తొమ్మిడిడ్లీలు రెండ్రుపాయలు.. - రవి మంత్రి

Nine idlis. Two rupees

“సా విరహే తవ దీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా...
కృష్ణా...ఆఆఆఆఆఆఆఆ....
తవ విరహే..ఏఏఏ....దీనా... ఆఆఆఆఆ..ఆఅ.అ.అ.ఆఆఆ..."

'ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.పుష్పాంజలి కార్యక్రమంలో ముందుగా..విప్రనారాయణ చిత్రం నుండి భానుమతి రామకృష్ణ పాడిన పాట విన్నారు.తర్వాత రాబోయే పాట...'

'ఆ నామాలూ, ఆ బొట్టూ... విప్రనారాయణలో నాగేశ్వర్రావుని చూస్తుంటే ఆకలీ నిద్రా ఉండవ్..'రోట్లో కొబ్బరి పచ్చడి రుబ్బుతూ అంది సుబ్బలక్షి .

'అన్నానని కాదు గానీ,అసలేం చేశాడమ్మా మీ నాగేశ్వర్రావు?అమ్మాయిల వెనక పరిగెట్టడవూను ,కుప్పిగంతులూ తప్ప...?నువ్వు కదలకే హేమా,పాపిడి చెదిరిపోతోంది.'జడరిబ్బను పైకి కట్టి గట్టిగా లాగుతూ అంది మాణిక్యమ్మ.

'అబ్బా...జుట్టు పీకేస్తున్నావు.కొంచం మెల్లిగా వెయ్ మామ్మా...'

'ఊఁ ..'

'మీ రామారావు మాత్రం..?రాముడు,కృష్ణుడు వేషాలెయ్యడం తప్ప ఇంకేం చేసాడు?పాపం,జబ్బలు వాచిపోయేవట పక్కనున్న వాళ్లకి...పైగా,డాన్సు చేస్తే అందరి కాళ్ళు తొక్కేసే వాడట... వొట్టి బండ మనిషి.'

'అమ్మమ్మా రెండ్రుపాయలివ్వా..'

'పోరా..నా దగ్గర్లేవు.'విసుక్కుంది.

'ఏవండీ...ఆ పేపర్ చదవడం అయిపోతే ఆ చిన్నాడిని మీతో పాటు స్నానానికి తీసుకెళ్లండి.వాడొక్కడే వెళ్తే సబ్బు మొత్తం బుడగలు చేసి అరగదీసేస్తాడు.'వంటింట్లో ఓ మూల ఉన్న దేవుడికి చిన్న ఆకులో బెల్లం నైవేద్యం పెడుతూ అంది రాధ.

'ఆఁ ...'

'నాన్నగారూ ..రెండురూపాయలివ్వరా?'

'చిల్లర లేదురా..అమ్మదగ్గరుందేమో అడుగు.'

'అమ్మా...ఇడ్లీకి డబ్బులివ్వే.'

'ఇస్తాగానీ ఈ పాలు చెల్లికిచ్చేసిరా.'

పాలు ఇచ్చి వచ్చేసరికి ఒక గిన్నె,దాన్లో మరోచిన్నగిన్నెఅందులోరెండురూపాయలు వేసి ఉన్నాయి...అమ్మ వంకచూసి నవ్వి బైటికి పరిగెత్తాడు వంశీ..

'ఒరేయ్ మెల్లిగా...పడతావ్..ఏమే రాధా అలా రోజూ వాడికి డబ్బులివ్వడం ఎందుకే.సుబ్భరంగా చద్దన్నం పెట్టచ్చు కదే.బలానికి బలం,ఆరోగ్యానికి ఆరోగ్యం....'

'పోన్లేమ్మా.మనం ఎలాగూ రోజూ టిఫిల్ను చెయ్యం కదటే...' లోపలనుంచే అంది రాధ,నూతి పళ్లెం దగ్గర పిల్లాడితో కలిసి సబ్బు నురగతో ఆడుతున్న మాస్టారిని కిటికీలోంచి చూసి తనలో తానే నవ్వుకుంటూ...

***************

అగ్రహారం నుంచి నాలుగడుగులేస్తే వెంకన్నబాబు గుడి.పక్కనే కచేరిచావడి ,ఎదురుగా ఉన్న పిల్లల గ్రౌండు దాటి సందులోకెళ్తే వరసగా పాకలు,అక్కడక్కడా పెంకుటిళ్ళు ఉన్న గూడెం వచ్చేస్తుంది.ఆ వీధుల పేరేంటో తెలీదు గానీ,ఆ చుట్టుపక్కల చిన్న చిన్న వృత్తులు చేసే వాళ్లంతా అక్కడే ఉంటారు.నాలుగైదు వీధులన్నీ కలిపి గూడెం అంటారు.ఆ గూడెం మొదటి వీధిలో చివరనుండి నాలుగో ఇంటి ముందు ఆగాడు.రెండు వాటాలున్న ఆ ఇంట్లో కుడి పక్క ఇస్త్రీ బండి సూర్యకాంతం,ఎడమ పక్క సూరిబాబు ఉంటారు.సూరిబాబు మెయిన్ రోడ్డులో డిగ్రీ కాలేజీ దగ్గర డ్రింకు బండి వేస్తే, వాళ్ళావిడ రత్నం పొద్దున్న ఇడ్లీలు,సాయంకాలం పకోడీలు,బజ్జీలు వేసి ఇంటిదగ్గరే అమ్ముతుంది.

'ఏవండీ...'చిన్నగా పిలిచాడు.ఎవరూ పలకలేదు.సగం వేసున్న తలుపు కొంచం తోసి మళ్ళీ 'ఏవండీ...'ఈ సారి కొంచెం గట్టిగా పిలిచాడు.

'లోనకొచ్చేయ్ బాబీ...'పెరట్లోంచి రత్నం మాట వినిపించి,మెల్లగా లోపలికెళ్ళాడు.ముందు గదిలో సూరిబాబు నులక మంచం మీద బోర్లా పడుకునున్నాడు.గంభీరమైన ఆకారం అతన్ది.

'ఇయ్యాల అప్పుడే వచ్చేసావే పంతులూ?ఇంకా అవలేదు ఇడ్లీ.మల్లీ రా..'

'పర్వాలేదండీ.నేనుంటాను.'అన్నాడు అటూ ఇటూ దిక్కులు చూస్తూ .

'ఊఁ ...ఇదిగో సిన్నీ..నాలుగు డొక్కలు,కొబ్బరి సిప్పలు అట్రా.లోన గోనిసంచిలో ఉంటాయ్.'

'ఆఁ..వత్తన్నా.'అటువైపు చూసాడు.

'అగ్గిపెట్టె కూడా.నాన్న సొక్కా జోబీలో ఉంటాది.సూడు..'

'సరేనే బాబా..'చూస్తూనే ఉన్నాడు.

కాసేపటికి డొక్కలు,చిప్పలు ఉన్న చిన్న సంచీ పట్టుకుని వచ్చింది వెంకటలక్ష్మి.పదకొండేళ్ళుంటాయేమో.వస్తూ,వంశీ గాడిని చూసి కళ్ళెగరేసింది.సిగ్గుతో ముడుచుకుపోయాడు.

'పొగ మొకం మీద పడద్ది.అలా దూరంగా ఎల్లి కూసో పంతులూ..'పొయ్యి తుడిచి,లోపల పుల్లలు,చిప్పలు పెట్టి మంట వెలిగిస్తూ అంది రత్నం.

'మ్..'

'సిన్నీ..నాన్న డింకు కాయలు కాంత కడిగెయ్.లెగిసాడంటే ఆరుత్తాడు మల్లీ.'

***************

'రాధికా...సూర్యకాంతం బట్టలు తీసుకురాలేదా?'

'లేదండీ మాస్టారూ....మీకేమో నేను ఉతికితే నచ్చదు.ఇవ్వాల్టికి ఏదో ఒకటి వేసేసుకోండి.'

'ఏదో ఒకటంటే?అలమారులో నీ చీర ఉంది.కట్టెసుకోమంటావా?'

'అంత సరదాగా ఉంటే కట్టుకోండి.నేనేం వద్దన్నానా?' కిసుక్కుమంది.

'వినపళ్ళేదు.'

'ఏమీ లేదూ..'అరిచి,'మీ రంగుకి నీలం రంగు చీర బావుంటుంది.ఇమ్మంటారా ..??'పప్పులో పోపు వేసి మూత పెడుతూ,మెల్లగా నసిగి గిరుక్కున వెనక్కి తిరిగింది.

'ఇప్పుడు చెప్పు,ఏ రంగు బావుంటుందో ..'ఎదురుగా నుంచున్నారు అప్పటికే తయారయిపోయిన మాస్టారు.

'స్..వినేసారా..'పెదవి పంటితో కొరుకుతూ తల మీద కొట్టుకుంది.

'మ్..ఏం వండావ్?' గిన్నె మూత తీసే వంకతో చేతిని నడుము మీంచి పోనిస్తూ.

'???' ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది.

'...' ఏమీలేదు అన్నట్టు భుజాలెగరేసారు.

'...'అన్నం పెడతా,వెళ్లి కూర్చోండి.పీట వైపు చూపిస్తూ సైగ చేసింది.

'మ్..'ఏదో కావాలన్నట్టుగా మూలిగారు.

'ఏవిట్రా శివా?చీర గొడవ?స్కూలు కి టైం అవ్వట్లేదా?'బైట నుండి అరిచింది మాణిక్యమ్మ.

'ఏమీ లేదమ్మా..'మాట్లాడకుండా వెళ్లి పీట మీద కూర్చున్నారు.

'అసలు రాజు వేషం వేసినా,కృష్ణుడి వేషం వేసినా రామారావే వెయ్యాలి..'

'వేషాలేస్తేనే రామారావు బావుంటాడేమో...నాగేశ్వర్రావు అలా నిలబడితే చాలు...'

***************

'పంతులూ..నీల్లు మీదడతాయ్..అలాగెల్లు.'

'నా పేరు పంతులు కాదు.'

'మరి?మా అమ్మ అలాగే అంటది కదా?'

'ఏమో నాకు తెలీదు ఎందుకో.నా పేరు శరత్ వంశీ.'

'రెండు పేర్లెందుకు?నీకు పంతులు అన్న పేరే బావుంది.'

'నువ్వు బడికెళ్ళవా?'

'మానేసాను?'

'ఏం?'

'రెండు దాకా ఎల్లాను.ఇంక మా నాన్న ఎల్లద్దన్నాడు.ఇంట్లో పనవ్వట్లేదని.'

'మ్..'

'నువ్వే తరగతి పంతులూ?'

'పంతులు అనకు.చిరాకు నాకు.'

'అబ్బో..'

'నాలుగో తరగతి.నువ్ మళ్ళీ రావచ్చు కదా బడికి?'

'నాతోటి పిల్లలనంతా ఇప్పుడు ఆరో ఏడో సదూతున్నారు.నాకు మాత్రం అచ్చరం ముక్క రాదు..బడి అంటే మా నాన్న తంతాడు మల్లీ.ఎందుకు లే బాబా...'

'మ్..'

'నువ్ సదువు నేర్పుతావా పంతులూ?'

'నీకా?నేనా??'

'ఆఁ?రోజూ ఇడ్డెన్లకొచ్చినపుడు కాంత కాంత సెప్పు.'

'గోడమీద సినిమా పేర్లు సదవాలని ఉంటాది నాకు.పోనీ,నా పేరు నేను రాసుకునేంత సదువు సెప్పు సాలు. '

'మ్..'

'పంతులూ.. గిన్నట్టుకురా..'అరిచింది రత్నం.

'అమ్మా..పంతులు నాకు సదువు సెప్తాడంటే.'

'ఆహాఁ..అంత పెద్దోడయ్యాడా పంతులు?'పెద్ద గిన్నెలో ఇడ్లీలు,చిన్న గిన్నెలో బొంబాయి చట్నీ వేసి చిన్న విస్తరాకు ముక్క బోర్లించి ఇస్తూ అంది.

'అదేం లేదండీ..'సిగ్గు పడ్డాడు.

'దా బాబీ..డబ్బులియ్యి....'బోణీ బేరం.కళ్ళకద్దుకుని చీర కొంగులో కట్టుకుంది.

గిన్నె తీసుకుని చూస్తున్నాడు.

'ఏటీ?సెట్నీ ఇంకా కావాలా?'

'కాదండీ..'

'మరేటి?'

'నేనూ,మా చెల్లీ,మా తమ్ముడూ..ముగ్గురమండీ.ఎనిమిది ఇడ్లీలైతే ఒకళ్ళకొక ఇడ్లీ తక్కువవుతుందండీ..'

'అయితే రేపణ్ణించి మేస్టారితో సెప్పి పావలా ఎక్కువ తీసుకురా..ఎల్లెల్లు.'

ఏమీ మాట్లాడకుండా తల దించుకుని బైటికొచ్చేసాడు.

'పంతులూ..పంతులూ ..ఆగు.'వీధి దాటుతుంటే వినిపించి వెనక్కి చూసాడు.

'గిన్ని మూతోసారి తియ్..'ఒగురుస్తూ అడిగింది రత్నం కూతురు.

'ఏం?'అంటూ అనుమానంగా మూత తీసాడు.

'ఇదిగో నీ తొమ్మిదో ఇడ్లీ.'కాయితంలో కట్టి తీసుకొచ్చిన ఇడ్లీని గిన్నెలో వేస్తూ చెప్పింది.

'??'ఆశ్చర్యంతో చూసాడు.

'మా అమ్మకి సెప్పకు.సంపేత్తది.నువ్ నాకు రోజూ సదువు సెప్పు.నేన్నీకిడ్లీ ఇత్తాను.'అనేసి పరిగెత్తింది.

*************

'చీరంటే గుర్తొచ్చింది.చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..అని నాగేశ్వర్రావ్ పాడితే నా కోసమే పాడాడేమో అనిపించింది.'

'అది పాడింది ఘంటసాల అమ్మా..పైగా పాడింది నీకోసం కాదు.వాణిశ్రీ కోసం..మా రామారావ్ ఐతే ఏకంగా చీరే కట్టుకున్నాడు నర్తనశాలలో.ఏం అందం ఏం అందం.నా మట్టుకి నేను పదహారు సార్లు చూసాను ఆ సినిమా.'

'అబ్బా....అమ్మా,అత్తయ్యా ఆపుతారా పొద్దున్నేగోల?'లోపలనుంచి కసురుకుంది రాధ.

'నాకూ,నా ఇష్టాలకి విలువ లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా..శివా,నన్ను నా కూతురింటికి పంపేయారా.పళ్లేకపోతున్నా ఈ మహాతల్లితో.'సుబ్బలక్ష్మిని చూసి మొటికలు విరిచింది.

'ఎనిమిదిన్నరకి బస్సుంటుంది.వెళ్తే మధ్యాన్నం భోజనం టైముకి అక్కడ ఉంటావు.నాకు,నా కూతురికి నీ చాకిరి తప్పుతుంది.బయల్దేరు.'

'ఏవిటండీ..వీళ్ళగోల..పొద్ధున్నే?ముందా రేడియో ఆపెయ్యండి దాని వల్లే ఈ గోలంతా...'స్కూలుకి బయల్దేరిన మాస్టారి వంక చూసి అంది. విననట్టు తన పని తను చేసుకుంటున్నారు మాష్టారు.

'ష్..'అనుకుంది తనలో తాను.'తొమ్మిది ఇడ్లీలిచ్చిందా?నోరు పెద్దదే గానీ మనిషి మంచిదే రత్నం.రండి రండి త్వరగా తినండి స్కూలు టైమైపోతోంది.హేమా,తమ్ముణ్ని కూడా పిలువు..'

'అత్తయ్యా..నాగేశ్వర్రావు అందగాడే..అమ్మా..రామారావు మంచి నటుడే.కానీ వాళ్ళిద్దరి పక్కనా ఎవరుంటే బావుంటుంది?'

'ఇంకెవరూ?మా సావిత్రి ..'ఇద్దరూ ఒకేసారన్నారు.దేవుడి దగ్గర బెల్లం నోట్లో వేసుకుని,నవ్వేసి వెళ్లిపోతూ రాధని చూసి కన్నుగీటారు మాస్టారు.

'మరే వదినా..చూడ చక్కని జంట.రక్తసమ్మంధం చూసాకే నేను దీనికి రాధ అని పేరు పెట్టాను తెలుసా.రామారావుని చూసి ఎంత ఏడిచేసానో.'

'నేను మాత్రం? మూగ మనసులు చూసి మూడ్రోజులు అన్నం తినలేదు.మీ నాగేశ్వర్రావ్ మాత్రం తక్కువ ఏడిపించాడా వదినా?

'ఆ రోజులు,ఆ సినిమాలు మళ్ళీ రావొదినా.పద పద ఎండొచ్చేస్తోంది.వడియాలు ఎండబెట్టేద్దాం.'

**************

ఇంట్లో ఎవర్నో ఒకళ్ళని కాకాపట్టి డబ్బులు సంపాయించి రోజూ ఇడ్లీల కోసం వెళ్తున్నాడు.పిల్లకి చదువు చెప్పడం వల్ల రత్నంకి కూడా కొంచెం అలవాటయ్యాడు వంశీ.

'ఊడత ఉయల బుషి..'

'అయ్యో..అన్నీ తప్పులే.కొమ్ములు అన్నీ ఎగరగొట్టేసావు.నువ్వు వట్టి మొద్దువి.'

'నీకే చెప్పడం రాదు.తిక్క పంతులు..'

'ఉడుత ఊయల ఋషి..'సరిచేసాడు.

'రేపు సంకురాత్రి దాటాక నా పుట్టిన్రోజు.పన్నెండొత్తాయి.'

'అయితే నాకేమిస్తావు నీ పుట్టిన రోజుకి?'

'ఇడ్లీ ఇత్తన్నాను రోజూ.సాలదా?అయినా పుట్టిన్రోజు నాది.నువ్వు నాకివ్వాలి,ఏవన్నా.నీ వయసెంత?'

'తొమ్మిది.పది వచ్చేస్తాయి ఇంకా నాలుగు నెలల్లో..'

'నా కన్నా సిన్నోడివే.సూత్తాకి అలా లేవు కాపోతే.'

'మ్ ..'

**************

'అమ్మా,నాకో రూపాయి ఇవ్వవే.'

'ఎందుకూ?'

'నా ఫ్రెండు పుట్టినరోజు రేపు.'

'ఎవరు ఆ ఫ్రెండు?'

'ఎవరోలే.ఇస్తే ఇవ్వు లేపోతే లేదు.అన్నీ చెప్పాలి నీకు.'

'ముక్కు మీద ఉంది వెధవకి కోపం.అంతా బాబు పోలికే.వెళ్ళు అమ్మమ్మని అడుగు.నేనిమ్మన్నా అని చెప్పు.'

ఎలా పోగేశాడో మొత్తానికి ఐదారు రూపాయలు సంపాదించాడు.

**************

'ఏటి పంతులూ..ఇయ్యాలాదివారం కదా?ఇడ్లీ ఎయలేదు.ముస్తాబయ్యోచ్చావ్?కొత్త సొక్కాలా ఉందే?పండగదా?'

'లేదండీ..పాతదే.'లోపలకి తొంగి చూస్తూ అన్నాడు.

'ఎవరిని ఎతుకుతున్నావ్?సిన్నా?వత్తాది.కూసో.'

'ఇవ్వాళ తన పుట్టినరోజని చెప్పింది.అందుకే ఇది ఇద్దామని వచ్చానండీ.'

'ఏటిది?'చూసింది.reynolds పెన్ను,చిన్న తెల్లకాయితాల పుస్తకం,రెండు రిబ్బను ముక్కలు.

'ఏవయ్యోయ్.సూసావా?నీ కన్నా పంతులు నయ్యం.నా కూతురు పుట్టిన్రోజు గుర్తెట్టుకుని బగుమానం కూడా తెచ్చాడు.'

'ఏటి పంతులూ.ఏటి కత?పెళ్లి సేసుకుంటావేంటి మా సిన్నీని?'పరాచకమాడాడు సూరిబాబు.

'రోజు మా కక్కలు,ముక్కలు ఎడతాను.బలంగా అవుతావ్.వొచ్చేత్తావా సెప్పు?' నవ్వింది రత్నం.

'ఛీ..'ఏం చెప్పాలో అర్ధం కాక సిగ్గు పడి నేలచూపులు చూస్తున్నాడు.

'సిగ్గు సూడు...ఇదిగో సిన్నీ, పంతులు నీకోసం అట్టుకొచ్చాడు.బాగా సదుంకో.'చెప్పేసి వెళ్లిపోయారు ఇద్దరూ.

నలుపు రంగు పొడుగు జాకెట్టు,మోకాళ్ళకి కొంచెం కిందవరకూ ఉన్న నల్లని చుక్కలున్న ఎర్రని పరికిణి లో వచ్చి నుంచుంది.మొదటిసారి ఆ అమ్మాయిని అలా చూట్టం వల్లనేమో పైకి కిందకి చూస్తూ ఉన్నాడు.

'ఏటలా సూత్తావ్?కొత్త బట్టలు బోన్నాయా?'

'మ్..చాలా..'

'సరే గానీ..ఈ పుత్తకం పెన్ను నేనేం సేస్కోను?నాకింకా అ,ఆ లే రాలేదు.'

'మెల్లగా వస్తాయిలే .'

'అయినా ఇంత డబ్బులెక్కడివి నీకు?'

'ఎలాగో వచ్చాయిలే.'

'మ్..కొబ్బరి నూజుండ తింటావా?తెత్తా ఉండు. మా అమ్మ సేసింది నా కోసం.'

'వద్దు.దగ్గొస్తుంది.'

'మ్..'

'ఈ బట్టల్లో బావున్నావు నువ్వు.ఎప్పుడు మురికి బట్టల్లో ఉంటావ్.ఇవ్వాళ కొత్తగా ఉన్నావ్.'

'నేనంటే ఇష్టమా నీకు?'

'ఏమో..'నవ్వాడు.

'నీ బుగ్గ చొట్టలు బలేగున్నాయి పంతులూ.'

'అలా పిలవకు.నాకు చిరాకు.రేపొస్తాను.'పరిగెత్తాడు.

***************

'రేపణ్ణుండి మాకు వేసంకాలం సెలవలు.' ఎప్పట్లాగే కాయితంలో చుట్టిన ఇడ్లీ తీసుకుంటూ అన్నాడు

'అయితే ఇంక నువ్వు రావా మరి?'

'ఏమో..మా అమ్మనడిగితే సెలవల్లో కూడా ఎందుకురా ఇడ్లీలు డబ్బు దండక్కి అని తిట్టింది.ఎలా అయినా రావడానికి ప్రయత్నిస్తా.నీకు చదువు చెప్పాలి కదా?'

'నాకు చదవడం కొద్దిగా వచ్చింది కదా?'

'ఇంకా నీ పేరు రాయడం రాలేదుగా?'

'మ్..'

'నువ్ చాలా మంచోడివి పంతులూ.'

'శరత్ వంశీ..'

'ఏదో ఓటిలే..'

'అవునూ..ఇన్నాళ్లూ చిన్ని, చిన్ని అనడమే గానీ నీ పేరేంటో తెలీదు నాకు.'

'లచ్చిమి....ఎంకట లచ్చిమి....ఎలాగైనా రా రేపు.నాకు నీ జత అలవాటైపోయింది.'వెళ్లిపోతూ అంది.

***************

వారం పది రోజుల తర్వాత..

'ఏవండీ..ఏవండీ..'

'ఏంటమ్మా వంశీ బాబు ఇలాగొచ్చావ్?'అడిగింది పక్కింటి సూర్యకాంతం.

'రత్నం గారు వాళ్ళు?'

'ఆళ్ళు బెజవాడెల్లేర్లాగుందమ్మా.పది రోజులడద్దన్నారు.'

'ఓహో..'

'ఏ?ఏవన్నా వొదిలేసావా ఆళ్ళింట్లో?'

'ఏమీ లేదు సూర్యకాంతం.'

***************

వేసవి సెలవులైపోవచ్చాయి..

'చొక్కాలు - 4

ప్యాంట్లు - 3

అవునే సూర్యకాంతం..ఆ రత్నం కూతురికి పెళ్లి చేసేసిందిట కట్టే?అప్పుడే ఏవొచ్చిందే దానికి తొందర?

లుంగీలు - 3 ' తెచ్చిన బట్టలు లెఖ్ఖపెడుతూ మధ్యలో అడిగింది మాణిక్యమ్మ.

అక్కడే అమ్మ ఒళ్ళో పడుకున్న వంశీ గాడు గిరుక్కున లేచాడు.

'సవత్తాడిన పిల్ల సిన్నపిల్లేటండి? '

'ఎప్పుడే?'

'ఆళ్లమ్మింటి కాడ అయిందండి.రత్నం ఆల్లమ్మకి ఒంటో బాగోపోతే సూత్తాకెల్లింది మొన్న.సేసేయఁవే,నాకూ తోడుంటది అని ఆళ్లంమ్మంటే దురగమ్మ గుల్లో పెళ్లి సేసేశారండి.ఈడు జోడు బావున్నారండి.పైగా ఆడు దానికి వరసేనండి.రత్నం తమ్ముడు.బెజవాళ్ళో ఆటో తోల్తాడు.'

'ఏం బాగోడమో ఏవిటో...ఇంకా ఉన్నారా ఇక్కడే?ఓ సారి రమ్మన్నానని చెప్పు.చీర పెట్టి పంపిద్దాం.మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల.'అంది రాధ.

తెలీకుండానే వంశీగాడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.బైటికి పరిగెత్తాడు.

'లేదండి ఇయ్యాల పొద్దుటే పంపేసింది కాపురానికి.మల్లీ వత్తే సెప్తానండి.'

'సరే లెఖ్ఖ తేలిపోయింది.పద్దులో రాస్తున్నాను.'

'అలాగేనండి.'బయల్దేరింది.

***************

'వంశీ బాబు ఇక్కడేం సేత్తన్నావ్?'

'ఏమీ లేదు సూర్యకాంతం.నువ్వెళ్లు.'కచేరి చావడి దగ్గర కూర్చున్న వంశీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

'సరే.సిన్నీ ఆల్లింట్లో పుత్తకం ఏదో వదిలేసావంట కదా?మొన్న ఆ పిల్లొచ్చినపుడు నువ్ కనిపిత్తే ఇమ్మని సెప్పింది.ఇదిగో.'అని వెళ్లిపోయింది.

తనిచ్చిన అదే తెల్లకాగితాల పుస్తకం..అంతే ఖాళీగా ఉంది.

ఆఖరిపేజీలోమాత్రం ఇలా రాసుంది.

'లచ్చిమి సరత వంసీ..'

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.