" ఏంటి రాజీ..! అలా వున్నావ్?భార్య రాజీవిని అడిగాడు రాఘవ. "ఏం లేదండీ!మన వాడు ప్రమోద్ విషయంలోనే కాస్త ఆందోళనగా ఉంది.వాడు హాస్టల్ నుంచి వచ్చిన దగ్గరనించీ మనిషి మనలోకంలో లేడు.నాతో సరిగ్గా మాట్లాడట్లేదు" అంది రాజీవి బాధగా. "నేనూ గమనించాను రాజీ!వాడు ముభావంగానే ఉంటున్నాడు. వాడికేమైనా కావాలేమో అడిగి చూడు.చెప్పటానికి మొహమాట పడుతున్నాడేమో "అన్నాడు రాఘవ. "మన దగ్గర మొహమాటం ఎందుకండీ.వాడు వచ్చిన దగ్గర్నుంచీ వాడితోనే ఉంటున్నా. అది కావాలా ఇది కావాలా ఆంటూ అడుగుతూనే వున్నా ఏమీ చెప్పట్లేదు. నేనేది మాట్లాడినా చిరాకు పడుతున్నాడు. మనవాడు మునపటిలా లేడని మాత్రం చెప్పగలను" అంది రాజీవి దిగాలుగా " మనం ఆత్రేయపురాన్ని,ఉమ్మడి కుటుంబాన్ని వదిలిపెట్టి, మన బాబు చదువుకోసం,వాడికో బంగారు భవిష్యత్తు అందించాలని ఆ ఊరినీ,అయినవాళ్ళందరికీ దూరంగా వచ్చేశాం. ఉమ్మడిలో వున్నప్పుడు పిల్లలందరూ కలిసి ఆడుకోవడం కష్ట సుఖాలు పంచుకోవడం సమిష్టిగా ఉంటూ లోటు లేని జీవితాన్ని గడిపారు. అందరూ కలిసి ఉండటంలో పిల్లలు పొందుతున్న భద్రతా భావం పట్ల మనకి సంతృప్తి వున్నా ప్రమోద్ చదువు కోసం విశాఖ రావాల్సొచ్చింది ". "అవునండీ! మనం ఒంటరి వాళ్ళం ఐపోయామనే బాధ కొన్నాళ్ళు వున్నా, కాల క్రమేణా కొత్త స్నేహితుల పరిచయాలతో ఆ లోటుని భర్తీ చేసుకున్నాం ప్రమోద్ మాత్రం ఆ పల్లెనీ,స్నేహితులనీ మర్చిపోలేక ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేక సతమవుతున్నాడేమో. మన వల్ల వాడి చదువుకు ఇబ్బంది కలగకూడదనేగా హాస్టల్ ఉంచాం . ఒక్కగానొక్క కొడుకని ఎంతో గారాబంగా పెంచుకున్నాం.ఏది కావాలన్నా క్షణాల్లో సిద్ధం చేస్తూనే ఉన్నాం. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా మన ప్రమోద్ సంతోషంగా వుండట్లేదు.ఎప్పుడూ మొహంలో ఏదో తెలియని అసంతృప్తి"అంది రాజి విచారంగా "నువ్వు కంగారు పడకు రాజీ. ప్రమోద్ ట్యూషన్ మాస్టారు సుందరం గారిని ఊరునించి రమ్మని కబురు చేశాను.రేపే సిటీకి వస్తున్నారు. ప్రమోద్ మనసులోని వెలితిని కనిపెడతారేమో చూద్దాం సుందరం మాస్టారంటే ప్రమోద్ కే కాదు,ఆయన దగ్గర చదువుకున్న పిల్లలందరికీ ప్రత్యేకమైన ఇష్టం,అంతకు మించిన గౌరవం. పిల్లవాని మానసిక స్థితిని బట్టి, బోధనా విధానాన్ని మారుస్తూ ,సరళమైన పద్ధతుల్లో శిక్షణ నిస్తూ ,అందరి హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారాయన."అన్నాడు రాఘవ ఆరోజు ఆదివారం. సుందరం మాస్టారు వచ్చారు. సాదరంగా ఆహ్వానించారు రాఘవ దంపతులు. ఆయన వస్తూనే ఇంటి ఆవరణ చుట్టూ తిరిగి పరిసరాలను బాగా పరిశీలించి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. "మాస్టారూ! మా ప్రమోద్ ప్రవర్తనకు కారణం ఏమిటో మీరైనా కనిపెట్టగలరన్న నమ్మకంతో మిమ్మల్ని పిలిపించాం. వాడి సమస్య ఏమిటో మీకైనా చెపుతాడేమో. ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోతుంటే తట్టుకోలేక పోతున్నాం.వాడికి మీదైన పద్ధతిలో కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు మనిషిని చేశారంటే మీ మేలు మర్చిపోలేము మాస్టారూ "అన్నాడు రాఘవ చేతులు జోడిస్తూ. ప్రమోద్ ని హాల్ లోకి పిలిచాడు రాఘవ. సుందరం మాష్టారికి నమస్కారం చేసాడు ప్రమోద్. "రా ప్రమోద్! ఇలా వచ్చి నా పక్కన కూర్చో"అంది రాజీ. విసుక్కుంటూనే వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు ప్రమోద్. "నేను నీ బెడ్ మీద పెట్టిన కొట్టబట్టలు వేసుకోకుండా పాత టీ షర్ట్ వేసుకున్నావే?" ఇందాక నీ రూమ్ లో పెట్టిన బూస్టు పాలు తాగావా నాన్నా?" అంది రాజీవి. "నాకు బూస్టు వద్దు.మిల్క్ షేక్ కావాలని ముందే చెప్పానుగా మమ్మీ.నేను తాగను."అన్నాడు ప్రమోద్ చిరాగ్గా. "ఇదండీ మాస్టారూ వీడి వరస,మంచి మాట ఏది చెప్పినా గిట్టటం లేదు ఎందుకోమరి,నేనొకటి చెపితే వాడొకటి అంటాడు.నేనేది చెప్పినా వాడి మంచి కోసమే కదండీ" విచారంగా అంది రాజీవి. సుందరం మాస్టారికి విషయం అర్ధమైంది . ప్రమోద్ ని దగ్గరకు పిలిచారు. "నీకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ మాష్టారుకి గురుదక్షిణ ఏమిస్తావ్ ప్రమోద్ ? అన్నారు. "మీరేదడిగినా ఇస్తాను ,చెప్పండి మాస్టారు" అన్నాడు "నేను నాలుగు రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నాకు కావల్సిన పనులన్నీ నువ్వే చేసి పెడతావా. వంటతో సహా.దానికి కావలసిన సరుకులు నువ్వే బయటనుంచి తీసుకురావాలని.చేయగలవా ప్రమోద్?"అన్నారు-మాస్టారు "తప్పకుండా చేస్తాను మాస్టారూ"అన్నాడు ప్రమోద్ ఉత్సాహంగా ఆ రాత్రి మాస్టారు "ప్రమోద్ !నాకు రెండు రోటీలు ,కలగలపు కూర,పటిక పంచదార వేసి మజ్జిగ చేసి తీసుకునిరా"అన్నారు ప్రమోద్ వంటగదిలోకి మొదటిసారిగా అడుగుపెట్టాడు. తల్లి చేసిపెడితే తినడం తప్ప అసలు అవన్నీ ఏవిటో అర్ధం కాలేదు . రోటీలు ఏ పిండితో చేస్తారో కూడా తెలియదు. 'కలగలుపు'కూర అనే మాటే ఎప్పుడూ వినలేదు. చేయకపోతే మాష్టారు ఏమనుకుంటారో? అనుకుంటూ "అమ్మా!రోటీలు ఏ పిండితో చేస్తారు ?"అని అడిగాడు. మాస్టారు చెప్పినవన్నీ నేనే స్వయంగా చేస్తాను.నువ్వు నాకు హెల్ప్ చెయ్యవా ప్లీస్."అన్నాడు ఆమె కోరుకుంది అదే.కొడుకు తనతో మాట్లాడుతుంటే సంతోషించింది.తనే దగ్గరుండి అన్నీ చెప్పి చేయించింది. "భోజనం బాగుంది ప్రమోద్ "అని మెచ్చుకున్నారు మాస్టారు. ప్రమోద్ మాస్టారు చెప్పినవి బయటకు వెళ్లి తేవడం తెలీదు. తండ్రి సరుకులు ఎలా ఎక్కడినుంచి తెస్తాడో కూడా అసలు తెలీదు. "నాన్నా!నాతో షాప్ కి వచ్చి,సరుకులు కొనడానికి సహాయం చేస్తారా.ప్లీస్?"అని అడిగాడు. గురువుగారు ఉన్న నాలుగు రోజులూ తండ్రీ కొడుకూ బయట కలిసి తిరిగటం తల్లితో కలిసి వంట గదిలో మాట్లాడుతూ పదార్ధాలు వండి అందరూ కలిసి తినడం వల్ల ప్రమోద్ లో మునుపటి ఉత్సాహం మళ్లీ వచ్చింది. మాస్టారు తన ఊరికి తిరుగు ప్రయణమయ్యారు. "మా ప్రమోద్ ని మళ్లీ మామూలు మనిషిని చేశారు. మీ బోధలతోనాలుగు రోజుల్లోనే వాడి మనసు మార్చారు .ఇప్పుడు చాలా ఉత్సాహంగా కనబడుతున్నాడు"అన్నారు రాఘవ,రాజీవి . "ఇందులో నేను చేసిందేమీ లేదుమ్మా.మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ పెరటి చెట్లను చూశాను. పెద్ద చెట్ల నీడలో చిన్న మొక్కలు ఎదగలేవు. కొంత నీడ కావాలి.కొంత వెలుతురుకావాలి. మీరే తన తోడూ నీడని తెలుసుకున్నాడు ప్రమోద్. అతనికి మీ అవసరం ఎంత మేరకో మీకూ అర్ధమయ్యింది అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి.కష్టంలోనే సుఖం ఉందని స్వయంగా తెలుసుకోనీయండి.అప్పుడు అతనిలో సహజ వికాసం కలుగుతుంది.ఇక నా అవసరం మీకు కలగకపోవచ్చు.సెలవు"అని చెప్పి వెళ్లిపోయారు మాస్టారు. ప్రమోద్ తల్లీ దండ్రులు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో,తనగురించి ఎంత తాపత్రయ పడుతున్నారో అర్ధం చేసుకున్నాడు.