మగధ సామ్రాజ్యాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించాడు. అతడు పేరుకు తగ్గట్లు పరాక్రమవంతుడే కాదు. ఆదర్శ రాజు. ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకుంటూ వారికి ఏ సమస్యలూ లేకుండా చూసుకునేవాడు. రామరాజ్యాన్ని తలపింపజేసేవాడు. శత్రువులు విక్రముని పరాక్రమానికి భయపడి ఆ రాజ్యంపై కన్నెత్తి కూడా చూడటానికి సాహసించలేదు.
ఆ విక్రమునికి విజయుడు అనే కుమారుడు ఉండేవాడు. విక్రముడు తన కుమారునికి యుద్ధ విద్యలు, రాజనీతినీ నేర్పడమే కాదు, ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగనిచ్చాడు. ప్రజల మంచీ చెడులను స్వయంగా తెలుసుకొనేలా చేశాడు. వారి మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలే చేశాడు. విజయునికి ప్రజలలో వస్తున్న మంచి పేరును చూసి, సంతోషించాడు. తన తదనంతరం తన కుమారుడు పాలనలో తన వారసత్వాన్ని నిలబెడతాడని పొంగి పోయాడు.
కాలం గడుస్తున్నది. విక్రమునికి వృద్ధాప్యం వచ్చింది. విజయుని తక్షణమే రాజును చేసి, తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ విషయం కుమారునికి చెబుతాడు. "క్షమించండి మహారాజా! నాకు రాజుగా అయ్యే అర్హత లేదు." అన్నాడు. ఖంగుతిన్న మహారాజా "ఎందుకు?" అన్నాడు. "నేను అనేక ప్రాంతాలు తిరిగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొనే క్రమంలో రామాపురం అనే గ్రామంలో విశ్వనాథుడు అనే వ్యక్తి గురించి విన్నా! అతడు ఎంతో పరాక్రమం కలవాడు. ధర్మాత్ముడు. కష్టపడి సంపాదించిన డబ్బును దానధర్మాలకే వినియోగించేవాడం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా విశ్వనాథుని దగ్గరికే వెళతారు. అతడు పారదర్శకంగా ఆ సమస్యలను పరిష్కరించేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు మిమ్మల్నే మరచి, అతని వద్దకు వెళుతున్నారంటే అతనిలో నాయకత్వ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పవచ్చు. పరిపాలనలో మీ వారసత్వాన్ని నిలబెట్టేది విశ్వనాథుడే. ప్రజా క్షేమం కోరే మీకు మీకు నా ఆలోచన నచ్చుతుందని భావిస్తున్నాను. పరిపాలనలో అతనికి నేను చేదోడు వాదోడుగా ఉంటాను." అన్నాడు.
అవును. తన కుమారుని ఆలోచన సరియైనదే. రాజు పదవి వారసత్వంగా రాకూడదు. సుపరిపాలన అనేది వారసత్వంగా రావాలి. కుమారునిలో రాజ్యకాంక్ష లేకపోవడం అనే లక్షణానికి ఆశ్చర్యానందానికి లోనైన విక్రముడు విశ్వనాథుని పిలిపించి, అతనిని మగధ సామ్రాజ్యానికి రాజుని చేశాడు. ప్రజలు మరికొన్ని దశాబ్దాల పాటు రామరాజ్యాన్ని చవి చూశారు.