ఓ...గోపాలకృష్ణ (పిల్లల కథ) - అన్నపూర్ణ . జొన్నలగడ్డ

o gopala krishna

అమ్మ...అమ్మ...నా ముంత తయారు చేశావా? అవతల ఆలస్యం అయితే నాకు తెప్ప దాటిపోతుంది. అప్పుడు నాకు గురుకులం వేళ దాటిపోతుంది. ఇంక గురువుగారు కొప్పడతారు. పాఠం మళ్ళీ చెప్పరు కదా... అమ్మ వింటున్నావా ? అంటూ గుడిసెలోనుంచి రంగడు అరుస్తున్నాడు. రంగడి తల్లి... కావేరి, ఆవు దగ్గర పాలు తీస్తోంది. ఇదిగో పాలు తెస్తున్నా రంగా, తాగి బయలుదేరుదువుగాని అని అంది. కాసేపటికి లోపలికి వచ్చి రంగా... ఈ పాలు తాగు నాన్న అని ఇచ్చింది. అమ్మ ఇచ్చిన పాలు తాగి, రంగడు పరుగు పరుగున రేవుకు వెళ్ళాడు. తెప్పలో కూర్చుని తన భుజాన వేసుకున్న సంచి పొదివి పట్టుకుని, నవ్వుకుంటూ ఆవల మా అన్న, నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అని కాస్త అటు ఇటు సర్దుకుని తన ముంత ను ఒకసారి చూసుకున్నాడు. అన్నయ్య, నేను వస్తున్నాను అని మనసులో ఒకసారి తల్చుకున్నాడు. తెప్ప నది దాటుతోంది రంగని చెవిలో అల్లంత దూరం నుండి వేణునాదం వినిపించింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆవలితీరం చేరుకోగానే తెప్పలోనుంచి ముందే దుమికి పరుగు అందుకున్నాడు. అలా ముందుకు సాగిపోతూ..... అన్నా...! గోపాలకృష్ణ ... ఓ....గోపాలకృష్ణ.... అని పిలుస్తూ సాగుతున్నాడు. ఆ పిలుపుకు జవాబుగా ఆ....వస్తున్నా, ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ ఒక పిల్లవాడు ఎదురు వచ్చి పలకరించాడు. నీ గురించే చూస్తున్నాను అంటూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగిపోయారు. అలా నడుస్తూ గురుకులం చేరుకున్నారు. రంగడు పిల్లల మధ్య చేరి చదువుకు సిద్ధం అయ్యాడు. గురువుగారు వచ్చారు పాఠం మొదలు పెట్టారు. సాయంత్రానికి చదువు పూర్తి అయ్యి మళ్ళీ రంగడు ఇంటికి బయలుదేరాడు. రేవుకు వెళ్లే దారి కొంచం చీకటి పడేసరికి గుబురు చెట్లమధ్య కాస్త భయానకంగా ఉంటుందని, తన అన్న తోడు రాగా మళ్ళీ తెప్ప ఎక్కి ఇల్లు చేరటం రంగనికి అలవాటు. ఇలా కాలం గడుస్తోంది. ఇంతలో గురుపూజోత్సవం వచ్చింది. ఆ రోజు గురుకులంలోని విద్యార్థులు అందరూ గురువుగారికి ఏం సమర్పించాలో ఆలోచిస్తున్నారు. ఇదంతా వింటున్న రంగడు ఆలోచన లో పడ్డాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరిన రంగడు ఆ విషయం వాళ్ల అమ్మతో చెప్పాడు. మనం ఏం ఇవ్వగలం నాయనా, మనకి ఉన్నది ఆ గోమాలక్ష్మి ఒక్కటే. ఒక ముంతలో పాలు, ఒక ముంతలో పెరుగు తీస్కుని వేళ్ళు. అవే ఇవ్వు, వారికి అవే మనం ఇవ్వగలిగిన కానుకలు అని అంది వాళ్ల అమ్మ. అలాగే అని మరునాడు అవే తీసుకుని వెళ్లాలని రంగడు సిద్ధం అయ్యాడు. చక్కగా ముంతలకు వాసిని కట్టి జాగర్తగా పట్టుకుని తీసుకు వెళ్ళాడు. రేవు దాటి ఆ అడవిలో నడుస్తుంటే కాలు కి ఏదో అడ్డం వచ్చి రంగడు ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు. లేచి ఒళ్ళు దులుపుకుని, చూసేసరికి ఆ ముంతలు పగిలిపోయాయి. అయ్యో..ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ, తన ఆలవాటు ప్రకారం అన్నా! ఓ... గోపాలకృష్ణ.. అని పిలిచాడు. అన్న వచ్చాడు. పగిలిన ముంతలు చూపించి నేను ఇప్పుడు గురువుగారికి ఏమి ఇవ్వాలి? అని బాధపడ్డాడు. అపుడు గోపాలకృష్ణ, మరేమీ ఫరవాలేదు అని ఒక చెట్టుకు కట్టి ఉన్న ఉట్టి లోనుంచి అలాగే ఉన్న రెండు ముంతలు తీసి రంగనికి ఇచ్చి ఇవి తీసుకువెళ్ళి మీ గురువుగారి కి ఇవ్వు వీటిలో కూడా పాలు, పెరుగు ఉన్నాయి అన్నాడు. రంగడు మళ్ళీ లేచి కళ్ళు తుడుచుకుని అలాగే, అని వెళ్ళొస్తాను అని పరుగు పెట్టాడు. గురుకులం చేరాడు రంగడు. అక్కడ పెట్టిన పెద్ద కుండలు లాంటి బానలు లో పాలు, పెరుగు పోస్తున్నారు. తను కూడా వెళ్లి ఆ బానల్లో ముంతలు వంచాడు. తిరిగి తుస్తే మళ్ళీ ముంతల్లో పాలు, పెరుగు వచ్చాయి. మరలా వంచాడు. బానల్లో తొలపటం, తిరిగి చూస్తే మళ్ళీ ముంతలు నిండటం. ఇలాగే నడుస్తోంది. ఆ చోద్యం చూస్తున్న ఒక పిల్లాడు అక్కడకు వచ్చి ఏదీ ఇలాతే నేను చూస్తాను అని ముంత లాక్కున్నాడు. అలా లాగటం లో పాల ముంత కింద పడి పగిలింది. సగం విరిగింది, అయినా మిగిలిన సగం లో పాలు నిండాయి. అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు. గురువుగారు వచ్చి ఏమైంది మీరు అందరూ ఎం చూస్తున్నారు అని అడుగగా అక్కడ జరిగిన వింత చెప్పారు. రంగా, నీకు ఈ ముంతలు ఎవరు ఇచ్చారు అని అడిగారు గురువులు. మా అన్న గోపాలకృష్ణ ఇచ్చాడండి అన్నాడు రంగడు. అన్నా? నీకు తోబుట్టువులు ఎవరు లేరు కదా అని గురువులు అంటే.. రంగడు వెంటనే, లేదండి నాకు ఒక అన్న ఉన్నాడండీ, ఇక్కడికి దగ్గర్లో ఉన్న అడవి లొనే ఉంటాడు. నాకు రేవు దగ్గర నుంచి రోజు గురుకులం చేరెవరకు సాయం వస్తాడు, అలాగే సాయంత్రం మళ్ళీ రేవు దగ్గర దించుతాడు అని చెప్పాడు. అతను మీ అన్న అని నీకు ఎవరు చెప్పారు అని గురువుగారు అడిగారు. రంగడు ఇలా చెప్పసాగాడు. గురుకులం లో చేరిన కొత్తల్లో నాకు ఈ అడవి దాటి ఇక్కడకు రావటానికి చాలా భయం వేసేది. చీకటి పడితే ఇంక నాకు భయంతో ప్రాణాలు గుప్పెట ఉండేవి. ఇలా నాలుగు రోజులు గడిచేసరికి నాకు జ్వరం వచ్చింది. కానీ, నేను పాఠాలు వినలేకపోతున్నానని ఏడిచేవాడిని. నాకు ఆరోగ్యం కుదుట పడ్డాక మా అమ్మ చెప్పింది. అడవిలోకి వెళ్ళగానే అన్నా... ఓ..గోపాలకృష్ణ.... అని పిలువు. ఆ పిలుపు విని, నల్లనివాడు, నీకంటే ఒక గుప్పెడు ఎత్తు ఉన్నవాడు, పసుపు పచ్చని పంచె కట్టుకుని, చేతిలో పిల్లనగ్రోవి పట్టుకుని ఒక పిల్లవాడు నీ పిలుపుకు జవాబిస్తూ ఇక్కడే ఉన్నాను అని అంటూ ఎదురు వస్తాడు. అతడే నీ అన్న అని అమ్మ చెప్పింది. నాతో రోజు వస్తాడు, నాకు చాలా విషయాలు చెప్తాడు, ఎన్నో నేర్పిస్తాడు, అసలు అతనితో ఉన్నంతసేపు నాకు ఏమి గుర్తుకు రాదు, ఎంతో ఆనందంగా ఉంటుంది గురువుగారు అన్నాడు రంగడు. మీ అన్న నీకు చాలా నేర్పించాడు అన్నావు ఏది మచ్చుకకు ఒకటి చెప్పు అన్నారు గురువుగారు. ఓ... మా అన్న నాకు వేళ్ళ మధ్య పచ్చడి బద్దలు పెట్టుకుని చలిది తినటం నేర్పించాడు గురువుగారు, చక్కని పద్యాలు నేర్పాడు అంటూ రంగడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇవతల చూస్తే గురువు గారి కళ్లు ఆనందబాష్ప ధారలు కురుస్తున్నాయి. ఆయనకు భాగవతం లోని గోకులం లో బాల కృష్ణుడు స్నేహితులతో మెలిగిన సన్నివేశాలు, పద్యాలు, లీలలు అన్ని గుర్తుకు వచ్చాయి. వేగంగా వచ్చి రంగా... నువ్వు ఎంత అదృష్టం చేస్కున్నావురా భగవంతుడిని కళ్లారా చూసావు, ఆయనతో ఆడుకున్నావు అని రంగడిని గుండెలకు హత్తుకుని, మనసారా ఆశీర్వదించి, నువ్వు నా శిష్యునివి కావటం నా అదృష్టం నాయనా అని అన్నారు. ఈ మాటలు రంగనికి అర్ధం కాలేదు. వెనుకనుంచి అంతా వింటున్న గురువుగారి భార్య ఆయనను ఏవిటి ఇదంతా అని అడిగింది. గురువు గారు అప్పుడు ఇలా చెప్పారు ఏముంది “యద్భావం తత్భవతి” అన్నారు. అంటే రంగనికి వాళ్ళ అమ్మ ఎలాంటి గుర్తులతో తనకు అన్న గా ఒక పిల్లవాడు కనిపిస్తాడు అని చెప్పిందో ఆ మాటలపై పూర్తిగా నమ్మకం ఉంచి అలాగే ఆ గోపాల కృష్ణుడిని ఎలుగెత్తి పిలిచాడు రంగడు. అందుకని అతని నమ్మకాన్ని దృఢపరుస్తూ అలాగే భగవంతుడు కనిపించాడు. మనం ఆయనను ఎలా కొలుచుకుంటామొ, ఎలా ఆరాధిస్తామొ అలాగే మనల్ని కరుణించి ఆ స్థాయికి సర్వాంతర్యామి కరుణ, ఆకృతి దాల్చి కటాక్షం చూపిస్తాడు. అదే ఈ రంగనితో జరిగింది. ఆ పరమాత్ముని కరస్పర్శ వల్లే ఆ ముంతలు మరల మరల నిండి ఆయన లీలని ప్రకటించాయి. వాళ్లమ్మ పూజ ఫలించింది. వాడి మనసు నిర్మలం అందుకే పరమేశ్వరుడు వాడికి కనిపించాడు అని అన్నారు. ఇద్దరూ ఒకసారి ఆ కృష్ణునికి మనసారా నమస్కారం చేసుకున్నారు. బయట పిల్లలు కూడా “ నంద కిశోరా హే,గోపాల బాల...” అంటూ తాళాలు వాయిస్తూ కృష్ణ భజనలు చేస్తున్నారు. అడవిలోనుంచి మధురమైన వేణు గానం గాలిలో సుగంధాలు నింపుతూ అందరిని తన్మయులను చేసింది. 🙏 ౼ ౼ 🙏

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.