సంధ్యా సమయం. అప్పుడే సూర్యుడు పడమర దిక్కున అస్తమిస్తూ నీలాకాశానికి సింధూరవర్ణం అద్ది అలరిస్తున్నాడు. శీతాకాలం కావడంవల్ల చిన్నపాటి చల్లగాలి ఉండుండి వీస్తోంది. ఆ చిరు గాలికి చెట్లకొమ్మలు విచిత్రంగా నాట్యం చేస్తున్నాయి. చెట్లపై పక్షుల కిలకిలా రావాలు మనసుని పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి అత్యంత రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంది. అయితే పార్క్‌లో ఒంటరిగా కూర్చున్న సాగర్‌ని ఇవేవీ మెప్పించలేకపోతున్నాయి. అతని మనసుని రంజింప చేయలేకపోతున్నాయి. పైగా అతని మనసు చాలా చిరాగ్గా ఉంది. స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు. ఉదయం భార్య శాలినితో గొడవపడిన సంఘటన గుర్తుకు వచ్చింది.
సాగర్, శాలిని వివాహం జరిగి పూర్తిగా ఒక సంవత్సరం కూడా కాలేదు. ప్రేమించి పెద్దల్ని ఎదురించి పెళ్ళిచేసుకుని దాంపత్య జీవితంలో మాధుర్యం అనుభవిస్తున్న వాళ్ళమధ్య చిలిపి తగాదాలు ఎన్ని వచ్చినా వాళ్ళ అనుబంధం మరింత గట్టిపడిందే కానీ, ఎప్పుడూ గతి తప్పలేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. మొదట చిన్న తగాదా అనుకున్నదల్లా నిప్పురవ్వలా మారి వాళ్ళమధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఇద్దరి మధ్యా అగాధాన్నీ సృష్టించింది. తమమధ్య అసలెందుకు తగువు వచ్చిందో గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు ఆదివారం. ఇద్దరూ ఉద్యోగస్థులు అవడంతో ఆదివారం ఉదయం ఇల్లంతా ఇద్దరూ కలసి శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత వంట చేసుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకోవటం అలవాటు. సాయంకాలం మాత్రం హాయిగా షికారుకో, సినిమాకో, లేక బీచ్‌కో వెళ్ళి సరదాగా గడిపి రాత్రి ఏదో హోటల్లో భోజనం ముగించి ఇంటికి తిరిగి రావడం అలవాటు వారిద్దరికీ.
అలాగే ఈ రోజుకూడా ఇద్దరూ కలిసి ఇల్లు శుభ్రం చేసే పనిలోపడ్డారు. సరిగ్గా అప్పుడే శాలిని అంది, "ఈ నెల మా కంపెనీ బోనస్ ఇస్తుంది. లక్షరూపాయల వరకూ రావచ్చు. దానిపై ఇంకొంత వేసి శ్రావణ శుక్రవారంకి నెక్లెస్ కొనాలని ఉంది." అందామె టివి తుడుస్తూ.
శాలిని మాటలు విన్న సాగర్ అదిరిపడ్డాడు. "అదేంటి, మర్చిపోయావా? ఓ అయిదేళ్ళవరకూ మనం పొదుపు పాటించాలనుకున్నాం కదా! అందుకే ప్రతీనెలా ఖర్చులు అదుపుచేసి డబ్బులు దాస్తున్నాం. అయిదేళ్లలో మనవద్ద కూడిన డబ్బులకితోడు బ్యాంక్ లోన్‌పెట్టి మంచి ఫ్లాట్ కొందామనుకున్నాం కదా! నీకు దొరకబోయే బోనస్ కూడా బ్యాంక్‌లో జమచేసి ఉంచుదాం." అన్నాడు సాగర్.
"నిజమే! నాకా విషయం బాగా గుర్తుంది. అయితే ఈ ఒక్కసారికి నాకు నెక్లెస్ కొనుక్కోవాలని ఉంది. ఇప్పటివరకూ నేను నిన్నేమీ కోరలేదు. ఈ ఒక్కసారికీ నేను కోరిన విధంగా చేద్దాం. ఇకముందెప్పుడూ నిన్నేం కోరను." అందామె.
"ఇలా ప్రతీసారి అనుకుంటూ పోతే మనం ఇక ఫ్లాట్ కొన్నట్లే! నేను ఇందుకోసం ఎన్ని మానుకున్నానో తెలుసా! సిగరెట్లు, సినిమాలు, స్నేహితులతో షికార్లు అన్నీ మన ఆశయంకోసం మానేసాను. మా స్నేహితుల దృష్టిలో పిసినారిగా ముద్రపడ్డాను కూడా. నాలాగే నువ్వు కూడా నీ వంతు త్యాగం చేయకపోతే మనం ఫ్లాట్ కొనలేం." అన్నాడు.
"మరి నేను మాత్రం! నేను ఎన్ని సరదాలు వదులుకోలేదు? పెళ్ళికాకముందు నెలకో చీర కొనేదాన్ని తెలుసా? ఆఫీసుకి స్కూటీలో వెళ్ళేదాన్ని. ఇప్పుడేమో బస్సులో వెళ్తున్నాను. ఇవన్నీ ఎందుకోసం? మనం ఫ్లాట్ కొందామనేకదా! అక్కడికి నువ్వక్కడివే త్యాగం చేసానని అనుకుంటున్నావెలా? పోనీ, నువ్వు కొనకపోతే మా నాన్నకి అడిగి కొనిపించుకుంటానంటే ఒప్పుకోవుకదా?" అందామె.
"మీ నాన్న చేత నెక్లెస్ కొనిపించుకోవడం సంగతలా ఉంచు,మీ నాన్న చూసిన సంబంధమే చేసుకోలేకపోయావా? బాగా ఆస్థులున్న సంబంధమే చూసారట కదా! నా అర్థిక పరిస్థితి చూసి కూడా నన్నెందుకు పెళ్ళిచేసుకున్నావు? మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని ఉంటే, అప్పుడు నీకు ఇంత కష్టం లేకపోను కదా! ఏమైనా నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే నా తప్పు." ఉద్రేకంగా అన్నాడు సాగర్.
"నిజమే! నేను నిన్ను ప్రేమించి తల్లితండ్రులను ఎదురించి మరీ పెళ్ళి చేసుకోవడం నిజంగా నా తప్పే!" కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతుండగా విసురుగా అంది శాలిని.
అలా మొదలైన వారి తగాదా చివరికి తీవ్రరూపం దాల్చి, శాలిని పుట్టింటికెళ్ళేదాకా వచ్చింది. వారించడానికి సాగర్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. శాలిని కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏమీ చెప్పకుండా సూటుకేస్ సర్దుకొని సాగర్ చూస్తూండగానే గడప దాటింది.
పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి ఆమె పుట్టింటికి వెళ్ళడం. పెద్దల్ని ఎదురించి వాళ్ళు పెళ్ళి చేసుకోవడంతో ఇంతవరకూ శాలిని పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇందుకు శాలిని తల్లి శారదమ్మ మనసులో బాధపడినా భర్తకి నచ్చచెప్పలేక పోయింది. కూతురికి తమ అంతస్థుకి తగిన సంబంధం తెచ్చినా ఆమె సాగర్‌ని వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపడం ఆమె తండ్రి చలపతిరావుకి నచ్చలేదు. ఎంత నచ్చచెప్పినా తను ప్రేమించిన సాగర్‌ని తప్ప ఇంకెవర్నీ వివాహం చేసుకోనని మొండికేసింది శాలిని. చలపతిరావు కూడా తన పట్టు వీడలేదు. సాగర్‌కన్నా తను చూసిన సంబంధం ఎన్నిరెట్లు మేలో వివరించి చెప్పినా ఫలితం లేకపోయింది. తల్లితండ్రులను ఎదురించి అయినా సాగర్‌నే వివాహం చేసుకోవడానికి నిశ్చయించిందామె. శారదమ్మ ఇటు కూతురికి, అటు భర్తకి నచ్చచెప్పలేక ఇద్దరిమధ్యా నలిగిపోయింది. సాగర్, శాలిని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్ళిచేసుకొని పెద్దవాళ్ళకి దూరంగా ఉన్నారు. సంవత్సరకాలంగా వాళ్ళమధ్య రాకపోకలు లేవు. శారదమ్మ మాత్రం ఈ మధ్యకాలంలో మనసు ఉండబట్టక భర్తకి తెలియకుండా కూతురికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కొనేది. అలాగే కులాంతర వివాహం కావడంవల్ల సాగర్ తల్లితండ్రులకూ ఈ సంబంధం ఇష్టం లేదు.
ఎవరినుండీ ఎటువంటి సహకారం లేకపోయినా స్నేహితుల అండతో పెళ్ళిచేసుకుని కాపురం పెట్టిన ఆ జంటకి రోజులు హాయిగానే గడిచిపోతుండగా ఇప్పుడు ఇద్దరిమధ్యా జగడంవచ్చి ఈ పరిస్థితి ఏర్పడింది. పెళ్ళయిన కొత్తలో జీవితంలో చాలా రకాల కలలు కన్నారు. అందులో ఒకటి స్వంత ఫ్లాట్ కొనడం. తమ కల సాకారం చేసుకోవడానికి ఇద్దరిమధ్యా ఒక ఒప్పందం కుదిరింది. అయిదేళ్ళపాటు పొదుపు పాటించి కొంత డబ్బులు వెనకేసుకున్న తర్వాత బ్యాంక్‌నుండి లోన్ తీసుకొని ఫ్లాట్ కొనాలన్నదే ఆ ఒప్పందం.
ఇద్దరూ అందుకే పొదుపు పాటిస్తూ సంవత్సరకాలంగా జాగ్రత్తగా ఉంటున్నారు. వారంలో ఒక్క ఆదివారం మాత్రమే ఎక్కడికైనా వెళ్ళి సమయం గడిపేవాళ్ళు. అలాంటిది ఈ ఆదివారమే ఇలా జరగడం సాగర్‌కి చాలా కష్టమనిపించింది.
పార్కులో కూర్చున్న సాగర్ మదిలో ఇలా చాలా ఆలోచనల సుడులు రేగుతున్నాయి. అక్కడ ఒక చోట నిలకడగా కూర్చోలేక కొద్దిసేపు అటూఇటూ తిరిగాడు. చాలా ఆదివారాలు, పెళ్ళైనముందు, ఆ తర్వాత కూడా సాయంకాలం ఇద్దరూ కలిసి ఆ పార్కుకి వచ్చి చాలా సేపు గడిపేవారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మనసు వికలమై సాగర్ మరి అక్కడ స్థిమితంగా ఉండలేకపోయాడు. పార్కు నుండి బయటపడి హోటల్‌కి వెళ్ళి భోజనం పార్సల్ చేసుకొని ఇంటి దారి పట్టాడు.
శాలిని ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. గలగల మాట్లాడే ఆమె ముఖమే మాటిమాటికీ కళ్ళముందు కదలాడసాగింది. 'తనన్న మాట ఎందుకు వినదు తను? తనేమీతప్పుమాట అనలేదే! ముందు స్వంత ఫ్లాట్ ఏర్పరచుకున్నాక ఆమె కోరినవన్నీ కొని ఇస్తానన్నాడు కదా! తన మాట కూడా వినిపించుకోకుండా ఎందుకంత పౌరషంగా మాట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయింది? తనేమన్నాడని? ఇద్దరూ కలిసేకదా ప్లాన్ చేసుకున్నారు. వెళితేవెళ్ళనీ, తనేనా ఎప్పుడూ తగ్గాలి, ఆమెందుకు తగ్గకూడదు?' ఇలా ఆలోచిస్తూ తల విదిలించి ఆమె ఆలోచనల్లోంచి బయటపడ్డాడు సాగర్.
సోఫాలో కూర్చొని టీవీ ఆన్‌చేసాడు రిమోట్‌తో. ఏదో షో వస్తోంది. ఏంకర్ తనకలవాటైన రీతిలో గలగల మాట్లాడుతూ షో నిర్వహిస్తున్నాడు. ఏవో కొంటె ప్రశ్నలు వేస్తున్నాడు అక్కడ కూర్చున్న ప్రేక్షకులకి. ఒకొక్కరూ ఒకో విధంగా జవాబులు చెప్తున్నారు. రెండు నిమిషాలు చూసిన తర్వాత బోర్‌కొట్టి ఇంకో చానల్ మార్చాడు. ఏదో పాత సినిమా వస్తోంది. హీరో, హీరోయిన్ వర్షంలో తడిసి ముద్దవుతూ రోమాంటిక్ గీతం ఆలపిస్తున్నారు. ఆ సన్నివేశం చూడగానే సాగర్‌కి మళ్ళీ శాలిని గుర్తుకు వచ్చింది. అమె గుర్తుకు రాగానే పెద్దగా నిట్టుర్చాడు సాగర్. ఏడాది క్రితం శాలినితో సిమ్లా మనాలికి హానీమూన్‌కోసం వెళ్ళినప్పటి సంఘటనలు గుర్తుకు వచ్చాయి సాగర్‌కి. మంచుకొండల మధ్య చిరుజల్లులో తడుస్తూ ఒకరి చేతులొకరు పట్టుకొని నడుస్తూ తిరిగిన సంఘటనలు కదలాడాయి సాగర్ కళ్లముందు. అక్కడ గడపిన మధురమైన క్షణాలు గుర్తుకువచ్చాయి సాగర్‌కి.
మళ్ళీ ఆలోచనలు శాలినివైపు మళ్ళడంతో టివి కట్టేసి, డైనింగ్ టేబుల్‌వద్దకు వెళ్ళి భోజనం పెట్టుకున్నాడు. ప్రతీ ఆదివారం ఎంతో సరదాగా గడిపే సాగర్‌కి ఈ రోజు అసలు సమయం గడవడమే కష్టమైపోతోంది. కొసరికొసరి వడ్డించే శాలినే గుర్తుకి వచ్చేసరికి ఒక్కడూ భోజనం చెయ్యలేక సగంలోనే చేతులు కడిగేసుకున్నాడు.
ఆ రాత్రి నిద్రపట్టడం గగనమైంది సాగర్‌కి. ఎంతవద్దనుకున్నా ప్రతీ క్షణమూ శాలినే గుర్తుకు రాసాగింది. ఏ రాత్రివేళ నిద్రాదేవి కరుణించిందో మరి తెల్లారి లేచేసరికి చాలా అలస్యం అయింది. వాచి చూసుకున్నాడు. 'అమ్మో! ఎనిమిదైందే!' అని ఆదరాబాదరాగా లేచి "శాలినీ !..." అని కేకవేయబోయి ఆగిపోయాడు, క్రితం రోజే ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవడం గుర్తుకు వచ్చి. ప్రతీరోజూ తెల్లారి ఐదుగంటలకల్లా లేచి, స్నానాదులు ముగించి, పూజ పూర్తిచేసి సాగర్‌ని ఏడుగంటలకల్లా నిద్రలేపేది. నిన్న జరిగినదంతా ఒక్కసారి గుర్తుకువచ్చి, సాగర్ వెంటనే గాబరాగా లేచి బాత్రూంకి వెళ్ళాడు తయరవడానికి.
ఆ రోజంతా కూడా శాలిని ఆలోచనలతోనే గడిచింది. ఆఫీసులో కూడా ఆమె తలపులే సాగర్‌ని వెంటాడాయి. ఎంత ప్రయత్నించినా ఆమె ఆలోచనల్లోంచి బయట పడలేకపోతున్నాడు సాగర్. తన ఆలోచనల్ని మరల్చుకోవడానికి ప్రయత్నిస్తూ సెల్ తీసాడు. అయితే అందులోనూ తనూ, శాలినీ కలిసి తీయించుకున్న ఫొటోలన్నీ సాగర్‌ని వెంటాడసాగాయి. రకరకాల ఫోజుల్లో తీసుకున్న ఫొటోలన్నీ సాగర్‌ని వెక్కిరించాయి.
సాయంకాలం అయ్యేసరికి, శాంతంగా ఆలోచిస్తే తప్పు ఆమెలో మాత్రమే లేదని తనలో కూడా కొంత ఉందని అనిపించింది సాగర్‌కి. 'అవును, మరి! అమె ఎప్పుడూ ఏమీ కోరలేదు. పెళ్ళి అయిన తర్వాత ఆమె తన కోర్కెలకి చాలా మట్టుకు అడ్డుకట్ట వేసింది. తమ లక్ష్యం కోసం తనొక్కడే కాదు, ఆమె కూడా తనవంతు పూర్తి సహకారం అందిస్తోంది. ఆమె ఎప్పుడూ దుబారా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడెందుకు మోజుపడిందో ఆమె, తను కూడా సున్నితంగా చెప్పవలసింది. తెగేవరకూ లాగడంవల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అమె కోరినట్లు నెక్లెస్ కొంటే అంత సమస్యేమీ లేదు. కాకపోతే తమ లక్ష్యం నెరవేరడానికి ఇంకో ఆరునెలలో లేక ఓ ఏడాదో పడుతుంది అంతేకదా! ఈ చిన్నవిషయంకోసమే తను అంత కోపం తెచ్చుకోవాలా? పాపం తను అలా మాట్లాడటంవల్ల ఎంత బాధపడిందో! తనతో జీవితం పంచుకోవడం కోసం తన వారినందరినీ వదిలి తనతో వచ్చింది. ఆ సంగతి కూడా తను గుర్తుంచుకోవాల్సింది.' అని తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు సాగర్.
'పాపం తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన శాలిని మనసులో ఏమనుకుంటున్నదో? తల్లితండ్రులను ఎదిరించి తనతో వచ్చిన ఆమె ఇప్పుడు మళ్ళీ ఇంటికివెళ్ళిన తరవాత అక్కడ ఏం అవమానాలు పాలవుతుందో? రేపే వెళ్ళి ఆమెని తీసుకొని రావాలి.' అని అనుకున్న తర్వాతగాని నిద్రపట్టలేదు సాగర్‌కి.
**** **** **** **** **** ****
శాలిని ఇంటికి చేరిందే కాని ఆమెకి మనసు మనసులో లేదు. ఇంటికి పెట్టి బేడాతో వచ్చి రాగానే పరిస్థితి గమనించాడు కాబోలు ఆమె తండ్రి, "ఏమేవ్! చూసావా నీ కూతురు వచ్చేసింది! నే చెప్పలేదా, ప్రేమ వివాహాలు ఎంత సేపు నిలబడతాయి? పూటకి ఠికాణాలేని వాడిని చేసుకోవద్దంటే వినలేదే? పోనీ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దానికి నిజం తెలిసివచ్చింది. విడాకులు తీసుకుంటే సరి, అప్పుడు నేను చూసిన పెళ్ళికొడుకుకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇప్పటికీ అతను మన శాలినిని చేసుకోవడానికి రెడీగానే ఉంటాడు." అన్నాడు.
"అబ్బ! ఉండండి! మీ అపశకునం మాటలూ, మీరునూ! అసలు అమ్మాయి ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా ఏమిటా మాటలు?" అంది శారదమ్మ విసుక్కుంటూ.
ఆ రోజంతా శారదమ్మ ఎంత మాట్లాడించటానికి ప్రయత్నించినా ఏమీ మాట్లాడలేదు శాలిని. రోజంతా ఆమె ముభావంగా ఉండటంతో అసలేమి జరిగిందో తెలుసుకోలేక పోయింది శారదమ్మ. తండ్రి చలపతిరావు అయితే ఇంకా కూతురితో బెట్టుగానే ఉన్నాడు పెళ్ళి విషయంలో తన మాట వినలేదన్న కోపంతో.
తను వచ్చినదగ్గరనుండి తండ్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా సాగర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమెకి భరింపరానిదైంది. తల్లికి ఏం చెప్పినా ప్రయోజనం లేదు.
మౌనంగా గదిలోపలికి వెళ్ళి తలుపువేసి మంచంపై పడి రోదించిందామె. 'అసలు తనెప్పుడూ ఏ కోరికా కోరనేలేదు సాగర్‌కి. తనసలు కట్టుబట్టలతో సాగర్‌వెంట కొత్తకాపురానికి వచ్చింది. పుట్టింట్లో ఎంతో ఆడంబరంగా బతికిన తనకి సాగర్ సమక్షం స్వర్గాన్ని తలపింప చేసింది. తను తన కోరికలన్నీ త్యజించి అతనివెంట నడిచింది. అయినా సాగర్ అర్ధం చేసుకోడేమీ? తన స్నేహితులందరూ శ్రావణమాసానికి బంగారం ఆభరణాలు కొనుక్కోవడంతో తనూ ఆశపడింది. అయినా తనకు రాబోయే బోనస్ డబ్బులతోనే కొనాలని అనుకుందికాని, జీతంలోంచి ఖర్చుపెట్టాలని భావించలేదే? కొద్దిగా ఎక్కువ పడితే మాత్రం దాచిఉంచిన డబ్బుల్లోంచి వాడాలని అనుకుంది గానీ. సాగర్ శాంతంగా చెప్పిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తను ఒక్కసారి అలా రియాక్ట్ అవడంవల్ల తన మనసెంత బాధపడిందో ఆలోచించడేమీ సాగర్? తను మాత్రం స్వంత ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆశయంతో ఎన్ని వదులుకోలేదు? అవన్నీ ఆలోచించడేమీ సాగర్?' ఆమె బుర్ర ఆలోచనలతో వేడెక్కింది. మనసు బరువైంది.
భోజనం కూడా సహించలేదు. తల్లి ఎంత బుజ్జగించినా పెదవి విప్పలేదు శాలిని. 'తనేం చెప్తుంది? చెప్తే లోకువైపోదూ? చెప్పినా తన సమస్య ఆమె ఎలా తీరుస్తుంది? తండ్రి ఎలాగూ తనకెటువంటి మద్దతూ ఇవ్వడు! ఇప్పుడు తనేం చేయాలి?' మళ్ళీ ఆలోచనలతో మనసు వికలంకాగా సరిగ్గా భోజనం చేయకుండానే లేచిందామె.
సాయంకాలం అయ్యేసరికి శాలినికి ప్రతీక్షణం సాగరే గుర్తుకు రాసాగాడు. మనసు మరల్చుకోవడానికి సాయంకాలం షాపింగ్‌కని బయలుదేరింది. అయితే ప్రతీక్షణం ఆమెకి సాగరే గుర్తుకి రాసాగాడు. ఇద్దరూ కలసివెళ్ళి ప్రతీనెలా మొదటివారం ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ ఒకేసారి కొనేవారు, దానివల్ల ఆదా అవుతుందని. షాపింగ్ మిషమీద షాపింగ్‌మాల్‌కి వెళ్ళిందేకాని ఆమెకి అక్కడ ఎక్కవసేపు ఉండబుద్ధిపుట్టక తిరిగి ఇంటికి తిరిగివచ్చిందామె.
రాత్రికూడా ఆమె మనసుని సాగరే ఆక్రమించాడు. ‘సాగర్ వద్దని అనగానే, తనెందుకు వినకుండా వాదించింది? అందువల్ల ఇద్దరిమధ్యా మనస్పర్థలు పెరగడమేకానీ ప్రయోజనమేమీ లేదుకదా? తండ్రిమద్దతు తనకెలాగూ లేదని తెలిసినా అతని ప్రసక్తి ఎత్తింది ఎందుకు?’ ఆలోచించేకొద్దీ, తను కూడా పొరపాటు చేసానేమోనని అనిపించిదామెకి. ‘ఇద్దరూ కలసి ఓపిగ్గా చర్చిస్తే సమాధానమైపోయే సమస్యకి తను ఇల్లువిడిచి ఇలా వచ్చేయడం భావ్యమేనా? తను ఇలా వచ్చేయడంవల్ల సాగర్ ఎంత బాధపడి ఉంటాడు?’
తను తప్పు చేసిన భావన శాలినిని పీడించింది. రేపు ఉదయమే ఇంటికి తిరిగివెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాతగాని శాలినికి నిద్రపట్టిందికాదు.
**** **** **** **** **** ****
పూర్తిగా తెల్లవారకుండానే లేచి శాలినిని తీసురావడానికి బైక్‌పై బయలుదేరాడు సాగర్. అతను అలా అక్కడికి చేరాడోలేదో, అప్పుడే శాలినికూడా తన బ్యాగ్ పట్టుకొని వీధిలోకి వచ్చింది. ఒకరినొకరు చూసుకున్నారు విస్మయంగా. అదీ ఒక్కక్షణమే! బైక్ ఎక్కింది ఆమె. ఆ తర్వాత, అంతకు ముందేమీ అసలు జరగనట్లే చెట్టాపట్టాలేసుకొని అక్కణ్ణుంచి కదిలారు వాళ్ళిద్దరూ.
అది చూసి శారదమ్మ ఊపిరి పీల్చుకుంది.
ఇంటికి చేరిన తర్వాత, "శాలినీ!...నాదే పొరపాటు! నేను అన్ని మాటలనవలసింది కాదు. ఎప్పుడూ ఏమీ కోరని నువ్వు నోరుతెరిచి అడగ్గానే నేను ఒప్పుకోవలసింది. పద ఇవాళ సాయంకాలమే వెళ్ళి నెక్లెస్ కొనుక్కొద్దాం!" అన్నాడు సాగర్.
"లేదు సాగర్! తప్పు నాది కూడా! మన ఆశయం తర్వాతే ఏ కోరికైనా! నెక్లెస్ కొనవద్దు. పూజకోసం ఏదైనా మన అందుబాటులో ఉన్నదే తీసుకుందాం!" అంది శాలిని.
ఇద్దరూ హుషారుగా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళిద్దరిమధ్యా అసలు గడవ జరిగిన ఆనవాళ్ళే లేవు. ఈ గొడవకూడా మిగతా చిన్న జగడాల జాబితాలోనే చేరిపోయింది.