కొత్త కోడలు - యు.విజయశేఖర రెడ్డి

New cousins

పాతిక సంవత్సరాలు పై బడుతున్నాయని మా ఏకైక పుత్ర రత్నానికి వివాహం చేశాము. మా అబ్బాయి రవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లికని నెల రోజుల సెలవు మీద వచ్చాడు.

పెళ్లి కడపలోను రిసెప్సన్ హైదరాబాద్‌లో చేశాము. చుట్టాలు పక్కాలు ఎక్కడివాళ్లు అక్కడకు వెళ్ళి పోయారు.

మాది త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ సొంతమే. కొడుకు కోడలికీ ఏ పనులు పురమాయించవద్దని నేను మా ఆవిడ నిర్ణయించుకున్నాము. ఇల్లు చిమ్మడానికీ తడి గుడ్డ పెట్టి తుడవడానికి మాత్రమే పనిమనిషిని పెట్టుకున్నాము. అంట్లు సరిగా తోమదని ఆ పనికి పెట్టుకోలేదు గుడ్డలు వాషింగ్ మెషిన్‌లో వేస్తుంది.

ఒక రోజు కోడలు స్వప్న బాత్ రూమ్‌లో బ్రేష్ చేసి రాగానే సుశీల టూత్ పేస్ట్ కోసం వెళ్లింది. బయటకు వచ్చి అష్టవక్రంగా ఉన్న టూత్ పేస్ట్ ట్యూబ్‌‌ను చూపించింది.దానిని నేను సరి చేశాను.

అందరం టీ తాగిన తరువాత స్వప్న స్నానానికి వెళ్లింది.కాసేపటికి బాత్రూంలో నుండి ఒక్కటే శబ్దాలు బయటకు వినబడ సాగాయి మగ్గు కింద పపడిన శబ్ధం సబ్బు పెట్టె పడిన చప్పుడు.

“ఏమండీ కోడలు స్నానానికి వెళ్ళిందా యుద్ధానికా?” అంది సుశీల గొంతు చించుకుని.

“మెల్లగా...రవి బయటకు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నీవు అన్నది వింటే నొచ్చుకునే వాడు” అన్నాను.

స్వప్న మళ్ళీ రాత్రి బ్రష్ చేసింది అప్పుడు కూడా టూత్ పేస్ట్ పరిస్తితి అష్టావక్రమే అయ్యింది.

రాత్రి పడుకున్నాక సుశీల ముఖ కవళికలు గమనించాను.

“సుశీ! నువ్వు అలా ఉండడం నాకు నచ్చదు”

“స్వప్నకు ఎలా నేర్పాలండీ?”

“పోనీ లేవే! కొత్త అమ్మాయి నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది” పడుకో అన్నాను.

తెల్లరింది “అత్తగారు నేను ఉన్న నాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని పనులైనా నేర్చుకుంటాను” అంది స్వప్న.

అలాగే అంది సుశీల. ఆ పూట భోజనాలయ్యాక స్వప్న వంటింట్లో షింక్ దగ్గర అంట్లన్నీ ఎంతో శుభ్రంగా తోమింది. తోమిన వాటిని బాల్కనీలో గిన్నెల స్టాండ్లో చక్కగా పెట్టింది.

ఆటో మేటిక్ వాషింగ్ మెషిన్‌లో గుడ్డలు వేసి నీళ్ళు పట్టి తగినంత వాషింగ్ పౌడర్ వేసింది. గుడ్డల పని కూడా చక్కగా చేసింది.

రాత్రి మేము పడుకున్న తరువాత “సుశీ! నువ్వు ఏ పూటైన అంట్ల గిన్నెలు చప్పుడు కాకుండా తోమావా? స్వప్న చూడు గుండు సూది పడినంత చప్పుడైనా కాకుండా ఎలా వాటిని శుభ్రం చేసి ఆరబెట్టిందో?” అన్నాను.

“అవునండీ నాకు అదే అర్ధం కావడం లేదు గిన్నెలు సరే గుడ్డలు కూడా చక్కగా ఆరేసింది ఆరిన వాటిని చక్కగా మడత పెట్టింది”

“కొన్ని విషయాలు తనే చూసి నేర్చుకుంటుంది” అన్నాను.

మరుసటి రోజు స్వప్న బ్రష్ వేసింది టూత్ పేస్ట్ ఏ మాత్రం వంకరాలు లేకుండా చక్కగా ఉంది అది చూసి సుశీల ముఖం ఆనందంతో వెలిగి పోయింది. తరువాత స్వప్న స్నానానికి వెళ్లింది బాత్ రూంలో నుండి బయటకు ఎలాంటీ శబ్దాలు వినబడ లేదు.

“స్వప్నా! నిన్ను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలి” అంది సుశీల.

“అదేంటి అత్తగారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది”

“అవునమ్మా! మీ అత్తగారు చప్పుడు చేయకుండా గిన్నెలు తోమింది నేను రెటైర్ అయ్యింది మొదలు ఏనాడూ చూడలేదు”

“ఊరుకోండీ! కోడలి ముందు మరీ నన్ను ఆటపట్టిస్తున్నారు”

“అవును నాన్న! అమ్మ ముందు కోడలిని ఎక్కువగా పొగడకండీ!” అన్నాడు రవి.

“అంతేలెండీ! మీరంతా ఒక్కటే నేనే పరాయి దానిని” అంది స్వప్న మూతి ముడుచుకొని.

“లేదు స్వప్న మీ మామయ్యను చేసుకుని కోడలిగా పల్లెటూరు నుండి సరాసరి పట్నంలో అడుగు పెట్టిన కొత్తలో నాకు టీ పెట్టడం కూడా రాలేదు... అత్తగారు మామయ్యగారు ఊరులోనే ఉండడం వల్ల నేర్పేవారు లేక అన్నీ మీ మామగారే నేర్పించారు”

“అదిగో సుశీ! కొత్త కోడలికి పాత విషయాలు చెప్పి నన్ను చిన్న బుచ్చుతున్నావు” అన్నాను.

రవి,స్వప్న,సుశీల హాయిగా నవ్వుకున్నారు నేనూ శృతి కలిపాను.

మరో వారంలో రవి స్వప్న అమెరికా వెళ్ళిపోయారు. మంచి కోడలు దొరికిందండీ... రవిని బాగా చూసుకుంటుంది అంది సుశీల.

నువ్వు నన్ను చూసుకున్నట్లే అన్నాను నవ్వుతూ. తనూ ముసిమిసిగా నవ్వింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.