గురుప్రీత్ సింగ్ - యు.విజయశేఖర రెడ్డి

gurupreet singh

మా అబ్బాయి,కోడలు అమెరికాలో ఉంటున్నారు. మా కోడలు వాళ్ల చెల్లెలు పెళ్లికని ఇండియా వచ్చింది. మా వాడికి రావడం కుదరలేదు.

ఈ లోగా మవాడికి నేధర్లాండ్, ఫిలిప్స్ కంపెనీలో సైంటిస్టుగా ఉంద్యోగం వచ్చింది. వీసా ప్రాసెస్ అంతా కంపెనీ వాళ్లు చేయడంతో మావాడికి అక్కడకు వెళ్ళడం సులువయ్యింది. డిపెండెంట్ అయిన మా కోడలికి మా వాడు వీసా ప్రాసెస్ అంతా ఆన్ లైన్లో చేసి పంపాడు.

మా కోడలు,చెల్లెలు పెళ్లి అయిన తరువాత నేను,నా శ్రీమతి,కోడలుతో ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లాము.

ఫ్లైట్ దిగిన తరువాత మా లగేజి తీసుకొని బయటకు వచ్చి లాడ్జ్ వెళ్లడానికి క్యాబ్ కోసం చూశాము. క్యాబ్అయితే అర గంట సమయం పడుతుందని ఆటో‌లో వెళదామని ఒక ఆటో అతణ్ణి అడిగాను మహిపాల్పుర్‌కు ఎంత తీసుకుంటావని. అతను వంద రూపాయలన్నాడు.

సరేనని ఆటో ఎక్కి మహిపాల్పుర్ లోని లాడ్జ్‌లో దిగాము. లాడ్జ్ ముందుగానే ఆన్ లైన్లో బుక్ చేసుకున్నాము.

“నా పేరు గురుప్రీత్ సింగ్ సార్! అని అతని విజిటింగ్ కార్డ్ ఇచ్చి అవసరమైతే పిలవమన్నాడు.

మూగ్గురమూ ఫ్రెష్ అప్ అయ్యాక రూంలో మెను చూసి రోటీస్, కర్రీస్ తెప్పించుకొని తిన్నాము.

మా కోడలు వీసా ఇంటర్వ్యూ మరుసటిరోజు ఉంది. నేధర్లాండ్ వీసా ఆఫీస్ చాణక్యపురిలో ఉంది. కాసేపు పడుకొని తరువాత వెళదామని నిర్ణయించుకున్నాము.

3.30 నిముషాలకు ఆటో అతనికి ఫోన్ చేశాను. 4.00 గంటలకల్లా రాగలవా అని. ఇదే ఏరియాలోనే ఉన్నాను మీరు రెడీ అయ్యి నాలుగు గంటలకల్లా లాడ్జ్ బయట ఉండండి అన్నాడు.

మేము తయారయ్యి లాడ్జ్ బయట నిలబడ్డాము.

ఆటో ఎక్కి ఎక్కడికి పోవాలో చెప్పాను.

అర గంటలో వీసా ఆఫీస్ చేరుకున్నాము. అక్కడ అన్ని వివరాలు తెలుసుకున్నాక ఇండియా గేట్ దగ్గరలోనే ఉందా అని సింగ్‌ను అడిగాను. పది కిలోమీటర్లు ఉంటుందని అక్కడ నుండి పార్లమెంట్ భవన్ కూడా దగ్గరవుతుందని చెప్పాడు. మేము వెళదామని నిశ్చయించుకొని ఆటో పోనియ్యమన్నాము.

ఇండియా గేట్‌‌కు కొద్ది దూరంలో రోడ్ పైన ఆటో ఆపి నేను పార్కింగ్ వద్ద ఉంటాను మీరు ఇక్కడకు వచ్చి ఫోన్ చేస్తే వస్తాను అన్నాడు అతను.

ఇండియా గేట్ వీర జవాన్ల జ్ఞాపకార్థం కట్టిన అద్బుతమైన కట్టడం. మేము కూడా వీర జవాన్లకు బయట చుట్టూ కట్టిన ఇనుప కంచె నుండే నివాళులు అర్పించాము.

తరువాత ఆ చుట్టుపక్కల తిరిగి ఫోటోస్ తీసుకున్నాము. పర్యాటకులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. అక్కడ సుమారు గంటన్నర పాటు గడిపాము.

అక్కడ నుండి రోడ్ పైకి వచ్చి ఫోన్ చేయగానే సింగ్ వచ్చాడు. ఆటోను పార్లమెంట్ వైపు పోనిచ్చాడు.

ఆటో కొద్ది దూరంలో ఆగింది. లోపలకు అనుమతి లేదు కాబట్టి బయటనుండే చూడగలిగాము.

“సార్! కొద్ది దూరంలో మంచి హిందూ టెంపుల్ ఉంది” అన్నాడు సింగ్.

సరేనన్నాను. ఆర్.కె.పురంలో ఉన్న కార్తికేయస్వామి గుడికి తీసుకెళ్లాడు. తమిళులు కట్టిన చక్కటి ఆలయం అది ఎత్తైన ప్రదేశంలో ఉంది. స్వామివారిని దర్శించుకున్న తరువాత తిన్నగా లాడ్జ్‌కి పోనియ్యమన్నాను.

లాడ్జ్ చేరుకునేసరికి రాత్రి 8.30 నిముషాలయ్యింది.

మా వాళ్లను రూంకు పంపించాక ఆటో చార్జ్ ఎంతయ్యిందన్నాను.

“రూ. 1400-00 సార్! అన్నాడు.

నాకు ఒక్కసారే మతిపోయింది “అదేంటి చాలా ఎక్కువ చెబుతున్నావు” అన్నాను.

“నాలుగున్నర గంటలు మీ కోసమే తిరిగాను... అంతా కలిపి అరవై కిలోమీటర్ల పైనే వచ్చింది” అన్నాడు.

“తగ్గించుకో సింగ్!” అన్నాను.

“మీరు డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు నేను కరెక్టుగానే చెప్పాను సార్!” అన్నాడు.

ముందుగా డబ్బు విషయం మాట్లాడక పోవడం నేను చేసిన పెద్ద తప్పు అని చేసేదిలేక అతను అడిగిన డబ్బు ఇచ్చి రూంకు వచ్చాను.

విషయం అడిగి తెలుసుకున్న మా ఆవిడ ప్రొద్దున వంద రూపాయలకే వచ్చి నిజాయితీ పరుడనిపించుకొని భలే మోసం చేశాడు అంది.

“ఢిల్లీ అంటే అంతే అత్తయ్యా! మోసాలు బాగా చేస్తారని చాలా మంది చెప్పారు” అంది కోడలు.

ముగ్గురం కాసేపు బాధ పడ్డాము. బయటకు వెళ్లే ఓపిక లేక మళ్లీ రూంకే ఆర్డరిచ్చి తెప్పించుకొని తిన్నాము.

మరుసటి రోజు ఉదయం రిసిప్సన్ లో నిన్న జరిగింది చెప్పాను. మీరు డబ్బు ఎక్కువ ఇచ్చారు సార్! వెయ్యికి మించి అవ్వదు అన్నారు వాళ్లు. వాళ్ల ఏ.సి. కారు అయితే ఎనిమిది గంటలు, 80 కిలోమీటర్ల వరకు రూ.1600-00 అవుతుందని చెప్పారు.

టిఫిన్ తిని రెడీ అయి వేరే ఆటోను ముందుగానే మాట్లాడుకొని వీసా ఆఫీసుకు వెళ్లాము. మా కోడలు అక్కడ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇచ్చాక వాళ్లు టోకెన్ ఇచ్చి కూర్చోమన్నారు.

ముగ్గురం ఒక చోట కూర్చున్నాము. వీసా ఏమవుతుందోనని నా శ్రీమతికి కాస్త కంగారుగా ఉంది.

“డిపెండెంట్‌గా వెళుతున్నాను కాబట్టి ఏమీ కాదు అత్తయ్యా!” అని ధైర్యం చెప్పింది.

కాసేపటికి మా కొడలి టోకెన్ నెంబర్ వచ్చింది. సుమారు గంట తరువాత చిరునవ్వుతో మా వద్దకు వచ్చింది. వీసా అయిపోయిందని పాస్ పోర్ట్ రేపు మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్య వచ్చి తీసుకోవచ్చని స్టాంప్ వేసిన పేపర్ చూపించింది.

వీసా అయిపోయిందన్న సంతోషంతో ఆటోలో లాడ్జ్ చేరుకొన్నాము.

మా రిటర్న్ జర్నీ మరుసటి రోజు రాత్రి పదిగంటలకు ఫ్లైటెలో.

మన లాడ్జ్ వాళ్లు చెప్పిన ప్యాకేజీ బాగుంది రేపు లోకల్ ట్రిప్ చూసుకొని మూడున్నరకల్లా వీసా ఆఫీసుకు వెళ్లి పాస్ పోర్ట్ కలెక్ట్ చేసుకుందాము అన్నాను. మా వాళ్లు సరేనన్నారు.

రేపు ఉదయం ఏడు గంటలకల్లా లోకల్ ట్రిప్ వెళతాము అని లాడ్జ్ వాళ్లకు చెప్పి రూ. 1600-00 ప్యాకేజ్ మాట్లాడుకొని లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్, స్వామినారాయణ్ టెంపుల్, రెడ్ ఫోర్ట్‌తో పాటు వీసా ఆఫీసు కవర్ చేయాలని చెప్పాను. వాళ్లు క్యాబ్ బుక్ చేశారు.

మేము ఆ రోజు ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి రిసెప్షన్ లో కూర్చున్నాము. క్యాబ్ 7.30 నిముషాలకు వచ్చింది.

ముందుగా కుతుబ్ మినార్ చేరుకున్నాము. డ్రైవరు క్యాబ్ పార్కింగ్ లో పెట్టుకున్నాడు. నేను వెళ్ళి ఎంట్రీ టికెట్ తెచ్చేలోగా నా సెల్ మ్రోగింది ఆ నెంబర్ చూడగానే నాకు చిర్రెత్తుకొచ్చింది. అది సింగ్ ది, ఏంటి విషయం అని అడిగాను.

“సార్! చాలా ముఖ్యమైన విషయం మిమ్ములను కలవాలి” అన్నాడు.

“మేము బయట ఉన్నాము వచ్చేసరికి సాయంత్రం ఐదు పైనే అవుతుంది” అన్నాను.

“అలాగే సార్! అప్పుడే కలుస్తాను” అన్నాడు.

“ఆ సింగ్‌‌కు మనతో ఏంపనో?” అంది శ్రీమతి.

“ఏమో తెలియదు... హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం పదండి” అని లోపలకు వెళ్లాము.

దాని తరువాత లోటస్ టెంపుల్, స్వామినారాయణ్ టెంపుల్, రెడ్ ఫోర్ట్ చూసుకొని చివరగా వీసా ఆఫీసుకు వెళ్లి పాస్ పోర్ట్ కలెక్ట్ చేసుకుని లాడ్జ్ కు బయలుదేరము. అన్ని కట్టడాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కానీ ఢిల్లీలో వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువ. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా నియంత్రణ బాగుంది.

లాడ్జ్ చేరుకునే సరికి సాయంత్రం ఐదు పైనే అయ్యింది. సింగ్ మా కోసమే లాడ్జ్ రిసెప్షన్ లో ఎదురుచూస్తున్నాడు. ఏంటని అడిగాను.

“సార్! మొన్న రాత్రి ఆటోలో మీరు తిరిగిన తరువాత తిన్నగా మా ఇంటికే వెళ్ళాను. ఉదయం ఆటోను శుభ్రం చేస్తుండగా వెనుక సీట్లో కాళ్లు పెట్టుకునే చోట ఒక మూలాన ఈ ఉంగరం దొరికింది మీ దేనేమో చూడండి” అని ఇచ్చాడు.

అది డైమండ్ రింగ్ దాని మీద మణి అని ఉంది అది మా కోడలుదే మేము ఎంగేజ్ మెంట్‌‌కు పెట్టాము. అయ్యో! అని అప్పుడు వేలు చూసుకుంది మా కోడలు.

“ఎప్పుడు పడిపోయిందో.. ఈ రోజుకు మూడు రోజులవుతోంది వేలికి ఉన్న ఉంగరం పోయిందన్న ద్యాస కూడా లేకపోతే ఎలాగ అమ్మాయ్యి ” అంది నా శ్రీమతి.

“కొద్దిగా లూజుగా ఉండడంవల్ల జారిపోయి ఉంటుంది నన్ను క్షమించడి అతయ్యా!”

“వీసా టెన్షన్లో చూసుకొని ఉండదులే” అని సర్ది చెప్పాను.

దాని ఖరీదు రూ.60,000-00 పైనే అయ్యింది.

“సార్! అది ఎవరి కంట్లోనూ పడలేదు.. మీ సొమ్ము గట్టిది”

“అవును ఇది మాదేనని ఎలా అనుకున్నావు”

“నిన్న అంతా మా చుట్టాల పెళ్లికి వెళ్లాము వచ్చే సరికి రాత్రి పదకొండు గంటలు దాటింది... ఈ రోజు కూరగాయల బస్తాలు దింపాను.మీ తరువాత ఎవ్వరూ ఎక్కలేదు” అని చెప్పాడు.

నేను ఆ ఆనందంలో రెండు వేల రూపాయలను తీసి ఇవ్వబోయాను.

“వద్దు సార్! ఇప్పటికే మీరు నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు” అని నవ్వుతూ వెళ్లిపోయాడు.

అతనికి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోవడం నాకు బాధ అనిపించింది.

ఆటోకు రూ. 1400-00 కారుకు రూ.1600-00 . అతనికి డబ్బు ఎక్కువ ఇచ్చానన్న భావనను నా మనసులో నుండి ఆ క్షణమే తొలగించాను. ఎందుకంటే అతను నిజాయితీపరుడు లేకపోతే డైమండ్ రింగ్ తిరిగి ఎలా తెచ్చి ఇస్తాడు.

గురుప్రీత్ సింగ్‌కు నా మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను.

******

యు.విజయశేఖర రెడ్డి

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.