వస్తా ద్ గర్వం - నన్ద త్రినాధరావు

Vastad is proud

భీముడు ఒక మల్లయోధుడు. గొప్ప బలశాలి. ఎంతటి వస్తాద్ లయినా అతడ్ని కుస్తీ పోటీల్లో ఓడించలేక పోయేవారు. దాంతో భీముడు బల గర్వంతో విర్ర వీగేవాడు. అంతటితో ఆగక గ్రామస్తుల పై దౌర్జన్యం చేస్తూ, వారిని వేధించే వాడు. అతని పీడ ఎలా వదిలించు కోవాలో వారికి అర్ధమయ్యేది కాదు. ఆ గ్రామంలో ప్రతి ఏటా కుస్తీ పోటీలు జరుగుతుండేవి. భీముడు ప్రత్యర్ధు లందర్నీ మట్టి కరిపించి, ప్రతిసారీ విజేతగా నిలిచేవాడు. తనను ఓడించే మగాడు ఆ గ్రామంలోనే లేడని మీసాలు మెలి తిప్పేవాడు. ఎవరైనా ఎప్పుడైనా కుస్తీ పోటీలో తనను ఓడిస్తే, ఆ గ్రామం విడిచి వెళ్తానని సవాల్ విసిరేవాడు. భీముడ్ని ఓడించాలన్న పట్టుదలతో కుస్తీ పోటీకి ఆ గ్రామం నుండే కాకుండా, చుట్టు పక్కల గ్రామాల నుండి కూడా వస్తాద్ లు వచ్చేవారు. కానీ భీముని ధాటికి తట్టుకోలేక పోయేవారు.పైగా అతని చేతిలో తన్ను లు తిని పలాయనం చిత్తగించేవారు. అదే గ్రామంలో రాముడు అనే యువ వస్తాద్ ఉండేవాడు. అతడు చాలా తెలివైన వాడు. భీముడ్ని భుజ బలం తో కాకుండా బుద్ధి బలంతో ఎదుర్కొని, అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. రాముడు ఆ మర్నాడే భీముడితో పోటీకి తలపడ్డాడు. అతడు భీముడితో, "నేను నీతో కుస్తీ పోటీకి వస్తాను. అయితే ఒక షరతు" అన్నాడు. "ఏంటది?" నిర్లక్ష్యంగా అడిగాడు భీముడు. "ముందుగా నువ్వు మా పశువుల కొట్టంలోని ఒక పలుపు కర్రని పైకి లాగి పారేయాలి. దాన్ని పీకేసిన మరుక్షణం నేను నీతో పోటీకి సిద్ధ పడతాను" అన్నాడు రాముడు అతడ్ని కవ్విస్తూ. "ఓస్ అంతేనా? దాన్ని నా చిటికెన వేలితో లాగి పారేస్తాను.ఆ తర్వాత నీ పని పట్టేస్తాను" అన్నాడు కోపంగా. భీముడు ఆ వెంటనే రాముని ఇంటి ఆవరణలో ఉన్న పలుపు కర్రను పైకి లాగటానికి సిద్ధపడ్డాడు. ఆ పోటీ చూడ్డానికి గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భీముడు చాలా నిర్లక్ష్యంగా ఒక చేత్తో ఆ పలుపు కర్రని లాగటానికి ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. అతడు వెంటనే మరో చేతిని కూడా ఉపయోగించాడు. అయినా ఆ కర్ర ఊడలేదు. దాంతో భీముడు ఆశ్చర్య పోయాడు. తన భుజాల్లోని బలాన్నంతా ఉపయోగించి, ఆ పలుపు కర్రని పైకి లాగాలని చూసాడు. కానీ అంగుళం కూడా ఆ కర్ర కదల్లేదు. ఎంతసేపు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దాన్ని ఏ మాత్రం కదల్చలేక పోయాడు భీముడు. చివరికి తన ఓటమిని అంగీకరించి, ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో ఆ గ్రామస్తులు ఆనందంతో రాముడ్ని ఆకాశానికి ఎత్తేశారు. అసలు విషయం రామునికి మాత్రమే తెలుసు. ఆ పలుపు కర్ర భూమిలో పాతి పెట్టింది కాదు. అది బాగా వేళ్ళూని, సన్నగా ఏపుగా పెరిగి అక్కడే పాతుకు పోయిన ఒక వేప చెట్టు మాను. దాన్ని పలుపు కర్రంత ఎత్తుకు నరికి, దానికి తాడుతో పశువులను కట్టేవాడు రాముడు. ***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు