నిజం - పద్మావతి దివాకర్ల

True

అభయ్ పెళ్ళికుదిరింది. ప్రేమించిన అమ్మాయి అర్చితతో అభయ్ వివాహం జరిపించడానికి ఇరుపక్షాల పెద్దలు సుముఖులవడంతో వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. అభయ్, అర్చిత ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళిద్దరిమధ్య చిగురించిన ప్రేమ పెళ్ళి వరకూ దారితీసింది. పెళ్ళిపనులు జోరందుకున్నాయి. ఇద్దరు కలసి పెళ్ళికి కావలసిన వస్తువులు షాపింగ్ చేస్తున్నారు. పెళ్ళిపనులవల్ల ఎవరికీ క్షణం తీరికలేదు. శుభలేఖలు ఎంపిక చేయడం, వాటిని అచ్చువేయడానికి ఇవ్వడం కూడా జరిగిపోయాయి.

అభయ్ అంటే శారద, శేఖర్ దంపతులకి అవ్యాజ్యమైన ప్రేమ. అతని మీదే తమ పంచప్రాణాలు పెట్టి బతుకుతున్నారు ఆ దంపతులు. అందుకే ఎప్పుడైతే అభయ్ అర్చితని ఇష్టపడుతున్నానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పాడో వాళ్ళు అతని కోరిక వెంటనే మన్నించారు ఆమె తమ కులం కాకపోయినా. అయినా ఆ దంపతులకి కులం పట్టింపు ఏ మాత్రం లేదు. వాళ్ళ ప్రేమకి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. అభయ్‌కి అర్చిత సరైన ఈడు జోడు అని అభిప్రాయం వాళ్ళది. అర్చిత చాలా మంచి, అణుకువగల అమ్మాయి అని మొదటి చూపులోనే గ్రహించారు వాళ్ళు. అర్చితని తమ కోడలుగా స్వీకరించడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించారు.

పెళ్ళి ఇంక నెలరోజులుందనగా అభయ్ తల్లి శారద అభయ్‌ని పిల్చి, "అభయ్! మన ఊరికి వెళ్ళి పెద్దతాతగారిని ఒకసారి కలిసి అతని ఆశీర్వాదం తీసుకో! నిన్ను చూసి చాలా కాలమైందని కబురు పెట్టారు. నీకు తెలుసు కదా. అతను పక్షవాతంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. నిన్ను చూసి అతను చాలా సంతోషిస్తారు. మళ్ళీ పెళ్ళైనతర్వాత అర్చితతో కలసి మనమందరం అక్కడికి వెళ్దాం." అందామె. తల్లి మాటలు విని మౌనంగా తల ఉపాడు అభయ్, తనకి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా.

"అలాగైతే రేపు శనివారం. రేపే బయలుదేరు. రేపు, ఎల్లుండి ఆదివారం అక్కడే గడిపిరా, పెద్ద తాతగారు నిన్ను చూసి చాలా సంతోషిస్తారు." అందామె తిరిగి.

ఆమె మాట తీసెయ్యలేక ఆ మరుసటి రోజు కారు తీసుకొని బయలుదేరాడు అభయ్ పెద్ద తాతగారు ఉండే ఊరికి. ఆ ఊరు తాముండే పట్టణానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. తన తాతగారూ, పెద్ద తాతగారు కూడా అదే ఊళ్ళో ఉమ్మడిగా ఒకే కుటుంబంలో ఉంటున్నారు. దాదాపు పదేళ్ళక్రితం తన తాతగారు చనిపోయినప్పుడు ఆ పళ్ళెటూరు వెళ్ళిన అభయ్ ఇప్పటివరకూ మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగుపెట్టనేలేదు. అతను మళ్ళీ ఆ ఊరికి వెళ్ళకపోవడానికి బలమైన కారణమే ఉంది.

శారద, శేఖర్ మధ్యమధ్య వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్తూన్నప్పుడు అభయ్‌ని కూడా రమ్మని పిలిస్తే, ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడు. అలాగని అభయ్‌కి పల్లెటూర్లంటే ఇష్టం లేదని కాదు. నిజానికి పల్లె వాతావరణం, పచ్చని పైర్లు, కల్మషం లేని ఆత్మీయతలు, అనురాగాలు, చెరువుగట్లు, గలగలపారే సెలయేరులాంటివంటే అభయ్‌కి చాలా చాలా ఇష్టం. అయితే తాతగారు ఊరంటే కన్నా పెద్దతాతగారంటే ఇష్టం లేకపోవడమే దానికి ప్రధాన కారణం కూడా. పైగా చాలా ఏళ్ళుగా అతనిమీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు అభయ్.

కారు నడుపుతున్న అభయ్‌మదిలో బోలెడన్ని ఆలోచనలు, గత స్మృతులు సుడులు తిరుగుతున్నాయి. తను చిన్నప్పుడు తాతగారింటికి వెళ్ళినప్పుటి సంగతి గుర్తుకు వచ్చింది. అప్పుడు తన వయసు సరిగ్గా పన్నెండేళ్ళు.

శారద తండ్రి మాధవరావు, పరంధామయ్య అన్నదమ్ములిద్దరిదీ ఉమ్మడి కుటుంబం. వాళ్ళిద్దరికీ కలిపి పాతిక ఎకరాల పొలం, ఓ పది ఎకరాల కొబ్బరి తోట ఉండేవి. మాధవరావుకి శారద ఒక్కర్తే కూతురు, అయితే ఆమె పెద్దనాన్న పరంధామయ్యకి ఇద్దరు కొడుకులు. అందర్లోకి శారద ఒక్కర్తే అమ్మాయి అవడంవల్ల ఆమె పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. ఆ ఇద్దరు అన్నదమ్ములకీ శారద ముద్దుల చెల్లెలు. అలాగే మేనల్లుడు అభయ్ అన్నా కూడా వాళ్ళందరికీ చాలా గారాబం. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా చెరువు గట్లమ్మట తిరగడం, కొబ్బరి తోటలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అభయ్‌కి. తన కన్న పెద్దవాళ్ళైన మావయ్య పిల్లలతో వెళ్ళి చెరువులో ఈత కొట్టేవాడు. ముందు అభయ్‌కి నీళ్ళల్లోకి దిగడానికి భయం చేసేది. పెద్ద బావ తనకి ధైర్యం చెప్పి ఈత నేర్పాడు. అలాగే కొబ్బరి తోటలోకి వెళ్తే వాళ్ళని చూడగానే పాలేరు వెంకన్న లేత కొబ్బరి బోండాలు కొట్టి ఇచ్చేవాడు. బావలతో కలసి అలిసిపోయేవరకూ కొబ్బరితోటలో తిరిగేవాడు.

తాతగారంటే అంటే అభయ్‌కి చాలా ఇష్టం. అతను తనపై కురిపించే ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేడు. పెద్దతాత పరంధామయ్యకి కూడా అభయ్ అంటే అభిమానమే! చిన్నప్పుడు తనని ఎత్తుకొని పోలంగట్లమ్మట షికారుకి తీసుకెళ్లడం, కొబ్బరితోటకు తీసుకెళ్ళడం చేసేవాడు అతను. పొరపాట్న తనని ఎవరైనా ఏడ్పించినా ఊరుకునేవాడు కాదు. పెద్దతాతగారు చెప్పే కథలన్నా, కబుర్లన్నా చాలా ఇష్టం అభయ్‌కి. కాస్త పెద్దైనాక కూడా బయటకి వెళ్ళేటప్పుడు తనని ఒక్కడ్నీ వదిలేవాడు కాదతను, వీలుంటే తనే వచ్చేవాడు, లేకపోతే ఇంకెవర్నైనా వెంట పంపేవాడు. ఊళ్ళో మాత్రం పైవాళ్ళనెవర్నీ మాత్రం కలవనిచ్చేవాడు కాదు. అలా చిన్నప్పుడు అతనంటే చాలా ఇష్టం ఉన్న అభయ్ ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల అతనిపట్ల అయిష్టం పెంచుకున్నాడు. రానురాను ఆ అయిష్టం కాస్తా ద్వేషంగా మారింది.

తనకి పన్నెండేళ్ళ వయసప్పుడు జరిగిన సంఘటన మనసులో బలంగా నాటుకుంది. అదే తనకి పెద్దతాతైన పరంధమయ్య మీద అంతులేని ద్వేషం ఆ పసి వయసులోనే ఏర్పడటానికి కారణమైంది. సనాతన సంప్రదాయాలు పాటించే పరంధామయ్య పూర్తిగా ఛాందసుడు. చాదస్తం పాలు కాస్త ఎక్కువే. అలాగే మడి, ఆచారం కూడా.

ఆ రోజు ఎవరితోడూ లేకుండా, ఎవరికీ చెప్పకుండా ఒక్కడూ కొబ్బరితోటవైపు వెళ్ళాడు. అక్కడ పాలేరు రంగన్న కొడుకు వెంకన్న, తన ఈడు వాడే కనిపిస్తే వాడిని పరిచయం చేసుకుని వాడితో ఆడుకున్నాడు. తనకన్న వయసులో పెద్దవారైన బావలకంటే కూడా వెంకన్నతో ఆడుకోవడం బాగా నచ్చింది అభయ్‌కి. వాడు తనకి రకరకాల కొత్త ఆటలు కూడా నేర్పాడు. అలా తామిద్దరూ ఆడుకుంటున్న వేళ అప్పుడే అజమాయిషీ చేయడానికి అక్కడికి వచ్చిన పరంధామయ్య కంట్లో పడ్డారిద్దరూ. వెంటనే అభయ్‌ని బలవంతంగా అక్కణుంచి లాక్కువచ్చాడు.

అప్పుడు తనతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి.

"ఎందుకురా, అలాగా జనాలతో ఆడతావు? అంతగా నువ్వు ఆడుకోవాలని అనుకుంటే నీ బావలతో అడుకో, అంతేగానీ ప్రతీ అడ్డమైన వాళ్ళతో అడకు." అని గట్టిగా మందలించారు. అంతేకాక, రంగన్నని, అతని కొడుకుని పిలిపించి గట్టిగా మందలించారు.

ఆ సంఘటన అభయ్‌మదిలో బాగా నాటుకుపోయింది. ఇంకా ఇలాంటి చాలా సంఘటనలు అతనిపై ద్వేషాన్ని పెంచాయి. అతను పూజ చేయడానికి మడి కట్టుకొని ఉంటే ఎవరైనా పొరపాటున అతని వద్దకు వచ్చినా విపరీతమైన కోపం వచ్చేది. తను పొరపాటు చేసినా ఏమీ అనేవాడు కాదు కాని, ఒకసారి పనిమనిషి మంగి కొడుకు పొరపాటున అతనిని ముట్టుకున్నందుకు ఎన్ని చీవాట్లు వేసాడో తనకింకా గుర్తే! అభయ్‌కి ఇలాంటి చాలా సంఘటనలవల్ల ద్వేషం బాగా పెరిగిపోయింది. తన పెద్దతాతకి బాగా అహంకారం అని అభయ్ మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఇంట్లోగానీ, పొలంలోగానీ పనిచేసే వాళ్ళపైన అతను చూపించే నోటి దురుసు తనం అన్నా, తన కిందపని చేసే వాళ్ళపైనా అతను చూపే వివక్ష, ప్రవర్తన వలన ఆ చిన్న వయసులోనే అతనిపై విపరీతమైన అసహ్యం పెంచుకున్నాడు అభయ్. అందుకే పెద్దతాతగారైన పరంధామయ్య అంటే అంత అయిష్టం, అంతకు మించి అసహ్యం. ఆ తర్వాత మరి ఆ ఊరికి వెళ్ళాలంటేనే కంపరమెత్తేది అభయ్‌కి. ఒకవేళ ఊరికెళ్ళినా అతని వద్దకు వెళ్ళేవాడుకాడు. అతనెప్పుడు కలుగజేసుకొని అభయ్ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించినా మనసుపెట్టి మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు.

క్రమంగా ఆ దూరం పెరిగింది. పెద్దైన తర్వాత ఆ ఊరికి వెళ్ళడమే మానుకున్నాడు. తల్లీ తండ్రి రమ్మని బలవంతం పెట్టినా చదువు సాకుతో తప్పించుకునేవాడు. పదేళ్ళక్రితం తన తాతగారు, మాధవరావు గుండెపోటుతో మరణిస్తే ఊరికి వెళ్ళాడు. అదే ఆ ఊరికి చివరిసారి వెళ్ళడం.

ఇప్పుడు ఇష్టం లేకపోయినా తల్లి బలవంతంవల్ల మళ్ళీ వెళ్తున్నాడు.

ముఖ్య రహదారి నుండి తమ ఊరికి వెళ్ళే మట్టి రోడ్డు రావడంతో ఆలోచనల్లోంచి బయటపడి ఎడమవైపు కారుని తిప్పాడు. అక్కణ్ణుంచి ఆ మట్టి రోడ్డులో ఓ పది కిలోమీటర్ల దూరం వెళ్తే తమ ఊరు వస్తుంది. ఆ రోడ్డంతా గతుకులమయంగా ఉండటంవల్ల జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ముందుకి పోనిస్తున్నాడు కారుని.

దారికి ఇరువైపులా పచ్చని పైరు కనువిందు చేస్తోంది. గాలికి ఊగుతూ పౌర్ణమినాడు అలలురేగే కడలిని గుర్తుకు తెస్తున్నాయి. పల్లెటూరి సోయగాలు మనసుని మైమరపిస్తున్నాయి. ఆ దారిలోనే ఉండుండి ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు ఎదురవుతున్నాయి.

కొంతమంది వాళ్ళ బళ్ళు ఆపి తిరిగి చూస్తున్నారు కార్లో వస్తున్నది ఎవరా అని. అందులో మధ్యవయస్కుడు ఒకడు మాత్రం కుతూహలం కొలదీ కారు ఆపి అడిగాడు, "ఎవరు బాబూ?” అని.

కారు ఆపి అద్దం కిందకు దించి చూసాడు అభయ్ పలకరించింది ఎవరా అని. పరిశీలనగా చూసిన తర్వాత గుర్తుపట్టాడు.

"రంగన్నా!...నేను...అభయ్‌ని" అన్నాడు.

"ఎవరూ...అభయా!" అని కొద్దిసేపు ఆలోచించి, "ఆ నువ్వా బాబూ! బాగున్నావా బాబు, ఇదేనా రావడం?" అన్నాడు.

"అఁ...రంగన్నా! మా పెద్దతాతగారు ఎలా ఉన్నారు?" ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు అడిగాడు.

పెద్దగా నిట్టూర్పు విడిచి, "మీ తాతగారికి ఏం బాగులేదు బాబూ! ధర్మప్రభువులు! కొడుకులందరూ దగ్గరే ఉన్నా మీ కోసమే అతని కలవరింతలు బాబు! మిమ్మల్ని చూడాలని తహతహ లాడుతున్నారు." అన్నాడు కంటతడి పెట్టుకుంటూ.

అతనికి ఒంట్లో బాగులేదన్న సంగతి ఎలాగూ తనకి తెలిసిందే అయినా అతనికోసం రంగన్న కంటతడి పెట్టడం, ధర్మప్రభువులని కీర్తించడం మాత్రం అభయ్‌కి విడ్డూరమనిపించింది. పాపం అమాయకుడు రంగన్న! మూర్ఖపు చాదస్తంతో హింసించిన వానిపై అభిమానం చూపిన రంగన్నని చూసి జాలిపడ్డాడు అభయ్.

"అయితే ఆయన నా కోసమే ఎదురు చూస్తున్నారా?" అడిగాడు.

"అవును బాబూ! మీ కోసమే ఆయన ఎదురుచూపులు! ఇవాళ అమ్మగారివద్ద నుండి ఫోన్ వచ్చినప్పటినుండి కళ్ళల్లో వొత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు, బేగి వెళ్ళండి బాబూ!" అన్నాడు రంగన్న పక్కకి జరిగి దారి ఇస్తూ.

రంగన్నవైపే సాలోచనగా చూస్తూ, "అలాగే, రంగన్నా! అన్నట్లు మరిచాను. నీ కొడుకు వెంకన్న ఇప్పుడెక్కడున్నాడు? ఇక్కడే పాలేరుగా ఉన్నాడా?" అడిగాడు అభయ్. తన పెద్దతాతగారి వద్ద పని చేసే రంగన్న కొడుకు వెంకన్న అంతకు మించి ఎలా ఎదుగుతాడన్నది అభయ్ ఊహ.

అభయ్ మాటలకి ఆశ్చర్యపోయి,"అందేంటిబాబు, అలాగంటారు? వెంకన్న ఇంజినీరింగ్ చదువు పూర్తిచేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు కదా! అవునులే మీకు తెలియదు కదా? మీరు ఇక్కడికి వచ్చి చాలా రోజులైందాయె!" అన్నాడు రంగన్న.

"ఆఁ..." ఈ సారి ఆశ్చర్యపోవడం అభయ్‌వంతైంది. పాలేరు రంగన్న కొడుకు అంత ఎదిగి ఉంటాడని ఊహించలేదు అభయ్. వెంకన్న ఇంజినీరయ్యాడా? నమ్మశక్యంగా అనిపించలేదు అభయ్‌కి.

"అవును బాబూ, నిజం! అంతా ఆ ధర్మ ప్రభువుల దయ! మీరు వెళ్ళండి బాబు, నేను కొద్దిసేపు తర్వాత వస్తాను." అన్నాడు రంగన్న అక్కణ్ణుంచి కదులుతూ.

ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొద్దిసేపుపట్టింది అభయ్‌కి. రంగన్న వెళ్ళినవైపే చూస్తూ కారుని ముందుకి పోనిచ్చాడు.

ఊరు దగ్గరకొచ్చేసింది. ఈ పదేళ్ళలో ఊరు చాలా మారిపోయింది. ఇంతకు మునుపు గుడిసెలు ఉన్న స్థానంలో చిన్న పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు లేచాయి. సినిమా హాలు కూడా ఒకటి వెలిసింది. కొత్తగా కనిపిస్తున్న ఊరిని చూస్తూ ముందుకి సాగాడు అభయ్. అంతా మారింది కాని ఊరి రహదారుల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు.

ఓ పదినిమిషాలలో తాతగారి ఇంటికి చేరుకున్నాడు. వీధి అరుగులోనే కూర్చున్న పెద్ద బావ భాస్కరం కారు చూస్తూనే ముందుకి వచ్చాడు.

"ఏరా! అభయ్!...చాలా ఏళ్ళ తర్వాత వచ్చావు. బహుశా, పదేళ్ళు దాటిందేమో నువ్వు ఇక్కడికి వచ్చి." అన్నాడు పలకరించి.

"అవును, చాలా రోజులైంది." అని భాస్కరంకి జవాబిచ్చి కారు డిక్కి తెరిచి తన బ్యాగ్ భుజానేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. చాలా రోజుల తర్వాత ఆ లోగిలిలో అడుగుపెట్టాడేమో ఆ ఇల్లంతా విచిత్రంగా కనిపిస్తోంది. ఆ పాత ఇల్లు చాలావరకూ రీమోడలింగ్ అయి బాగా కొత్తగా కనిపిస్తోంది.

ఇంట్లోకి వెళ్ళగానే బిలనిలమని పిల్లలు చుట్టుముట్టారు అభయ్‌ని. పిల్లల్ని చూసేసరికి ఇంతదూరం కారు నడిపి వచ్చిన అలసట ఒక్కసారి దూరమైనట్లు అనిపించింది. బ్యాగ్ తెరిచి తనతో తెచ్చిన చాక్లెట్లు అందరికీ అందించాడు. అప్పుడే బయటనుండి వచ్చిన చిన్న బావ ఆదిత్య అభయ్‌ని పలకరించాడు.

"బావా! నీ బ్యాగ్ ఈ రూములో ఉంచు. ఎప్పుడనగా బయలుదేరావో, స్నానం చేసి ఫ్రెష్ అయి రా! భోజనం చేద్దాం! తాతగారు భోజనం చేసి నిద్రపోతున్నారు. అతను మేలుకున్నాక కలుసుకుందాం." అన్నాడు ఆదిత్య.

అభయ్ స్నానం చేసి వచ్చేసరికి హాల్లో అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు. మావయ్యలిద్దరూ అభయ్‌ని కలవడానికి కాచుకొని ఉన్నారు. అభయ్‌ని ఆప్యాయంగా పలకరించారిద్దరూ.

"మీ అమ్మ, నాన్న కూడా రావలసింది. వాళ్ళని కూడా కల్సి చాలా రోజులైంది.” చెప్పాడు పెద్దమావయ్య.

"పెళ్ళిపనుల్లో తీరుబాటులేదు మావయ్యా! అయితే వీలు చూసుకొని అందర్నీ పిలవడానికి వస్తామన్నారు. బహుశా, వచ్చే వారం వస్తారనుకుంటా!" అన్నాడు.

చాలా రోజులతర్వాత వాళ్ళందరితోనూ కలిసి భోజనం చేయడం అభయ్‌కి చాలా ఆనందమనిపించింది. చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. అత్తలిద్దరూ కొసరికొసరి వడ్డిస్తూంటే, పెద్దబావ, చిన్నబావ హాస్యాలాడుతుంటే వాళ్ళ అభిమానానికి కళ్ళు చెమర్చాయి అభయ్‌కి. వాళ్ళ మాటలతోనే కడుపు నిండిపోయినట్లనిపించింది అభయ్‌కి. పెద్దతాతగారిపై ద్వేషం లేకపోయుంటే తను ఇక్కడికి నెలకోసారైనా వచ్చి ఉండేవాడనని మనసులోనే అనుకున్నాడు అభయ్.

భోజనం చేసిన తర్వాత తాతగారు లేచారని తనకోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు ఆదిత్య. అభయ్ ఆదిత్యతో తాతగారి గదికి వెళ్ళారు. బెడ్‌పైన ఉన్న పరంధామయ్యని చూసాడు అభయ్. తను పదేళ్ళక్రితం చూసినప్పటికి ఇప్పటికి అతనిలో ఎంతో తేడా! ఠీవిగా రాజసం ఉట్టిపడే ఆ పరంధామయ్య ఎక్కడ, ఇప్పుడు బెడ్‌పై నిస్సహాయంగా పడి ఉన్న ఇతను ఎక్కడ! చాలా చిక్కిపోయి, శుష్కించిపోయి ఉన్నాడతను. అంతగా ద్వేషించే అభయ్ కళ్ళలో కూడా అప్రయత్నంగా చిన్న కన్నీటిపొర ఏర్పడింది. మాట్లాడే స్థితిలో కూడా ఉన్నట్లు లేరతను. అభయ్‌ని దగ్గరకు పిలిచి చేయి నిమిరారు ప్రేమగా.

ఇంతకుముందు అతను అలా చేయి వేస్తే తేళ్ళు జెర్రిలు ప్రాకిన ఫీలింగ్ కలిగేది. కాని అభయ్‌కి ఇప్పుడలా అనిపించలేదు. అందుకు కారణం నిస్సహాయ స్థితిలో ఉన్న అతనిపై జాలి కావచ్చని అనుకున్నాడు అభయ్.

"ఎలా ఉన్నావు?" అస్పష్టంగా ఆ ఒక్కమాట వినబడింది అతని నోట. బాగున్నానని తల ఉపాడు అభయ్.

"నా మీద నీకు కోపం ఉంది కదూ?..."అన్నారు అతను మెల్లగా కూడదీసుకొని.

లేదన్నట్లు తల అడ్డంగా ఉపాడు ఈ స్థితిలో అతన్ని మరి బాధించడం ఇష్టంలేని అభయ్.

కొద్దిసేపు అక్కడే ఉండి తన రూముకి తిరిగివచ్చాడు అభయ్. విశ్రాంతికోసం మంచంపై వాలాడు గాని ఎంతకీ నిద్ర కరుణించలేదు. దీనంగా తనవైపు చూస్తున్న పెద్దతాతగారి మొహమే కళ్ళముందు కదులుతోంది. ఇంకొద్దిసేపు చూసి మరెలాగూ నిద్రపట్టదని గ్రహించి లేచి ముఖం కడుక్కుని టివిముందు కాస్సేపు కూర్చున్నాడు.

సాయంకాలం నాలుగు గంటలైనతర్వాత ఇంట్లో ఏమి తోచక ఓ సారి తిరిగివస్తానని బయలుదేరాడు అభయ్. చిన్నబావ తోడు వస్తానని వెంటబడితే, "నేనింకా చిన్నపిల్లడ్ని కాను బావా! చిన్నప్పుడైతే నన్నెక్కడికీ ఒంటరిగా వెళ్ళనిచ్చేవారు కాదు. అయినా వెళ్ళేవాడిననుకో! ఓ సారి అలా తిరిగివస్తాను." నవ్వుతూ చెప్పి ముందుకి నడిచాడు.

అలా బయలుదేరిన అభయ్‌కి ఊళ్ళో చాలా మార్పులు కనబడ్డాయి. అభయ్‌ని తెలిసినవాళ్ళు పలకరిస్తున్నారు. తెలీనివాళ్ళు కుతూహలంగా అడిగి తెలుసుకుంటున్నారు. తను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ తిరిగి చివరికి కొబ్బరితోటకి వెళ్ళాడు. ఆ తోటలో ఓ మూల ఉన్నఇంట్లో ఉంటున్నాడు రంగన్న.

అభయ్ అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. రంగన్న భార్య తలుపు తీసి అభయ్‌ని చూసి భర్తని పిలిచింది, "నీ కోసం ఎవరో వచ్చారు చూడు మావా!" అని. రంగన్న బయటి వచ్చి అభయ్‌ని చూసి, "నువ్వా బాబూ! రా బాబూ లోపలికి రా!" అన్ని, భార్యవైపు తిరిగి, "రంగీ! ఈ అబ్బాయి ఎవరో తెలుసా!" అంటూ ఆమెతో ఏదో చెప్పాడు. అతని మాటలు వింటూనే ఆమె అభయ్‌వైపు కుతూహలంగా చూసి మెల్లగా ఏదో అన్నది.

ఆమె రంగన్నతో ఏదో గుసగుస లాడటం గమనించాడు అభయ్ కానీ అదేమిటో తెలియలేదు. "ఏమిటి రంగన్నా?" అని అడిగాడు. రంగన్న "ఏమీ లేదు బాబు! చాలా రోజులైంది కదా చూసి, తమరిని గుర్తుపట్టలేదు రంగి." అన్నాడు. రంగన్న మాటల్లో తడబాటు గ్రహించాడు అభయ్. "పదండి బాబూ! తోటలోకి వెళ్దాం" అంటూ బయటకి వచ్చిన రంగన్నని అనుసరించాడు అభయ్. రంగన్న, రంగి ఏమి గుసగుసలాడుకున్నారో, ఎందుకు రంగన్న తనతో మాట్లాడేటప్పుడు తడబడ్డాడో అర్ధం కాలేదు అభయ్‌కి.

తోటలో రంగన్నతో తిరిగి తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు అభయ్. అప్పుడు గుర్తుకు వచ్చింది అభయ్‌కి రంగన్న కొడుకు వెంకన్న గురించి. వెంకన్న గురించి అడిగాడు.

"మీ పెద్ద తాతగారే ఆదుకోకపోతే మా వెంకన్న ఇలాంటి స్థితిలో ఉండేవాడా బాబూ? మీ తాతగారు ధర్మ ప్రభువులు! వాడి చదువంతా అతని చలువవల్లే సాగింది. ఏం చేసినా అతని ఋణం తీర్చుకోలేను బాబూ!" అన్నాడు రంగన్న కళ్ళు చెమర్చగా.

"ఆఁ...నిజమా!" రంగన్న మాటలు నమ్మలేక అన్నాడు అభయ్.

"అవును బాబూ! మీకు అతని మీద అలక ఉందని తెలుసు. పైకి ఆయనెంత కఠినంగా కనిపించినా, మనసు మాత్రం వెన్న. మాకెప్పుడూ ఏ లోటూ చేయలేదు. అలానే ఒక్క వెంకన్ననేకాదు, ఈ ఊళ్ళో చాలామందిని చదివించారాయన. అందరికీ పైకి తెలిసేది అతని చాదస్తం మాత్రమే! అతని మనసు ఎంతమందికి తెలుస్తుంది? ఇలా ఎంతమంది చదువులకి, పెళ్ళిళ్ళకి సహాయం చేసారో ఆయన?" చెప్పాడు రంగన్న.

"ఆఖరికి మీరు..." ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రంగన్న.

"ఆఁ...ఏంటి రంగన్నా! నేను..."

"ఏమీలేదు బాబూ, చాలా చీకటిపడింది, ఇంటికిపదండి. మీరు వచ్చి చాలా సేపయ్యింది. ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. నేనూ వస్తున్నా!" అని మాట మార్చాడు. రంగన్న ముందుకి దారితీయగా అభయ్ అతని వెంట నడిచాడు. చీకటిపడినా ఊళ్ళో సందడి సద్దుమణగలేదు. తోవలో ఎదురుపడినవాళ్ళు రంగన్నతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో అడుగుతూంటే, అతను వారికి ఏవో సమాధానాలు చెప్తూ ఉన్నాడు.

వాళ్ళు కుతూహలంగా తనని చూడటం అభయ్ చూపుని దాటిపోలేదు. ముందు ఆ సంగతి పట్టించుకోలేదుకాని, రంగన్నతో మాట్లాడిన వాళ్లందరూ తనని గుచ్చిగుచ్చి చూడటం విడ్డూరమనిపించింది.

ఈ లోగా ఇంటి వద్దకు చేరుకున్నారిద్దరూ. వరండాలోనే ఎదురైంది వాళ్ళ ఇంట్లో పనిచేసే మంగి. రంగన్నతో ఉన్న అభయ్‌ని చూస్తూనే, "ఆఁ...! ఈ అబ్బాయేనా మన సోమన్న కొడుకు! ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఎంత ఎదిగిపోయాడు?" అంది అతనివైపే చూస్తూ, రంగన్న చూపులతో ఎంత వారిస్తున్నా గమనించకుండా.

అయితే అభయ్ మాత్రం అది గమనించాడు. తనని ‘సోమన్న కొడుకు ‘అని అంటున్నదేమిటి ఆమె అని మాత్రం అర్థం కాలేదు. అందులో ఏదో రహస్యం ఉందని మాత్రం తోచింది అభయ్‌కి. అప్పుడు ఇంకేమీ మాట్లాడకుండా ఇంట్లో ప్రవేశించాడు.

రంగన్న కూడా ఇంట్లో ప్రవేశించగానే, "ఏమిటి రంగన్నా, నన్ను పట్టుకొని సోమన్న కొడుకంటుందేమిటి?" అని అడిగాడు.

"ఆఁ...ఏం లేదు బాబు. ఆమె ఈ మధ్య కొంచెం అలా అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతోంది." తడబడుతూ తప్పించుకోచూసాడు రంగన్న.

"చూడు, రంగన్నా! నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నన్నందరూ ఎందుకో గుచ్చి గుచ్చి చూస్తున్నారు, చివరికి నీ భార్య కూడా! ఇప్పుడేమో ఈమె కూడా ఏమంటుందో అర్ధం కావడంలేదు. మీరందరూ ఏదో దాస్తున్నారు. నువ్వైనా చెప్పు సంగతేమిటో?" అన్నాడు అభయ్.

ఏమీ చెప్పకుండా దిక్కులు చూస్తున్న రంగన్నని తన గదిలోకి లాక్కుపోయాడు అభయ్. రంగన్న రెండు చేతులూ పట్టుకొని, "చెప్పు రంగన్నా! నిజం చెప్పు! చిన్నప్పటినుండీ నువ్వంటే నాకు చాలా గౌరవం. నన్ను అందరూ అదోలా ఎందుకు చూస్తున్నారు? సోమన్న ఎవరు?" అడిగాడు అభయ్ కుతూహలం ఆపుకోలేక.

అభయ్ చేతులు విడిపించుకొని దూరంగా జరిగాడు రంగన్న. రెండు నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత నోరు విప్పాడు, "బాబూ ఆ విషయం మీకు చెప్పకూడదు. మీకు తెలియకపోవడమే మంచిది." అన్నాడు తలవంచుకొని.

"ఏం రంగన్నా! ఏమిటంత రహస్యం! నాకు చెప్పకూడనంత రహస్యం ఏమిటి? నిజం చెప్పు, నా మీద ఒట్టు!" రెట్టించాడు అభయ్.

ఆఖరికి చెప్పకతప్పలేదు రంగన్నకి. "అసలు...అసలు బాబూ...మీరు ఆ సోమన్న సొంత బిడ్డ." చెప్పలేక చెప్పాడు రంగన్న.

"అఁ..." ఆ మాటలు విన్న అభయ్ నిశ్చేష్టుడైయ్యాడు. అతని మొహం తెల్లగా పాలిపోయింది.

"నిజమా!...నిజమా!!..." రంగన్న మాటలకి తట్టుకోలేక అతని భుజాలు పట్టుకు కుదిపేస్తూ అడిగాడు అభయ్.

"అవును బాబూ...మీరు శారదమ్మ బిడ్డ కారు. మీ పెద్దతాతగారు పరంధామయ్యగారి వద్ద పాలేరుగా పని చేస్తున్న సోమన్న బిడ్డ మీరు. పట్నం వెళ్ళి తిరిగివస్తూ మీ అమ్మానాన్నా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. మీరొక్కరే ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. మీ అమ్మానాన్నా ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడంతో వాళ్ళని బంధువులందరూ వెలివేసారు. అప్పుడు వాళ్ళని ఆదుకున్న మీ పెద్దతాతగారే వాళ్ళకి దేవుడు. మీ నాన్న తరఫు వాళ్ళుగానీ, అమ్మ తరఫు వాళ్ళుగానీ మీ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాకపోతే మీ బాధ్యత అతనే తీసుకున్నారు పాపం. శారదమ్మగారికి పిల్లలు కలగకపోవడం వల్ల మిమ్మల్ని వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చారు." అని ఆగాడు రంగన్న.

రంగన్న మాటలు విన్న అభయ్‌కి తల తిరుగుతున్నట్లు అనిపించి నిస్త్రాణంగా సోఫాలో కూలబడ్డాడు. నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణించుకోవడం అసాధ్యమైంది.

"అలా మీరు శారదమ్మ, శేఖర్‌గారి వద్ద పెరిగారు. వాళ్ళు మిమ్మలెంత అలారు ముద్దుగా పెంచుకున్నారో మీకు తెలుసుగా. అసలు ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదని పరంధామయ్యగారు మా అందర్నీ శాసించారు కూడా. అందుకే మీరు ఈ ఊరు వచ్చినప్పుడు ఒంటరిగా ఎక్కడికీ వదిలేవారు కాదు. ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు, ఈ రహస్యం బయటపడుతుందని, అందుకు మీరు నొచ్చుకుంటారని. మీరు ఎప్పటికీ ఈ నిజం తెలుసుకోకూడదనే ఆయన భావన. అందుకే మీరు బయటకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు తోడు వచ్చేవారు. ఈ విషయం కనీసం మీ బావలిద్దరికీ కూడా తెలియకుండా పెంచారాయన. అంత గొప్ప వ్యక్తి మీ పెద్దతాతగారు. అందుకే మీకు చెప్పలేదు. కానీ మీరు మీ మీద ఒట్టుపెట్టుకునేసరికి నాకు చెప్పక తప్పలేదు. మీకు అతనిపై కోపం ఉందని నాకు తెలుసు. అతని మనసు వెన్న బాబూ! పైకి మాట కఠినంగా కనిపించినా అతని హృదయం చాలా మెత్తన! మా వెంకన్న కూడా ఇప్పుడు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాడంటే అతని చలువే కారణం. అతను తన చాదస్తంతో, మాటలతో బాధించడమే మీరు చూసారుగాని, ఆయన ఎంతమంది మా లాంటి వారికి కొలిచే దేవుడో మీకు తెలియదు బాబూ. మాలాంటి అందరి బ్రతుకులు చల్లగా సాగడానికి కారణం అతని కృపే బాబూ! ఎంతమంది మాలాంటి వారికి అజ్ఙాతంగా అతను సహాయం చేసారో?" చెప్పాడు రంగన్న కళ్ళు చెమర్చగా.

ఆ మాటలు విన్న అభయ్ కళ్ళు వర్షించాయి. ‘తనెంత అపార్థం చేసుకున్నాడు తనపాలిట దైవంలాంటి అతన్ని. తనలాంటి వాడికి ఎంత ఉన్నత స్థితి కలిగించారు. తను కలలో కూడా ఊహించలేని ఉజ్జ్వల భవిషత్తు ఇచ్చారాయన, అలాంటి అతనిపైనా తను అలకబూనాడు? అప్పటికి అభయ్‌కి అర్ధమైంది తను ఊరికి వచ్చినప్పుడు తనకెందుకు అంత కట్టుదిట్టం చేసేవారో అని. తను ఏం చేస్తే అతని ఋణం తీర్చుకోగలుగుతాడు! తనని ఆదరించి ఇంత మంచి జీవితం ప్రసాదించిన అతన్ని అకారణంగా తనెంత ద్వేషించాడు? తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా!’ ఆక్రోశించింది అభయ్ మనసు.

తనకి దైవంలాంటి పెద్దతాతగార్ని క్షమాపణ అడగాలి అని తలచి వర్షించిన కళ్ళతో అతని గదిలోకి దూసుకువెళ్లాడు అభయ్. పరంధామయ్యగారి చెంతకువెళ్ళి కూర్చున్నాడు. అభయ్ కన్నీళ్ళు అతని పాదాలని అభిషేకించసాగాయి. అప్పుడే నిద్రలోనుండి లేచి కళ్ళు తెరిచిన పరంధామయ్యగారి చల్లని చూపు అభయ్‌పై ప్రసరించింది. అతని కళ్ళల్లో అనంతమైన వెలుగు గోచరించింది అభయ్‌కి. ఆ వెలుగే తనకి దారి చూపిస్తున్నట్లు అనిపించింది. తన తప్పుల్ని క్షమించి, తనని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది అభయ్‌కి. అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి కన్నీళ్ళతో పరంధామయ్య గుండెలపై వాలాడు అభయ్.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.