శిరీష ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూలబడింది. ఈరోజు అంతా ఆఫీస్ లో ఇటు అటు తిరిగి పనిచేయడమే సరిపోయింది. దాంతో కాళ్ళు నొప్పులు. ఇంటికి రాగానే మంచి నీరు ఇచ్చే వారు లేరు. ఏం కావాలన్నా తనే చూసుకోవాలి. అక్కడితో సరిపోయిందా. కాసేపటికి శ్రీవారు వస్తారు. ఏది రెడీగా లేకపోయినా చిరచిరలాడతారు. అది భరించే కన్నా ఆయన వచ్చే లోపు ఏదో ఒక టిఫిన్ చేసి రెడీ గా ఉంటే సరి. ఈ విషయాలన్నీ మనసులోనే నెమరేసుకుంటున్న శిరీష తప్పని సరిగా లేచి బట్టలు మార్చుకుని పని లోకి జొరబడింది. అలా ఒక గంట గడిచేసరికి పకోడీ, కాఫీ రెడీ అయ్యాయి. తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది, ఇంతలో ఆకాశ్ వచ్చాడు. రాగానే "శిరీ, తల బద్దలై పోతోంది, వేడిగా కాఫీ ఇవ్వు. అదే చేత్తో తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. ఆకలి దంచేస్తోంది." అన్నాడు. శిరీష మారు మాట్లాడకుండా అన్ని టేబుల్ మీద పెట్టింది. ఆకాశ్ ఫ్రెష్ అయి వచ్చి అవన్నీ చూసి "ఆహా, ఎంతదృష్టం" అంటూ కాఫీ అందుకొని పకోడీ నమలసాగాడు. సడెన్ గా అతనికి గుర్తు వచ్చింది, భార్య నుండి ఏ రెస్పాన్స్ లేదని. తననే చూస్తూ " ఏమిటి అలా ఉన్నావ్. ఆఫీస్ లో ఏమైనా గొడవా." అన్నాడు. "అదేం లేదు." అంది ముభావంగా. "మరెందుకు అలా ఉన్నావ్. ఏదో అయిపోయినట్లు" అన్నాడు ఆకాశ్ అసహనంగా. "ఈ రోజు కాస్త త్వరగా వచ్చాను. కొంచెం సరదాగా గడపవచ్చు అనుకుంటే. నా ఖర్మ. అంత అదృష్టమా నాకు. ఇవాళే ఇలా ఏడుపు ముఖం తో ఉండాలా." అన్నాడు మళ్లీ. "ఎందుకు ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటారు. జవాబు చెపితే కోసం, చెప్పకుంటే కోపం. నా మానాన నేను ఉండడం కూడా తప్పేనా." కొంచెం కోపం, బాధ మిళాయించి అడిగింది శిరీష. "శిరీష, నీ మానాన నువ్వు, నా మానాన నేను ఉండేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు." విసుగ్గా అని ఆకాశ్ బైటికి వెళ్ళి పోయాడు. శిరీష సోఫా లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచన లో పడింది. అలా ఎంతసేపు గడిచిందో తలుపు శబ్దం విని కళ్ళు తెరిచింది. ఆకాశ్ వస్తూనే " ఏమిటి ఇంకా అలానే ఉన్నావా. మూవీ కి టికెట్స్ బుక్ చేశాను. ఇంకా వంట పెట్టు కుంటే కుదరదు కాని త్వరగా తెములు. హోటల్ లో తిని మూవీ కి పోదాం." అన్నాడు. అవును, కాదు అని వాదించే కన్నా మాట్లాడకుండా వెళ్ళడమే నయం అనిపించింది శిరీష కి. రోజులు మామూలుగా గడుస్తున్నాయి. ఆకాశ్ శిరీష గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించడు. తనకేమైనా లోటు అనిపిస్తే శిరీష నే తప్పు పడతాడు. శిరీష కి తన మనసు విప్పి చెప్పే అవకాశం ఇవ్వడు. శిరీష రోజులు గడిచేకొద్దీ డల్ అవుతూ ఉంటుంది. కానీ ఆకాశ్ ఏమాత్రం పట్టించుకోడు. శిరీష కజిన్ రాధ వివాహం కుదిరింది. చిన్ననాటి నుండి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తన పెళ్లి కిముందుగా రాకపోతే ఇంక ఎప్పటికీ మాట్లాడనని బెదిరించడం తో ఆకాశ్ ని అడిగింది శిరీష. తనను వెళ్ళమని, పెళ్ళి టైం కి వస్తానని ఆకాశ్ హామీ ఇవ్వడంతో ఆఫీస్ కి శెలవు పెట్టి కజిన్ రాధ ఊరికిప్రయాణమైంది శిరీష. రాధ శిరీష ని చూసి చాలా సంతోషించింది. మిగిలిన స్నేహితుల తో కలిసి శిరీష కూడా చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంది. పెళ్లి పనుల్లో, రాధకి సహాయం చేయడంలో శిరీష కి సమయమే తెలియలేదు. అనుకున్న దానికంటే ముందే ఏవో శెలవులు కలిసి వచ్చాయని ఆకాశ్ కూడా వచ్చేశాడు. ఆకాశ్ ది అందరితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం కావడంతో ఏ ఇబ్బంది లేకుండా తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. శిరీష కి అతని రాక వలన ఇబ్బంది కలగకపోవడం తో ఇంకా ఆనందంగా ఉంది. మరునాడు పెళ్లి. ముందు రోజు సాయంత్రం ఆడ, మగ అంతా రాధ బామ్మ దగ్గర చేరారు. శిరీష రాధని అడిగింది " ఇప్పుడు ఏంచేస్తారు" అని. "ఏంలేదు శిరీష, మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే మా బామ్మ చెప్పవలసిన విషయాలు ఇలాగే కూర్చోపెట్టి చెపుతుంది. ఇంకెవరైనా ఏమైనా.అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా ఇప్పుడే చెపుతారు. ఇది మా ఇంటి అలవాటు." నవ్వుతూ చెప్పింది రాధ. 'ఓహో, అలానా! ఈ పద్ధతి ఏదో బాగున్నట్లుంది' అనుకొని తను కూర్చుంది. బామ్మ అందరినీ ఒకసారి చూసి, "ఏమర్రా! ఎవరైనా మొదలు పెట్టండి" అంది. "నువ్వు చెప్తే విందామని వస్తే, నువ్వేంటి బామ్మా, మమ్మల్ని అడుగు తున్నావు" అన్నారెవరో. "ఏమో కాలం మారుతోంది. నా మాటలు నచ్చుతాయో లేదో" అంది బామ్మ. "అబ్బా, బామ్మా, మొదలు పెట్టు. ఆలస్యంగా మొదలు పెడితే ఇంక ఎవరికీ నిద్రలు ఉండవు" అంది ఇంకొక అమ్మాయి. "సరే, సరే. చూడమ్మా పెళ్లి కూతురా, నువ్వు జాగ్రత్త గా విను. భార్య అంటే భారమైనది. భర్త అంటే భరించే వాడు అని కాదమ్మా. భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికోసం ఒకరుగా ఉండాలి." అని అంటూండగా ఒక కోణంగి, "అదేంటి బామ్మా, కార్యేషు దాసి అని మొదలు పెట్టలేదేం" అన్నాడు. "ఉండరా భడవా, నీకు వెటకారం ఎక్కువైంది. భార్య భర్తని సేవించడం లో దాసి లాగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రి లాగా, సహనం లో భూదేవి లాగా, ఎప్పుడూ లక్ష్మి లాగా కళ కళ లాడుతూ, భోజనం పెట్టినప్పుడు కన్నతల్లి లాగా ఉండాలి." అంది బామ్మ. అబ్బాయిలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. "బామ్మా, ఎప్పుడూ పాత పాటే నా, కొత్తగా ఏమైనా చెప్పవచ్చ కదా,"అంది రాధ గారంగా. ఆమె తలపై చేయి వేసి నిమురుతూ,"అవునమ్మా ఈసారి కొత్తగా నే చెప్పబోతున్నాను. ఎంతసేపు మేమెలా ఉండాలో చెప్తారు. అబ్బాయిలు ఇలా ఉండాలి అని ఎవరూ చెప్పలేదా. అనుకుంటారు మీరు. అవును. అబ్బాయిలకు కూడా కొన్ని లక్షణాలు అవసరమే. అబ్బాయిలు చేపట్టిన కార్యములను విజయవంతంగా పూర్తి చేయాలి. కుటుంబాన్ని సమర్ధ వంతంగా నడిపించాలి. రూపానికి శ్రీకృష్ణుని లాగా భార్య ను ఆనందింప చేస్తూ, శాంతం లో శ్రీ రాముని లాగా ఉండగలగాలి. భార్య పెట్టిన భోజనం తో తృప్తి చెందాలి. సుఖ దుఃఖాలలో ఆమె చేతిని వదలక ఒక మిత్రుని లాగా సహకరించాలి. కుటుంబ పెద్దగా ఎవరికీ కష్టం కలగకుండా అందరినీ సంరక్షించాలి. ముఖ్యంగా భార్య కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలి." ఈ మాటలు విన్న అమ్మాయిలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. "ఆగండాగండి. మీరు మీ కష్టసుఖాలు అరమరికలు లేకుండా భర్తతో పంచుకోవాలి. అతని కష్టసుఖాలు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ సంసారం సుఖసంతోషాలతో వర్థిల్లుతుంది. జీవనమాధుర్యం అనుభవం లోకి వస్తుంది. అర్దమైందా. సరె. ఇక పడుకోండి. మళ్లీ ప్రొద్దున్నే లేవాలి." అంటూ బామ్మ లోపలికి దారితీసింది. మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ సర్దుకున్నారు. శిరీష కూడా రాధతో వెళ్ళబోతూ పక్కకి తిరిగేసరికి అక్కడ ఆకాశ్ కనిపించాడు. " అరే, మీరు పడుకోలేదా." అంది ఆశ్చర్యంగా. ఆకాశ్ ని చూసిన రాధ "నువ్వు లేకపోతే ఆకాశ్ కి తోచదేమో." అంది నవ్వుతూ. "అబ్బే, అదేం లేదు. బామ్మ గారు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి. వింటూ ఉండిపోయాను" అన్నాడు. "అవును. ఆవిడ చాలా మంచి విషయాలు చెప్పారు" అంది శిరీష. బాగా రాత్రి అవడంతో అందరూ వెళ్లి పడుకున్నారు. తెల్లారి లేచి పెద్ద వాళ్ళు పెళ్ళి పనుల్లో పడితే రాధ స్నేహితురాళ్ళు ఆమె ను అలంకరించడంలో మునిగి పోయారు. పంతులు గారు తొందర పెట్టడంతో ముస్తాబు ముగించి రాధని పెళ్లి తంతు లో కూర్చోపెట్టి స్నేహితురాళ్ళు ఛలోక్తులతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత శిరీష, ఆకాశ్ లు రాధ కి చెప్పి వెనుదిరిగారు. రాధ ఆకాశ్ కి మరీ మరీ థాంక్స్ చెప్పింది. శిరీష, ఆకాశ్ లు తిరిగి వచ్చి తమ తమ పనులలో ములిగి పోయారు. కాని ఇద్దరిలోనూ కొంత మార్పు చోటు చేసుకుంది. శిరీష ఆఫీస్ నుండి వచ్చి కాఫీ, స్నాక్స్ రెడీ చేసి ఫ్రెష్ అయి ఆకాశ్ కోసం ఎదురు చూడటం, రాగానే ప్రేమ గా పలకరించడం చేస్తోంది. ఆకాశ్ కూడా ముందులాగా చిరాకు పడకుండా ఆమె మంచి చెడులు కనుక్కుంటున్నాడు. ఇద్దరూ తమ ఆఫీస్ విషయాలు ఆనందంగా పంచుకుంటున్నారు. ఆరోజు ఆదివారం. ఇద్దరూ తీరికగా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆకాశ్ "శిరీ ఒక విషయం అడగనా" అన్నాడు. శిరీష "అడగండి" అంది ఏమైఉంటుందా అని ఆలోచిస్తూ. "శిరీ, మీ ఫ్రెండ్ పెళ్లి కి వెళ్లి వచ్చాక మన లైఫ్ లో చాలా మార్పు వచ్చింది కదూ. ముందు లాగా మనలో గొడవలు లేవు కదూ." అన్నాడు ఆకాశ్. "అవును. ఆ రోజు బామ్మ గారి మాటలతో నేను చేసే పొరపాటు నాకర్థమైంది. ఎంతసేపు మీరు అర్థం చేసుకోవాలి అని అనుకొనే దానిని, కాని మీ వైపు నుంచి ఆలోచించే దానిని కాదు. బామ్మ గారి మాటలతో నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది " అంది శిరీష. ఆకాశ్ "నిజమే. బామ్మ గారి మాటలతో నాలో కూడా మార్పు వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటేనే జీవితాన్ని ఆనందమయం చేసుకోగలనని అర్థం చేసుకున్నా. ఇన్నాళ్ల నా ప్రవర్తనకి నేను సిగ్గు పడుతున్నాను శిరీ. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు." శిరీష ని దగ్గరకు తీసుకొని ఆర్తిగా అన్నాడు. "అయ్యో, అవేం మాటలండీ. నావల్ల కూడా పొరపాటు జరిగింది. అందులో నా బాధ్యత కూడా ఉంది. మీరే నన్ను క్షమించాలి." అంది శిరీష. "పోనీ, తప్పొప్పులు మరిచి పోయి ఇంక నుండి ఆనందంగా ఉందామా" అన్నాడు ఆకాశ్ నవ్వుతూ దానికి సమాధానం గా శిరీష అతని గుండెలకు హత్తుకుపోయింది సంతోషంగా.