తన స్నేహితుడు కైలాసరావు చనిపోయాడన్న వార్త విన్న ఆనందరావు హుటాహుటిన వాళ్ళింటికి వెళ్ళాడు. ముందురోజు ఉదయం ఒంట్లో కొద్దిగా నలతగా ఉందంటే చూసివచ్చాడు, ఇంతలోనే ఇలాంటి ఉపద్రవం జరుగుతుందని ఊహించలేదు ఆనందరావు. కైలాసరావు భౌతికదేహం చూసేసరికి కన్నీరు ఆగలేదు ఆనందరావుకి. ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులేకాక, కలిసి ఒకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లో పని చేసి ఉద్యోగ విరమణ చేసారు. కైలాసరావుకి పెద్దగా ఆరోగ్య రుగ్మతలేమీ లేవు. రిటైరై అయిదేళ్ళైనా ఆరోగ్యంగానే ఉండేవాడు. అలాంటి కైలాసరావు చనిపోయాడంటే ముందు నమ్మలేకపోయాడు ఆనందరావు.
అప్పటికే అక్కడ తన స్నేహితులు, కైలాసరావు బంధువులు చాలా మంది వచ్చి ఉన్నారు. కైలాసరావు కొడుకు శివకుమార్ తండ్రికి సీరియస్‌గా ఉందని తెలియడంతో హైదరాబాద్‌నుండి క్రితం రాత్రే ఇంటికి చేరుకున్నాడు. ఒక్కరోజు కూడా పూర్తిగా ఆస్పత్రిలో ఉండలేదు కైలాసరావు. హృద్ఘాతంతో తెల్లవారుఝామునే కన్నుమూసాడు. అయితే అదృష్టం ఏమిటంటే తండ్రి కడసారి చూపు దక్కింది శివకుమార్‌కి.
కైలాసరావు భార్య కమలని, కొడుకు శివకుమార్‌ని, కూతురు శివానిని పరామర్శించాడు ఆనందరావు.
"నిన్న ఉదయం నేను చూసేసరికి తనకి ఒంట్లో బాగానే ఉందని అన్నాడు. ఇంతలోనే ఏమిటి ఇలా అయింది?" అన్నాడు ఆనందరావు.
"ఉదయం బాగానే ఉన్నారు, మధ్యాహ్నం కొద్దిగా గుండెనొప్పి ఉందంటే అస్పత్రికి తీసుకువెళ్ళాం. వెంటనే డాక్టర్ ఆపరేషన్ చెయ్యాలన్నారు. అబ్బాయి రాత్రే వచ్చాడు. ఆపరేషన్ చేసినా ఆయన దక్కలేదు. మమ్మల్నందర్నీ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు అన్నయ్యగారూ." అంటూ బావురుమంది ఆమె.
ఆనందరావు దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమెని ఊరడించాడు. "ధైర్యం తెచ్చుకో చెల్లెమ్మా. నువ్వే అధైర్యపడితే ఇక పిల్లల సంగతేమిటి? వాడు పుణ్యాత్ముడు. ఎవరిచేతా చేయించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే మరీ ఎక్కువ వయసు కాకుండానే పోవడం దురదృష్టకరం." అన్నాడు ఉబికివస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ. శివకుమార్‌కి, శివానికి ధైర్యం చెప్పాడు.
కైలాసరావు అంత్యక్రియలు పూర్తైయ్యేవరకూ ఆనందరావు దగ్గరుండి అన్నీ జరిపించాడు.
ఇంటికి తిరిగివచ్చినా కైలాసరావుకి సంబంధించిన ఆలోచనలు మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. మరిచిపోయే స్నేహానుబంధమా అది! చిన్నప్పటి నుండి కలిసి చదువుకొని కలిసి ఉద్యోగం కూడా చేసారాయె! ఆ రోజు రాత్రి నిద్రపట్టక మంచంపై అసహనంగా దొర్లాడు ఆనందరావు. కైలాసరావు గురించిన విషయాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. చిన్నప్పటి నుండీ అన్నీ పనులు పక్కాగా, ప్లాన్‌గా చేసే అలవాటు ఉంది కైలాసరావుకి. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా అంతే! ప్రతీపని ఓ పద్ధతి ప్రకారం చేసేవాడు. కైలాసరావు తెలివైనవాడే కాక మంచి ముందుచూపు కలవాడు కూడా. అతని ఆలోచనలన్నీ బాగా ముందుచూపుతో కూడుకున్నవే.
ఉద్యోగంలో ఉండగానే కూతురిపెళ్ళి చేసాడు. కొడుకుని బాగానే చదివించాడు. శివకుమార్ కూడా మంచి ఉద్యోగంలోనే చేరాడు. స్వంత ఊళ్ళోనే ఇల్లు కట్టుకొన్నాడు. ఉద్యోగ విరమణ తర్వాత సంతృప్తిగా జీవితం వెళ్ళబుచ్చుతున్నాడు. అంతలోనే ఇలా జరుగుతుందనీ ఎవరూ అనుకోలేదు. ఆ రాత్రంతా కైలాసరావు గురించిన ఆలోచనలతోనే చాలాసేపు నిద్రపట్టలేదు ఆనందరావుకి.
ఓ నెల తర్వాత శివకుమార్ నుండి ఫోన్ వచ్చింది ఆనందరావుకి.
"అంకుల్! మా అమ్మ ఫామిలీ పెన్షన్‌కోసం సహాయం చెయ్యగలరా? ఏమేం ఫారాలు, కాగితాలు కావాలో, ఎలా అవన్నీ నింపాలో, ఏం చేయాలో కాస్త చెప్పగలరా? మా నాన్నగారు పెన్షన్ తీసుకుంటున్న బ్యాంక్ శాఖలో అడిగితే వివరంగా ఏమీ చెప్పలేకపోతున్నారు." అన్నాడు శివకుమార్.
"అలాగే కుమార్! మా ముఖ్య కార్యాలయంలో నాకు బాగా తెలిసినవాడు ఒకతను ఉన్నాడు. అతనితో మాట్లాడతాను. అతను కావలసిన ఫారాలన్నీ పంపితే అవి పూర్తి చేసి పంపిద్దాం." చెప్పాడు ఆనందరావు.
"అలాగే అంకుల్!" అన్నాడు శివకుమార్.
వెంటనే ఆనందరావు ముఖ్య కార్యాలయంలో తనకు తెలిసిన శేషగిరికి ఫోన్ చేసాడు. శేషగిరి ఆ ఫారాలు మెయిల్‌చేసి, ఇంకా ఏమేమి కాగితాలు కావాలో వివరంగా సందేశం పంపాడు.
ఆ సాయంకాలం ఆనందరావు శివకుమార్‌కి ఫోన్‌చేసి, "కుమార్!..."అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో, "అంకుల్! ఫారాలేవీ అక్కరలేదు అంకుల్! నాన్నగారు అన్నీ ముందుగానే సిద్ధం చేసి ఓ ఫైల్లో ఉంచారు. ఇవన్నీ అలమరా వెదికితే దొరికాయి. అలమరాలో నాన్నగారు పాస్‌బుక్కు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇన్సూరెన్సు పాలసీలతో బాటు ఫామిలీ పెన్షన్‌కి సంబంధించిన ఫారాలు, అవి ఎలా నింపాలో వివరంగా రాసి ఉంచారు. అంతేకాక మరణదృవ పత్రం, జీవన ప్రమాణపత్రం,ఇంకేం కావాలో అంతా వివరంగా రాసి ఉంచారు. మీకు శ్రమ ఇచ్చాను అంకుల్. అవి పూర్తి చేసిన తర్వాత ఎవరికి పంపాలో కూడా వివరంగా రాసారు. మళ్ళీ ఎమైనా అవసరమైతే ఫోన్ చేస్తాను అంకుల్!" అన్నాడు శివకుమార్.
కైలాసరావు ముందుచూపుకి, దూరదృష్టికి ఆశ్చర్యపోయాడు ఆనందరావు. అన్నిపనులూ పక్కాగా ఓ పద్ధతి ప్రకారం చేసే కైలాసరావు ఫారాలన్నీ ముందే సేకరించి ఇంట్లో ఉంచాడన్న మాట. చాలామంది తమ ఆస్థుల వివరాలుగాని, బ్యాంక్అకౌంట్ల గురించి గానీ భార్యకి కూడా తెలపరు. తమ బ్యాంక్అకౌంట్లకి నామినేషన్ చేయరు, చేయడానికి ఇష్టపడరు కూడా. ఒకవేళ చెప్పినా ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళనీ చూసాడు ఆనందరావు తను ఉద్యోగం చేసే సమయంలో. అలాంటి సందర్భంలో ఆ కుటుంబ పెద్ద మృతి తర్వాత కుటుంబ సభ్యులు ఎంత అవస్థలు పాలవుతారో తెలుసుకోవడానికి వాళ్ళు ఉండరు. అలాంటిది తన భార్యా, పిల్లలు తన మృతి తర్వాత ఏ మాత్రం ఇబ్బంది పడకూడదని అన్నీ సమకూర్చి వివరంగా రాసి ఉంచిన కైలాసరావు ముందుచూపుకి అబ్బురపడ్డాడు ఆనందరావు. తను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు ఆనందరావు.
-పద్మావతి దివాకర్ల