మాండవ పురాన్ని పరిపాలిస్తున్న వీరవర్మ మహారాజుకు ఇద్దరు మగ పిల్లలు. అందులో పెద్దవాడు రామ వర్మ పుట్టు గుడ్డి.రెండవ వాడు రాఘవ వర్మ చక్కగా ఉన్నాడు. మహా రాజు రామవర్మ గురించే చింత చేస్తున్నాడు.మహారాణి రత్న ప్రభ ఇద్దరిని సమంగా పెంచింది. రాఘవ వర్మ ను ఉద్దేశించి
" అన్నదమ్ములు ఎప్పుడూ విడిపోకూడదు,పగలు పెంచుకోకూడదు.రాజ్యం లోని ప్రజల సాధక బాధకాలను చూడాలి.మీరు సఖ్యతగా ఉండాలి.అన్నకు చూపు లేదని చిన్న చూపు చూడకు నాయన" అంది.
"ఛా.. అలాంటి దేమి ఉండదమ్మా. అన్నకు చూపు వస్తుంది " అని రాఘవ వర్మ చెబుతుంటే " నీ మాట ఫలిస్తే చాలు నాయన" అంది. రోజులు గడుస్తున్నాయి.పిల్లలిద్దరూ అన్ని విద్యలు నేర్చుకున్నారు.యుక్త వయస్సు వచ్చింది.వీరవర్మ గుడ్డి కుమారుడైన రామవర్మను ఎందరో వైద్యులకు చూపించాడు.ఎన్నో పసరులు, ఔషధాలు ద్వారా వైద్యం చేయించాడు.ఉహు అవి ఏవీ ఫలితాలు ఇవ్వలేదు. ఒక రోజు రాజ్యానికి సిద్ధమహర్షి వచ్చాడని ఆయన మాట నిజం అవుతుందని ,ఎన్నో రోగాలను కుదిర్చిన వాడని తెలిసింది రాజుకు. ఈ విషయం తెలిసి సిద్ధమహర్షికి కబురు పెట్టాడు. సిద్ధమహర్షిని సాదరంగా ఆహ్వానించాడు వీరవర్మ.
"పిల్లలకు కబురు పెట్టండి" అన్నాడు సిద్ధమహర్షి. " రామవర్మ,రఘువర్మ"అని పిలువగానే వినాయముగా చేతులు కట్టుకుని
వచ్చి నిలబడ్డారు.మహర్షికి పాదాభివందనం చేశారు. సిద్ధమహర్షి రామవర్మను పరీక్ష గా చూసి కళ్ళు మూసుకుని నోటి తో ఎదో జపిస్తున్నాడు.కాసేపటికి మహర్షి కళ్ళు తెరచి "రాజా! నీకుమారునికి చూపు వస్తుంది.ఇది వైద్యంతో నయం అయ్యేది కాదు.ఓ విచిత్ర పుష్పం తో నయం అవుతుంది" అన్నాడు.
రాజు ఆ మాటకు " విచిత్ర పుష్పమా! ఎక్కడవుంటుంది స్వామి?" అన్నాడు. సిద్ధమహర్షి ఇలా చెప్పాడు "రాజా! తూర్పు దిక్కున ఓ కొండ పైన శివాలయం ఉంది.ఆ శివాలయం ప్రక్కనే కోనేరు ఉంది.అందులో ఉంటుంది.చాలా మహిమాన్వితమైన పుష్పం.పౌర్ణమి రోజునే అది కోనేరు లోనుంచి బైటకు వస్తుంది.ఆ పుష్పాన్ని తీసుకు వచ్చి శివునికి జలాభిషేకం చేసి ,రాజ ప్రాసాదములోనే ఓ ప్రత్యేక మైన కొలను లో ఆ పుష్పాన్ని విడవాలి.తరువాత పౌర్ణమి రోజునే ఆ పుష్పాన్ని మీ కుమారుని కళ్ళకు తాకించాలి. అప్పుడే పూర్తి దృష్టి వస్తుంది. ఆ పుష్పం ఉన్న రాజ్యంలో సుఖశాంతులు ఉంటాయి.దుష్ట పీడలు ఉండవు"అని చెబుతూ "కానీ రాజా!" అంటూ ఆగాడు.
" చెప్పండి మహర్షి "అన్నాడు రాజు. మహర్షి గడ్డం దువ్వుకుంటూ రాజును ప్రక్కకు ఆహ్వానించాడు.మహర్షి ఇలా చెప్పాడు.
" రాజా! ఆ పుష్పం మీ ఇద్దరి కుమారుల మధ్య చిన్న పాటి ఘర్షణను తెస్తుంది" అన్నాడు. " స్వామి" అన్నాడు రాజు ఆందోళనగా.
"రాజా! విచారించకు నీ కుమారుడు రఘువర్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది.పుష్పం తెచ్చే వరకు నేను యోగ నిద్రలో నే ఉంటాను" అన్నాడు. "మహర్షి మీ ఆశీస్తులతో నేను ఆ పుష్పాన్ని తీసుకు వస్తాను.అన్నకు కంటి చూపు వస్తుంది అన్నాడు రాఘవవర్మ.
మహర్షి రాఘవవర్మ భుజం తడుతూ " భేష్ నీ సోదర ప్రేమ గొప్పది .రేపే బయలుదేరు" అన్నాడు. " చిత్తం స్వామి"అంటూ మహర్షికి పాదాభివందనం చేశాడు రఘువర్మ.
"విజయోస్తు" ఆశీర్వదించాడు మహర్షి.
వీరవర్మ ఆలోచనలో పడ్డాడు.పుష్పం ఇద్దరికి ఘర్షణ తెస్తుందా!ఏమిటి ఈ వైపరీత్యం అనుకున్నాడు. రఘువర్మ అన్నయ్య వైపు చూసి " అన్నయ్య చూపు లేదని నీవు బాధపడకు ఆ పుష్పం తీసుకు వస్తాను"అన్నాడు. "మంచిది సోదరా "అంటూ ఆలింగనం చేసుకున్నాడు రామవర్మ. ఆ సోదర ప్రేమకు సంతోషించింది రత్నప్రభ. ఇంతటి అనోన్య సోదరులకు ఘర్షణా!అర్థం కాలేదు వీరవర్మ కు.
**** *** *** ***
ఆ రోజు శివునికి పూజ చేసి నుదుట కుంకుమ తిలకం పెట్టి "వెళ్ళి రా నాయన" అంది రత్నప్రభ. తల్లిదండ్రులకు నమస్కరించి పయనం మైనాడు రాఘవవర్మ.
మాండవ పురంలో ఆ రాత్రి నడి ఝాములో ఓ సుందరి పిలుపు "రాజా" అంటూ మధురంగా పిలిచింది. "ఎవరు " అంటూ దిగ్గున లేచాడు రామవర్మ. ఓ కిల..కిలా నవ్వు వినిపించింది
"ఎవరు" అన్నాడు. తరువాత మౌనం.కొన్ని క్ష ణములు గడిచాయి. రామవర్మ ఏదో అనుకుని విశ్రమించాడు.ఇంతలో ఓ చల్లని స్పర్శ అతని కళ్ళకు తాకింది.వెంటనే ఆ చేయిని పట్టుకున్నాడు. ఆశ్చర్యం అతనికి చూపు వచ్చింది.ఎదురుగా అపురూప లావణ్య రాశి. తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. " నాకు చూపు వచ్చింది" అంటుంటే అది వారించింది ఆ సుందరి. " రాజా!అరవకు ఈ చూపు కాసేపే, మళ్ళీ నీకు చీకటే" అంది మధురంగా అతని మెడపై చేతులు ఉంచి. " రాజా "అంటూ రామవర్మ తల దువ్వుతూ " నేను అప్సరసను నిను కోరి వచ్చాను.ప్రతి రోజు ఇదే సమయానికి వస్తాను. నీతో కులాసాగా గడుపుతాను రా " అంటూ ఆలింగనం చేసుకుంది.ఆ ఆలింగనంలో కరిగి పోయాడు.సరిగ్గా తెల్ల వారే సమయానికి ఆమె మాయమైంది.రామవర్మను మళ్ళీ చీకటి ఆవరించింది.అలా మూడు,నాలుగు రోజులు సమయానికి రావడం,రామవర్మను శృంగారా కేళిలో ఓలలాడించడం జరిగి పోతోంది.
*** ***** ***** ****
రఘువర్మ శివాలయం పైకి చేరుకున్నాడు.ప్రక్కనే కోనేరు ఉంది.అయితే అది ఎండిపోయి ఉంది.ఈ కొనేరులో పుష్పమా! చూద్దాం.రేపే కదా పౌర్ణమి అనుకున్నాడు.
ఆ రోజు రాత్రి రామవర్మ ఆ సుందరి గాఢ కౌగిలిలో ఒదిగిపోయాడు. "రాజా"అంది.
"చెప్పు దేవి" అన్నాడు కళ్ళు మూసుకుని.
" నా మాట వింటావా" అంది
"నీ కోసం ఏమైనా చేస్తాను "అన్నాడు.
" రేపు పౌర్ణమి మీ తమ్ముడు రాఘవవర్మ ఆ పుష్పాన్ని తీసుకు వచ్చి నీ కళ్ళకు తాకిస్తాడు".
"నాకు చూపు వస్తుంది ఇక రోజంతా ఈ అందం నాదేగా"!అన్నాడు.
" కాదు నీవు మరణిస్తావు" అంది. ఆ మాటకు ఆమె కౌగిలిలో నుంచి విడి వడి " నిజమా!"అన్నాడు.
"అవును రాజా!నీ మరణమే అతనికి కావాలి .ఈ రాజ్యం నకు తనే రాజు కావాలనే కాంక్ష కలిగి ఉన్నాడు. నీతో ప్రేమతో మాట్లాడతాడు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుష్పాన్ని కళ్ళకు తాక నీయవద్దు. మళ్ళీ వస్తాను" అంటూ వెళ్ళింది.కటిక చీకటి అతన్ని ఆవరించింది.ఆలోచనలో పడ్డాడు రామవర్మ.తమ్ముడు ఇంతకు తెగించాడా!అనుకున్నాడు.
**** **** **** ****
నిండు పౌర్ణమి. వెన్నెల పగటిని తలపించేలా ఉంది.రఘువర్మ శివుడిని పూజించి కోనేరు ఒక్కో మెట్టు దిగాడు ఆశ్చర్యం కొద్దిగా నీరు వచ్చింది.మళ్ళీ ఇంకో మెట్టు దిగాడు.మరికొంత నీరు.అలా మెట్లు దిగుతుంటే నీళ్ళు వస్తున్నాయి.పూర్తి మెట్లు దిగాడు.నడుం లోతు వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయాయి.వెంటనే ఆ నీళ్ళల్లో నుంచి ఓ పుష్పం పైకి వచ్చింది.ఆనందం తో కళ్ళు మెరి శాయి. " జై శివ దేవా!"అని నమస్కరించి ఆ పుష్పాన్ని అందుకుని ఒక్కో మెట్టు ఎక్కి వస్తుంటే నీళ్ళు తరిగి పోతున్నాయి.కోనేటి పైకి వచ్చిన తర్వాత ఓ శిలా శాసనం అతన్ని ఆకర్షించింది.ఇలా చదువు కుంటున్నాడు.
" ఈ పుష్పం ప్రతి పౌర్ణమి రోజంతా విక సిస్తూనే ఉంటుంది.పౌర్ణమి రోజునే ఈ పుష్పాన్ని రోగులకు తాకిస్తే రోగాలు బాగవుతాయి.కళ్ళు లేని వారి కళ్ళకు తాకిస్తే కళ్ళు వస్తాయి.ఈ పుష్పం ఉన్న రాజ్యములో
కరువు ఉండదు.దుష్ట శక్తులు ఉండవు.ఇది ప్రతి రోజు పగలు విచ్చు కుంటుంది.రాత్రి ముడుచుకుంటుంది.అభిషేకించిన ప్రత్యేక జలం తోనే ఈ పుష్పాన్ని ఉంచాలి" అని రాసుంది.
****** ****** ***** ******
ఆ పౌర్ణమి రోజు నడి జాము లో ప్రత్యక్ష మైంది ఆమె.అడుగుల సవ్వడి చూసి " దేవి "
అన్నాడు. ఆమె రఘువర్మ కళ్ళను తాకింది.ఆ రోజు ధగ.. ధగ కాంతితో మెరిసిపోతోంది ఆమె.మేని వంపులతో ఆకర్షిస్తుంది.రెండు చేతులు చాచింది.ఆమె గాఢ పరిష్వ0గం లో ఒదిగిపోయాడు రామవర్మ. "దేవి" అంటున్నాడు మత్తుగా." నాకు చూపు శాశ్వతంగా ఇవ్వరాదు"అన్నాడు.
" అది నా చేతుల్లో లేదు రాజా!"అంది.
"ప్రతి రోజు రాత్రి నీ కోసం ఎదురు చూడటం ,ఈ రాత్రి ఇలా ఉంటేనే మేలు అనుకుంటున్నాను దేవి"అన్నాడు.
"నేనంటే అంత ఇష్టమా రాజా!"
"నాకీ లోకంలో నీవు తప్ప ఎవరూ లేరు" అన్నాడు.
" మరి నీ తమ్ముడు".
" వాడా!సోదర ద్రోహి" అన్నాడు కోపంగా.
" ఆ పుష్పాన్ని చేజిక్కించు కున్నాడు రాజా" అంది.
వెంటనే ఆమె కౌగిలిలో నుంచి బైట పడి "ఎలా
సాధ్యమైంది" అన్నాడు.
" దిగులు చెందకు నీకు ప్రమాదం లేదు.వచ్చే మాసం పౌర్ణమి రోజున నీ సోదరుడు పుష్పాన్ని నీ కళ్ళకు తా కించడానికి ముందు గానే నీవు ఆ పుష్పాన్ని నాకు ఇవ్వాలి".
"అదేలా సాధ్యం"అన్నాడు.
"ఆ పుష్పాన్ని మీ ప్రాంగణం లోనే ప్రత్యేకంగా ఓ కొలనులో అభిషేకించిన జలంతో
ఉంటుంది" అంది.
"ఇది నీ కెలా తెలుసు" అన్నాడు.
" పిచ్చి రాజా!"అని అతని మోముపై ముద్దు పెట్టి మాయ చేసింది." నీవు లేనిదే నేను లేను .ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుష్పాన్ని కళ్ళకు తాకనీయకు.నీవు మరణించ కూడదు.నీవు నా రాజువు" అని అతన్ని తన రొమ్ముకు ఆన్చుకుంది. " దేవి" అంటూ ఒదిగిపోయాడు.
******* ****** *****
పుష్పాన్ని తీసుకుని ముందుగా సిద్ధ మహర్షి దగ్గరకు వెళ్ళాడు రాఘవవర్మ. "స్వామి"అని పిలిచాడు.యోగ నిద్రలో కళ్ళు మూసుకుని ఉన్న మహర్షి రాఘవవర్మ పిలుపుతో కళ్ళు తెరిచాడు.ఎదురుగా చేతిలో పుష్పాన్ని పట్టుకుని రాఘవవర్మ కనిపించాడు. అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వి " కూర్చో" అంటూ ఆసనం చూపించాడు.పుష్పాన్ని మహర్షికి ఇచ్చి పాదాలకు నమస్కరించాడు.
"దీర్ఘాయువుతో జీవించు నాయన" ఆశీర్వదించాడు మహర్షి.
"రఘువర్మ నీకో విషయం చెప్పాలి" అంటూ చెవిలో ఎదో చెప్పాడు. అది వినగానే దిగ్భ్రాంతి చెందాడు రఘువ వర్మ "అలాగా"అన్నాడు. మహర్షి దగ్గర సెలవు తీసుకుని రాజ భవనం చేరుకున్నాడు.రాఘవవర్మ విచిత్ర పుష్పాన్ని తీసుకు వచ్చాడని రాజ్యము అంతా కోలాహలంగా ఉంది.రాజు,రాణి ఆనంద భరితులైనరు.రామవర్మకు ఈ విషయ తెలిసి కోపంతో ఊగి పోయాడు. "నన్ను చంపాలని వచ్చావా"!అనుకున్నాడు మనసులో.
******* ******** *******
పౌర్ణమి రాత్రి. శివునికి ప్రత్యేక పూజ
చేసి ,అర్చిన చేసి ,అభిషేకించిన జలంతో ప్రత్యేక కొలనులో ఆ పుష్పాన్ని వదిలారు రాజు,రాణి.రాఘవవర్మ వడి వడి గా ముందుకు వెళ్ళి పోయాడు.సరిగ్గా అదే సమయానికి రామవర్మ ప్రాసాదము లోకి వచ్చింది ఓ ఆకారం. " రాజా"! అంది. ఆ పిలుపు పరిచయం ఉండగా "దేవి వచ్చావా!"అన్నాడు. ఆమె రామవర్మ కన్నులు తాకింది."ఈరోజు తొందరగానే నా మీద దయ కలిగిందే"అన్నాడు.
"రాజా నీ మేలు కోరి చెబుతున్నాను .ఇక కాసేపటిలో నీ మరణం ఉంది.మీ తమ్ముడు నీ కళ్ళకు ఆ పుష్పాన్ని తాకించాలని చూస్తాడు.కాబట్టి ముందుగానే ఆ పుష్పాన్ని తీసుకు వచ్చి నాకు ఇవ్వు వెళ్ళు"అని అతని చెక్కిలిపై ముద్దాడింది.అదంతా వింటున్నాడు రాఘవవర్మ. రాత్రి వేళలో చూపు రావడమేమిటి?ఎవరీ మాయవి? అన్న మాయ మొహంలో ఉన్నాడు అనుకుని తన అన్న కంటే ముందుగా కొలనుచేరుకుని అక్కడ ఆ పుష్పాన్ని తీసుకుని దాని స్థానంలో మరో పుష్పాన్ని అక్కడ పెట్టి దాపుగా ఉండి చూస్తున్నాడు.అనుకున్నట్లుగా రామవర్మ వస్తున్నాడు.అన్నను పరీక్ష గా చూస్తున్నాడు రాఘవవర్మ. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం రాత్రి వేళలో చూపు రావడం, రామవర్మ మెల్లగా కొలనులోకి దిగి ఆ పుష్పాన్ని తీసుకుని అటు ఇటు చూసి తన ప్రాసాదం లోకి వెళ్ళాడు.వయ్యారంగా పానుపు పై పడుకుని అందాలు ఒలకపోస్తూ ఉంది."సుందరీ"అని పిలిచాడు.
ఆ పిలుపుకు ' వచ్చావా రాజా!' అని పైకి లేచింది.
"ఇదిగో పుష్పం" అన్నాడు అందిస్తూ.
" నా మంచి రాజా!"అంటూ ముద్దులతో ముంచింది. పుష్పం ఇస్తే వెళుతుందని కాసేపు పుష్పం ఇవ్వకుండా ఆట పట్టిస్తున్నాడు రామవర్మ.ఇద్దరూ నవ్వుతూ ఆటపాటలతో ఉన్నారు.
******* ******** ******
"రాఘవవర్మ.. రాఘవవర్మ" తండ్రి పిలుస్తున్నాడు.
"నాన్నగారు వస్తున్నా".
"త్వరగా రా నాయనా పౌర్ణమి పోక ముందే ఆ పుష్పాన్ని తీసుకుని అన్నగారి కళ్ళకు తాకించాలి" అన్నాడు.
"రా నాయన " అంది తల్లి.
"సిద్ధ మహర్షి వారికి కూడా కబురు పంపాను "
అన్నాడు రాజు.అనుకున్న సమయానికి సిద్ధమహర్షి వచ్చాడు.అందరూ కొలను దగ్గరకు వెళ్ళి పుష్పానికి నమస్కరించారు.రాఘవవర్మ పుష్పాన్ని అందుకుని వడి వడి గా రామవర్మ దగ్గరకు వెళుతున్నాడు.అతన్ని అనుసరించారు సిద్ధమహర్షి, రాజు,రాణి.
రామవర్మ పానుపు పై సరస సల్లాపాలతో నవ్వుతూ ఆమెను కౌగిలిలో బంధించాడు. పుష్పం మంచం కింద ఉంది. ఎవరో రావడం తో అటు చూసింది సుందరి.వెంటనే కళ్ళ పై చెయ్యి వేయగానే చీకటి అలుముకుంది.
రాఘవవర్మ ముందుకు అడుగు వేసి "మాయవి అగు"అనగానే ఆమె అదృశ్యమైంది. "దేవి..దేవి అంటున్నాడు రామవర్మ కళ్ళు నలుపుకుంటూ.దేవి అనే పిలుపు ఆశ్చర్యం కు గురి చేసింది రాజు,రాణిలకు.
"అన్నయ్య పుషాన్ని తెచ్చాను నీ కళ్ళకు తాకించుకో" అన్నాడు.
"ఆపు ద్రోహి,అది పుష్పం కాదు .మరణ
పుష్పం"అన్నాడు.
"ఆ పుష్పం నీకు ఎలా వచ్చింది?" నేను ..... ఆగాడు. తమ్ముడి చేతికి మరో పుష్పం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కాలేదు రామవర్మకు.
రాజు,రాణి అర్థం కాక అయోమయంలో వున్నారు.
"అన్నయ్య ఇది మహిమ గల పుష్పం.నీ కళ్ళకు అద్దుకో" అన్నాడు రాఘవవర్మ ముందుకు వస్తూ.
"వద్దు ఆ పుష్పాన్ని నా కళ్ళకు తాకించకు అది నా కళ్ళకు తాకితే నేను మరణిస్తాను"అన్నాడు. ఆ మాటకు అదిరిపడ్డారు రాజు,రాణి.
"అన్నయ్య " అంటూ ముందుకు వస్తున్నాడు తమ్ముడు.
"ద్రోహి అగు అక్కడే అన్నను చంపి రాజ్యం దక్కించు కోవాలనుకుంటున్నవా!"అన్నాడు కోపంగా.
"కాదు అన్నయ్య నేను ద్రోహిని కాను .నువ్వు మాయవి మొహంలో ఉన్నావు"అన్నాడు.
రాజు,రాణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మహర్షి వైపు చూశారు.మహర్షి తల ఆడిస్తూ ఇలా చెప్పాడు.
"రామవర్మా!గత కొన్ని రోజులుగా నీకు రాత్రి వేళల్లో మాత్రమే చూపును ఇచ్చి మొహావేశం లో నిన్ను పడవేసిన ఆ సుందరి రాక్షసి.నీకు నీ తమ్ముడికి తగవు పెట్టి మిమ్మలను చంపి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ,విచిత్ర పుష్పాన్ని సైతం దాని అధీనం లో ఉంచుకోవాలని దాని పన్నాగం.ఇది ముందే నేను మీ తమ్ముడికి చెప్పాను.నీ మంచం కింద ఉండేది నకిలీ పుష్పం. నీవు నమ్మకపోతే ఇప్పుడే ఆ రాక్షసిని నీ ముందర ప్రవేశ పెడతాను.అయితే ముందు నీవు ఆ పుష్పాన్ని కళ్ళకు అద్దుకో" అన్నాడు.రాఘవవర్మ వెంటనె ఆ పుష్పాన్ని అన్న కళ్ళకు తాకించాడు.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రామవర్మ.ఎదురుగా తల్లిదండ్రులు, సిద్ధమహర్షి. "అమ్మ..నాన్న "అంటూ ముందుకు వెళ్ళాడు.తల్లిదండ్రుల పా దాలకు ,మహర్షి పాదాలకు నమస్కరించాడు.
"తమ్ముడూ 'అంటూ ఆలింగనం చేసుకున్నాడు.
"నిన్ను రాత్రిళ్ళు మొహంలో పడేసిన ఆ రాక్షసిని చూస్తావా!"అన్నాడు సిద్ధమహర్షి.
"నేనే కాదు.నా లాగా ఎవరూ దాని వలపు వలలో చిక్కుకోరాదు.ప్రవేశ పెట్టండి మహర్షి"
అన్నాడు.
మహర్షి రాఘవవర్మ వైపు చూసి "రాఘవవర్మ ఆ పుష్పం లోని మూడు రెక్కలను మృదువుగా తాకు"అన్నాడు. రాఘవవర్మ మృదువుగా మూడు రెక్కలను చేతితో చిక్కు ఆ ప్రాంతంలో ఓ దట్టమైన పొగ కనిపించింది. "మాయవి" బైటకు రా"అన్నాడు మహర్షి. భయంకర ఆకారంతో గజ..గజ వణుకుతూ కనపడింది రాక్షసి.
"రాజా!ఇన్నాళ్ళు నీవు దీని వలపు లో చిక్కుకున్నావు.పుష్పం చేజిక్కించు కోవాలని ఇది ఎన్నో ప్రయత్నాలు చేసింది.మిమ్ములను వధించి రాక్షస రాజ్యాన్ని స్థాపించాలనుకుంది
అన్నదమ్ములకు తగవు పెట్టాలనుకుంది.చివరకు ఇలా పట్టుబడింది.
ఆ మాటలకు రామవర్మ తల దించుకున్నాడు.వెంటనే రాఘవవర్మ ఒర లో నుంచి ఖడ్గం తీసి రెప్పపాటులో ఆ రాక్షసి తల ఎగురగొట్టాడు. అప్పుడే తెలవారింది.
రామవర్మ రాక్షసి బంధం నుండి విముక్తు డైనందుకు రాజు,రాణి ఆనందించారు.
సిద్ధమహర్షి అన్న తమ్ములను పిలిచి "ఈ విచిత్ర పుష్పం ఈ రాజ్యంలో ఉన్నంత వరకు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.ఏ దుష్ట శక్తి ఈ రాజ్యం వైపు కన్నెత్తి చూడ లేదు.మహిమాన్వితమైన ఈ పుష్పాన్ని కొలనులోనే వదులు దాం రండి" అన్నాడు.
అందరూ కొలను దగ్గరకు చేరుకున్నారు. సిద్ధ మహర్షి శివ సోత్రాలు చదువు చుండగా కొలను లోకి పుష్పాన్ని వదిలారు రాజు,రాణి.
ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకున్నారు అన్నదమ్ములు.కొలను నీటిలో కదులుతూ ఉన్న ఆ పుష్పానికి అందరూ నమస్క రించారు.