గెలుపు - సన్నిహిత్‌

the victory

ప్రముఖ యువ రచయిత ' విరించి ' కి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. అతి పిన్న వయసులో ఎన్నో గొప్ప రచనలు చేసి ' కేంద్ర యువ సాహిత్య అకాడమీ ' అవార్డు అందుకున్న అతని ప్రతిభకు పట్టం కడుతూ ఈ సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. అతను పుట్టి పెరిగి ఊళ్ళోనే సన్మాన కార్యక్రమం. వచ్చిన అతిధులందరూ ఎంతో గొప్పగా విరించి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ పొగడ్తలేవీ అతని చెవికెక్కడం లేదు. అతని కళ్ళు మాత్రం ప్రేక్షకుల మధ్య ఎవరి కోసమో వెతుకుతూ తిరుగుతున్నాయి. కాసేపటి తర్వాత ఆ అన్వేషణ ఫలించింది. తనకు కావాల్సిన ఆ వ్యక్తి ప్రేక్షకుల మధ్య కనపడగానే విరించి మనసు సంతృప్తితో నిండిపోయింది. జరుగుతున్న సన్మానం కంటే, తన కోసం ఆ వ్యక్తి రావడం విరించికి ఎనలేని సంతోషాన్ని , విజయపు భావనని కలిగించింది.

ఆ ప్రేక్షకుల మధ్య ఉన్నది ఎవరో కాదు. విరించి సాధించిన విజయాన్ని కనులారా చూడ్డానికి వచ్చిన అతని తండ్రి. !

విరించి ఇంట్లో నుండి పారిపోవడానికి కారణమైన.... అతని కన్న ' తండ్రి' !!!

* * *

కొన్ని సంవత్సరాల క్రితం .....

ఒక మధ్యాహ్నం వేళ కాలేజీ నుండి ఇంటికి వచ్చి తన రూములోకి వెళ్ళి తలుపేసుకున్నాడు ' కుమార్‌ '. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అతను . అతని రాకను గమనించిన తండ్రి విశ్వం , భార్యను పిలిచి చెప్పాడు .

" నీ సుపుత్రుడు క్లాసుకి డుమ్మా కొట్టి వచ్చినట్టున్నాడు .. ఏమైందో కనుక్కో" అని .

భర్త మాట జవదాటని సుమతి కొడుకు రూము వైపు కదిలింది.

" కాలేజీ నుండి తొందరగా వచ్చేసావేం నాన్నా " అని ప్రేమగా అడిగింది . తల్లి వైపు అదోలా చూసాడు కుమార్‌. అతని కళ్ళల్లో ఎన్నో భావాలు.

" ఏమోనమ్మా ..క్లాసు రూము లో కూర్చోవాలనిపించలేదు ..అందుకే వచ్చేసాను" అని చెప్పాడు

" అదేంటి కుమార్‌. బోలెడంత ఖర్చు పెట్టి నాన్నగారు నిన్ను ఇంజనీరింగ్‌ లో జాయిన్‌ చేసారు. ఇలా నువ్వు చదువు వద్దని తప్పించుకుంటే ఆయన ఎంత బాధపడతారు" నెమ్మదిగా చెప్పింది.

" నాకు అవన్నీ తెలీవమ్మా ... నాకు నచ్చలేదు..అందుకే వచ్చేసాను" స్థిరంగా చెప్పాడు." హుష్‌.." అని నిట్టూర్చి బయటకు వచ్చేసిందామె .

కుమార్‌ ని ఇంజనీరింగ్‌ వరకు తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టాలు ఆమె కళ్ళముందు కదిలాయి. లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు కదా అని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఎప్పుడూ చిన్న పని కూడా చెప్పేవారు కాదు. ' బాగా చదువుకో నాన్నా ' అని చెప్పడం తప్ప ఇంకేమీ అనే వారు కాదు. తాము పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు అతని దృష్టి లో పడకుండా జాగ్రత్తపడేవారు. అయితే కుమార్‌ కూడా వాళ్ళనెప్పుడూ డిజెప్పాయింట్‌ చెయ్యలేదు. చిన్నప్పుడు బాగానే చదివే వాడు. కానీ వయసు పెరిగే కొద్దీ అతనిలో మార్పులు రావడం ప్రారంభించాయి. ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నాడు . టైము దొరికినప్పుడల్లా లేప్‌ టాప్‌ ముందేసుకుని ఏదో చదువుతూ ఉంటాడు . ఖచ్చితంగా అది ఇంజనీరింగ్‌ కి సంబంధించిన మెటీరియల్‌ మాత్రం కాదు.

భర్త దగ్గరకు వెళ్ళి " అడిగానండీ ...క్లాసులో కూర్చోవడం ఇష్టం లేక వచ్చేసాడంట " అని చెప్పింది సుమతి .

తోక తొక్కిన తాచులా పైకి లేచాడు విశ్వం. " పిచ్చెక్కిందా వాడికి ..ఏం మాట్లాడుతున్నాడు ..ఏమడిగాను వాడిని ...రాళ్ళు మొయ్యమన్నానా…బాగా చదువుకోమనే కదా చెప్పాను. అది కూడా కష్టమా వాడికి. అయినా నాదే తప్పు. ఇలాంటి వెధవ మీద ఆశలు పెట్టుకుని ఉన్నదంతా తగలేసాను" అని అరుస్తున్నాడు . నిస్సహాయంగా భర్త వైపు చూసింది సుమతి. రూములోనుండి ఈ మాటలన్నీ వింటున్న కుమార్‌ మనసు నెమ్మదిగా ముక్కలవసాగింది. ' తనకు ఈ చదువు ఇష్టం లేదు ' అని తల్లిదండ్రులతో ఎన్నో సార్లు చెప్పాడు. వాళ్ళు వినిపించుకోలేదు. పైగా ' కుర్రకుంకవు ..నీకేం తెలుసు ?' అని కొట్టిపడేసారు. ' నేను కుర్రకుంకనే కావచ్చు ..కానీ మీరు చెప్పినట్టు ' చదువు ' అనే పని చెయ్యాల్సింది నేనే కదమ్మా..నా మనసుకి నచ్చని పని చేసి జీవితాన్నివృధా చేసుకోమంటారా ' అని అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకో ధైర్యం చాల లేదు. ఆ అశక్తత కన్నీళ్ళుగా మారి చెంపల పైకి జారింది.

తల్లిదండ్రులు తన పైన పెట్టుకున్న ఆశలు అతనికి అర్థమవుతున్నాయి . అలాగని వాళ్ళు కోరుకున్నట్టుగా తను ఇంజనీరింగ్‌ చదువు పై దృష్టి పెట్టనూ లేకపోతున్నాడు..ఎలా ? ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతుక్కోవాలనుకున్నాడు కుమార్‌. ఆత్మహత్య లాంటి బేవార్సు నిర్ణయాలు తీసుకునేంత పిరికివాడు కాదు అతను . జీవితాన్నిసఫలం చేసుకోవాలని తపిస్తున్నవాడు .అందుకే - " నేను ఇంట్లోనుండి వెళ్లిపోతున్నాను నాన్నా ! ఎలాంటి అఘాయిత్యం చెయ్యను. నా గురించి వెదక్కండి .ఏమైపోతానో అని భయపడకండి. నాకు నచ్చిన జీవితాన్ని ఏర్పరుచుకున్నాక మళ్ళీ మీకు కనిపిస్తాను .మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి " - అని లెటర్‌ వ్రాసి ఒక అర్థరాత్రి ఇంట్లో నుండి వచ్చేసాడు .

తూర్పు దిక్కున సూర్యోదయం ఎంతో అందంగా కనిపిస్తోంది. జారుతున్న మంచు ..ఎగురుతున్న పక్షులు... ఉషోదయాన్ని మరింత సుందరమయం చేస్తున్నాయి. తూరుపు కనుమల మధ్య నుండి దూసుకుపోతున్న ఆ రైలు గత రాత్రి అనుభూతులని మోసుకుంటూ వెళుతోంది. కిటికీ పక్కనే కూర్చున్న కుమార్‌ ఆలోచిస్తూ ఉన్నాడు. గత రాత్రి ..ఇంటి నుండి ఎంతో ధైర్యంగా వచ్చేసాడు.. కానీ ఎక్కడికి వెళ్ళాలి ..ఏం చెయ్యాలి అన్న క్లారిటీ లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా తనను తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏదో సాధించాలి అన్న తపన ఉంది...కానీ ' అది ఎలా ? ' అన్న మార్గం తెలియడం లేదు.

" టీ తాగుతావా బాబూ .." ఎదురు సీట్లో కూర్చున్న పెద్దాయన అడుగుతున్నాడు . చేతులెత్తి నమస్కరించాలి అనిపించేలా సౌమ్యంగా ఉన్నాడాయన.

' తాగుతాను ' అన్నట్టు తలూపాడు కుమార్‌. పేపర్‌ కప్‌ లో పోసిన టీ చేతికందించాడు ఆయన. నిదానంగా సిప్‌ చేసి " థాంక్స్‌ అండీ " అన్నాడు కుమార్‌.

" రాత్రి నుండి చూస్తున్నాను. ఏదో బాధతో ఉన్నట్టు అగుపిస్తున్నావు. ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసావా ? " సూటిగా అడిగాడు.

సిగ్గుతో తల వాల్చేసాడు కుమార్‌. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ' అవును ' అన్నట్టు తలూపాడు.

" నా అనుభవం నీ విషయాన్ని పట్టేసింది. అందుకే సూటిగా అడిగాను. ఏమీ అనుకోవద్దు బాబూ " అన్నాడాయన.

" ఫర్వాలేదండీ " అన్నాడు కుమార్‌.

వారి మధ్య గాలి కూడా ఇబ్బంది గా కదలసాగింది. తన తండ్రి వయసున్న ఆ పెద్దాయన అలా అడిగేసరికి ' తప్పు చేసానా ? ..' అన్న భావం ఒక్కసారి కలిగింది కుమార్‌ కి. కానీ ' జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోవాలంటే ఆ మాత్రం రిస్క్‌ తప్పదు ' అని సర్దిచెప్పుకున్నాడు.

రైలు ఏదో స్టేషన్‌ లో ఆగింది. " నాతో రా బాబూ .." అన్నాడు ఆ పెద్దాయన. ఎందుకో కాదన లేక పోయాడు కుమార్‌. నిశ్శబ్దంగా ఆయన వెనక రైలు దిగాడు.

చాలా చిన్నస్టేషన్‌ అది ! స్వఛ్చమైన ప్రకృతి ఒడిలో ..పచ్చని గిరుల మధ్య ఒదిగి పోయి ఉంది. అక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న గ్రామం వైపు ఇద్దరూ నడిచి వెళ్ళసాగారు. పావు గంట సేపు నడిచాక వచ్చింది చిన్న ఊరు. కడిగిన ముత్యంలా ..మంచి వాడి మనసులా ప్రశాంతంగా ఉంది.

" నమస్తే మూర్తి గారు .." అంటూ దండం పెట్టాడు ఎదురుగా వస్తున్న ఒక గ్రామీణుడు. ' నమస్తే ' అన్నట్టు తలాడించారాయన.

కాసేపట్లో మూర్తి గారి ఇల్లు వచ్చింది. పర్ణశాల లా ఉంది ఆ ఇల్లు. వీళ్ళను చూడగానే గబ గబా వాకిట్లోకి వచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది ఇంటి ఇల్లాలు. చూడ్డానికి మూర్తి గారికి తగ్గట్టే మహలక్ష్మిలా ఉంది.

అప్రయత్నంగా " నమస్కారం అమ్మా ! " అంటూ అభివాదం చేసాడు కుమార్‌.

" నమస్కారం బాబూ ..రా " అంటూ లోనికి దారిచ్చింది ఆవిడ .

" సావిత్రీ ..ఈ అబ్బాయి ..." అంటూ ఏదో చెప్పబోయారు మూర్తిగారు. ' తర్వాత చెబుదురుగాని ' అన్నట్టు చేత్తోనే వారించింది . ' మీ విషయం నాకు తెలీదా ..అందరూ మీకు పిల్లలే ' అన్న భావం ఆవిడ బాడీ లాంగ్వేజ్‌ బట్టి అర్థమవుతోంది. కాఫీ ఫలహారాలు ఏర్పాటు చేసారు సావిత్రమ్మ గారు. అన్నీ అయ్యాక చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించసాగాడు కుమార్‌. మూర్తి గారు మంచం మీద నడుం వాల్చి రిలాక్స్‌ అవుతున్నారు. దూరంగా కనిపిస్తున్న విశాలమైన కొండలు ..వాటిని ఆనుకునే లోతైన లోయలు ! ఆ లోయల గుండా ప్రవహిస్తున్న సెలయేటి గలగలలు.

" ఎంత సేపయ్యింది నాన్నా వచ్చి " అంటూ వచ్చాడో యువకుడు.అతను మూర్తి గారి అబ్బాయి అని అర్థం అయింది కుమార్‌ కి. ఎత్తుకు సరిపడా లావుతో చూడ్డానికి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.

" ఇప్పుడే వచ్చాను రా ...ఈ అబ్బాయి కుమార్‌ అని ..రైల్లో కలిసాడు " అని చెప్పారు మూర్తిగారు.

" అర్థమైంది నాన్నా .." అంటూ తల పంకించాడు అతను.

అప్పుడే వచ్చిన సావిత్రమ్మ గారు " ఒరేయ్‌ రాజు... ఈ అబ్బాయి ని అలా మీ స్కూల్‌ దాకా తీసుకెళ్ళు " అని చెప్పారు. " అలాగేనమ్మా .." అని కుమార్‌ వైపు తిరిగి " నాతో రండి " అంటూ ముందుకు కదిలాడు రాజు.

ఇద్దరూ నడవసాగారు. రాజు తో మాట్లాడుతుంటే చాలా ఆత్మీయుడిని కలుసుకున్న భావం కలిగింది కుమార్ కి . మనసులో ఏదీ దాచుకోకుండా స్వఛ్చంగా , నిర్మొహమాటంగా మాట్లాడుతున్న రాజు వ్యక్తిత్వం కుమార్‌ ని ఎంతో ఆకర్షించింది . కుమార్‌ పరిస్థితి రాజు పసిగట్టగలిగాడు. అందుకే -

" తల్లిదండ్రులని ..చక్కటి జీవితాన్ని వదిలేసి రావాల్సినంత అవసరమేమొచ్చించి ? " అని అడిగాడు . విషయం మొత్తం రాజుకి తెలిసిపోయిందని అర్థమైంది కుమార్ కి . ' తెలిస్తే మాత్రం తప్పేముంది ... ఇది తను ఇష్ట పడి తీసుకున్న నిర్ణయమేకదా ' అని సర్ది చెప్పుకున్నాడు .

" చదువంటే ఇష్టం లేదని కాదు.. కానీ అంత కంటే ఇంకేదో చెయ్యాలని ఉండేది. ఇంట్లో వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. అందుకేవచ్చేసాను " అని చెప్పాడు కుమార్‌.

సాలోచనగా తలపంకించాడు రాజు . ఇంతలో స్కూల్‌ వచ్చింది. స్కూలంటే మరీ పెద్దదేమీ కాదు. రెండు మూడు పాకల్లో నడపబడుతోంది. గిరిజన విద్యార్థులకు చదువు చెప్పడానికి మూర్తిగారు స్థాపించిన స్కూల్‌ అది . మొదట్లో ఆయన పాఠాలు చెప్పేవారు. ఓపిక తగ్గాక ఆ పని ఆయన కొడుకైన రాజు చేపట్టాడు.

విద్యాధికుడైన మూర్తిగారు ఇలాంటి గిరిజనప్రాంతానికి అంకితమవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కుమార్ కి .

" రాజూ ..మీసొంత ఊరు ఇదేనా ? " ఆసక్తిగా అడిగాడు కుమార్‌

" నేను పుట్టి పెరిగింది ఇక్కడే .. "

" నేనూ అంటున్నావు .." సందేహంగా అడిగాడు

" అవును నేను ఇక్కడే పుట్టాను. నా చిన్నప్పుడే మా అమ్మానాన్నా విషజ్వరానికి బలైపోయారు. అనాధనైన నేను సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని పెద్దయ్యాను. చదువును ఎంతగానో ప్రేమించే నేను పెద్ద ఆఫీసరు అవుతానని అందరూ అనుకున్నారు. కానీ నాకు ఎప్పుడూ అలాంటి కోరికలు లేవు. నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతపు పేద విద్యార్థులకి చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మూర్తిగారు స్థాపించిన ఈ పాఠశాలలో నావంతుగా విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నాను. " చెప్పాడు రాజు.

" మరి మూర్తి గారు నిన్ను కొడుకనే పరిచయం చేసారు ? "

" అవును ..సొంత కొడుకుని కోల్పోయిన వాళ్ళకి నేనే అండగా ఉండాలని అనుకున్నాను. ప్రతీరోజూ వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ చేదోడు వాదోడు గా ఉంటున్నాను " చెప్పాడురాజు

కుమార్‌ విభ్రాంతికి లోనయ్యాడు.

" కొడుకుని కోల్పోవడమేంటి ? కొంచెం వివరంగా చెప్పండి "

చిన్నగా నిట్టూర్చాడు రాజు. చెప్పడం కొనసాగించాడు

" మూర్తిగారు ఇక్కడికి ఏభై కిలోమీటర్ల దూరం లో ఉన్న సిటీలో ప్రొఫెసర్‌ గా పని చేస్తుండేవారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు ' వంశీ ' . ఒకడే కొడుకు కదాని చాలా ప్రేమగా పెంచారు. వంశీ మంచి గాయకుడు . చదువుతో పాటూ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. గొప్ప గాయకుడు కావాలని కలలు కనే వాడు. మూర్తి గారు కూడా అతని అభిమతానికి అడ్డు చెప్పలేదు. చదువుతో పాటూ సంగీతాన్ని కూడా నేర్పించారు. ఎక్కడ పాటల పోటీలు జరిగినా తీసుకెళ్ళేవారు. బాగా ప్రోత్సహించేవారు. చివరికి టీవీల్లో కూడా పాడించారు..." అంటూ అగాడు

" మరి ..ఎక్కడ తప్పు జరిగింది ? "

" తప్పు ఎవరి వల్లాలేదు. పరిస్థితులే అలా వచ్చాయి "

" అంటే .."

" సంగీతాన్ని హాబీ గా ఎంచుకోమని ...ఏదైనా మంచి జాబ్‌ చూసుకోమని మూర్తి గారు కోరారు. అదే ఆయన చేసిన తప్పు. మొదట్లో కొంత విముఖత చూపించినా వెంటనే జాబ్‌ లో జాయినయ్యాడు వంశీ. కానీ అందులో మన లేక పోయాడు. స్వేఛ్చగా ఎగిరే పక్షి లా ఉండే కుర్రాడు పంజరంలోని చిలుకలా నిర్జీవంగా మారిపోయాడు. తన మనసుకి నచ్చని వృత్తిలోకి అయిష్టంగా ' పరకాయప్రవేశం ' చెయ్యడం వల్ల వచ్చిన బాధ అది . సమస్య చిన్నదే కానీ వంశీ దాన్ని సీరియస్‌ గా తీసుకున్నాడు...భూతద్దంలో నుండి చూసి భయపడి జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు . ఈ పుత్రశోకం నుండి ఆ దంపతులు చాలా కాలం కోలుకోలేకపోయారు. చివరికి అన్ని బంధాలను తెంచుకుని ఈ గిరిజన ప్రాంతానికి వచ్చి ప్రశాంతంగా జీవిస్తున్నారు. తమకు తోచిన విధంగా చుట్టుపక్కల వాళ్ళకి సాయపడి సంతృప్తిని వెదుక్కుంటున్నారు. అంతే ...అదీ జరిగింది " అని ముగించాడు.

తనకు తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్టనిపించింది కుమార్ కి . జీవితపు వైశాల్యం అవగతమైంది. తన లాంటి సమస్య చాలామంది కుర్రాళ్ళకి ఉంది అని అర్థమైంది. కానీ ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మనిషి పోజిటివ్‌ రిజల్ట్‌ వైపు పయనించాలని ..లేకపోతే అది వాళ్ళని నమ్ముకున్న పెద్దలకి విషాదాన్ని మిగులుస్తుందని వంశీ కథ ద్వారా అర్థమైంది. అదృష్టవశాత్తు తను మూర్తి గారి చేతుల్లో పడ్డాడు.

" చాలా థాంక్స్‌ రాజూ.. ఎన్నో విషయాలు చెప్పి నా కళ్ళు తెరిపించావు " అని ప్రేమగా హత్తుకున్నాడు కుమార్‌. ఎండ చుర్రుమనిపిస్తుండటంతో రాజు స్కూల్‌ వైపు వెళ్లిపోయాడు . కుమార్‌ వెనక్కు తిరిగి ఇంటి ముఖం పట్టాడు .

జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదిలాయి కుమార్ కి . తల్లిదండ్రులు తనని ఇంజనీరింగ్‌ చదువు పైన దృష్టి పెట్టమని అడగడం , తాను చదవలేనని ఏడ్వడం , ఇంటిలో నుండి వచ్చేయడం అన్నీ గుర్తుకు వచ్చాయి. సరే .. జీవితమనే పెద్దప్రయాణంలో ఇవన్నీ చిన్న చిన్న మజిలీలు కావచ్చు. కానీ అంతిమంగా తను గమ్యం చేరాలి..విజేతగా మిగలాలి అనుకున్నాడు.

ఇంటికి రాగానే మూర్తిగారు పిలిచారు.

" చూడు కుమార్‌ ..ఇది నీ సొంత ఇల్లే అనుకో ..ఇక్కడ నీకు ఎటువంటి ఆంక్షలూ ఉండవు . నీకు నచ్చినట్టుగా నువ్వుండొచ్చు . నీకు నచ్చిన కెరీర్ని ఎంచుకోవచ్చు. ఓటమి.. గెలుపు..వీటన్నిటి కంటే కూడా మన చుట్టూ ఉన్నసమాజానికి ఉపయోగపడుతూ ఆనందంగా జీవించడం ముఖ్యం...ఆల్‌ ద బెస్ట్‌ " అని చెప్పారు. కొండంత ఆత్మవిశ్వాసం కలిగింది కుమార్ కి .

అన్వేషణ ప్రారంభించాడు. అతని కళ్ళ ముందు ఎంతో మంది వ్యక్తులు కదిలారు. తమకు నచ్చిన రంగం లో ప్రవేశించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న వాళ్ళు ...తమకు నచ్చక పోయినా బ్రతకడానికి ఏదో ఒక పని చేస్తూ ' పరకాయ ప్రవేశ ' జీవితాలని గడుపుతున్న వాళ్ళూ ..ఇలా అందరూ కదిలారు. కానీ తనేం చెయ్యాలి ? తనకు ఏది ఇష్టం ? ఏమో ! ...అది తెలుసుకోవడానికే ఈ అన్వేషణ ! అడవంతా కలతిరిగేవాడు. ప్రకృతి తో మాట్లాడేవాడు. అది చెప్పే ఊసులని మనః చక్షువుతో వినేవాడు. తనలో తానే రగిలిపోతూ ...ఆ వేడిలో కాలిపోతూ ...ఏదో సంఘర్షణ. ఇంకేదో ఆవేశం !.

చిన్నప్పటి నుండీ సాహిత్యం చదవడం అతనికి ఇష్టం. కొన్ని వందల పుస్తకాలు చదివాడు. అవన్నీ టైం పాస్‌ కోసం..ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చదువుతున్నాడని అనుకునేవారు అతని తల్లిదండ్రులు. క్లాసు పుస్తకాలు కాకుండా ఇవి చదివి చెడిపోతాడేమో అనుకుని భయపడేవారు. కానీ రచనల్లో అంతర్లీనంగా దాగి ఉండే ఒక సౌందర్యం ..పదాల మేజిక్‌ ..అతన్ని కట్టిపడేసేది. అందుకే కనబడిన ప్రతి పుస్తకాన్ని చదివేవాడు . ఆ జ్ఞానం అంతా అతని బుర్రలో పదిలంగా ఉంది. ఇప్పుడు అతని మదిలో రగులుతున్న రక రకాల భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి . వాటిని బయటకు వ్యక్తపరచడానికి ఒక అవుట్‌ లెట్‌ కావాలి. అందుకే అతను కలం పట్టాలని నిర్ణయించుకున్నాడు . తన మది సాగరంలో ఎగిసి పడుతున్న అలల్లాంటి ఆలోచనలని కాగితం మీద పెట్టాలని నిశ్చయించుకున్నాడు. అది మొదలు ' విరించి ' అన్న కలం పేరుతో రచనలు చెయ్యడం లో నిమగ్నమయ్యాడు. ఎన్నో కథలు ..పుస్తకాలు వ్రాసాడు. మానవ జీవితం లో ఉన్న వివిధ పార్శ్వాలని తన రచనల్లో ఆవిష్కరించాడు. గిరిజనుల జీవితాల్లోని చీకటి వెలుగులని ప్రతిబింబిస్తూ అతను వ్రాసిన ' కొండ మీది జీవితం ' అన్న పరిశోధనాత్మక గ్రంధానికి ' కేంద్ర యువ సాహిత్య అకాడమీ ' అవార్డ్‌ అందుకున్నాడు. పేరు ప్రతిష్టలను సాధించాడు. ఆ వార్త తెలిసాక మూర్తి గారి కళ్ళల్లో ఆనందభాష్పాలు కదిలాయి.

" ధన్యుడివి నాయనా .." అని కుమార్‌ ని దీవించారు.

" ఇదంతా మీ చలవే మాష్టారూ. దారి తప్పి వెళ్ళిపోతున్న నా జీవితాన్ని పట్టాలపైకి తెచ్చారు. నాకు ఇంత ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు.మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను " అంటూ పాదాభివందనం చేసాడు కుమార్‌.

" చిరంజీవ ..చిరంజీవ " అని లేవదీసారు మూర్తిగారు .

* * *

చప్పట్ల హోరుతో గతం లో నుండి బయటపడ్డాడు విరించి. తన తండ్రి ప్రేక్షకుల మధ్య లేకపోవడం గమనించాడు. సన్మాన కార్యక్రమం పూర్తి కాగానే ఇంటి వైపు కదిలాడు.

అతన్ని చూడగానే " కుమార్‌ ..ఎలా ఉన్నావురా " అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది తల్లి సుమతి.

" బాగానే ఉన్నానమ్మా.. మిమ్మల్ని వదిలి వెల్లిపోయినందుకు నన్ను క్షమించండమ్మా " అని చేతులు పట్టుకున్నాడు.

అతని మాటలకు నొచ్చుకున్నట్టు " మేం నిన్ను క్షమించడం ఏంట్రా ..నువ్వే మమ్మల్ని క్షమించాలి. నీ ఇష్టాన్ని తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాము..ఇష్టం లేని చదువు చదవమని బలవంతం చేసాము " అంది సుమతి.

ఈ లోగా తండ్రి విశ్వం అక్కడికి వచ్చి " మనం వాడి విషయంలో తప్పు చేసాం సుమతీ ... కానీ మన కొడుకు తప్పు చెయ్య లేదు . జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవడం.. దారి తప్పి నాశనం అవ్వడం లాంటి పిచ్చి పనులు చెయ్యలేదు. సన్మార్గంలో నడిచి ...తనకు ఇష్టమైన రంగంలో కష్టపడి ...తాను అనుకున్నది సాధించి చూపించాడు. యువతకు ఆదర్శంగా నిలిచాడు . ఐ యాం ప్రౌడ్‌ ఆఫ్‌ యు మై సన్‌ " అంటూ కొడుకుని కౌగలించుకున్నాడు .

సమాజాన్ని గెలవడం కంటే కూడా తన తల్లిదండ్రుల మనసులని గెలవగలిగానన్న సంతృప్తి తో హాయిగా నవ్వుకున్నాడు విరించి ..ప్రముఖ రచయిత విరించి ...అలియాస్‌ ..కుమార్‌ !!.

--------------0------------

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు