రాణీమహల్ - ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి

Rani Mahal

కృష్ణదేవరాయలు విజయనగర సంస్థానాన్ని పరిపాలిస్తున్న కాలం,. తమ సంస్థానానికి, మరియు శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి అందుబాటులో, చంద్రగిరిలో ఒక కోటను నిర్మించుకున్నారు. అద్భుతమైన నిర్మాణశైలితో ఆ కోట ఐదంతస్థులుగా నిర్మితమై ఉంది, అప్పటికే విజయనగర సామ్రాజ్యానికి తూర్పు, పశ్చిమ, ఉత్తరాన మూడు రాజధానులు ఉండగా, ఈ కోటను తమ రాజ్యానికి దక్షిణ రాజధానిగా ప్రకటించుకుని తరచుగా అక్కడకు వచ్చి కొద్దిరోజులు ఉండి వెళ్లడం ఆనవాయితీ అయింది. విజయనగర మహారాజుకి, అయితే కేవలం పురుషులు మాత్రమే ఇక్కడకు వచ్చేవారు, స్త్రీలను అనుమతించేవారు కాదు, అందుకుగల కారణాలు ఉన్నాయి. ఆకోటలో ప్రత్యేకమైనది, ప్రాముఖ్యం సంపాదించుకున్నదీ, రెండంతస్తుల రాణీమహల్,.. దానిని అద్భుత శిల్ప సౌందర్యంతో విశాలమైన సభామందిరంలా నిర్మించారు,. వివిధ ప్రాంతాలనుండి తీసుకువచ్చిన కొందరు స్త్రీలు ఇక్కడికి వచ్చే మహారాజుని తమ నృత్య, గాన, వాద్య కళలతో అలరిస్తూ ఉంటారని చెప్పుకుంటారు.. అక్కడ ఉండే స్త్రీలు కూడా అమితమైన సౌందర్యాన్ని కలిగి అప్సరసలను పోలి ఉంటారని, రాజ వంశీయులకు తప్ప అన్యులకు వారు కనిపించని చెబుతుంటారు.. అత్యంత రహస్యంగా ఉన్న ఆ రాణీమహల్ గురించి బయటకు తెలిసింది వాస్తవమేనా!? లేక తెలియని రహస్యం మరేదైనా ఉందా అనే అనుమానం కొందరు శత్రురాజులకి ఉంది, వాస్తవమే ఐతే విజయనగర సామ్రాజ్యంపై దండెత్తి ఎలాగైనా రాజ్యాన్ని, ఆ చంద్రగిరి కోటను స్వాధీనపరుచుకుని, ఆ వైభవం అనుభవించాల్సిందే అన్నది వారి వాంఛ, అప్పటికీ కొందరు రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు ఉత్తరాన గోదావరి తీరప్రాంతాన్ని పాలిస్తున్న రాజు మార్తాండ వర్మ దృష్టి దీనిపై పడింది.. ******************* విజయనగర సంస్థానం, సభలో అందరూ కొలువుదీరి ఉన్నవేళ సైనికుడు ఒక సమాచారాన్ని తీసుకువచ్చాడు.. "మహారాజా!! వేగులు సమాచారంతో విచ్చేసి ఉన్నారు, తమరికి విషయం విన్నవించాలని తెలియజేస్తూ అనుమతికోసం నిరీక్షిస్తున్నారు.." "అనుమతినివ్వండి" సెలవిచ్చారు మహారాజు.. రాజు అనుమతి ఇవ్వగానే సభలోకి ప్రవేశించారు, ఇరువురు వేగులు.. "ప్రణామాలు మహారాజా!!" "భద్రా! మహావీరా! ఏ సమాచారంతో వచ్చారు?" మంత్రి తిన్నడు అడిగాడు.. "మహరాజా! ఉత్తరాన గోదావరి ప్రాంతాన్ని పాలిస్తున్న మార్తాండవర్మ మన చంద్రగిరి కోటపై దాడికి పథకం రచిస్తున్నట్టుగా సమాచారం" "రాజ్యన్ని వదిలి ఆ విడిది ప్రాంతం మీద దండెత్తాలని యోచనెందుకు చేస్తున్నాడు!" అంటూ మంత్రి వైపు చూసాడు ఆశ్చర్యంగా మహారాజు.. "ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు మహారాజా! దక్షిణ భారతంలోనే విశిష్ట ప్రాముఖ్యం పొందిన ఆ చంద్రగిరి కోట మీద ఎందరిదో రాజుల కన్నుపడింది,. దానిని ఆక్రమిస్తే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే ప్రాంతం, దక్షిణ భారతావనికి కేంద్రంగా ఉన్నచోట ఉండటం, అన్నిటినీ మించి దాని నిర్మాణశైలి ఎందరికో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది,. మహాభారత కాలంలో మాయసభలా ఇక్కడ ఉన్న అద్భుత శిల్పసంపద, విశాలమైన సభా మందిరాలు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో దాన్ని గెలుచుకుంటే, అయితే రాజధానిగా చేసుకోవచ్చు, లేదా విడిదిగా ఉంచుకోనూ వచ్చు,. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధంగానే., ఇదే వారి ఎత్తుగడ.." "అంతేనంటారా?" అడిగాడు మహారాజు.. "ఖచ్చితంగా కాదు మహారాజా! అందులో ఉన్న సౌందర్యాన్ని సొంతం చేసుకునేందుకు కూడా కావచ్చు,. అచ్చటి విషయం ఎంత రహస్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎలానో బయటకి తెలిసిపోతుంది,. బహుశా అదీ వారి ప్రయత్నానికి కారణం అయ్యుండచ్చు.." చిరునవ్వుతో బదులిచ్చాడు మహామంత్రి.. మంత్రి నవ్వులో అంతర్యాన్ని గ్రహించాడు మహారాజు.. బదులుగా చిరునవ్వు నవ్వాడు.. "ఆ విషయమై సమగ్ర సమాచారం సేకరించండి, వాస్తవమే ఐతే అతడికి సందేశం పంపండి, ఎదురుదాడికి సిద్ధం అని,. మన సామర్థ్యం గురించి తెలిసీ సాహసం చేస్తున్నాడు అంటే అతడికేదో బలం సమకూరి ఉండాలి,.. అవశ్యం, అదేంటో కూడా తెలుసుకోండి.." అంటూ ఆజ్ఞ జారీ చేసి సభ ముగించాడు.. ************** "అసలు ఆ రాణీమహల్ రహస్యం ఏమై ఉంటుంది మార్తాండ వర్మా!" "ఉంది మిత్రమా!" "ఒక రాజు రాజ్యంమీద దాడిచేసి ఆ రాజ్యాన్ని పొందాలి అనుకోవడం న్యాయం,. కానీ, ఇలా ఎప్పుడో కానీ వినియోగించని ఆ చంద్రగిరి కోటమీదకి దండెత్తడం ఆక్రమించుకోవాలి అనుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది" "మిత్రమా! అది విడిదికాదు,. అలా భ్రమింపచేయాలని చేసిన ప్రయత్నం మాత్రమే, అందులో ఒక విశేషం ఉంది, ఆ కోట మొత్తంగా ఒక అద్భుత నిర్మాణం అయితే అందులో మొదటి అంతస్తులో నిర్మితమైన రాణీమహల్ ఒక్కటి మరో అద్భుతం" "అవునా?" "అవును మిత్రమా! అందులో దేవకాంతల సమానమైన సౌందర్యంతో విరాజిల్లే స్త్రీలు ఉంటున్నారు, వారి నృత్యాలతో, గానాలతో ఆ మహల్ నిత్యం పౌర్ణమి శోభతో వెలిగిపోతోంది" "విజయనగరం మహారాజుకి ఇదెలా సాధ్యమైంది?! సరే, ఒకవేళ మనం ఆక్రమించుకున్నా వాళ్ళు ఉంటారని నమ్మకం ఏముంది..? ఆ మహారాజు పరాజయం పొందితే వాళ్ళు ప్రాణత్యాగం చేయరా..? ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు.." ఆశ్చర్యంగా అడిగాడు.. "అతడికున్న బలం, స్నేహగుణం వల్ల ఎన్నోదేశాల నుండి సౌందర్యవతులైన స్త్రీలను కానుకగా పంపిస్తుంటారు, వారి కళలు ప్రదర్శించి అతడిని మెప్పిస్తూ ఉండటమే వారిపని.. అన్యులకి ఆ కోటలోకి ప్రవేశం ఉన్నప్పటికీ, రాణీమహల్ లోనికి మాత్రం కేవలం రాజ కుటుంబీకులు మాత్రమే వెళ్లగలరని సమాచారం, రాజకుటుంబ స్త్రీలకు కూడా ఆ కోటలోకి ప్రవేశం లేదు, ఇక వారి ప్రాణత్యాగం అంటావా! బందీలు చేసి వశపరుచుకుందాం, లేనప్పుడు మనకి ఆ రాజ్యం దక్కుతుందిగా" "ఇదంతా సరే మిత్రమా! మన లక్ష్యం ఆ విజయనగర సంస్థానం కదా! ఆ సంస్థానం మీద మనం దాడి జరిపితే అప్పుడు ఈ కోట కూడా మనదే అవుతుందిగా!!" "ఆ రాజ్యంపై దాడికి వెళ్ళాలి అనుకున్నా, మనం ఈ కోటను దాటి వెళ్ళాల్సిందే,. రాజ్యానికి నలుదిక్కులా ఇలాంటి కోటలను నిర్మించి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ మహారాజు.. నేరుగా రాజ్యంపై దాడిచేయడం అంత సులభమైన విషయంకాదు,. వినోదం, విలాసం కోసం ఈ ప్రాంతానికి విచ్చేసే మహారాజు, తక్కువ సైన్యంతో, పెక్కు జాగ్రత్తలు లేకుండా వస్తాడు, అదే మనకి అవకాశంగా మారుతుంది,. అదను చూసి మన బలగంతో నలుదిశలా దాడి ఆరంభిస్తాం, రాజ్యానికి సమాచారం అంది, సైన్యం వచ్చేలోపు మహారాజు మన బందీ అవుతాడు" అంటూ పథకం వివరించాడు. "శభాష్ మార్తాండా! నీ ఆలోచన అమోఘం, ఇక మిగిలింది కార్యాచరణ మాత్రమే.." అంటూ అభినందించాడు మిత్రుడు.. ********************* వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున విడిదికోసం చంద్రగిరికి తన పరివారంతో బయలుదేరాడు విజయనగర మహారాజు,. ముందుగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని, అనంతరం కోటకి చేరుకున్నాడు,. కోటలో సందడి మొదలైంది,, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన నర్తకీ మణులు, గాయకులు, వాయిద్యకారుల సమక్షంలో సంబరాలు జరిగాయి.. మహావీరుడు ఆదుర్దాగా కోటలోని రాజమహల్ లోకి ప్రవేశించాడు, "మహారాజా! ఆ మార్తాండవర్మ, అతడి మిత్ర రాజులు నలుదిశలా ఆక్రమించి ఉన్నారు, మనపై దాడికి సిద్ధంగా ఉన్నారు.." కంపిస్తున్న స్వరంతో చెప్పాడు,. తమ సైన్యం సన్నద్ధంగా లేదు,. ఇక్కడ ఉన్న బలగాలూ సరిపోవు,, 'ఏం చేయాలో' అన్నది మహావీరుడి గాభరాకి కారణం, అతడి వెనకే మరో వేగు భద్ర కూడా వచ్చాడు,. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా ఓ సంఘటన జరిగింది. మహారాజు తన ఒరలో ఉన్న పిడిబాకును మహావీరుడి వైపు గురిచూసి విసిరాడు, రెప్పపాటులో అది అతడి గొంతులో దిగింది.. "మహారాజా!" ఆశ్చర్యంగా చూసాడు భద్ర.. "భద్రా! సైన్యాన్ని సిద్ధం కమ్మని కబురందించు.. కోటలో, కొండపైన, చుట్టుపక్కల ఉన్న సైనికులందరికీ వర్తమానం అందించు, యుద్ధానికి సంసిద్ధులు కమ్మను.." "ఆజ్ఞ మహారాజా!" అంటూ కింద పడివున్న మహావీరుడి కాయం వైపు దీనంగా చూసాడు.. "భద్రా! చింతించనవసరం లేదు. ఈ మహావీరుడు మార్తాండవర్మ వేగుగా ఎప్పుడో మారాడు,. మన సమాచారం అంతా చేరవేస్తున్నాడు,. ఈక్షణం మనం తక్కువ సైన్యంతో ఇక్కడకు విచ్చేసామని, దాడికి ఇదే అనువైన సమయమని సమాచారం అందించింది ఇతడే, దాన్ని అదనుగా తీసుకునే ఆ మార్తాండ వర్మ దండయాత్రకి వస్తున్నాడు,. ఆ విషయం వాళ్ళు మనల్ని చుట్టుముట్టేవరకూ గోప్యంగా ఉంచాడు" విషయం అర్థమైన భద్రుడు తక్షణమే అచటనుండి కదిలాడు,. పహారా కాస్తున్న సైనికులకి సమాచారం అందించాడు.. ఖచ్చితంగా విజయం తనదేనని, అతిత్వరలో విజయనగర సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోబోతున్నానని మహదానందంగా ఉన్నాడు మార్తాండవర్మ.. కానీ, అతడి అంచనాలు తారుమారయి, తన పతనానికి మార్గం వేసుకున్నాడని ఊహించలేకపోయాడు. **************** "మహారాజా! అతడు నలుదిశలా ఆక్రమణకు వస్తున్నాడు.." చెప్పాడు మహామంత్రి. "మనసైన్యాన్ని మూడు దిశలు పంపండి,. మూడు వైపులా నాయకత్వం వహించడానికి మన ప్రత్యేక అశ్వదళం సిద్ధంగా ఉందిగా, మరో వైపు నేను కొంతమంది సైనికులతో దాడికి వెళతాను" అంటూ సిద్ధమయ్యాడు మహారాజు. అనుకున్నట్టుగానే మార్తాండవర్మ తూర్పుదిశగా రాగా మిగతా మూడువైపులా అతడి మిత్ర, సామంత రాజులు దాడికి దిగారు, చిత్రంగా వాళ్ళ అంచనాలకు మించి విజయనగరం సైన్యం ఎదురుదాడికి దిగింది,.. ఇది వాళ్ళు ఊహించని పరిణామం, ఇదెలా సాధ్యం??! మార్తాండవర్మకి అర్థంకాలేదు, ఒక్కొక్క యోధుడు ఆకారంలో భీముడికి మల్లె ఉండి ప్రచండదాడి చేస్తున్నారు,.. ఎంతో శిక్షణ లభిస్తే కానీ ఇది సాధ్యంకాదు,. విజయనగరం సామ్రాజ్యంలో ఇంతటి యోధులా! ఎలా సాధ్యం అన్నది అంతు చిక్కలేదు,. అప్పటికే అతడి సామంతులు పరాజయం పొంది లొంగిపోయారు,. ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధపడని మార్తాండవర్మ మాత్రం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాడు. విజయనగర సైన్యం, వారి అశ్వదళ పోరాటం బహుచిత్రంగా అనిపించింది.. తనని తప్పుదారి పట్టించారని అతడికి అర్ధమైంది, అయినా ఊపిరి ఉన్నంతవరకూ పోరాటం చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు, కోటభాగానికి చేరుకున్నాడు, ఇతర రాజులను బంధించిన మహారాజు కొద్దిసేపటికే మార్తాండవర్మని కూడా పరాజితుణ్ణిగావించి.. కోటలో దిగుడు బావి పక్కన ఉన్న రహస్యగుహలో బంధించాడు.. ***************** అక్కడ ఒక వ్యక్తిని చూసిన సారంగధరుడు ఆశ్చర్యపోయాడు,. "మీరు!?" "కౌండిన్యదేశ రాజు విద్యాధరుడిని" "మీరు అసామాన్యమైన ప్రతిభావంతులని విని ఉన్నాను.., కానీ!" సందేహంతో ఆగిపోయాడు.. "విజయనగర రాజు మాయలో ఎంతటి వీరుడైనా ఓడిపోవాల్సిందే" "మాయా! నిజమే,, నాకిప్పుడే అర్థమౌతుంది" "అవును.., ఈ చంద్రగిరికోటలో ఉన్న రాణీమహల్ ఓ మాయా ప్రపంచం,. దాని ప్రలోభానికి లోనై నేను దాడికి వచ్చాను.. నా అంచనా,, నువ్వు వచ్చింది కూడా అందుకే అనుకుంటా" నవ్వుతూ అన్నాడు అతడు. "అతడిని ఓడించాలన్నది ప్రధాన లక్ష్యం, మీరన్నట్టు ఈ రాణీమహల్ అద్భుతాలు కూడా అందుకు కారణమే, ఐతే స్త్రీలు నృత్యంతో అలరించే ఈ రాణీమహల్ లో వీరుడిని ఓడించే మాయలా!! ఇదెలా సాధ్యం?" "అది నృత్యమందిరం కాదు, సుశిక్షితులైన సైన్యాన్ని తయారుచేసే ప్రదేశం, పేరుకి మాత్రమే రాణీ మహల్!! కానీ అక్కడ ఉండేదంతా దేశంలో పలు ప్రాంతాలనుండి ఖరీదుచేసి, కొన్న మేలుజాతి అశ్వాలు,, వాటికి శిక్షణ నిచ్చే శిక్షకులు,. వారితో పాటు శిక్షణ పొందే సైనికులు,, మొదటి రెండవ అంతస్థులలోనే ఉంటారు" "సైనికులకు శిక్షణ రాజ్యంలో కదా ఇస్తారు!" "అది మాములు సైనికులకు, కానీ ఇక్కడ శిక్షణ పొందే ఒక్కో సైనికుడు ఒక్కో బ్రహ్మాస్త్రం లాంటివాడు, ఒక్కో సైనికుడు వెయ్యిమంది యోధులకు సమానమైన వాడు" విద్యాధరుడి మాటలకి విస్మయం చెందాడు,, మార్తాండవర్మ. "మరి అప్సరసలు, సౌందర్యవతులు నాట్యం అని ఏవో కథలు!" "అవన్నీ కట్టుకథలు, అసలు విషయం లోకానికి తెలియనివ్వకుండా చేసే ప్రయత్నం మాత్రమే.., అది నమ్మే నేనూ ఇటుగా దాడి ఆరంభించాను, దట్టమైన మేఘాలనుండి జారిన పిడుగులమల్లే దూకారు సైనికులు కోటలోనుండి,, ఆశ్చర్యపోయాను.. అయినప్పటికీ ఎదురుతిరిగాను కానీ, నిలవలేకపోయాను" అంటూ ఆగాడు.. "ఎంతమోసం!" అన్నాడు మార్తాండవర్మ.. "మోసమా, అప్పుడు మీరూ, నేనూ చేసింది న్యాయమా? రాజ్యపరిరక్షణ కోసం కృష్ణదేవరాయ మహారాజు తంత్రం ఇది,.. పక్కవారికి అన్యాయం జరగనిది, తనని తాను రక్షించుకునేందుకు చేసిన పథకం మోసమవ్వదు మిత్రమా!" "ఇక మన జీవితకాలం ఇక్కడేనా విద్యాధరా!" "క్షమించమని వేడుకుంటే క్షమ లభిస్తుంది,. నేను అందుకు సిద్ధంగా లేను, నువ్వు సిద్ధమైతే వెళ్లి యాచించు, సామంతుడిగా జీవితాన్ని గడుపు.." ఆమాట వినగానే ఉలిక్కిపడ్డాడు, "చావనైనా చస్తాను కానీ, యాచన ప్రసక్తే లేదు" అంటూ తన ఒరలో ఉన్న ఖడ్గాన్ని తీసుకుని గొంతు కోసుకుని అక్కడిక్కడే మరణించాడు, అతడితోపాటు అతడి మిత్రరాజులు కూడా ప్రాణత్యాగం చేసారు. జీవితాంతం బందీలుగా ఉండేకన్నా అదే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. "శత్రుసంహరం పూర్తయింది మహారాజా!!" అంటూ వర్తమానం అందించాడు విద్యాధరుడు. (చిత్తూరు జిల్లాలో గల చంద్రగిరి కోట,. అందులో ఉన్న రాణీమహల్ ను కథా వస్తువుగా తీసుకుని కల్పిత సన్నివేశాలతో అల్లుకున్న కథనం, ఇది వాస్తవం కాదు అని మనవి) ***స్వస్తి***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.