బెజవాడ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. హడావిడిగా ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చిన రమాపతి,ట్రైన్ అప్పటికే ఆగి ఉండటంతో వేగాన్ని మరింత పెంచి తాను ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు. టెన్షన్ తగ్గడంతో నెమ్మదిగా తన సీట్ దగ్గరకు చేరుకున్నాడు. మధ్య సీట్ లో కూర్చుని, కాస్త స్థిమిత పడ్డాక ప్రక్క సీట్ల వంక దృష్ఠి సారించాడు.
కుడివైపు కిటికీ సీట్ దగ్గర ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని వున్నాడు. పొడవాటి తెల్లటి గడ్డం తో ఉన్న అయన కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు.
తరువాత తన దృష్టిని ఎడమవైపు ఉన్న వ్యక్తి వైపు సారించాడు రమాపతి.
తనలాగే ముప్పై ఏళ్ళ వ్యక్తి.
అతని ముఖంలో దిగులు తాండవిస్తోంది.
'ఏదైనా కష్టాలలో ఉన్నాడేమో....' అని జాలి పడ్డాడు రమాపతి.
కాసేపటికి టికెట్ కలెక్టర్ వారి వద్దకు వచ్చాడు.ముగ్గురినీ మార్చి మార్చి చూసాడు.
తిరిగి తన చార్ట్ వంక చూసాడు.
మళ్ళీ ముగ్గురినీ పరిశీలనగా చూసాడు.
అతని ముఖంలో సన్నటి చిరునవ్వు.
ఏదో అనబోయి అంతలో ‘తనకెందుకులే’ అనుకున్నాడేమో!
ఏమీ మాట్లాడకుండా టిక్కెట్లు పరిశీలించి వెళ్ళిపోయాడు. వెళ్లేముందు మరోసారి వాళ్ళ వంక చూసి సన్నటి నవ్వు నవ్వాడు.
"ఏమిటీ? మన మొహాల్లో ఏదైనా విచిత్రం కనబడుతోందా?"రమాపతి తో అన్నాడు ఎడమ వైపు కూర్చుని ఉన్న వ్యక్తి.
"అదే నాకూ అర్ధం కావడం లేదు. అన్నట్లు నా పేరు రమాపతి. హరిద్వార్ వెళుతున్నాను” పరిచయం చేసుకున్నాడు రమాపతి.
సన్నటి చిరునవ్వు అవతలి వ్యక్తి ముఖంలో.
"నా పేరు సీతాపతి. నేనూ హరిద్వార్ వెళుతున్నాను" చెప్పాడతను. తరువాత రమాపతికి దగ్గరగా జరిగి “బహుశా అటువైపు కూర్చున్న స్వామిజీ పేరు ఉమాపతి అయి ఉంటుంది" చెవిలో చిన్నగా చెప్పాడతను.
ఆ మాటలు స్వామిజీ చెవిలో పడ్డాయి.
"కాదు నాయనలారా! అయినా 'స్వామిజీ' అన్నారుగా. Sఅలానే పిలవండి." ఇద్దరివంక చూస్తూ అన్నారాయన.
ఇద్దరూ స్వామీజీకి నమస్కరించారు."ఇంతకీ ఏ పనిమీద హరిద్వార్ వెళ్తున్నారో తెలుసుకోవచ్చా?"అడిగారాయన.
ఇద్దరూ మౌనంగా ఉండటం చూసి ఆయనే ఇలా అన్నారు"బహుశా ఏ స్మగ్లింగ్ పనిమిదో వెళుతూ ఉండి ఉంటారు. అందుకే చెప్పడానికి తటపటాయిస్తున్నారు"
"అబ్బే! అలాంటిదేమీ లేదు స్వామీ" ముక్తకంఠంతో అన్నారిద్దరూ .
"మరైతే భార్యల మీద అలిగి సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నారా?" అంటూ బిగ్గరగా నవ్వేశారు స్వామిజీ.
"అంత కరెక్టుగా ఎలా ఊహించారు స్వామీ ?"అని రమాపతి అనడంతో నిర్ఘాంతపోయారు స్వామిజీ.
"నేను కూడా డిటో" అని సీతాపతి అనడంతో మరింత దిగ్భ్రాంతికి లోనయ్యారాయన.
కాసేపటికి తెప్పరిల్లి "ఇద్దరూ కలిసి నాతో పరాచికాలాడుతున్నారు కదూ" అన్నారు.
"స్వామీజీలంటే నాకు చాలా గౌరవం. నేను వెళ్తున్నది కూడా హరిద్వార్లో ఒక స్వామీజీని కలవడానికే. అలాంటిది నేను మీతో పరాచికాలాడతానా?" అన్నాడు రమాపతి నొచ్చుకుంటూ.
"వాట్ ఏ కోఇన్సిడెన్స్? నేను కూడా అదే పనిమీద వెళ్తున్నాను." ఆశ్చర్యంగా అన్నాడు సీతాపతి.
"బహుశా విజయవాడ నుండి హరిద్వార్ వెళ్లి ఆశ్రమం ఏర్పరచుకున్న లక్ష్మీనారాయణ స్వామిగారి కోసం వెళ్తున్నారేమో" నవ్వుతూ అన్నారు స్వామిజీ.
"అవును స్వామిజీ." అన్నారిద్దరూ.
ఆ స్వామిజీ నాకు బాగా తెలుసు. వారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మీరు ముందుగా మీ నిర్ణయాలకు కారణం నాకు చెప్పండి. దాన్నిబట్టి మీ విషయం ఆయనకు ఎలా చెప్పాలో నాకు అవగాహనకు వస్తుంది" అన్నారు స్వామిజీ.
చెప్పడానికి ఉపక్రమించే ముందు ఒకసారి ఎదుటి సీట్ వంక చూసాడు రమాపతి. అక్కడ ఒక మరాఠీ కుటుంబం ఉన్నారు. తమ భాషలో మాట్లాడుకుంటూ వారి లోకంలో వారు ఉండటంతో తన కథ ప్రారంభించాడు.
"నాకు బీసెంట్ రోడ్డులో ఒక బట్టల దుకాణం వుంది.
ఆరు నెలల క్రితం నాకు పెళ్లయింది. నా భార్య పేరు రమ.
పేర్లు బాగా కలిశాయని అందరూ అంటుంటే పొంగిపొయాను.
నా భార్యను కాపురానికి తీసుకుని వచ్చేటప్పుడు అత్తమామలతో పాటు బావమరిది కూడా వచ్చాడు. ఓ వారం గడిచాక అత్తమామలు తిరుగు ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్నారు.
బామ్మర్ది మాత్రం నా బెడ్ రూమ్ లో నిద్ర పోతున్నాడు.
'ఇదేమిటి? ఇతడు వెళ్లడం లేదా? లేదులే. అంతా సర్దడం అయ్యాక టక్కున లేచి ఓ పది నిముషాల్లో రెడీ అవుతాడేమో.' నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అత్తమామలు లగేజి చేతుల్లోకి తీసుకున్నారు. ఇక ఆతృత ఆపుకోలేక నా భార్యను వంటిట్లోకి పిలిచాను.
"ఇదేమిటి?మీ తమ్ముడు వెళ్లట్లేదా?" అడిగాను.
లేదండీ! వాడికి చదువెలాగూ అబ్బలేదు కదా. కొద్దిరోజులు మీ అంగట్లోనే పని నేర్చుకుంటే తర్వాత నాన్నగారు స్వంతంగా షాపు పెట్టిస్తారట. మీకు కూడా అంగట్లో సహాయంగా ఉంటుందని సరే అన్నాను. మన దగ్గరే ఉంటాడు" చల్లగా చెప్పింది రమ.
"కొంప ముంచావు రమా! షాపుకు దగ్గరగా ఉంటుందనే సాకుతో ఈ ఇల్లు చిన్నదైనా అద్దెకు తీసుకున్నదెందుకు? మనకు ఏకాంతం దొరుకుతుందని. అమ్మానాన్నలు కూడా అర్ధం చేసుకొని అభ్యంతరం చెప్పలేదు. ఈ ఇలు అసలే చిన్నది. పానకంలో పుడకలా మీ తమ్ముడిని తీసుకుని వస్తే ఎలా?" అన్నాను.
"ఛీ పాడూ ! మీకెప్పుడూ అదే ధ్యాస. అవతల అమ్మానాన్నలు ఎదురు చూస్తున్నారు."అంటూ హాల్లోకి నడిచింది రమ.
"వస్తాం అల్లుడుగారూ! అమ్మాయి గురించి మాకేం దిగుల్లేదు. గట్టి మనిషే. మా దిగులల్లా అబ్బాయి గురించే. వాడు పూర్తిగా అమాయకుడు. ఇక వాడికి మిరే అన్నీ....."బామ్మర్ది బాధ్యతను అప్పగించి నిష్క్రమించారు అత్తమామలు. రోజూ నాతోపాటు బామ్మర్దిని కూడా షాపుకు తీసికొని వెళ్ళేవాడిని. షాపులో ఓ మూల కూర్చుని సెల్ ఫోన్ లో గేమ్ లు ఆడుకునేవాడు. చిన్నపాటి పనికూడా చేసేవాడు కాదు. ఈ విషయం రమతో చెప్పాను.
"చిన్నవాడు కదండీ. తప్పకుండా మారుతాడు .అయినా మా తమ్ముడనేకదా చిన్న విషయాన్ని తప్పుగా చెబుతున్నారు!"అంది రమ.
చేసేది లేక అలాగే సర్దుకుంటున్నాను నేను. కానీ నేను షాప్ నుండి పనిమీద బయటకు వెళ్ళివచ్చాక డ్రా లో డబ్బులు తగ్గి ఉండటం చాలా సార్లు గమనించాను.
ఈ విషయాన్నీ భయపడుతూనే రమకి చెప్పాను.
"చిన్నవాడు కదండీ!...."అంటూ పాతపాట పాడడంతోబాటు "అయినా కుర్రవాడికి ఖర్చులుంటాయని తెలీదా?మీ తమ్ముడైతే మిరే ఖర్చులకి డబ్బులు ఇవ్వరా?"అని ఎదురు ప్రశ్నించింది రమ.
ఆలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి నాకు టైఫాయిడ్ రావడంతో ఓ పదిరోజులపాటు షాప్ మూసివేద్దామనుకున్నాను.
"ఎందుకండీ! మా తమ్ముడు చూసుకుంటాడు లెండి. బావకు ఆ మాత్రం సహాయం చెయ్యలేడా? పైగా వాడికి కూడా స్వంతగా వ్యాపారం చెయ్యడం రావాలి కదా." అంది రమ.
చేసేది లేక 'సరే' అన్నాను. నేను కోలుకోవడానికి పదిహేను రోజులు పట్టింది.
తరువాత షాప్ కి వెళ్లి చూసిన నాకు మతి పోయింది.
దాదాపు సగం షాప్ ఖాళీ అయింది. దాని తాలూకు డబ్బులు మాత్రం జమ కాలేదు. బామ్మర్దిని అడిగితే పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అతడు లేని సమయం చూసి గుమస్తాను అడిగాను. మొదట తటపటాయించినా తరువాత అసలు విషయాలు ఒకటొకటిగా బయట పెట్టాడతను.
మా బావమరిదికి అన్ని వ్యసనాలూ ఉన్నాయట. సాయంత్రమయ్యేసరికి బార్ లో హాజరు వేసుకోవలసిందేనట.
ఇక ప్రక్క వీధిలో ఓ యువతి వద్దకు తరచూ వెళుతుంటాడని గుమాస్తాతో పాటు పక్క షాపు వాళ్ళు కూడా చెప్పారు. తన షాపులోనే ఒక నగ చేయించాడనీ, ఎవరికీ ఇచ్చాడో తనకు తెలీదనీ నగల షాప్ అతను చెప్పాడు. అత్తమామలకు ఫోన్ చేసి పిలిపించాను. జరిగిన విషయాలు చెప్పి, బావమరిదిని వెంటనే తీసుకెళ్లమని చెప్పాను.
"చిన్నవాడే కదండీ...." పాతపాటే పా డబోయింది రమ.
"చిన్నవాడేమిటి? పక్కవీధి పంకజానికి రాళ్ల నెక్లెస్ చేయించాడట తెలుసా?" కోపంగా అన్నాను నేను.
"మీరిలా మా తమ్ముడిని నిందిస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను" అంది రమ.
"ఏమైనా సరే.మీ తమ్ముడిని ఇక్కడ ఉంచడానికి నేను ఒప్పుకోను." ఖరాఖండిగా చెప్పాను నేను.
కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది రమ.
"రమా! తలుపు తెరువు.తొం దరపడి ఏమీ చేసుకోవద్దు...." అంటూ తలుపు దగ్గర చేరి కేకలు పెడుతున్నారు అత్తమామలు.
దాంతో నాకూ కాస్త ఆందోళన కలిగి పరుగెత్తుకుంటూ వెళ్లి భుజంతో తలుపును బలంగా మోదాను.
లోపల గడియ వేసి ఉండక పోవడంతో ఆ విసురుకు రూంలో పడిపోయాను నేను.
రమ ఇంకా ఫ్యాన్ పైకి చున్నీ విసురుతూ వుంది. జరిగిన హడావిడికి చుట్టూ ప్రక్కల వారు వచ్చారు. అందరూ నాదే తప్పని నిర్ణయించారు. ఇంకెప్పుడూ రమను బాధ పెట్టనని నాచేత హామీ ఇప్పించారు.
జరిగిన సంఘటన నాలో భార్య పట్ల విరక్తిని కలిగించింది. లక్ష్మీనారాయణ స్వామిగారి గురించి విని ఉండటంతో అయన అనుమతిస్తే ఆశ్రమంలో చేరుదామని నిశ్చయించుకున్నాను."
చెప్పడం ముగించాడు రమాపతి.
తరువాత తన కథ ప్రారంభించాడు సీతాపతి.
"నేను ఒక ఇన్సూరెన్సు కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్నాను. ఇటీవలే పెళ్లయింది. నా భార్య పేరు సీత. నా కష్ఠాలు శోభనం గదిలోనే ప్రారంభం అయ్యాయి."చెప్పడం అపి ఒకసారి చుట్టూ చూసాడు.ఎవరూ గమనించడం లేదని తెలిసాక తిరిగి కొనసాగించాడు.
"పాలగ్లాసుతో గదిలోకి వచ్చిన సీత చాలా భయపడుతున్నట్లు అనిపించడంతో దగ్గరకు తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాను. తన భయం పోగొట్టడానికి 'నీకిష్టమైన కలర్ ఏమిటి? నీ స్నేహితురాళ్ల పేర్లు చెప్పు ' లాంటి ప్రశ్నలు అడిగాను.
"నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అడుగు" అన్నాను.
"మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? "హఠాత్తుగా ప్రశ్నించింది సీత.
కాస్సేపు ఆలోచించాను నేను. వాస్తవానికి నాకూ ఏ హీరోయిన్ గురించీ పెద్దగా ఆసక్తి లేదు. అయినా ఏదో ఒక పేరు చెప్పాలి కాబట్టి ఇటీవలే చూసిన సినిమా తాలూకు హీరోయిన్ ' సమన్నా 'పేరు చెప్పాను.
" సమన్నా ఇష్టమైతే మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు?"అంది సీత.
తన గొంతులో తీవ్రత ఉందనీ,తన ముఖాన్ని చంద్రముఖి ఆవహిస్తోందని గమనించని నేను సరదాగా సమాధానమిచ్చాను" సమన్నా ఒప్పుకుంటుందంటావా?"
అంతే!
పాలగ్లాసు భళ్ళున బద్దలైంది.
"మగవాళ్ళంతా ఇంతే. లేకి మనుషులూ, లేకి బుద్ధులూ" ఆమె గొంతు నిండా అసహ్యం.
ఆమె ఎందుకలా రియాక్ట్ అయ్యిందో నాకు అర్ధం కాలేదు. సర్ది చెప్పడానికి ప్రయత్నించేకొద్దీ మరింత రెచ్చి పోతోంది సీత.
'ఈ రోజు నీకు జాగారమే!' ఉదయం ఫ్రెండ్ చేసిన కామెంట్ గుర్తుకు వచ్చింది. నిజమే. ఆ రోజంతా ఆమె కేకలతో నాకు నిద్ర పట్టలేదు.
రోజులు భారంగా గడుస్తున్నాయి. నేను ఇంటికి ఆలస్యంగా వచ్చిన రోజైతే ఇల్లు రణరంగమే .'సమన్నాతో సినిమాకి వెళ్లి వస్తున్నారా? 'అని ఆ రోజంతా గొడవే.
"మొత్తానికి నిన్ను సమన్నా ప్రక్కన హీరోగా ఉహించుకొంటోంది మీ ఆవిడ.
వెంటనే పేరు మార్చుకొని సినిమాల్లో ట్రై చేస్కో." అని సలహా ఇచ్చాడు, విషయం విన్న నా స్నేహితుడు.
ఒకసారి మా మామగారిని కలిసి విషయం వివరించాను.
“ఇదంతా మా అత్తగారి వల్లనే, అంటే సీత అమ్మమ్మ వల్లనే జరిగింది.
ఆవిడకు భర్తమీద చెప్పలేనంత అనుమానం. ఆమె పెట్టే టార్చర్ భరించలేక యాభై ఏళ్ళ వయస్సులో ఆత్మహత్య చేసుకున్నారాయన. అప్పటినుండి ఆమె మా దగ్గరే ఉంటోంది. మనవరాలికి మంచి కథలు చెప్పడం మాని, తాను భర్తవల్ల ఎన్ని కష్టాలు పడిందో వివరించేది. తన కళ్ళు గప్పి తన భర్త ఎన్ని చిల్లర వేషాలు వేశాడో కళ్ళకు కట్టినట్లు చెప్పేది. మీ అత్తగారు కూడా మధ్య మధ్యలో నాగురించి ఆడిపోసుకొని అగ్నికి ఆజ్యం పోసేవారు. దాంతో సీత మనసులో మగవారందరూ భార్యలను మోసంచేసేవారన్న నమ్మకం ధృడంగా ఏర్పడింది." చెప్పారాయన.
రోజురోజుకూ సీత పెట్టే టార్చర్ ఎక్కువవుతోంది. నేనెవరైనా అమ్మాయితో కనీసం మాట్లాడి ఉన్నాతన అనుమానానికి చిన్న కారణం దొరికిందనుకోవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. ఒక సెలెబ్రిటీని ఈ సీతాపతి ప్రక్కన ఊహించుకోవడం మా ఆవిడకే చెల్లింది.
ఒక రోజు నేను ఇంటికి వస్తున్నప్పుడు నా స్నేహితుడు ఎదురయ్యాడు.
"నేను వ్రాసిన కథ ఈ వీక్లీ లో పడింది. చదివి ని అభిప్రాయం చెప్పు" అంటూ ఓ వీక్లీ మ్యాగజైన్ నా చేతిలో పెట్టాడు.
ఇంటికి వచ్చిన నేను పుస్తకాన్ని టేబుల్ పై ఉంచి స్నానానికి వెళ్ళాను.
కాస్సేపటికి బాత్రూం తలుపు దబదబా బాదుతోంది సీత.
తలుపు తీసిన వెంటనే నా మీదకు దూకి ఒళ్ళంతా రక్కింది.
"ఏకంగా దాన్ని ఇంటికే తీసికొని వస్తారా?ఎంత ధైర్యం మీకు?"అంటూ ఇంట్లో వస్తువులన్నీ చిందర వందర చేసింది.
"ఏం మాట్లాడుతున్నావు?ఎవర్ని తీసికొని వచ్చాను నేను?" అర్ధం కాక అడిగాను.
"ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నారు?" అంటూ నేను తెచ్చిన వీక్లీ లో ఓ పేజీని చూపించింది.
అందులో సుమన్నాఫోటో వేసి ఆమె గురించి ఓ ఆర్టికల్ వ్రాసారు. నాకు చూపించాక ఆ పేజీని కసిగా చింపి కాలికింద వేసి తొక్కింది సీత .
నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి నాది. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ స్వామిగారి ఆశ్రమం గురించి తెలిసింది నాకు. భార్యాబాధితులకు అక్కడ ఆశ్రయం లభిస్తుందనీ,అసలు స్వామిజీ కూడా ఒకప్పుడు భార్యా బాధితులేననీ విన్నాను." చెప్పడం ముగించాడు సీతాపతి.
ఇద్దరు చెప్పిందీ విన్న స్వామిజీ కాస్సేపు ధ్యానంలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకున్నారు .ఓ పది నిముషాలు గడిచాక కళ్ళు తెరిచారు.
"రమాపతీ! సీతాపతి సమస్యతో పోలిస్తే నీ సమస్య చాలా చిన్నది . అవునా?"
అవునన్నట్లు తలవూపాడు రమాపతి.
"నీ బావమరిది ఎంత అసమర్థుడైనా నీ భార్యకు తమ్ముడు.అతన్ని తప్పు పడితే ఆమె బాధ పడుతుంది.నీ సమస్యను తెలివిగా పరిష్కరించుకో.అతనికి కాస్తో కూస్తో పని నేర్పించి మీ మామగారితో చెప్పి స్వంతగా షాప్ పెట్టించు. ఒకవేళ అతడు దివాళా తీస్తే, ఆ స్టాకంతా సగం రేటుకు నువ్వే కొనుక్కో." చెప్పారు స్వామీజీ.
అంగీకారంగా తలవూపాడు రమాపతి.
తరువాత సీతాపతి వైపు తిరిగారు స్వామిజీ.
"నీదసలు సమస్యే కాదు.ఒంటికి జ్వరం వస్తే అందుకు సంబందించిన మాత్రలు వాడతాం.
మనసుకు జ్యరం వస్తే?
చిన్నప్పుడు జరిగిన సంఘటనలో, విన్న సంఘటనలో నీ భార్య మనసును కలచి వేసాయి.
ఆమెను సైక్రియాటిస్టు కు చూపించు. తప్పకుండ నయమవుతుంది. ఇందుకోసం సన్యాసం అవసరం లేదు."చెప్పారాయన.
"అలాగే స్వామీ! మీరు చెప్పినట్లే చేస్తాను." వినయంగా తలవూపుతూ అన్నాడు సీతాపతి.
"ఇంతకీ లక్ష్మీనారాయణ స్వామి ఆశ్రమం లో ఏం జరుగుతుందో తెలుసా?"ప్రశ్నించారు స్వామిజీ.
తెలియదన్నట్లు తలవూపారు ఇద్దరూ.
"అక్కడికి భార్యా బాధితులే కాదు,భర్తా బాధితులయిన భార్యలు కూడా వస్తారు.అక్కడికి వచ్చిన వారందరినీ ప్రతిరోజూ సమావేశ పరుస్తారు.ఒకరి కష్టాలు మరొకరితో చెప్పుకోడానికి అవకాశం కల్పిస్తారు.
బావి ఈ చివరనుంచి ఆ చివరకు ఈదిన కప్ప, ప్రపంచాన్నే ఈదినట్లు భావించి అలసి పోతుంది. బావినుంచి బయటకు వచ్చినప్పుడే,అది తన కష్టం చాల చిన్నదని తెలుసుకుంటుంది. ఒక మనిషి ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తాడో,ఇతరుల కష్టాలకు స్పందిస్తాడో అప్పుడతనికి తన కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఎప్పుడూ తన గురించి ఆలోచించే వారికి జీవితమంతా కష్టాలు తప్పవు.
మీరిద్దరూ హరిద్వార్ వెళ్లాల్సిన అవసరం లేదు.పక్క స్టేషన్ లో ట్రయిన్ దిగి, వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళండి.
ఒక్కోసారి ఆలస్యం కూడా అనర్దానికి దారి తీస్తుంది.మీరు వెళ్లాలనుకుంటున్న స్వామీజీ విషయంలో కూడా అదే జరిగింది."చెప్పారు స్వామీజీ.
"అలాగే స్వామీజీ.మాకు జ్ఞానోదయం కలిగించారు.నెక్స్ట్ స్టేషన్లోనే ట్రైన్ దిగి వెనక్కి వెళతాం. ఈలోగా లక్ష్మీనారాయణ స్వామి గారి గురించి మీకు తెలిసిన విషయాలు దయచేసి చెప్పండి."అడిగారు ఇద్దరు పతులూ.
"ఇక దాపరికమెందుకు నాయనలారా.మీరు కలవాలనుకున్న స్వామీజీని నేనే!
నా అసలు పేరు లక్ష్మీపతి.
నా భార్యా పేరు లక్ష్మి.
లక్ష్మీపతి అని అంటే నారాయణుడే కదా!
అందుకే లక్ష్మీనారాయణ స్వామి ఆశ్రమం స్థాపించాను.
మీలాగే నేనూ భార్యా మీద అలిగి ,ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లి రెండు రోజులు స్నేహితుడి
గదిలో వున్నాను.
ఒక రోజంతా నాకోసం ఎదురు చుసిన నా భార్య,మరుసటి రోజు ఆత్మహత్య చేసుకుంది.
జరిగిన విషాదం నన్ను కృంగదీసింది. మతిస్థిమితం తప్పి ఎక్కడెక్కడో తిరిగాను. చాలా రోజులకు కోలుకొని లక్ష్మీనారాయణ స్వామి ఆశ్రమం స్థాపించాను. కాపురంలో కలతలతో ఆవేశానికి లోనైన వాళ్ళను చేరదీసి ,కాస్త స్థిమిత పరచి, తిరిగి ఇంటికి పంపుతున్నాను."చెప్పడం ముగించారు లక్ష్మీనారాయణ స్వామి అనే లక్ష్మీపతి.
భక్తితో స్వామీజీకి నమస్కరించారు,రమాపతి, సీతాపతులు.
ఇంతలో వారివద్దకు వచ్చిన టికెట్ కలెక్టర్ ,"మీరు తెలుగువారేనా?" అని ప్రశ్నించాడు.
అతడు తమతో మాటలు కలాపాలనుకుంటున్నాడని గ్రహించిన ముగ్గురూ కాస్త సర్దుకుని కూర్చుని,అతన్ని కూర్చోమన్నారు.
"మీరు ముగ్గురూ హరిద్వార్ వెళ్తున్నారు కదూ! మీలో ఎవరికైనా లక్ష్మీనారాయణ స్వామి ఆశ్రమం తెలుసా?"ప్రశ్నించాడతను.
అతని కోటు పైనున్న నేమ్ ప్లేట్ వంక చూసారు స్వామీజీ.
'ఉమాపతి' అని ఉంది దానిపైన.
"నీ భార్య పేరు ఉమ కదూ?" చిరునవ్వుతో ప్రశ్నించారు స్వామీజీ.
తన హోదా కూడా మరచి స్వామీజీ పాదాలకు నమస్కరించాడు టికెట్ కలెక్టర్.
"అవును స్వామీ.పేర్లు బాగా కలిశాయని మా పెళ్ళిలో అందరూ అన్నారు...."చెప్పుకుంటూ పోతున్నాడు ఉమాపతి.
'ఈ కథకు ముగ్గురు పతులు అనే పేరు సరిపోతుందని ఇంతవరకూ అనుకున్నాను.ఇంతలో నాలుగోపతిగా నువ్వు వచ్చావు' మనసులో అనుకున్నారు స్వామీజీ.