ఒక ఊర్లో ఒక వస్తాదు ఉండేవాడు.తాను బలవంతుడ్ని అనే గర్వం అతనికి ఎక్కువగా ఉండేది. దానికి తోడు అతనికి ధనబలం కూడా ఎక్కువ ఉండటంతో అతనికి పొగరు విపరీతంగా ఉండేది.అతను ఊర్లో పెద్దలను గౌరవించేవాడు కాదు,బంధుమిత్రులను ఆదరించేవాడు కాదు.అతని గర్వాన్ని పోగొట్టే మొనగాడు ఉంటే బాగుణ్ణు అని ఊర్లో వారు అనుకునేవారు. ఒక రోజు ఊర్లో కుస్తీ పోటీలు పెట్టారు.కుస్తీ పోటీల్లో చాలా మందిని ఓడించాడు వస్తాదు.విజయ గర్వం బాగా తలకెక్కిన ఆ వస్తాదు,అకారణంగా ఒక పెద్దాయన మీద చెయ్యి చేసుకున్నాడు.ఊర్లో వారందరూ బాధ పడ్డారు. ఒక ముసలాయన వచ్చి వస్తాదుని మందలించాడు, వస్తాదు ముసలాయనపై మండిపడుతూ,నేను ఒక్క దెబ్బ వేశానంటే చచ్చిపోతావు అని హేళనగా మాటలాడాడు, నన్ను కొట్టడం నీ తరం కాదు,నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను కుస్తీ పోటీల్లో ఓడించు అని సవాలు విసిరాడు ముసలాయన,అందుకు వస్తాదు బిగ్గరగా నవ్వుతూ,నీతో కుస్తీ పోటీల్లో నేను ఓడిపోతే నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి నేను నా జీవితాంతం బానిసగా ఉంటాను అని బీరాలు పలికాడు. ముసలాయనకు వస్తాదుకు మధ్య కుస్తీ పోటీ మొదలయింది.ముసలాయ వస్తాదుని కావాలనే హేళన చేసాడు.వస్తాదు మండి పడి అతనిపై కాస్తా మట్టి విసిరాడు.ఇదే మంచి అదును అనుకొని ముసలాయన కుస్తీ మైదానం పక్కనున్న చీమల పుట్టను చెదరగొట్టి గుప్పెడు చీమలు తెచ్చి వస్తాదు మీద గుమ్మరించాడు. చీమలుకొన్ని వస్తాదు లోదుస్తుల్లోకి చేరి తమ ఇష్టానుసారంగా కాట్లు వేసి వస్తాదుకి నానా ఇబ్బందులు పెట్టాయి,వస్తాదు నేలమీద పడి దొర్లుతూ కిర్రోమొర్రో అంటుండగా ముసలాయన వస్తాదు గుండెలుమీద కూర్చున్నాడు,వస్తాదు ముసలాయనకు దండం పెట్టి తాను ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు.అప్పటి నుండి ముసలాయనకు కట్టు బానిసయ్యాడు.