“ ఏడో చేప .....” - చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

seventh fish

రాజధానిలో గగ్గోలు గా ఉంది,

పిల్లా పెద్దా , పీచు పిడక , కుక్క మేక సమస్త ప్రాణులు వల్లకానంత గగ్గోలు గా ఉన్నారు . ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ అనుభవం ఎవ్వరికీ లేదు అందుకే బాహాటం గా కాకుండా అందరూ లోపల్లోపల గోణుక్కుంటున్నారు.

మూలనున్న ముసలమ్మలు కలికాలం వచ్చేసిందే అంటూ నిట్టురుస్తున్నారు, అక్కడక్కడ పోయిన వారు పోగా మిగిలిన ముసలయ్యలు ‘ ఏమే కాస్త టీ ఇస్తావా ‘ అనే ధైర్యం కూడా లేక నిస్సత్తువగా కూర్చుని ఉన్నారు . యువసామాన్యం నాయకుల వైపు చూస్తున్నారు , నాయకగణం మేధావుల వైపు చూస్తున్నారు . మేధావులు కళ్ళు కళ్ళు కలుపుకొని , మనస్సులోని దిగులు ని బయట పెట్టకుండా గంభీరంగా ఉంటున్నారు. మధ్య వయస్సు వాళ్ళు వాళ్ళతోనూ వీళ్ళతోనూ కలవలేక మల్లగుల్లాలు పడిపోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు యధాప్రకారం పనిచేస్తున్నారు , వ్యాపారులు సరుకు ఎంత ఉందీ? తెచ్చి స్టాక్ పెట్టుకుంటే నయమేమో అని, పద్దులు పెట్టేవారికి మొహమాటం లేకుండా బాకీలు అడగటం మొదలు పెట్టారు. శాంతి భద్రతలు చూసుకునే వారు వారి వారి సిబ్బందికి శలవులు రద్దు చెయ్యాలా ఉన్న సిబ్బంది తో సర్దుకుందామా అని ఆలోచనల తో సతమతమవుతున్నారు.ప్రభుత్వ వ్యతిరేక బృందాలు నిశ్చేష్ట తో నిలిచి పోయి ఉన్నాయి . ఇదేమి సామాన్యమైన సంఘటనేమీ కాదు .

మంత్రి గారి ఇంట్లో విషయం తెలిసినా అంతా సాధారణం గా నే ఉంది. రోజూ లాగానే మంత్రి గారు బ్రాహ్మీ ముహూర్త సమయం లో లేచి కాలకృత్యాలు ముగించుకొని , ఓళ్ళు వంచి వ్యాయామం చేసుకొని , స్నాన పానాదులు ముగించుకొని మెల్లిగా దైనందిన రాచకార్యాలకు ఉపక్రమించారు. ఈ అరాచకం ఆయన దృష్టికి నిన్ననే వచ్చింది , ఎన్నో ఏళ్ళుగా ఆయన మంత్రి గా ఉన్నారు. ఈ రాజుగారికి ముందు ఎందరో రాజుల పాలనలో ఆయన మంత్రి గా పని చేసిన అనుభవం ఉండి కూడా , ఆయనకు అయోమయం గా వుంది ఇది ఎలా సాధ్యం . ఇలాగే చూస్తూ ఉరుకుంటే రేపు తన పరిస్థితి , తన అధికార ప్రాభవం, తన హోదా ఇవన్నీ ఎటుపోవాలి?. ఇట్లా అయితే కష్టం . ఈ రాజుని గద్దె దింపాల్సిందే లేక పోతే ఏకు మేకై నిలిచిపోతాడు అని ఆలోచించి, సమావేశాన్ని జరపాలి అని విపక్షీయులకు సలహా కూడా ఇచ్చాడు. రహస్య మంతనాలు జరపాలి ఇది ఆయన మనస్సులోని ఆలోచన. ప్రభుత్వ వ్యతిరేకుల్ని అందరిని ఏకం చెయ్యాలి. ఇట్లా మనసులో సతమతమయిపోతూ ఉన్నా , ప్రస్తుత బాధ్యతలను పక్కకు పెట్టె పిచ్చి పని చేయలేదు. యధాప్రకారం కార్యాలయానికి బయలుదేరారు , ప్రభుత్వం ఎవరిదైనా కట్టప్ప లాగా ఆయన రాజ్యానికి కట్టు అధికారి. ఆయనకు అధికారం ఇచ్చే గర్వం మాత్రం చాలు .

‘ అయ్యా వాహనం సిద్దమండీ ‘ సేవకుడు వచ్చి చెప్పాడు. తలెత్తి చూశాడు మంత్రి , సేవకుడు వినయంగా నిలుచున్నాడు .

‘ ఏమోయ్ రంగన్నా , ఏమిటి రాజ్యం లో విశేషాలు’

‘ తమకు తెలియని విశేషాలు నాకేమి తెలుస్తాయ్ అయ్యగారు’

‘ భలే వాడివే, నాకు విషయాలు తెలీయక కాదు , ప్రజలు ఏమనుకొంటున్నారో అని ‘

నర్మగర్భంగా నవ్వాడు ...రంగన్న మాత్రం సామాన్యుడేమీ కాదు, మంత్రి గారికి చీఫ్ సేవకుడు అతనికీ అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి , అతనికి అంత ఆందోళన గానే ఉంది కాని మరి అనుభవం ఇచ్చిన సంయమనం మరి, అంత త్వరగా బయటపడే పరిస్థితి కాదు . ఆచి తూచి అడుగెయ్యాలి అది అత్యవసరం.

‘ అదేనండి తమరి దృష్టి కి వచ్చిన విషయమే అందరూ చర్చిస్తున్నారండి ‘..... వినయంగా చెప్పాడు .

మంత్రి గారికి అర్ధం అయింది రంగన్న ఇంతకంటే పెద్దగా బయట పడడని. అయన అనుభవం లో లేని సమస్య అయ్యే సరికి ఆయనకు ఏమి తోచడం లేదు అట్లా అని అందరిలాగా బయట పడ నూ లేడు. ఇదొక మాయ గోల , పదవి ఇచ్చే డోల . చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది అన్న నిశ్చయానికి వచ్చేశాడు . మెల్లగా లేచాడు ఒక నిశ్చయం చేసుకున్న వాడిలా అడుగులు వేశాడు తన వాహనం వైపు . ‘ పోనియ్యి ‘ సారధి కి చెప్పాడు రహదారులన్నీ ఖాళీ గా ఉన్నాయి. కేవలం యుద్ధం జరిగేటప్పుడే ఇలాంటి ఖాళి కనిపిస్తుంది . ‘ నిజమే ఇది యుద్ధం లాంటి పరిస్థితే ‘ మంత్రి గారి మనస్సులో అనుకున్నాడు . అక్కడక్కడా కనిపిస్తున్న ప్రజలలో కూడా అంత ఉత్సాహం ఏమి కనిపించడం లేదు. రోడ్డు పక్కన పడుకున్న కుక్కలు కూడా దిగులు గానే కనిపిస్తున్నాయి. కాకులు కూడా ముక్కులు చెట్లకి పూసుకుంటూ నిరాశగా ఉన్నాయి . ప్రకృతి కూడా ఇంత దిగులు గా ఉందేమిటీ విరక్తిగా నవ్వుకున్నాడు . తన కార్యాలయానికి చేరుకున్నాడు . విచిత్రంగా తన కార్యలయమంతా హడావిడి గా ఉందీ.అర్ధం కాలేదు మంత్రి గారికి . భటుడు నమస్కారం చేశాడు

‘ రాజు గారు మన కార్యాలయానికి వచ్చారండి ‘ ఉత్సాహంగా చెప్పాడు . వీడొకడు వీడికి ఏది చూడు ఉత్సాహమే . రాజు గారు నా కార్యాలయానికి రావటం ఏమిటీ ,ఆయన కి ఏమి అర్ధం కాలేదు. ఆయన జీవిత కాలం లో రాజు గారి దగ్గరికి తాను వెళ్ళడమే గాని రాజు గారు తన కార్యాలయానికి రావడం ఎప్పుడూ జరగలేదు. హడావిడి గా అడుగులు వేశాడు.

‘ రండి రండి మంత్రి గారు ....మీ కోసమే చూస్తున్నాము ‘

నవ్వుతూ ఎదురొచ్చారు రాజు గారు . రాజు గారు చక్కటి నవ్వుతో ఉంటారు . ఆయన కళ్ళు మాత్రం తీక్షణం గా మనిషి మనస్సుని చదువుతాయి. ఆయన సమక్షం లో సామాన్యమైన వ్యక్తి కూడా ఎంతో ప్రభావవంతుడై కనిపిస్తాడు . ఆయన మాటల కంటే చేతల మనిషిగా పేరు సంపాయించుకొన్నాడు. ఆయన సమక్షం లో ప్రతీ వ్యక్తీ ఉత్తెజితుడవుతాడు.

“ నమస్కారం ... ఏమిటీ ఈ ఆకస్మిక పర్యటన , మహారాజా ? నా మీద ఏమన్నా విచారణా ??” నవ్వుతూనే తన అక్కసు వెలిబుచ్చాడు .

“ మీమీద ఏమన్నా ఆరోపణ వస్తే విచారణ కూడా చెయ్యాలా ........” నవ్వాడు రాజుగారి తో పాటు ఉన్న సేనాధిపతి ...కోపం గా చూశారు మంత్రి గారు , ఏదో పదవి హోదా మీద మోజే గాని ఆయన ఎప్పుడు కక్కుర్తి పడలేదు. సర్దుకున్నాడు సేనాధిపతి ఆయనకు మంత్రి గారంటే వ్యతిరేకత ఏమీ లేదు , కేవలం రాజు గారు అంటే వల్లమాలిన అభిమానం అంతే.

“ అయ్యో మీమీద విచారణ ఎందుకు చేస్తాం మంత్రి గారు ? నేనే ఉరికే అందరి కార్యాలయాలు దర్శిద్దాం అని ...” ఇదిగో ఇలా బయలుదేరాను నవ్వుతూ చెప్పారు రాజు గారు ... సంజాయిషీ ఇచ్చినట్టు అనిపించినా ... ఆయన మాటలలో ఒక స్నేహం ఉంది .

‘ క్షమించండి మహారాజ ఏదో పరాకులో...’ సర్దుకున్నారు మంత్రి గారు. కార్యాలయం అంతా అప్పటికే రాజు గారు చుట్టేసి ఉన్నారు . మంత్రి గారు వస్తే మాట్లాడదాము అని, కొన్ని విషయాలను రాజు గారు నిర్ణయించినట్టు కనిపించింది .

‘ మంత్రి గారు ఇంతకు ముందు ఎలా జరిగిందో నాకు అనవసరం , నాకు ఉన్న ప్రణాళిక మీముందు పెట్టాను ‘ దానికి తగ్గ ఆలోచనలు చేసి, సూచనలు ఏవన్నా ఉంటే చెప్పండి ‘ అంటూ లేచారు రాజు గారు . ఆయన వచ్చిన పని అయిపొయింది . బయలుదేరటానికి సిద్ద పడుతున్నారు . మంత్రి గారికి అప్పుడు తెలివి వచ్చింది .

‘ మహారాజా ఒక చిన్న సందేహం , ఇది కర్ణాకర్ణి గా నేను విన్నదే , అయితే మీ నోటినుంచి ఒక్కసారి అది నిజమో కాదో విందామని ‘ సంకోచిస్తూ నే అడిగారు మంత్రి గారు.

‘ అడగండి మీకు సంకోచం దేనికి ......? ‘ భరోసాగా చెప్పారు రాజు గారు .

‘ నేను మంత్రిని కాబట్టి , నా బాధ్యత కాబట్టి అడుగుతున్నాను. ఇందులో ఎటువంటి కుట్రా కుతంత్రం లేదు మీరు దయచేసి మనసులో పెట్టుకుని నాకు సమాధానం ఇవ్వండి ‘ నిజాయితీ గా అడిగారు మంత్రి గారు . వాతావరణం గంభీరం గా మారింది. రాజు గారి అంగరక్షక దళం అప్రమత్తమైంది . అంతటా నిశ్శబ్దం అందరి దృష్టి రాజు గారి మీదే .

‘ అసలు ఏమి జరిగింది ఏమిటి మీ సందేహం ‘ అడగండీ అనునయంగా అన్నారు రాజు గారు . ఇప్పుడు అందరి దృష్టి మంత్రి గారి మీద . అయన లిప్త పాటు తటపటాయించారు. రోట్లో తలపెట్టి భయపడితే కుదురుతుందా.

‘ రాజ్యం అంతా ఇదే విషయం గా గగ్గోలు ఎత్తి పోతోంది ... ‘ కాస్త సేపు గట్టిగా ఉపిరి తీసుకున్నారు కళ్ళెత్తి రాజు గారి వైపు చూసి మళ్ళా తల దించుకుని అడిగారు

“ ఏడో చేప కూడా ఎండిందీ అని ...........” విచిత్రంగా ఆయన మాటలు ఆయనకే సరిగ్గా వినిపించలేదు అందుకని ఇంకొంచం స్పష్టంగా మళ్ళా అన్నారు “ ఏడు చేపలు ఎండ పెడితే ... ఏడు చేపలూ ఎండినాయట నిజమేనా ... “

కాసేపు మౌనం రాజ్యమేలింది , రాజు గారు అందరినీ గమనించి చూసారు . అందరి మొహాల్లో ఆదుర్దా రాజు గారి సమాధానం ఏమిటో అని . రాజు గారి మొహం లో ముందు చిరునవ్వు మొలకెత్తింది , తరువాత అది సరి నవ్వుగా మారింది.

“ ఇందులో సందేహం ఏమి ఉంది ? చేపలు ఎండ పెడితే ఎండవా ? ...ఎండాయి రాజకుమారులు తెచ్చిన ఏడు చేపలు ఎండాయి ... నిస్సందేహంగా ఎండాయి ... దీంట్లో విడ్డురం ఏమి వుంది రాజ్యం గగ్గోలు పుట్టటానికి ఏమంత విషయం ఉంది ...? ... ఏదో జరిగి పోయిందని నేను కొంచెం అనుమానపడ్డాను, సరే నేను బయలుదేరుతాను “ అంటూ సిద్దంగా ఉన్న తన వాహనం ఎక్కి వెళ్ళిపొయ్యారు . ఆయన తో బాటు ఆ రాజ్యాన్ని , ఆ రాజ్య ప్రజానీకాన్ని , ఆ రాజ్యసంపదను కాపాడే నిస్వార్ధ బలగం అంతా రేపటి వైపుకు అడుగు వేసింది .

ఒక్క చేపన్నా ఎండకుండా ఉంటె కదా మొత్తం కధ నడిపి చీమల పుట్టని . గడ్డిదుబ్బు ని చూపించి , ఆవుల్ని , పశువుల కాపరులని , చంటి బిడ్డల్ని విచారణ చేసే నెపం తో కాస్త వెనక్కి వేసుకోవడం ....ఇహ ఇట్లా అన్ని చేపలూ ఎండిపోతే ఇక మాకు దిక్కేంటి అని శత్రు రాజుల దగ్గరకు రాయబారాలు మొదలైనాయి .

అన్ని చేపలు ఎండటం తో సామాన్య ప్రజలు కూడా తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని పాత కధను కంచికి పంపించేశారు . పదండి మనం ఇంటికి వెళ్దాం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.