంబమంతా హాయిగా నవ్వుకుంది. ......మీగడ వీరభద్రస్వామి 7893434721