డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సుందరం తనకి ఎదురుగా అమర్చి ఉన్న ఆహారపదార్థాలు చూసి ఎక్కడలేని నీరసానికి గురయ్యాడు. ప్లేట్లో సర్దిఉన్న జొన్న రొట్టెలు, రాగి జావ, పచ్చి కూర ముక్కలు చూసేసరికి అప్పటివరకూ ఉన్న ఆకలి ఎటో మాయమైపోయింది.
భార్యా పిల్లల ముందు మాత్రం రకరకాల వంటకాలు ఉన్నాయి. అవి చూసి నోరు ఊరిన సుందరం ఉండబట్టలేక, "నాకు కొంచెం మెంతివంకాయ కూర, ఆవకాయ వెయ్యకూడదూ!" అని అడిగాడు భార్య సుందరిని.
"ఇంకా నయం దుంపలు వేపుడు, కొబ్బరి చట్నీ కూడా వెయ్యమన్నారు కాదు." అందామె వ్యంగ్యంగా.
ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్ధంకాని, "అయితే అవికూడా వెయ్యు." అన్నాడు ఆశగా సుందరం.
"ఏమిటేమిటి, అవి కూడా వెయ్యాలా? ఎంత ఆశ! మతి ఉండే మాట్లాడుతున్నారా? మర్చిపోయారా మీ ఆరోగ్య పరిస్థితి? మీరిలా చిన్నపిల్లల్లా మారాం చేస్తే ఎలా? ఇవన్నీ మీరు తినకూడదని డాక్టర్ చిలక్కి చెప్పినట్లు చెప్పారు గుర్తులేదా మీకు? మీరు ఇప్పుడు కేవలం నేను పెట్టిన జొన్న రొట్టెలు, రాగి జావ, పచ్చి కూర ముక్కలు మాత్రమే తినాలి. అంతే, మరేం అడగకండి." నిర్మొహమ్మాటంగా చెప్పింది సుందరి.
"నాన్నా, మీ ఆరోగ్యం కోసం అమ్మ ఎంత తపిస్తున్నదో చూసారా! ఇక మీ పాత ఆహారపు అలవాట్లు మర్చిపోవాలి నాన్నా!" అన్నాడు కొడుకు సురేంద్ర.
తన మాట ఇక చెల్లదని గ్రహించాడు సుందరం. అతి కష్టంమీద వాటి మీదనుండి చూపు మరల్చుకొని దిగులుగా తనకిచ్చిన జొన్న రొట్టెలు తినడంలో నిమగ్నమైయ్యాడు. తినలేక తినలేక కష్టపడి తినసాగాడు తన ముందు ఉంచిన పదార్థాలు.
సుందరంకి రక్తపోటు, మధుమేహంతో పాటు కొలష్ట్రాలు కూడా ఉంది. ఈ మధ్యనే గుండెపోటు వచ్చి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. డాక్టర్ అతనికి, అతని భార్యకి తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు చెప్పాడు. ఆ డాక్టర్ చెప్పిన జాగ్రత్తలే కాకుండా సుందరి ఇంకా చాలా చోట్ల సామాజిక మాధ్యమాల్లో సేకరించిన సమాచారంబట్టి సుందరానికి భోజనం సమకూరుస్తోంది. రుచిపచీ లేని ఆ చప్పిడి తిండి తినలేక నానా బాధ పడుతున్నాడు పాపం సుందరం. ఏం చేసినా భార్య తనకి తినడానికి ఇష్టమైనవి పెట్టడంలేదు. డాక్టర్ చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటిస్తున్నది సుందరి. చేసేదేమీలేక అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాడు పాపం సుందరం.
మధ్యాహ్నం కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంకాలం ఏదో నల్లటి కషాయం లాంటి పానీయం ఇచ్చింది సుందరి. సామాజిక మాధ్యమాల్లో విని అలాంటి కషాయం చేయడం నేర్చుకొని సాయంకాలం వేళ భర్తకి ఇస్తోందామె. పాపం సుందరం నోరేమో కమ్మటి కాఫీ కోసం కాయకాచిపోయింది. అయినా చేసేదేమీ లేదు. ఏమైనా ఇంటే గయ్‌మని ఇంతెత్తు లేస్తుందామె. 'అంతా మీ ఆరోగ్యం కోసమే కదా!' అంటుంది ఏమైనా అంటే.
తనేమో చక్కగా రకరకాల చిరుతిళ్ళు తింటూ కాఫీ సేవిస్తుంది. ఆమె వైపు జాలిగా చూడటం తప్ప ఇంకేం చెయ్యలేడు సుందరం.
సోఫాలో విశ్రాంతిగా చేరబడ్డ సుందరం మనసు గతంలోకి పరుగులు తీసింది. నలభై ఏళ్ళ కిందటి మాట. అప్పుడే తను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. అందరిలానే ఏ పెద్ద నగరంలోనో, పట్టణంలోనో ఉద్యోగం చేసి బ్రహ్మచారి జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించిన సుందరంకి ఆశాభంగం కలిగింది. గిరిజన ప్రాంతంలో ఒక మారు మూల పల్లెటూళ్ళో ప్రభుత్వరంగ బ్యాంక్‌లో పోస్టింగ్ వచ్చింది సుందరంకి. ఆ గిరిజన గ్రామంలో సరైన వసతి, ఇతర సౌకర్యాలు కూడా లేవు. అలాగే ప్రయాణ సౌకర్యాలు కూడా. జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి, రావడానికి రోజుకి ఒక బస్సు మాత్రమే ఉండేది. అత్యవసర వస్తువులన్నీ ఆ జిల్లా కేంద్రం నుండే రావాలి. ఆ పల్లెటూరిలో కాయగూరలు మాత్రం ఏవో కొద్దిగా లభిస్తాయి, అంతకు మించి ఇంకేం దొరకవు. వెచ్చాలు కూడా బయట నుండి రావలసిందే. ఏ కారణంవల్లనైనా బస్సులు ఆగిపోతే ఇక అంతే సంగతులు. ఓసారి అలాగే ప్రతిపక్ష రాజకీయ పార్టీ నిర్వహించిన బంద్ వలన వరసగా మూడు నాలుగురోజులు పట్నం నుండి సరుకులు రాలేదు. బంద్ వలన దగ్గరున్న పట్నంలో ఉంటున్న మేనేజరు కూడా రాలేకపోయాడు. ఊళ్ళోఉన్న చిన్నచిన్న దుకాణాలు, హోటళ్ళు కూడా తెరవలేదు. ఓ చిన్న హోటల్లోనే భోజనం చేసేవాడు. సుందరం అప్పటికింకా స్వయంపాకం ప్రారంభించలేదు. సుందరంకి భోజనం ఓ సమస్య అయింది. అయితే అతని పరిస్థితి గ్రహించిన ఆ బ్యాంక్‌లో స్వీపర్‌గా పని చేస్తున్న అప్పన్న సుందరంని తన ఇంటికి పిల్చాడు. అతని ఇంటికి భోజనానికి వెళ్ళడానికి ముందు మనస్కరించలేదు సుందరం. అయితే ఆకలికి తట్టుకోలేక అప్పన్న ఇంటికి వెళ్ళక తప్పింది కాదు. అప్పన్న ఉండేది ఓ చిన్న పాకలో. అందులోనే అప్పన్న తన తల్లితండ్రులు, భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అప్పన్న పేదరికం ప్రతిబింబిస్తోంది ఆ ఇంట్లో. అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పన్న తన భార్యతో ఏదో చెప్పడంతో అమె సుందరకి కూడా కింద కూర్చోవడానికి నేలమీద ఓ చిన్న గుడ్డ ముక్క పరిచింది. అప్పన్న తనవాళ్ళనందర్నీ సుందరంకి పరిచయం చేసాడు. సుందరం చాలా బిడియపడుతూ వాళ్ళని పలకరించి కూర్చున్నాడు. అప్పుడు అప్పన్న భార్య అందరికీ తినడానికి ఆకులలో కొన్ని జొన్నరొట్టెలు, ఆకుదొన్నలలో ఏదో పదార్థం తెచ్చింది. అందరూ తినడానికి ఉద్యుక్తులవుతూంటే, ఆ పదార్థాలేమిటో తెలియక అయోమయంగా వాటివైపు చూస్తూ కూర్చున్నాడు సుందరం.
అప్పుడు సుందరం పరిస్థితి చూసిన అప్పన్న, "సార్! అది రాగి జావ. మేము రాగిజావ, జొన్న రొట్టిలే సాధారణంగా తింటాము. అవే మాలాంటి వారికి పరమాన్నం సార్! ఇంట్లో బియ్యం లేకపోవడం వల్ల మీరు తినే వరి అన్నం వండలేదు. రేపు ఎలాగోలా ఎక్కణ్ణుంచైనా తెచ్చి అన్నం వండగలం. ఇవాళకి ఎలాగోలా వీటితో సరిపెట్టుకొండి." చెప్పాడు సంకోచంగా.
"ఏం ఫర్వాలేదు అప్పన్నా! మీరందరూ తినగా లేంది నేను మాత్రం తినలేనా!" అన్నాడు బింకంగా సుందరం. మాటవరసకి, మొహమ్మాటానికి అలా అన్నాడే కాని అలవాటులేని ఆ జొన్నరొట్టెలు, రాగిజావ తినడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అవి కష్టపడి తిన్నతర్వాత, పాపం అప్పన్న, అతని కుటుంబ సభ్యులు అవి ఎలా తింటున్నారో అని మనసులో అనుకున్నాడు. పేదవారు అంతకుమించి ఇంకేం తినగలరు పాపం అనుకున్నాడు సానుభూతిగా. అయితే అక్కడ గిరిజనులకి అవే ముఖ్యమైన అహారం అని ఆ తర్వాత తెలుసుకున్నాడు సుందరం. రెండురోజుల తర్వాత మళ్ళీ బళ్ళు నడిచాయి. హోటళ్ళు కూడా తెరవడంతో సుందరం స్థిమిత పడ్డాడు. అయితే ఆ తర్వాత హోటళ్ళపై ఆధారపడకుండా స్వంతంగా వండుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అప్పన్న ఇంట్లో తిన్న జొన్న రొట్టెలు, రాగి జావ గురించి మాత్రం ఇప్పటివరకూ మరిచిపోలేదు సుందరం. ఆ ఊరినుండి నాలుగేళ్ళ తరవాత బదిలి అయి మరో ఊరికి వెళ్ళినా అక్కడి అనుభవాలు సుందరం మదిలో అలానే నిక్షిప్తమై ఉండిపోయాయి.
ఉద్యోగంలో క్రమంగా పైకెదిగి సకాలంలో పదోన్నతులు సాధించి ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసాడు సుందరం. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల చివరికి తను ఆ రోజు గిరిజన గ్రామంలో తిన్న తిండే ఇప్పుడు తినవలసి వస్తోందని గ్రహించి మనసులోనే విరక్తిగా నవ్వుకున్నాడు సుందరం. అప్పుడది పేదవారి భోజనమని భావించాడు కాని, ఇప్పుడు అదే తినక తప్పడంలేదు తనకు. తను ఆర్థికంగా ఇప్పుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అవే తినక తప్పడంలేదు తనకు. ఆరోగ్య పరిరక్షణకు ఇవాళారేపూ చాలామంది అవే భోజనంగా స్వీకరిస్తున్నారని గుర్తొచ్చి కొద్దిగా సమాధాన పడ్డాడు.
గతంలో జరిగిన ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకొని నిర్లిప్తంగా తనలోతాను నవ్వుకున్నాడు సుందరం.
"ఏమిటండీ మీలో మీరే నవ్వుకుంటున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటింది. లేవండి భోజనానికి!" అన్న శ్రీమతి మాటలు వినిపించి ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చాడు.
తనకి పెట్టబోయే భోజనం తలచుకుంటూ విరక్తిగా నవ్వుకొని భోజనానికి లేచాడు పాపం సుందరం.