విశాఖలో విఖ్యాత డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థినీ,విద్యార్థులు కొందరు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఫలితంగా విశాఖపట్టణంలోని అరకు, దాని పరిసర ప్రాంతాలను చూడడానికి విహారయాత్రకు పంతొమ్మిది మంది బయలుదేరారు.
ముందుగా అరకు చేరుకుని హోటల్ మయూరిలో దిగారు. అబ్బాయిలు,అమ్మాయిలు విడివిడిగా ఇద్దరేసి చొప్పున ఒక్కొక్క డబుల్ బెడ్రూం తీసుకున్నారు. తొమ్మిది డబుల్ బెడ్రూంలు పద్దెనిమిది మందికి సరిపోయాయి. మురళి సింగిల్ బెడ్రూం తీసుకున్నాడు.
వారం రోజులకు సరిపడా ప్రణాళికల రూపు రేఖలు దిద్దుకుని యువతరపు హద్దులు దాటకుండా ఆనందంగా గడపసాగారు.
రెండు రోజులు గడిచాయి.
****
ఉదయం ఎనిమిది కావస్తోంది.
అరకు పోలీసు స్టేషన్‌లోకి ఇన్స్పెక్టర్ అడుగు పెడుతుండగా.. .అతడి టేబుల్ పైన ఉన్న ల్యాండ్ ఫోన్ మ్రోగింది. అడుగుల వేగం పెంచి ఫోనెత్తాడు.
“హలో...అయాం ఇన్స్పెక్టర్ రాజీవ్” అన్నాడు.
“నమస్తే సార్! నేను హోటల్ మయూరి మేనేజర్ మేఘనాథ్‌ను మాట్లాడుతున్నాను...వైజాగ్ నుండి విహారయాత్రకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి చనిపోయాడు”
“ఆ గదిని లాక్ చేయండి.. నేను ఒక పది నిముషాల్లో అక్కడుంటాను” అన్నాడు రాజీవ్.
తన అసిస్టెంట్ మూర్తిని తీసుకుని జీప్‌లో సంఘటనా స్థలానికి బయలుదేరాడు రాజీవ్.దారిలో రాజీవ్ సూచన మేరకు క్లూస్ టీమ్‌కు, అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు మూర్తి.
పోలీసు జీప్ ఆగగానే పరుగులాంటి నడకతో వచ్చిన వ్యక్తి...”సర్..ఇందాక ఫోన్ చేసిన మేఘనాథ్‌ను. చనిపోయింది మురళి సర్...రూమ్ నంబర్ నైన్” అంటూ దారితీశాడు. గది ముందు విద్యార్థినీ,విద్యార్థులంతా గుమికూడి చర్చించుకుంటున్నారు. అందరి ముఖాలలో భయాందోళన అద్దంపడుతోంది.
“వీరంతా ఎవరు? ముందుగా ఎవరు చూశారు? ఎప్పుడు చూశారు?” అంటూ మేఘనాథ్ పై రాజీవ్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే...ఒక విద్యార్థి కలుగజేసుకుని.
“సార్! మేమంతా వైజాగ్ విఖ్యాత డిగ్రీ కాలేజీ ఫైనలియర్ విద్యార్థులం. విహారయాత్రకు బయలుదేరాము. నా పేరు వినయ్‌కుమార్ సర్. నిన్న అందరం అరకు వెళ్లి రాత్రికి తిరిగి వచ్చాం. ఉదయం టిఫిన్ చేద్దామని క్యాంటిన్‌కు బయలుదేరాం. మురళి రాక పోవడంతో అతని గదికి వెళ్ళి కాలింగ్ బెల్ నోక్కాను. కాసేపు వెయిట్ చేసి తలుపు తట్టాను. లోపల గడియ పెట్టుకోలేదేమో..! తెరుచుకుంది. దగ్గరికి వెళ్లి పిలిచాను. సమాధానం రాకపోయేసరికి తట్టి లేపుదామని భుజం ముట్టుకోగానే చల్లగా తగిలింది. చలనం లేక పోయేసరికి భయమేసి మేనేజర్‌ను పిలిచాను” అంటూ వినయంగా రెండు చేతులు కట్టుకున్నాడు వినయ్‌కుమార్.
ఇంతలో క్లూస్ టీం వచ్చింది. రాజీవ్ సూచనలతో క్లూస్ టీం తమ పనిలో మునిగి పోయింది. రాజీవ్ అమ్మాయిలతో...మూర్తి అబ్బాయిలతో మమేకమై వివరాలు సేకరించసాగారు. ఇంతలో అంబులెన్స్ రావడంతో..క్లూస్ టీం గ్రీన్ సిగ్నలివ్వగానే..మురళి శవాన్ని జాగ్రతగా అంబులెన్స్ లోకి ఎక్కించి, అరకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
“నా అనుమతి లేనిదే ఎవరూ గదులు ఖాళీ చెయొద్ధు” అంటూ రాజీవ్ విద్యార్థులందరినీ హెచ్చరించాడు. మూర్తికి మరింత సమాచారం లాగమన్నట్టు తగిన సూచనలిచ్చి స్టేషన్‌కు బయలుదేరాడు.
***
సాయంత్రం స్టేషన్‌కు వస్తున్న రాజీవ్‌ను చూడగానే అంతవరకు చెట్టుకింద కూర్చొని ఏడుస్తున్న మురళి తల్లిదండ్రులు చటుక్కున లేచి నిలబడ్డారు. గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ..ఎదురు వెళ్లారు. వాళ్ళను లోనికి రమన్నట్టుగుగా సైగ జేస్తూ తన గదిలోకి వెళ్ళాడు రాజీవ్. రెండు చేతులా దండం పెట్టుకుంటూ రాజీవ్ వెనకాలే వెళ్లారు మురళి తల్లిదండ్రులు.
“మీ అబ్బాయికి ఎవరైనా శత్రువులున్నారా...” అంటూ ఆరాతీశాడు రాజీవ్.
“ఎవ్వరూ లేరు సార్! మాకు ఒక్కగానొక్క కొడుకు మురళి” గద్గద స్వరంతో అంటూ సుతారముగా నుదురు కొట్టుకోసాగారు.
“దోషిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటాము” అని వారిని ఓదార్చి, మురళి పార్థీవదేహం తీసుకెళ్లడానికి అనుమతి పత్రం ఇస్తూ...ఆసుపత్రికి వెళ్లమన్నాడు.
సాయంత్రం సుమారు ఆరుగంటలకల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. రాజీవ్ వాటిని చదవగానే...హంతకులను పట్టుకోగలననే ధైర్యం కలిగింది. వెంటనే మూర్తిని, మరొక లేడీ కానిస్టేబుల్‌ను తీసుకుని హోటల్ మయూరికి బయలుదేరాడు.
నేరుగా మేనేజర్ మేఘనాథ్‌ను కలిసి గత రాత్రి సి.సి. కెమెరా రికార్డింగ్ తన సెల్ ఫోన్లో కాపీ చేసుకున్నాడు రాజీవ్. ఆ దృశ్యాలను మూర్తి, తను చూస్తూ...కాసేపు చర్చించుకున్నారు.పిల్లలను ఇంటరాగేట్ ఎలా చెయ్యాలో ప్రణాళిక రచించుకున్నారు. పథకం ప్రకారం మేఘనాథ్ కేటాయించిన గదిలోకి వెళ్లి కూర్చున్నారు. రాజీవ్ చెప్పినట్లు ఒకరయ్యాక మరొక విద్యార్థినిని గదిలోకి పంపిస్తోంది లేడీ కానిస్టేబుల్. రాజీవ్ ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నాడు. మూర్తి విధ్యార్థుల సమాధానాలను రికార్డు చెయ్యసాగాడు.
రాజీవ్ తన సెల్ ఫోన్లో ఒక ఆగంతకుని ఫోటో నవీన్‌కూమర్‌కు చూపిస్తూ...”ఇతను నిన్న రాత్రి నీ దగ్గరికి వచ్చాడు కదూ...” అంటూ రెట్టించాడు. నవీన్‌కుమార్ వణికిపోయాడు.
గాడ్ ప్రామిస్ సర్...నా దగ్గరకు రాలేదు” అంటూ నెత్తి మీద అరచెయ్యి పెట్టుకుని బిక్కముఖమేశాడు. అతని పేరు ప్రదీప్,పవిత్ర బావ సర్. బహుశా ఆమెను కలిసి ఉంటాడు . పవిత్ర,చరిత ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు. చరితకు కూడా తెలిసి ఉంటుంది సర్!” అంటూ మరి కొన్ని వివరాలు అందించాడు. ప్రదీప్ ఇంటి చిరునామా తెలుసుకుని నవీన్‌కుమార్‌ను పంపిస్తూ...మూర్తికి సైగ చేశాడు. వెంటనే మూర్తి స్టేషన్‌కు ఫోన్ చేసి ఆ చిరునామా చెప్పి అర్జెంట్‌గా అతణ్ణి పట్టుకు రావాలని ఆదేశించాడు.
పవిత్రను బెదిరించగానే చరిత తాననేలా వేధించిందో చెప్పింది. సెల్ ఫోన్లో ప్రదీప్ ఫోటోను చూపిస్తూ...ఆరా తీస్తే అతనెవరో తెలియదని బొంకింది. రాజీవ్‌కు సీన్ సాంతం అర్థమయ్యింది. చరితను తనదైన శైలిలో అడగగానే మొత్తం కథ వివరించింది. ఆమె కళ్లవెంట ధారాళంగా కన్నీరు..జలపాతాల్లా ఎగిసి పడసాగాయి.
తృప్తిగా గాలి పీల్చుకున్నాడు రాజీవ్. పవిత్రను,చరితను లేడీ కానిస్టేబుల్ సాయంతో జీపులో ఎక్కించుకుని స్టేషన్‌కు బయలుదేరాడు. దారిలో మూర్తి పత్రికా విలేఖరులకు సమాచారమిచ్చాడు.
స్టేషన్ చేరే సరికి ప్రదీప్ సెల్లో రెడీగా ఉన్నాడు అతణ్ణి చూసి పవిత్ర ఖంగుతింది.
మరో పావుగంటలో పత్రికా విలేఖరులతో సమావేశమై దొషులను పట్టుకున్న వివరాలను, కేసు పూర్వాపరాలను వివరించసాగాడు రాజీవ్.
“నా సర్వీసులో హత్య కేసులెన్నో ఛేదించాను. కాని ఈ మురళి హత్య ఒక కొత్తకోణంలో జరిగింది. విచిత్రంగానూ ఉంది” అంటూ ప్రాంభించాడు. “మురళిది మంచి హాండ్సమ్ పర్సనాలిటీ. తను ఇలా చిటికేస్తే చాలు ఆడవాళ్ళు అలా వలలో పడతారని అతని ప్రగాఢ విశ్వాసం. కాని పవిత్ర విషయంలో అది నిజం కాలేదు. ఒక రోజు అతని చెంపలు వాయించింది కూడా. ఆ విషయం పెద్దలదాకా ప్రాకింది. మురళిని అందరి ముందు పవిత్ర పాదాలనంటి క్షమాపణలు చెప్పించారు. పవిత్ర బావ ప్రదీప్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు” అంటూ మూర్తిని చూసి తాను రికార్డు చేసిన సారాంశాన్ని చెప్పమన్నట్టుగా సైగ చేశాడు రాజీవ్.
మూర్తి గొంతు సవరించుకుని..”మురళి పవిత్ర మీద కక్షగట్టాడు. ఆమె క్లోజ్ ఫ్రెండ్ చరితను, మురళి వలలో వేసుకుని..ఆమెను పావులా వాడుకున్నాడు. చరితను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని చేశాడు. చరిత పెళ్లి గురించి మురళిపై ఒత్తిడి తీసుకురాసాగింది. అరకు విహార యాత్ర నుండి రాగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ప్రమాణం చేశాడు.
అరకు వచ్చాక తన పథకం చరితకు చెప్పి కేవలం ప్రతీకారం కోసమే అని మభ్యపెట్టాడు. అలా తాను చెయ్యక పోతే మన పెళ్లి గురించి మర్చిపోవాల్సి ఉంటుందని బెదిరించాడు. చరిత ఒప్పుకోక తప్పలేదు. చరిత స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి మురళి ఫోన్‌కు పంపింది. మురళి వాటిని ఫార్వార్డ్ చేస్తూ...’రేపు నువ్వు అదే పెద్దల ముందు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి..లేదంటే నీ దృశ్యాలన్నీ వాట్సప్‌లో సామాజిక సంచలనాలవుతాయని మురళి మెసేజ్ పెట్టాడు. పవిత్ర, చరితను నిలదీసింది. తాను మురళి వల్ల మోసపోయానని విషయమంతా చెప్పింది.
పవిత్ర, ప్రదీప్‌కు మెసేజ్ పెట్టింది. తాను రావడానికి కాస్త ఆలస్యమవుతుందని...మురళిని దొంగ దెబ్బ కొట్టాలని ప్రదీప్ మెసేజ్ పెట్టాడు.
మరుసటిరోజు అరకులో వాటర్ ఫాల్స్ చూడడానికి అందరూ బయలుదేరారు.ఎవరికి వారు చుట్టుపక్కల అందాలను వీక్షిస్తున్నారు. అరకు పల్లె జనం పుట్ట తేనె పండ్లు అమ్ముతున్నారు కొని తినే వారు తింటున్నారు.
ఒక చోట ఒక గుడిసె ముందు పాము కాటుకు మందు ఇవ్వబడును అన్న బోర్డ్ చూసింది చరిత.పామూకాటుకు మందు కొని పాము విషం అమ్ముతారట నాకు వైద్యంలోకి కావాలి అని అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపింది ముసలాయనకు. డబ్బు చూడగాని ఆశ పుట్టి ఒక చిన్న సీసాలో పాము విషం ఇచ్చాడు. దానిని హ్యాండ్ బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుంది.
ఆ రోజు రాత్రి మురళి గదికి చరిత చేరుకుని నీవు చెప్పినట్లే చేశాను...అని ప్రేమతో ఎన్నో కబుర్లు చెప్పింది. అవును మనం విజయవాడ చేరుకోగానే పెళ్లి చేసుకుందాము అని మద్యం సీసా మూతను తీశాడు.. ఉండు నీకు ఈరోజు గ్లాసులో పోసి నేనే స్వయంగా తాగిస్తాను అంది. ఆగు బాత్రూంకు వెళ్ళి వస్తాను లేకపోతే తాగిన మత్తు దిగిపోతుంది అన్నాడు. మురళి వెళ్ళి వచ్చేలోగా చరిత పాము విషాన్ని మందు పోసిన గ్లాసులో కలిపింది. మురళి మంచం మీద కూర్చుని తాగుతూ మెల్లగా వాలిపోయి... కాళ్ళూ, చేతులూ గట్టిగా ఆడించసాగాడు... ఆ గది తలుపు ఆటోమెటిక్ లాక్ సిస్టం, దానివల్ల ఆన్ చేయకుండానే తోసుకుని తన గదికి భయంతో చేరుకుంది చరిత.మురళి గది డోర్ లాక్ కాలేదు”
రాజీవ్ వెంటనే మూర్తిని ఆగమని సైగ చేస్తూ...”చివరి అంకం నేను చెబుతాను” అంటూ చెప్పడమారంభించాడు.చరిత విషం కలిపిన విషయం పవిత్రకు తెలియదు. అదే రాత్రి ప్రదీప్ వచ్చాడు. పవిత్రనడిగి మురళి రూమ్ నంబరు తెలుసుకున్నాడు. మురళి పడుకున్నాడో! లేడో! పరిసరాలు స్టడీ చేసి వస్తానని పవిత్రకు చెప్పి మురళి గదికి వెళ్ళాడు. తలుపు కాస్త ఓరగా తెరచి ఉన్నట్లు కనబడింది. నెమ్మదిగా తోసుకుని లోనికి వెళ్ళాడు. అప్పటికే మురళి నోటి గుండా నూరగలు ఉన్నాయి. బాగా తాగడం మూలాన అలా వాంతి చేసుకున్నాడనుకున్నాడు. మురళి అప్పుడు కొస ఊపిరితో ఉన్నాడు. ప్రదీప్ దిండు తీసి మురళి ముఖంమ్మీద పెట్టి గట్టిగా నొక్కి పెట్టాడు. చనిపోయాడని నిర్ధారణ చేసుకుని అక్కడ నుండి పారిపోయాడు.
అందుకే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లోవిషప్రయోగమూ...ఊపిరి ఆడక పోవడమూ మురళి మరణానికి మార్గాలయ్యాయని ఉంది” అంటూ ముగించాడు ఇన్స్పెక్టర్ రాజీవ్.