కృషితో నాస్తి దుర్భిక్షం - శ్రీమతి దినవహి సత్యవతి

Nasty famine with hard work

డిగ్రీలో పట్టభద్రురాలినయ్యాక పై చదువులు చదవాలని ఆశపడినా కుటుంబ పరిస్థితులవల్ల వెంటనే ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం దొరికింది. సాయంత్రం ఆఫీసయ్యాక దొరికిన తీరుబాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని దగ్గరలోనే ఉన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేరాను. సాయంత్రం 6 నుంచీ 8 గంటల వరకూ తరగతులు జరిగేవి. అలా 2 కంప్యూటర్ కోర్సులు చేసాను.

ఆ తరువాత కొంతకాలానికి వివాహం జరగడం, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి శ్రీవారితో వెళ్ళిపోవడం జరిగింది. మరుసటి ఏడాది బాబు పుట్టాడు. వాడి ఆలనా పాలనలో రోజులు ఆనందంగానే గడుస్తున్నప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనే కోరిక రోజు రోజుకీ నాలో బలపడసాగింది.

అయితే ఆ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ బాబు బాగా చిన్న పిల్లవాడవటాన చదువు సాఫీగా సాగక మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది. అయినా నిరుత్సాహ పడలేదు. పోనీ కొన్నాళ్ళు ఉద్యోగం చేద్దామా అనుకున్నా మరీ పసివాడైన బాబుని క్రెష్ లో పెట్టడానికి నా తల్లి మనసు ఒప్పలేదు. అందుకని బాబు స్కూల్లో చేరేదాకా వేచి ఉండి, ఆ తరువాత దగ్గరలోనే ఉన్న ఎన్.ఐ.ఐ.టి. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. నేను ముందు చేసిన కంప్యూటర్ కోర్సుల ఆధారంగానూ, నా చదువు, ఆంగ్ల, హిందీ భాషలలో నాకున్న పరిజ్ఞానాన్నీ పరిగణనలోకి తీసుకుని ఇన్స్టిట్యూట్ డైరక్టర్ గారు, కాప్టన్ సింగ్, నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది.

ఉదయాన బాబుని స్కూల్లో దింపడం, సాయంత్రం వాడిని స్కూలునించి తీసుకుని మళ్ళీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలదాక పని చేసి ఇంటికి రావడం, ఇంట్లో వంటా వార్పూ, రాత్రి భోజనాలూ ..ఇదీ నా దినచర్య !!!!

కొన్ని నెలలు గడిచాక ఇన్స్టిట్యూట్ డైరక్టర్ నన్ను పిలిచి “కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేయండి మీరు, అది మీ పదోన్నతికి సహాయపడగలదు” అని సలహా ఇచ్చారు.

సాయంత్రం పూట ఆఫీసు టైం అయ్యాక క్లాసులకి హాజరవ్వాలి, అయితే బాబుని ఎక్కడుంచాలి అన్న మీమాంశ వచ్చింది. నేనూ శ్రీవారూ... ఇద్దరం సంపాదిస్తున్నప్పటికీ, అప్పటి మా ఆర్థిక పరిస్థితి బాబుని క్రెచ్ లో ఉంచేలా లేదు..

‘ఏం చెప్పాలా?’ అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన నన్ను చూసి “మీకెమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి” అన్నారు డైరెక్టర్. బాబు గురించి, మా పరిస్థితి గురించి చెప్పాను.

అందుకు కాప్టన్ సింగ్ కొంచం ఆలోచించి “అయితే ఒక పని చెయ్యండి, బాబుని స్కూలునించి తీసుకొచ్చి మీతో పాటే క్లాసులో కూర్చోపెట్టుకోండి. అందుకు మీకు వెసులుబాటు కలుగజేస్తాను” అన్నారు.

నా ఆనందానికి అవధులు లేవు. బాబు అప్పుడు ఎల్. కె.జి. లో ఉన్నాడు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి మర్నాడే కోర్సుకి రిజిస్టర్ చేసుకున్నాను. ఫీజు నెల జీతంలో మినహాయించేలా ఒప్పందం చేసుకున్నాను. రోజూ సాయంత్రం బాబుని స్కూలునుంచి తీసుకొచ్చి, ఇన్స్టిట్యూట్ లోనే ప్రెష్ చేసి, యూనిఫాం మార్చి (ఒక జత బట్టలు నా బ్యాగులో పెట్టుకునే దాన్ని), క్యాంటీన్ లో పాలు త్రాగించి...క్లాసులో ఆఖరి వరుసలో నేను కూర్చుని, ప్రక్కన బాబుని కూర్చో పెట్టుకునేదాన్ని. క్లాసులో లెక్చర్ జరుగుతున్నంతసేపూ బుధ్ధిగా కూర్చునే వాడు లేదా బాగా అలిసి పోయినప్పుడు నిద్ర వస్తే అలానే తల కుర్చీలో వాల్చుకుని పడుకుండిపోయేవాడు.

ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఏడున్నర ఒక్కొక్కసారి ఎనిమిదయ్యేది. గబ గబా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసేదాన్ని. ఈ ప్రక్రియలో శ్రీవారు కూడా చేతనైనంత సహకారం అందించేవారు. అలా ఒక ప్రక్క బాబుని చూసుకుంటూ, ఇల్లు నడుపుకుంటూ, ఉద్యోగం చేస్తూ....మొత్తానికి కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు లో ఒక ఏడాది పి.జి. డిప్లమా పూర్తి చేసాను. ఆ కోర్సులో అత్యధ్భుతమైన ప్రతిభ కనపరచినందుకుగాను ‘అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెంస్’ అవార్డు కూడా పొందాను .

ఆ తరువాత కొద్ది రోజులకి శ్రీవారి ఉద్యోగ రీత్యా మా మకాము బెంగళూరు మారింది. బాబు తరువాత మాకు ఒక పాప. నా ఉద్యోగ పర్వానికి మళ్ళీ రెండు సంవత్సరాలు విరామం. పిల్లల చదువులూ మధ్య మధ్యలో అనారోగ్యాలూ, సంసారపరమైన చిక్కులూ, ఆందోళనలూ...వీటన్నిటినీ దాటుకుంటూ కాలగమనంలో మరో కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాలంతో పాటుగా, ఉపాధ్యాయ వృత్తిలో నాది, చదువులలో పిల్లలదీ, ఉద్యోగంలో శ్రీవారిదీ పయనం ముందుకు సాగింది.

సరిగ్గా ఆ సమయంలోనే, సంసార బాధ్యతల మాటున మనసు పొరలలో నిక్షిప్తమైపోయిన అలనాటి నా కోరిక ....పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని ...మళ్ళీ వెలుగుచూడాలని తాపత్రయపడసాగింది. పిల్లలతో, శ్రీవారితో సంప్రదించాను. ఇరువురూ కూడా నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చారు. దాంతో వెంటనే కార్యాచరణ ప్రారంభించి, ఎం.సి.ఎ. చేయడానికని ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) కి దరఖాస్తు చేసాను.

ఉద్యోగాన్ని కొనసాగిస్తూ, పిల్లలని చదివించుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ ....బాబు 10 వతరగతి లోకి, పాప ఎనిమిదవ తరగతిలోకి వచ్చేటప్పటికి ఎమ్..సి.ఎ. పూర్తి చేయడమే కాదు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలినయ్యాను. ఉపాధ్యాయ వృత్తిలో పదోన్నతి పొంది సీనియర్ లెక్చరర్ అయ్యాను.

‘ఉత్తమ ఉపాధ్యాయిని’ అని విద్యార్థులనుంచి, యాజమాన్యంనుంచి ప్రశంసలు అందుకుంటూ దాదాపు పండ్రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తదుపరి అనివార్య కారణాలవలన ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది.

వృత్తినుంచి విరమణ పొందిన తదుపరి రచనా వ్యాసంగమే ప్రవృత్తిగా చేసుకుని, నేర్చిన ఉన్నత విద్య ఇచ్చిన పరిజ్ఞానాన్ని జోడించి సామాజిక విషయాలపై, తెలుగులో, రచనలు చేస్తూ సమాజాన్ని చైతన్యపరచే దిశగా నావంతు కృషి చేస్తున్నాను.

*****శుభం*****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు