సాయంత్రం ఆఫీస్ వదిలే సమయానికి ఓ అరగంట ముందుగా మెల్లగా మేనేజర్ రూమ్ లోకి అడుగుపెట్టాడుసుబ్బారావు.
కాళ్ళు బార్లా చాపి సీలింగ్ వైపు చూస్తూ కులాసాగా కాళ్లు ఊపుతున్న రామారావు గుమ్మం దగ్గర అలికిడి విని, చటుక్కునఫైళ్లలో తల దూర్చాడు ఎడతెరపి లేని పనులలో సతమతమవుతున్న వాడు మల్లే.
"సార్..!" అంత భయం, భక్తితో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు కూడా నిలబడడడేమో అన్నట్లు మేనేజరుముందు నిలబడ్డాడు సుబ్బారావు.
"ఏంటి?" సీరియస్ గా అడిగాడు మేనేజర్.
‘వీడి ముఖంలో మన్ను పడా! వీడి ముఖం ఉండడమే అంతంత మాత్రం. కాస్త నవ్వుతూ అడిగితే వీడి సొమ్మేంపోతుందో..? దానికి తోడు ఆ సీరియస్ నెస్ ఒకటి. అది అసలు వీడి ముఖానికి సరిపడదు. సీరియస్ గా వున్నప్పుడు వీడిముఖం, తిరుణాళ్లలో అన్నిటికీ అరటిపళ్లు దొరికి తనకు తొక్క కూడా దొరకని వానరం లాగా ఉంటుంది.‘
" ఓ అరగంట పర్మిషన్ కావాలి సార్!" అనాలనుకున్నవి అన్నీ మనసులో అనుకుని, కాస్త ముందుకు ఒంగి వినయంగాఅడిగాడు సుబ్బారావు.
"దబ్!" టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ క్రింద పడింది.
"ఏమైంది? ఫ్లవర్ వాజ్ ఎందుకు కింద పడింది ?" మేనేజర్ సీరియస్ గా ముఖం పెట్టుకొని అడిగాడు.
"ఏమో సర్! గాలికి పడినట్లుంది."
"నీ ముఖం! గాలి ఎక్కడ ఉంది ఇక్కడ? నువ్వు అంత వినయంగా వంగడంతో టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ నీ తలకు తగిలికింద పడింది."
"అవునా...! వినయంతో మరీ అంత ముందుకు వంగానా?" ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు సుబ్బారావు.
"నోటిలోకి ఈగలు పోగలవు. జాగ్రత్త! ఇక్కడ గాలి ఉండదన్నాను కానీ ఈగలు లేవనలేదు." అన్నాడు మేనేజర్ గాండ్రిస్తూ.
"మరీ..అదీ..మరే..." సుబ్బారావు నసుగుతూ అన్నాడు.
"ముందు విషయం చెప్పు!" గదిమాడు మేనేజరు.
"ఓ అరగంట పర్మిషన్ కావాలి సార్! ఇంటికి వెళ్ళాలి." గబగబా పాఠం అప్పగించినట్లుగా చెప్పాడు.
"ఇంటికా? ఏంటి సంగతి? మీ ఆవిడ పప్పు నానబోసిందా? ఇంట్లో గ్రైండర్ పనిచేయడం లేదా?" కిసుక్కున నవ్వాడురామారావు.
‘నీ ఇంట్లో సంగతులన్నీ నన్ను అడుగుతావేంట్రా అడ్డగాడిదా?‘ మనస్సులోనే కోపాన్ని అణచుకుంటూ, "అబ్బే! అదేంలేదు సార్! చిన్న పని ఉంది."
"అదే..ఏంటా పని?" కులాసాగా కాళ్లు ఊపుతూ అన్నాడు రామారావు.
"శ్రావణమాసం కదా సార్!"
"అయితే...? పేరంటాళ్లను నిన్నే బొట్టుపెట్టి పిలిచి రమ్మందా మీ ఆవిడ?" ఈసారి ఊగిఊగి నవ్వాడు రామారావు.
‘నీ పిండాకూడు..! నీ ముఖం మీద కాకి రెట్ట వెయ్య! నీ పిండం కాకులకు గద్దలకు పెట్ట!‘ మనసులోనే పళ్లు నూరాడుసుబ్బారావు.
"లేదు సార్! మా ఆవిడ టైలర్ దగ్గర తన జాకెట్ తీసుకు రమ్మంది." సుబ్బారావు నోటిలో మాట నోటిలో వుండగానే,
"టైలరా? ఏ టైలర్?" ఒక్క ఉదుటున లేచి అడిగాడు రామారావు.
ఆయన అలా లేవడంతో ఉదయం నుంచి కుర్చీలోనే కూర్చుని ఉన్నాడేమో, దానికి తోడు భారీకాయం కావడంతో, అంటుకుపోయినట్టు ఉన్న కుర్చీ ఆయనతో పాటే అంటిపెట్టుకుని లేచింది.
సుబ్బారావు అద్భుతాన్ని చూస్తున్నట్టుగా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు.
"ఏమైంది సుబ్బారావు?"
"సార్! ఇప్పుడు మీరు నాకు ఏమైనా బోధించబోతున్నారా?"
"నేను నీకు బోధించడమా? నీకేమైనా పిచ్చి పట్టిందా?"
"కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు ఆయన ఆకాశం లో పెద్ద రూపంలో కనిపిస్తాడు కదా సార్! అలా మీరులేవగానే మీతో పాటు కుర్చీ కూడా లేచింది సార్!" ఇంకా ఆశ్చర్యంతో నోరు తెరిచే అన్నాడు సుబ్బారావు.
రామారావు వెనక్కి చూసుకుని ప్యాంటుకు అతుక్కుని ఉన్న కుర్చీని విదిలించి, "నీ ముఖం! శ్రీకృష్ణుడు లేదు! భగవద్గీతలేదు! ఇంతకు నువ్వు వెళ్లేది ఏ టైలరు దగ్గరికి చెప్పు?" టేబుల్ మీద కూర్చుంటూ అన్నాడు.
"పాషాణం అండ్ కఠినం టైలర్స్ సార్!" ఈసారి టేబుల్ పైకి లేస్తుందేమోనని టేబుల్ వైపు భయంగా చూస్తూ అన్నాడుసుబ్బారావు.
"హా..! పాషాణం టైలర్సా?" రామారావు ఒక్క ఉదుటున వచ్చి సుబ్బారావును కౌగిలించుకున్నాడు.
"ఏమైంది సార్? ఆ టైలర్ మీకు బంధువా? ఆప్త మిత్రుడా? బాల్య స్నేహితుడా? మీకు లైఫ్ ఇచ్చిన వాడా?" గబగబాఅడిగాడు సుబ్బారావు రామారావు కౌగిలిలో నలిగిపోతూ.
"ఛ! వాడు నా బంధువేంటి?" గబుక్కున సుబ్బారావును వదిలేసి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.
"మరి ఏమైంది సార్? అతని పేరు వినగానే మీరు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు?" సుబ్బారావు కుతూహలంగాఅడిగాడు.
"మా ఆవిడ బట్టలు కూడా అక్కడే ఇస్తుందయ్యా!తన జాకెట్లు కూడా అక్కడే ఇచ్చింది. నెల రోజుల నుంచీత్రిప్పుకుంటున్నాడు. నువ్వు ఎటూ వెళ్తున్నావుగా! మా ఆవిడ జాకెట్లు కూడా అడిగి తీసుకురా!"
"అలాగే సార్!" మనసులో ‘ తప్పుతుందా!‘ అనుకున్నాడు.
"వెళ్ళనా సార్?" మరలా మర్యాదగా, వినయంగా వంగి అడగబోతూ ఫ్లవర్ వాజ్ వైపు భయంగా చూశాడు.
"హహ్హహ! భయపడకు. నేను పట్టుకున్నానులే!" ఫ్లవర్ వాజ్ ను పట్టుకుంటూ పళ్ళికిలించాడు.
"ఉండు. స్లిప్ ఇస్తాను." అంటూ జేబులో ఉన్న స్లిప్ తీసి ఇచ్చాడు.
"డబ్బులు" అడగబోయి నోరు నొక్కుకున్నాడు.
********. *******
సుబ్బారావు బైకును టైలరు షాపు వున్న రోడ్డులోకి వెళ్లి పార్క్ చేస్తూ బెదిరిపోయాడు. షాపు ముందు ఎక్కడ చూసినాజనం! ఏమైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా? గబగబా జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లబోయాడు.
"అబ్బా..!" బాధతో కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోతూ, తనను మోచేత్తో పొట్టలో పొడిచిన అతని వైపు కోపంగాచూశాడు.
"మరి? ఇప్పుడు వచ్చి తోసుకుంటూ వెళ్తున్నావు. మాకు లేదు నీ తెలివి పాపం!" వెకిలిగా నవ్వాడు మోచేత్తో పొట్టలోపొడిచిన అతను.
కళ్ళలో తిరుగుతున్న నీళ్లను అదుపు చేసుకుంటూ పైకి నవ్వేందుకు ప్రయత్నిస్తూ,
"అక్కడ ఏంటి? బట్టలు ఇస్తున్నారా?" అని అడిగాడు షాపు ముందు కుర్చీ లో కూర్చుని ఉన్న అతని ముందు జనంగుంపుగా గుమికూడి ఉండటం చూసి.
"కాదు. మన స్లిప్స్ అక్కడ ఇస్తే, అతను లోపల కనుక్కొని మన బట్టలు పూర్తయ్యాయో లేదో చెప్తాడు. అవునూ...మీముఖం ఏంటి అలా అష్టవంకరలు తిరిగింది?" అడిగాడు మో.పొ.పొ.అతను.
"ఓ...అదా? ఇందాక మీరు నా పొట్టలో పొడిచారు కదా? నాకు ఏడుపు రాబోతే ఆపుకుని నవ్వానన్నమాట. అందుకే అలాముఖం అష్ట వంకరలు తిరిగింది. నయం ఇప్పుడు అష్టవంకరలు తిరిగింది. మా ఆవిడ ముందైతే అప్పుడప్పుడుపదహారు వంకర్లు కూడా తిరుగుతుంది. తెలుసా?" గొప్పగా చెప్పాడు సుబ్బారావు.
మో.పొ.పొ. అతను వింతగా చూసి నవ్వి, "అదుగో! మన ముందు ఆ నలుగురు అయిపోతే మన వంతే!" చెప్పాడు.
ఈ లోపల కొందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ కనిపించారు.
"ఏమైంది? మీరెందుకు వెళ్ళిపోతున్నారు?" ఆదుర్దాగా వారికి ఎదురు వెళ్లి అడిగాడు.
"మా బట్టలు కుట్టడం పూర్తి కాలేదట. మరొక వారం పడుతుందంటున్నారు." ఇంటర్వ్యూలో ఉద్యోగం జారిపోయినట్లుగాముఖం పెట్టి అన్నాడు.
"అయ్యో! ఎలా?" సుబ్బారావు బెంబేలు పడిపోయాడు.
"ఏమైంది?" అడిగాడు మో.పొ.పొ.అతను.
మోచేత్తో పొట్టలో పొడిస్తే పొడిచాడు కానీ, అతను తనకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.
"ఇవాళ బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం!" అన్నాడు సుబ్బారావు ఆందోళన పడిపోతూ.
"ఇవాళ బుధవారమా..?" గుండె పట్టుకుని కూలబడిపోయాడు మరోపక్క నిలుచుని వున్న యాభై ఏళ్ల గోవర్ధనం.
"అయ్యో భలేవాడివి! నువ్వేం మనిషి వయ్యా? అలా ఉన్న పళాన చెప్తే గుండె ఆగిపోదూ? నయం. గురువారం అని ఉంటేఅసలు చచ్చి ఊరుకునేవాడు." అతని పక్కన ఉన్న అతను బాటిల్లో నీళ్లు అతని ముఖం మీద చల్లుతూ అన్నాడు.
"అసలు ఏంటి ఈ వారాల గొడవ?" మరొక అమాయకుడు బిక్కమొహం వేసి అడిగాడు.
" ఎల్లుండే శ్రావణ శుక్రవారం. మా ఆవిడ ఇవాళ జాకెట్టు తీసుకు వెళ్లకపోతే చంపేస్తుంది. ఉతికి ఆరేస్తుంది. ఇవాళ స్లిప్ ఇస్తే జాకెట్ అయిందో లేదో చెప్తారు. కుట్టకపోతే మరల గుర్తు చేసి వెళ్తే రేపైనా ఇస్తారు. మా ఆవిడ జాకెట్టు తీసుకువెళ్లకపోతే...!" సుబ్బారావు నుదుటిన చెమటలు అలుముకున్నాయి.
చెమట తుడుచుకుంటూ పక్కకు చూసి ఉలిక్కి పడ్డాడు. ఇంతకుముందు పడిపోయిన అతనిని నీళ్లు చల్లి లేపిన అతను, బాటిల్ చేత్తో పట్టుకుని, నీళ్లు కుడి చేతిలోకి కొద్దిగా తీసుకుని ఆత్రంగా సుబ్బారావు వైపు చూస్తున్నాడు.
"ఏంటి?" అయోమయంగా చూస్తూ అన్నాడు సుబ్బారావు.
"పడిపోతే...నీళ్ళు చల్లుదామని." అన్నాడు నీళ్ల బాటిల్ అతను.
సుబ్బారావుకు చిర్రెత్తుకొచ్చింది.
"పదండి! పదండి! పదండి ముందుకు! పదండి తోసుకు! " అంటూ పాటపాడుతూ ముందుకు వెళ్లిన మో.పొ.పొ.అతను స్లిప్పులు తీసుకుంటున్న అతని దగ్గరకు వెళ్లి, తన స్లిప్పు అతని చేతిలో పెట్టాడు.
"రేయ్ మల్లీ! నెంబరు డి. టూ జీరో వన్ సంగతేంటి?" తన ముందున్న ఇంటర్ కమ్ లో అడిగాడు స్లిప్పులతను.
కాసేపటి తర్వాత అవతలినుంచి వచ్చిన సమాధానం విని, " అయిపోయింది." అన్నాడు సీరియస్ గా.
"హమ్మయ్య!" మో.పొ.పొ.అతను పెద్దగా నిట్టూర్చాడు. సుబ్బారావు అదిరిపడి చుట్టూ చూశాడు.
"ఏంటి?" వింతగా చూశాడు మో.పొ.పొ.అతను. "ఇక్కడ పాము బుస పెట్టిన శబ్దం వినిపిస్తోంది. మీకువినిపించలేదూ..?" భయం భయంగా చూశాడు.
"ఓహ్! అదా! నేను మా ఆవిడ జాకెట్టు అయిపోయింది అనేసరికి పెద్దగా నిట్టూర్చాను కదా! ఆ శబ్దం మీకు అలావినిపించిందన్నమాట."వివరించాడు మో.పొ.పొ.అతను సుబ్బారావు స్లిప్ తీసుకుని.
"మల్లీ! ఎఫ్ ఫైవ్ టూ ఎయిట్ అయిందా?" సుబ్బారావు ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. స్లిప్పులతను ఇంటర్ కంపట్టుకుని అవతలి వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని నోటివెంట ‘అయిపోయింది, కాలేదు‘ ఈరెండు మాటలలో ఏ మాట వస్తుందో ? అని సుబ్బారావు ఎదురు చూస్తున్నాడు.
మో.పొ.పొ.అతను సుబ్బారావు కు వెళ్ళొస్తానని చెబుదామని సుబ్బారావు వైపు చూసి బిత్తరపోయాడు. అప్పటికేసుబ్బారావు కింద పడిపోయివున్నాడు.నీళ్ల బాటిల్ పట్టుకున్న అతను సుబ్బారావు ముఖం మీద నీళ్లు చల్లాడు.
"నువ్వు అంత సేపు విషయం చెప్పకుండా వుంటే ఎలాగయ్యా బాబూ! అతను ఊపిరి బిగబట్టి నీ వైపు చూసి, చూసిఊపిరి అందక క్రింద పడ్డాడు." స్లిప్పులతన్ని కోప్పడ్డాడు నీళ్ల బాటిల్ అతను.
సుబ్బారావు ముఖం మీద నీళ్లు పడగానే లేచి అయోమయంగా చూశాడు.
"జాకెట్టు రెడీ అయింది." స్లిప్పులతను సుబ్బారావు వైపు భయంగా చూస్తూ అన్నాడు.
బాటిల్ ని పట్టుకొని ఉన్న అతను చేతిలో నీళ్లు పోసుకుందామా? వద్దా? అన్నట్లు చూస్తున్నాడు.
సుబ్బారావుముఖం వైపు.
"హమ్మయ్య! హు..!" ఈసారి లేచి నిలుచున్న సుబ్బారావు గట్టిగా నిట్టూర్చాడు.
ప్రక్కనున్న అతని చేతిలోని నీళ్లు బాటిల్ దబ్బున కింద పడింది.
"ఈసారి ఏమైంది?" స్లిప్పులతను చిరాగ్గా చూశాడు.
సుబ్బారావు కూడా అర్థం కాక చూశాడు.
"ఏం మనిషి వయ్యా అంత గట్టిగా నిట్టూరుస్తారా ఎవరైనా? బాటిల్ క్రిందపడి నీళ్లన్నీ నేలపాలయ్యాయి కదా నీనిట్టూర్పుకు."
సుబ్బారావు ముక్కుకు చేయి అడ్డం పెట్టుకుంటూ మేనేజర్ ఇచ్చిన స్లిప్పు ఇవ్వబోయాడు.
"ఇదేంటి?" పెన్షన్ ఆఫీస్ లో గుమస్తాలా ముఖం చిట్లించాడు.
"మా మేనేజర్ భార్య జాకెట్ కూడా ఉందట. ఆ స్లిప్పు..!"
"అయితే ఆయన్నే రమ్మని చెప్పు పో!" ఆ మర్యాదకు బిత్తరపోతూ, ‘పర్లేదులే మరీ రేయ్ అనలేదు కదా!‘ అని మనసులోసంబరపడిపోయాడు.
"ఆయన నన్ను తీసుకురమ్మని పంపించారు." వినయంగా అన్నాడు.
"ఒక మనిషికి ఒకే స్లిప్పు." సీరియస్ గా అన్నాడు వేరే వాళ్ల స్లిప్ తీసుకుని ఇంటర్ కమ్ తన చేతిలోకి తీసుకుంటూ.
నీళ్ల బాటిల్ అతను "ఇలా ఇవ్వండి నేను ఇస్తాను." అన్నాడు.
"సరే, అయినా ఇన్ని రూల్స్ ఏమిటి?" అన్నాడు.
"రేయ్ మల్లీ! జి 809 అయిందా?"
మేనేజర్ భార్య స్లిప్, బాటిల్ అతను ఇవ్వగానే తీసుకొని, ఇంటర్కమ్ లో అడిగాడు.
సుబ్బారావు మరల ఊపిరి బిగబట్ట బోతూ ఇంతకుముందు జరిగింది గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. నీళ్ళ బాటిల్ అతనుబాటిల్ లో అడుగున ఉన్న నీళ్లను చేతిలోకి తీసుకుని సుబ్బారావు ముఖం వైపు చూశాడు.
"నేను ఊపిరి బిగబట్టనుగా?" కొంటెగా అన్నాడు సుబ్బారావు.
"కాలేదు." స్లిప్పులతను ఈ సారి పెద్దగా అరిచాడు.
‘మరలా రేపు రావాలా....?" సుబ్బారావు వెనక్కి పడిపోతుంటే మో.పొ.పొ.అతను పట్టుకున్నాడు. నీళ్ల బాటిల్ అతనుమిగిలిన కొద్ది నీటిని తన చేతిలోకి తీసుకున్నాడు సుబ్బారావు ముఖం మీద చల్లేందుకు.
*శుభం*