మధూ, ముందు ఎటువంటి ఉపమాన సంబోధన లేదేమిటి అనుకున్నావా.. ఏమని వ్రాయను? ఏ పోలికకూ అందనంత ఎత్తులో వున్న నిన్ను వేటితోనో పోల్చి తక్కువ చేయలేను. నీ పరిచయం కాకతాళీయమని అనుకోలేను. విధాత నాకోసమే నిన్ను మలచి నా దగ్గరకు పంపాడేమో అనిపిస్తున్నది. నిన్ను కలిసే వరకు నాకూ ఒక మనసుందని తెలియలేదు. బ్రతుకులో బాధ్యతలే తప్ప ప్రేమ, అనుబంధాలు లేవనుకున్న నాకు నీ పరిచయం సరికొత్త ఆలోచనలకు తెరలేపింది. మొదటిసారి నిన్ను చూసిన వేళ తొలిచూపు బాణం నాటుకోలేదు. నువ్వు అందమైనదానివో కావో నేను నిర్ణయించలేను. కారణం నేను నీలో అందాన్ని చూడలేదు. నా దృష్టిలో అందానికి కొలబద్ద లేదు. అందుకేనేమో నా కనులు నీ అందాన్ని ఆస్వాదించలేక పోయాయి. నీతో పరిచయం పెరుగుతున్న కొలది నీ వ్యక్తిత్వం, మంచితనం, సమస్యను ఎదుర్కోగల ధైర్యం, సమయస్పూర్తి నాలో నీ మీద ఒక సదభిప్రాయాన్ని ఏర్పరిచాయి. చిరునవ్వుతో ఆప్యాయంగా 'దీపూ' అని పిలిచే నీ పిలుపు నీలో ఒక ఆత్మీయురాలిని నాకు చూపించింది. క్రమేపి నీ రాక కోసం కనులు వెదకడం మొదలుపెట్టాయి. నీ పిలుపు కోసం మది ఎదురుచూసేది. నీవు రాని రోజు ఏదో వెలితిగా అనిపించేది. ఏ చిన్న చప్పుడైనా నీవేనేమోనని తిరిగి చూసేవాడిని. ఏ పనీ చేయ మనసయేది కాదు. నాలో మార్పు క్రమంగా నాకే తెలియసాగింది. దానినే ప్రేమంటారేమోనని నాకు నిజంగా తెలియదు. నువ్వు లేక నేను ఉండలేనేమో అనే భయం మాత్రం బలపడసాగింది. కానీ ఏనాడూ నువ్వు చొరవ చేసిన దాఖలాలు లేవు. నాలా నీవు కూడా ఆలోచిస్తున్నావో లేదో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా మీద నీకు సదభిప్రాయమే ఉంది. మరి అది నాతో కలసి నడిచేటంతగా ఉన్నదో, లేదో తెలియదు. నాకు నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం కావాలి. నీ నిర్ణయం ఏదైనా నాకు శిరోధార్యమే. చలం గారు చెప్పినట్లు' మనం స్త్రీని ఎంతగా ప్రేమిస్తామో ఆమె మనలను అంతకంటే రెట్టింపు ప్రేమిస్తుందని '.. అదే నిజమైతే నువ్వు నా ప్రేమను అంగీకరిస్తావు. నీ కులమేదయినా, మతమేదయినా నాకు అడ్డంకి కాదు. నా ప్రేమను అంగీకరించమని బలవంతం చేయను. ఏ కిరాతక చర్యకు ఒడికట్టను. ప్రేమ ప్రేమను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని పెంచుకోదు. నేటి యువత అర్థం చేసుకోలేని విషయమదే. అందుకే పువ్వుల వంటి ఆడపిల్లల మీద దారుణాలు జరుగుతున్నాయి. అలాటి దుర్మార్గాలు మన మధ్య చోటుచేసుకోకూడదు. అంతేకాదు పెద్దలను ఎదిరించి లేచిపోవడాలు అసలు వద్దు. ప్రేమ మన రెండు మనసులకే కాదు, మన ఇద్దరి కుటుంబాలకు సంబంధించినది. ఎంత కష్టమైనా, ఎన్ని సంవత్సరాలైనా వారి ఆమోదంతోనే మనం ఒకటి కావాలి. క్షణికావేశపు నిర్ణయం కాదిది మూడునాళ్ళలో ముగియడానికి. మనసు పొరలను మధించి వెలికివచ్చిన అమృతధార ఇది. నీతోడిదే జీవితం అనుకుంటున్నాను. మరి నీ మనసు గదిలో నాకు రవ్వంత చోటు ఇస్తావనే ఆశ. నీ నవ్వుల నదిలో ఓలలాడాలని, నీ తీయని పిలుపుతో మేలుకోవాలని కనే కలలు కల్లలు కానీయవనే నమ్మకంతో క్షరము కాని ప్రేమను అక్షర రూపంలో పరుస్తున్నాను. ఎదుటపడి మాట తెలుపలేని మూగవాడిని. మనసు గది తెరచి ఆహ్వానిస్తున్నాను. ఫలితం నిరాశను మిగిల్చినా ఉన్మాదిగా మారను. నీ ఊహల ఊపిరితో సాగుతూ సమాజం కోసం బ్రతుకును సాంబ్రాణి చేస్తాను. నీ సమాధానం కోసం చకోరమై చూస్తూ.... నీకు అంగీకారమైతే.... 'నీ' కావాలనుకునే దీపూ..... ఉత్తరం చదువుతున్నంత సేపు మధులిక కళ్ళముందు దీపక్ కనిపిస్తూనే ఉన్నాడు. చిన్నతనంలోనే ఒక కనుగుడ్డు నీరుకారిపోయి చూపులేకుండా పోయింది. కానీ నాలోని లోపం అతనికి కనిపించడం లేదు. అతను నా మనసును మాత్రమే చూస్తున్నాడు. అటువంటప్పుడు నేను అతనిలోని లోపాన్ని చూడడం ఎంతవరకూ సమంజసం. జీవితంలో ఎంత వద్దనుకున్నా ఎవరో ఒకరి తోడు కావాలి. లేకుంటే బ్రతుకు భారంగా మారుతుంది. ఆ తోడు అర్థంచేసుకున్న వాడయితే, అంతకన్నా ఏం కావాలి. కూటికి, గుడ్డకు కొరగాని, మనసుకు శాంతినివ్వలేని కులాలెందుకు? మతాలెందుకు? మంచితనం ముందు అన్నీ తలవంచాల్సిందే. మధులికలో ఏదో తెలియని ఉద్వేగం. మనసు దీపక్ వైపుకు మొగ్గు చూపసాగింది. 'నీకు అంగీకారమైతే నాకూ అంగీకారమే దీపూ.... నీ నిరీక్షణకు నా స్పర్శతో ముగింపు పలుకుతాను. నీ పలుకును నా పెదాల పలికించి నీ మాటలో నా బాట పరుచుకుంటాను'. రేపటి వసంతం ఈరోజే వచ్చినంత ఆనందంతో దీపక్ ఇంటికి బయలుదేరింది మధులిక.