ప్రతిజ్ఞ - కొడాలి సీతారామా రావు

Pledge

సేనాపురంలోని సగం మంది మగవాళ్ళు ఆ వూరిని జాతీయ రహదారికి కలిపే రోడ్డు దగ్గిరే వున్నారు.ముసలివాళ్ళు,అనారోగ్యంతో వున్నవాళ్ళు,మాత్రమే ఇంటిదగ్గిర వున్నారు.పిల్లలు,వయసులో వున్న స్త్రీలు అంతా పైడిరాజు ఇంటి ముందు వున్నారు.

ఆ వూరివాళ్ళకి అది చాలా మమూలు విషయం. ఎందుకంటే ఆ వూరిలో ప్రతి ఇంటినుంచి ఒకరు సైన్యంలో వున్నారు.చరిత్ర కాలం నుంచీ అది ఆనవాయితీగా వస్తోంది.ఆనవాయితీ అల్లా కాలక్రమంలో ఆచారం అయిపోయింది.కొన్ని కుటుంబాలనించీ ఇద్దరు,ముగ్గురు కూడా సైన్యంలో వున్నారు.ఏ ఇంట్లో ఎవరు చనిపోయినా ఆ వూరి వాళ్ళంతా ఓదార్పుగా ఆ ఇంటిముందే వుంటారు.

ఇప్పుడు పైడిరాజు కొడుకు చిన్న పైడిరాజు శవం కోసం ఎదురు చూస్తున్నారు.పైడిరాజు ముగ్గురు కొడుకులూ సైన్యం లోనే వున్నారు. చిన్న కొడుకు పాకిస్తాన్ దగ్గిర సరిహద్దులో వున్నాడు.

వారం రోజులక్రితం పాకిస్తాన్ సైనికులు మన సరిహద్దులో ప్రవేశించి పహరా తిరుగుతున్న చిన్న పైడిరాజుని చంపి తల నరికి తీసుకుపోయారు అతనితో పాటు పహరా కాస్తున్న మరో సైనికుడిని విచ్చలవిడిగా కాల్చి చంపేశారు.

చిన్నపైడిరాజు మ్రుతదేహానికి పొస్ట్ మార్టం చేసి విశాఖపట్నం పంపుతున్నారు విమానంలో. అతని శవంతో పాటు కొందరు సైనికాధికారులు కూడా వస్తున్నారు. ఆ శవాన్నివిశాఖపట్నం నుంచీ సేనాపురం తీసుకురావటానికి పదిమంది యువకులు వెళ్ళారు.ప్రభుత్వం సైనిక లాంచనాలతో అంతిమ సంస్కారం నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్త్రపతి,ప్రధాని,ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులెందరో సంతాపం తెలియచేశారు. చిన్నపైడిరాజుకి భార్య,ఇద్దరు చిన్నపిల్లలు వున్నారు.ఆడవాళ్ళంతా ఆమె దగ్గిరే వున్నారు ఆమెని ఓదార్చాటానికి.పిల్లలంతా ఆటల్లొ వున్నారు.కొందరు యువతులు అందరికీ మజ్జిగా,టీ అందిస్తున్నారు.

చిన్న పైడిరాజు భార్య సుమతి. నిజానికి చాలా బాధగా వున్నా,దుఃఖాన్ని దిగమింగి ధైర్యంగా కూచుంది.సహజ మరణం కాకుండా సైన్యంలో వుండగా చనిపోతే వారి గురించి గుండెలు బాదుకుని శోకాలు పెట్టడం వారి వీరత్వానికి అవమానమని ఆ వూరివాళ్ళ నమ్మకం. ఆమెకి ఇద్దరు కొడుకులు.పెద్దవాడు ఐదో తరగతి,రెండోవాదు రెందోతరగతి. వాళ్ళిద్దరూ ఆమె దగ్గిరే కూచున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ తండ్రి చనిపోయాడని.వాళ్ళని మధ్యలో పిల్లలు వచ్చి పిలిచికెళ్ళేరు ఆడుకుందామని.

కాసేపు వాళ్ళతో ఆడుకున్నాక పెద్దవాడు చెప్పేడు “నేను మా అమ్మదగ్గిర వుంటానురా. మా ఆమ్మ బాధ పడుతోందిరా. నేను దగ్గిరుంటే మా అమ్మకి బాధ తగ్గుతుందిరా.” చిన్నవాడు కూడా వాడిని అనుసరించి లోపలికి వెళ్ళి పోయాడు.వాళ్ళ అమ్మకి చెరో పక్కనా ఆమె భుజం మీద చేయి వేసి కూచున్నారు.ఇద్దరూ ఆమె కంటినించి వచ్చే కన్నీటిని తుడుస్తున్నారు.

నిజానికి సుమతికి ఈ సంబంధం వచ్చినప్పుదు వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదు.సైన్యంలో పనిచేసేవాళ్ళు కుటుంబంతో ఎక్కువ కాలం కలిసుండరనీ,ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తారనీ,ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదనీ వారి వాదన. సుమతికే ఆశ్చర్యం వేస్తుంటుంది ఈ పెళ్ళి గురించి తను అన్న మాటలు తలుచుకుంటుంటే.”చావు ఎప్పుడొస్తుందో తెలియదు. సైనికులకే కాదు ఎవరి విషయంలోనైనా అంతే.పైగా అది తప్పదు ఎవరికైనా.దానిగురించి భయపడటంలో అర్ధం లేదు.పుట్టడం ఎలాగో చావటం కూడా అంతే. నిజానికి ఒక మనిషి మామూలుగా చనిపోవటం కన్నా సైనికుడిగా చనిపోవటం గొప్ప. అందరూ సైనికుల సంబంధాలు వద్దనుకుంటే పాపం వాళ్ళకి పెళ్ళిలెలా అవుతాయి.వాళ్ళ తల్లిదండ్రులకీ క్షొభే కదా. ఈ సంబంధం నాకు ఇష్టమే.”

అలా ఆమెకి ఇష్టమవటంతో ఈ పెళ్ళి జరిగింది. అత్తవారి ఊరికి వచ్చిందగ్గర నుంచీ సుమతి యువతులందరినీ ఒక చోట చేర్చింది.వాళ్ళకి కుట్లు,అల్లికలూ నేర్పింది. ఆ వూరి ప్రెసిడెంట్ పలుకుబడితో వాళ్ళు తయారు చేసిన లేసులు,అల్లికలు,లంగాలు లాంటివి పక్కనున్న పట్నంలో ప్రత్యేక ప్రదర్శన యేర్పాటు చేసి ప్రచారం కల్పించింది. అలా “ సేనాపురం” అల్లికలకి మంచి ప్రాచుర్యం లభించింది.అనేక షాపులవారు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇవ్వసాగారు.

ఆ వూరి వాళ్ళందరినీ ఒప్పించి భారత సైన్యాధికారికి ఒక ఉత్తరం రాసింది అందరి సంతకాలతో.దానిలో విశేషమేమిటంటే – సైన్యంలోఅత్యధికులున్న ఆ గ్రామాన్ని అయన సందర్శిస్తే యువకులలొ మరింత ఉత్సాహం కలుగుతుంది సైన్యంలో చెరాలని.

ఆశ్చర్యంగా భారత దేశ సైన్యాధ్యక్షుడు ఆ గ్రామాన్ని సందర్శించాడు. అది దేశ వ్యాప్తంగా పెద్ద వార్త అయ్యింది అక్కడి యువతులు తయారు చేసిన లేసుల్ని,ఇతర కుట్టు దుస్తులని చూసాడాయన. అక్కడిక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడాయన. ఆ వూరి లేసుల్ని అన్ని సైనిక కేంటీన్లలో అమ్మేలా. ఆ గ్రామవాసులందరినీ అభినందించాడాయన.ప్రతి కుటుంబం నుంచి ఒకరు సైన్యంలో చేరే ఆమ్నవాయితీని కొంసాగించమని కొరాడాయన.ఒక సైన్యాధ్యక్షుడు సందర్శించిన గ్రామంగా సేనాపురం ప్రత్యేక గౌరవాన్ని పొందింది. జాతీయ స్థాయిలో అన్ని వార్తా ఛానళ్ళు,వార్తా పత్రికలు ఆ వార్తని ప్రముఖంగా ప్రస్తావించాయి.కొన్ని,ఛానళ్ళుఅ వూరిగురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసాయి. కొన్ని పత్రికలలో ప్రత్ఏక కధనాలు రాసారు. అందరూ సుమతిని అభినందించారు.

ఇంతటి బాధలో వున్నా సుమతి చేతిలో అల్లుతున్న లేసు వుంది. నిజానికి ఆమె చుట్టూ వున్న అందరి చేతుల్లో కూడా.

చిన్న పైడిరాజు చిన్నప్పటి విషయాలు కొందరు చెప్తున్నారు.వీధిలో కలకలం చెలరేగింది.చిన్నపైడిరాజు శవపేటిక వస్తోందని చెప్పారెవరో. అందరూ బైటికి వచ్చారు. ఆ పేటికని కిందకి దించారు. అందరూ వరుసగా నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఆ పార్ధివ శరీరానికి దణ్ణం పెడుతున్నారు.

సుమతి అత్తమామలు,తల్లిదండ్రులు కూడా ఆ పేటిక దగ్గిరకి చేరారు.తల లేకపోవటంవల్ల శరీరం మొత్తాన్ని ఒక తెల్లటి బట్టలొ వుంచారు. ఆ పేటిక మీద తల ఆన్చి సుమతి చాలాసేపు వుండిపోయింది. చాలా మందిలా గొంతు చించుకుంటూ,గుండెలు బాదుకుంటూ ఏడవలేదు ఆమె. ఆమె పక్కనే పిల్లలిద్దరూ వున్నారు. వాళ్ళు అమ్మని చూస్తూ ఏడుస్తున్నారు.

సైనికాధికారులు చుట్టూ వున్నవాళ్ళతో చెప్తున్నారు ఆ సంఘటన జరిగిన తీరు.చిన్న పైడిరాజుతో పాటు పహరాలో వున్నమరో సైనికుడిని కాల్చి చంపారని. తల లేకపోయినా శరీరం మీది గుర్తులని బట్టి,ఆరోజు డ్యుటీలో వున్న వారి వివరాలని బట్టి ఆ శరీరం చిన్నపైడిరాజుదిగా నిర్ధారించారని.

బాధలో వున్నవారినందరినీ చిన్నకొడుకు మాటలు ఆశ్చర్యపోయేలా చేశాయి.సైనికుడి కొడుకనిపించుకున్నాడన్నారందరూ. తల్లి ముఖాన్ని తన చిన్ని చేతులతో తనవేపు తిప్పుకుని “నువ్వేం బాధపడకమ్మా. నేను పెద్దయ్యాక సైన్యంలో చేరి నాన్నని చంపినవాణ్ణి చంపేస్తానమ్మా. నిజం.

ఒట్టు.”

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.