మేకవన్నె పులి (క్రైమ్ కథ) - చెన్నూరి సుదర్శన్

tiger like a goat (Crime Story)

“నాన్నా..! కొట్టొద్దు. ప్లీజ్..” అని ఏడ్చుకుంటూ కామేశం రెండు కాళ్ళను చుట్టేసుకుంది అతని చిన్న కూతురు ప్రమీల.

కామేశం ముఖం మరింత జేవురించింది. పండ్లు పట, పట కొరుకుతూ..

“పమ్మీ.. ఈ రోజు మీ అమ్మ సంగతి అటో, ఇటో తేలాలిరా!” మైకంలో తడబడుతున్న గొంతుతో గద్దిస్తూ.. పటుత్వం లేని చేతులతో మీసాలు మెలేయసాగాడు.

“పొద్దున ఇచ్చిన డబ్బులు కలాస్. ఈ రాత్రికి ఉపవాసమేనా..! మందు పడితేనే కంటికి కునుకు పడ్తుంది. బుజ్జగించి చూశాను, బెదిరించి చూశాను. ఉహ్హు..! డబ్బులు రాల్చడం లేదు. మళ్ళీ కడుపులో మందు పడితే గాని నేను మళ్ళీ మామూలు మనిషిని గాను” అనుకుంటూ కళ్ళళ్ళో నుండి నిప్పులు కురిపించసాగాడు.

ప్రమీల ఏమాత్రమూ బెదర లేదు. మరింత గట్టిగా కామేశం కాళ్ళను అదిమి పట్టుకుంది.

కామేశం వదిలించుకునే యత్నంలో తూలి పడబోయి చటుక్కున తమాయించుకున్నాడు. అతని కోపం నశాళానికంటింది. కన్నకూతురనే కనికరం లేకుండా వీపు మీద అరచేత్తో ఛళ్ళుమనిపించాడు. ప్రమీల కీచుమని గుక్కపట్టింది. అయినా ఆమె బిగించిన చేతులు సడలి పోలేదు. సరికదా.. తన కాళ్ళతో కామేశం కాళ్ళకు మెలిక పెట్టింది.

“పిల్లను పిడాత చంపేస్తావా ఏంది? నీ చేతులు పడిపోనూ..” అంటూ.. ప్రమీల దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది కామేశం భార్య కమలమ్మ. “పెద్ద పిల్లను పొట్టన పెట్టుకున్నది సరిపోలేదా? నీకింకా బుద్ధి రాకపాయే..! దాని ఉసురు తప్పకుండా తాకుతుంది. ఉన్నొక్క దాన్ని మింగి కూర్చో.. నీ కళ్ళు చల్లబడ్తాయి” అని ఏడ్చుకుంటూ.. ప్రమీలను లేవదీసే యత్నంలో కమలమ్మ వంగే సరికి, కామేశం చెయ్యి, కమలమ్మ వీపు మీద విమానం మోత మ్రోగించింది. తన తల్లి మీద దెబ్బ పడే సరికి ప్రమీల తల్లడిల్లిపోయింది. చటుక్కున కామేశం కాళ్ళను వదలి అమాంతం కమలమ్మ మీద వాలిపోయింది.. మరో దెబ్బ తన తల్లి మీద పడకుండా..

కాళ్ళ బంధం వీడిన కామేశం, కమలమ్మ చీర కుచ్చిళ్ళలో చెక్కుకున్న చేసంచి లాక్కున్నాడు. ప్రమీల గబుక్కున కామేశం మీదకెగబడి చేతిలోని సంచిని లాక్కోబోయింది. ఊహించని పరిణామానికి ఖంగు తిన్న కామేశం చటుక్కున ఎడం చేత్తో సంచి వెనక్కి దాచుకుని.. కుడి చేత్తో ప్రమీల చెక్కిలి మీద లాగి కొట్టాడు. ప్రమీల బుగ్గ మీద ఐదేళ్ళు అచ్చుపడ్డాయి. కమలమ్మ లబ, లబా మొత్తుకుంటూ కామేశంను రెండు చేతులతో నెట్టేసి, ప్రమీలను గుండెలకు హత్తుకుంది.

“పమ్మీ.. పోతే పోయాయిరా. నా రెక్కల కష్టం. నువ్వు నా కోసం దెబ్బలు తినకు బిడ్డా. మన ఖర్మ. ఎలా జరిగేది అలా జరుగుతుంది. దేవుడు మన నుదుటి మీద ఇలాగే రాసేడేమో..! నీకెమన్నా అయితే నేను బతుకను బిడ్డా” అంటూ ప్రమీలను తన హృదయానికి మరో మారు గట్టిగా హత్తుకుంది కమలమ్మ.

“మర్యాదగ పైసలడుగగానే ఇస్తే.. ఇంత గలాటా అయ్యేదేనా! కమిలీ.. వస్తా” అని చేతిలోని డబ్బులు చూసి ఈలేసుకుంటూ వీధి గుమ్మం దాటబోయాడు.

ఉన్నఫళంగా పక్కింటి పరమయ్య ప్రత్యక్షమయ్యాడు. అతను ఆరడుగుల ఆజాను బాహుడు.. భీకరాకారుడు. గండు చీమల దండు కదలాడునటులుండే మీసాలు. అతణ్ణి చూడగానే కామేశం గుండె ఝల్లుమంది. అయినా మేకపోతు గాంభీర్యం అరువు తెచ్చుకొని.. పక్కకు తప్పుకో అన్నట్లుగా చేత్తో సంజ్ఞ చేశాడు.

కామేశం ఇంట్లో ఇలా గొడవ జరిగినప్పుడల్లా పరమయ్య రావడం.. కామేశాన్ని నాలుగు చీవాట్లు పెట్టడం పరిపాటి. కాని ఈ సారి పరమయ్య మరింత కోపంగా ఊగి పోతూ.. నిలబడిన పధ్ధతి చూసి, ఝడుసుకుని.. ముందుకేయ బోయిన అడుగు గబుక్కున వెనక్కి తీసుకున్నాడు కామేశం.

“కామేశం.. నీకిదేం రోగమయ్యా! చంటి పిల్లని చూడకుండా చెయ్యి చేసుకుంటావా? నీ దిమాకేమైనా ఖరాబైందా..!” అనుకుంటూ.. చూపుడు వేలుతో బెదిరించసాగాడు. “లోకంలో నువ్వొక్కడివే తాగుతున్నావా? ఎందరు తాగేవాళ్ళు లేరు. అందరూ.. నీ మాదిరిగానే భార్యలను, పిల్లలను కొట్టుకుంటున్నారా?. నీ తాగుడు సహించని నీ పెద్ద బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం అప్పుడే మర్చిపోయావా? నయాపైస సంపాదించే తెలివి లేదు గాని ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఆమె రెక్కలు ముక్కలు చేసుకొను ప్రమీలను చదివిస్తుందన్న జ్ఞానం ఉన్నదా నీకు? ఇలా అయితే ప్రమీల చదువెలా సాగుతుంది”

పరమయ్య మాటలన్నీ చెవిటి వాని ముందు శంఖమూదినట్లే అయ్యింది. అగ్గిమీద గుగ్గిలమయ్యాడు కామేశం.

“నాపెండ్లాన్ని తిడ్తాను,, కొడ్తాను.. చంపి పాతరేస్తాను. నువ్వెవ్వనివిరా అడుగడానికి .. దానికి మరో మొగుడివా? మీ రంకుతనం ఎప్పటి నుండి నడుస్తోంది? ” అని నోరు జారాడు కామేశం.

పరమయ్య కోపం కట్టలు తెంచుకొని ఎగిసి పడింది. పులిలా కామేశం మీదకు లంఘించ బోయాడు. కమలమ్మ మెరుపు వేగంతో వచ్చి అడ్డుకుంది.

“అన్నయ్యా.. నీకు దండం పెడ్తాను. నువ్విక్కడ్నించి వెళ్ళిపో..” అంటూ రెండు చేతులు జోడించింది. గొడవ ముదరడం విని వచ్చిన పరమయ్య భార్య భాగ్యమ్మ అతణ్ణి ఇంట్లోకి రమ్మంటూ చెయ్యి బట్టి వెనక్కి లాగసాగింది.

“కామేశం.. నోరు దగ్గర పెట్టుకో ఖబర్దార్. నా చెయ్యి పడితే.. గుటుక్కుమని ఛస్తావని తటపటాయిస్తున్నా... ఊరపిచ్చుకంత లేవు.. ఒంట్లో చటాకంత మాంసం లేదు. ఎంత మాటన్నావ్.. ఇంకో సారి అంటే పీక పిసుకుతా నాకొడుకా..” అనుకుంటూ ఉరిమి, ఉరిమి చూసుకుంటూ వెనుదిరిగాడు.

కమలమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళి మూలకున్న గొడ్డలి తీసుకు వచ్చికామేశం చేతికిచ్చింది.

“ఏమయ్యా..! నామీద గింత అనుమానమా.. నన్ను ముక్కలు, ముక్కలు కింద నరికేస్తావేమో! నరికేసి కాకులకు గద్దలకు వేయి” అనుకుంటూ వెళ్ళి వీధి గుమ్మం గడప మీద మెడ పెట్టి బోర్లా పడుకుంది. ప్రమీల గజ, గజా వణకుతూ.. వెళ్ళి కమలమ్మ మెడ మీద అడ్డంగా పడుకుంది. తనను గూడా చంపేయమన్నట్లుగా..

వారిరువురి రోదనలతో వాడంతా దద్దరిల్లింది. ఇది రోజున్న భాగవతమే అన్నట్లుగా మరెవ్వరూ కామేశం ఇంటి వైపు తొంగి చూడలేదు.

కామేశం గొడ్డలి కింద పడవేసి నిర్దాక్షిణంగా ఇద్దరి మీద నుండి దాటి సారాయి కొట్టు వైపు దారి తీశాడు.

***

తెల, తెల వారుతోంది. కాకులు కావు, కావు మంటున్నాయి.

కమలమ్మ శోకనాలు వాడ, వాడలా వినరాసాగాయి. గుండెలు రెండు చేతులా బాదుకో సాగింది.

ప్రమీల ఏడ్చీ, ఏడ్చీ కన్నీళ్ళు ఇంకిపోయాయి. తల్లి గదుమ పట్టుకుని ఊరుకోబెడ్తూంది. కమలమ్మ ఆర్తనాదంలోని ఆవేదన గమనించి వాడంతా లేచి పరుగెత్తుకు వచ్చింది. మంచంలో అచేతనంగా పడి ఉన్న కామేశంను చూసి అంతా మ్రాన్పడి పోయారు.

తలా ఓ చెయ్యి వేసి కామేశం శవాన్ని వాకిట్లో నేల మీద వరిగడ్డి మీద పరిచిన చాపలో వేశారు. తలాపుకు దీపం.. అగర వత్తులు వెలిగించారు. ఇంటి ముందు నిప్పులు రాజేశారు. మరి కొందరు శామియాన కోసం పరుగెత్తారు.

కామేశం పార్థీవ శరీరం మీద పడి కమలమ్మ ఏడుస్తుంటే.. కన్నీళ్ళు పెట్టని వారు లేరు.

“పాపం ఎంతైనా మొగుడు” అంటూ ముక్కున వేలేసుకుంది భాగ్యమ్మ. “తిట్టినా.. కొట్టినా.. ఒక మనిషి అండగా ఉన్నాడంటే అదే ఎంతో దైర్యం”

భాగ్యమ్మ వచ్చింది గాని పరమయ్య రాక పోయే సరికి అంతా ఆమె వంక అనుమానంగా చూడసాగారు.

ఇంతలో పోలీసుజీపు డేగలా వచ్చి వాలింది. జనాల గుండెలు గుభేలుమన్నాయి. ప్రమీల భయం, భయంగా కమలమ్మ వెనకాల దాక్కుంది. పోలీసులను చూసి కమలమ్మ ఏడుపు తారా స్థాయికి చేరింది.

రంగనాథం ఎస్సై జీపు దిగి వడి, వడిగా వస్తూనే “పరమయ్య ఎక్కడ?” అంటూ పోలీసు పధ్ధతిలో అడిగే సరికి భాగ్యమ్మ పంచ ప్రాణాలు పైకి ఎగిరి పోయాయి. అంతా ఆమె వంక తిరిగి చూడడం గమనించిన రంగనాథం భాగ్యమ్మను చూసుకుంటూ “నీ మొగడేనా పరమయ్య” అంటూ అడిగాడు. రంగనాథం ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టే రకమని అంతా అనుకుంటూంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. రంగనాథంతో వచ్చిన ఇద్దరు పోలీసులు ముందుకు చొచ్చుకు వస్తున్న మందిని నియంత్రించసాగారు.

“ఔను సార్.. నా భర్తనే. ఎందుకు సార్” అంటూ భాగ్యమ్మ ప్రాణాలు చిక్కబట్టుకుని నెమ్మదిగా అడిగింది.

“ఎందుకా.. నిన్న కామేశాన్ని పీక పిసుకుతా.. అన్నాట్ట కదా..! నువ్వుగూడా విన్నావని నాకు రిపోర్టు వచ్చింది. ఏడి వాడు.. కామేశం పీక పిసికి పారిపోయాడా..! మర్యాదగా అడుగుతున్నాను. నిజం చెప్పు లేకుంటే వాన్నీ.. నిన్నూ లోపలేసి తోముతా..” అంటూ పోలీసు భాషకు పదును పెట్టాడు రంగనాథం.

భాగ్యమ్మ నిలువెల్లా వణకి పోతూ.. “సారూ.. పరమయ్య ఉత్తిత్తగ బెదిరిచ్చాడే గాని అటువంటివాడు కాదు. ఉత్త అమాయకుడు. తెల్లవారు ఝామున నాలుగింటికి లేచి మా ఊరికి పని మీద వెళ్ళాడు. నిజం సారూ..” అంటూ దేవుని మీద ప్రమాణం చేస్తూ.. కన్నీళ్ళ పర్యంతమై రంగనాథం కాళ్ళ మీద పడబోయింది. రంగనాథం వెంటనే వెనక్కి జరిగాడు.

“ఎవరో ఆయన మీద పగబట్టి షికాయత్ చేసుంటారు. పరమయ్య చూడ్డానికి ఆకారం అలా ఉంటుంది గాని పిరికి వాడు. కావాలంటే ఇక్కడ అందరినీ అడగండి” అనుకుంటూ రెండు చేతులు జోడించింది భాగ్యమ్మ.

“సరె, సరే..! ‘ఎలుకకు పిల్లి సాక్ష్యం’ అన్నట్టు నీ మాటలు ఎవరు నమ్ముతారు గానీ.. సర్కార్ కానూన్‌ నుండి ఎవరూ తప్పించుకో లేరు. ముందు కామేశం శవాన్ని పంచనామా చేసి పోస్ట్ మార్టం చెయ్యాలి.. అప్పుడు గాని నిజానిజాలు బయట అడవు” అంటూ లాఠీ తనదైన శైలిలో తిప్పుకుంటూ.. వీరయ్య శవం చుట్టూ తిరుగుతూ.. ఫోటో గ్రాఫర్ వివిధ భంగిమలలో ఫోటోలు తీస్తుంటే.. పరిసరాలు పరికించసాగాడు. కమలమ్మ ఏడ్చుకుంటూనే రంగనాథానికి దండాలు పెట్టసాగింది.

ఇంతలో ఊరి సర్పంచ్, నలుగురు పెద్దమనుషులతో రావడం.. పంచనామా కార్యక్రమం ఆరంభమయ్యింది.

***

ఆ మరునాడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి.

కామేశం ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడని తేలింది. మెడ మీద గాయాలు గాని వేలి ముద్రలు గానీ ఏమీ లేవు. కల్తీ సారాయి ప్రభావమూ కాదు.

ఊళ్ళో రోగాలకు మందులు దొరకవి గాని, జల్సాలకు మందు దొరుకుతంది. ఊరు చిన్నదైనా.. పరిష్కారం కాని కేసులకు లెక్కే లేదు. అని మనసులో గొణుక్కోసాగాడు రంగనాథం.

కామేశం కేసు అర్థం గావడం లేదు. తల పట్టుకున్నాడు. పరమయ్య మీద వాడలోని వాడొకడు ఆకాశరామన్నలా ఫిర్యాదు పోలీసు స్టేషన్‌లో సెంట్రీకి ఇచ్చి పోవడం.. ఇంత తతంగం చెయ్యాల్సి వచ్చింది. కాని కామేశానిది సహజ మరణమని అనుకోడానికి ఆస్కారమూ లేదు. ఊపిరాడక పోవడమేమిటి? అని మనసులో పరి, పరి విధాల ఆలోచించసాగాడు. కామేశం ఇంట్లోనే రాత్రి ఏదో జరిగి ఉండాలి.. కొత్త వాళ్లెవరైనా వచ్చి ఉండాలి.. అని మనసులో తట్టే సరికి లేచి జీపు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు.

జీపు వాడలో దుమ్ము రేపుతూ వస్తుంటే.. అంతా పరమయ్యను పట్టుకు పోవడానికి వస్తుందని గుస, గుసలాడసాగారు కాని అది నేరుగా కామేశం ఇంటి ముందాగింది.

రంగనాథం జీపు దిగి లాఠీ ఊపుకుంటూ రావడం చూసి ప్రమీల ఇంట్లోకి పరుగెత్తింది.

“ఏంటి ప్రమీలా..! అలా పరుగెత్తుకుంటూ వస్తున్నావ్” అనుకుంట బయటకు తొంగి చూసి కమలమ్మ స్థాణువై

పోయింది.

ఎదురుగా యమునివలె రంగనాథం కనబడే సరికి రెండు చేతులు జోడించి దండం పెట్టింది.

“చూడు కమలమ్మా.. నాకు కొన్ని నిజాలు తెలియాలి. నీ భర్త ఊపిరాడక చనిపోయాడని రిపోర్టు వచ్చింది. తాగుడు గాదు.. పీక పిసుకుడూ కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఇంటికి రాత్రి వచ్చారా?” అంటూ ప్రశ్నించాడు.

“ఎవరూ రాలేదు సార్” అంటూ ఏడ్పుముఖంతో చెప్పింది కమలమ్మ. కమలమ్మ వెనుకాల దాక్కొని బిక్కు, బిక్కు మంటూ చూడసాగింది ప్రమీల.

“అయితే నువ్వే వీరయ్యకు ఊపిరాడకుంట ఏదో చేసి ఉంటావని నాకు అనుమానంగా ఉన్నది. నేను నీ సొంత అన్నయ్య అనుకొని నిజం చెప్పు. చెప్పలేదనుకో.. నిన్ను ఠాణాకు తీసుకెల్లి మా పద్ధతిలో అడగాల్సి వస్తుంది” అని గోడ పక్కకున్న చిన్న బెంచీ లాక్కోని కూర్చున్నాడు.

“నిజం సార్.. నా కూతురు మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకేం తెలియదు. తెల్లవారు ఝామున లేచి నేను బాత్ రూమ్­కు పోయి వచ్చాను. కామేశం రాత్రి మూలుగు కుంటూ పడుకున్నాడు. జ్వరమేమైనా వచ్చిందేమోనని.. నొసలు మీద చెయ్యేసి చూశాను. చల్లగ తగిలేసరికి గాబరా పడుకుంటూ లేపాలని తట్టాను. ఎంత లేపినా లేవ లేదు” అంటూ ప్రమీల తల మీద చెయ్యేసి ప్రమాణం చెయ్యసాగింది.

“ఈమె నీ కూతురా..! ఏం చదువునవురా” అని అడుగుతూ.. ప్రమీలను దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యి ఊపాడు రంగనాథం. ప్రమీల రాను అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ..

“ఆరో తరగతి” అంది భయం భయంగా..

“భయపడకు ప్రమీలా.. నిన్నేమనను. కమలమ్మను పోలీసు స్టేషన్­కు తీసుకొని పోయి వీపు సున్నం చేస్త. అప్పుడు గాని నిజం గక్కది” అని లేచి కమలమ్మను జీపు ఎక్కించు మన్నట్లు జీపు డ్రైవర్­ను పిలిచాడు.

డ్రైవర్ రావడం చూస్తూ ప్రమీల వణకి పోయింది. తల్లిని తీసుకు వెళ్ళి కొడ్తారని తల్లడిల్లింది.

“వద్దు.. వద్దు.. మా అమ్మను తీసుకు పోవద్దు. నేను నిజం చెబుతాను” అన్నది ప్రమీల.

రంగనాథం ఆశ్చర్యంగా బెంచీ మీద తిరిగి కూర్చుంటూ.. డ్రైవర్­ను బయటకు వెళ్ళమన్నట్టు ఇషారా చేశాడు. కమలమ్మ బిత్తరపోయి పిచ్చిచూపులు చూడసాగింది. లిప్తకాలంలో తేరుకుని “చిన్న పిల్ల మాటలు.. సారూ. దానికేం తెలియదు. నన్ను స్టేషన్­కు తీసుక పోవద్దని అది అలా చెబుతోంది. పట్టించుకోకండి” అని కమలమ్మ రంగనాథం రెండు కాళ్ళ మీద పడింది.

“లేదు సార్.. నేను జరిగింది చెప్తాను. మా అమ్మను తీసుక పోవద్దు” అని తల్లి మీద ప్రేమను తన మాటల్లో చూపసాగింది ప్రమీల.

“చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం కమలమ్మా. వాళ్ళు అబద్దాలాడరు” అంటూ చేతి లోని లాఠీ, తలపైన టోపీ తీసి పక్కకున్న స్టూలు మీద పెట్టాడు రంగనాథం.

“నేను ఎవరినీ ఎక్కడికీ తీసుక పోను. నువ్వు చెప్పేది నిజమో! కాదో!” అంటూ అనుమానం వ్యక్త పర్చాడు రంగనాథం.

“నాకు మా అమ్మంటే ప్రాణం. మా అమ్మకు ఏం కాదంటే నేను నిజం చెప్తా..” అంటూ తలెత్తి చూసింది ప్రమీల. ఏమీ కాదన్నట్టు భరోసా ఇచ్చాడు రంగనాథం.

“మానాన్న గుణం మంచిది కాదు సార్. తాగుబోతని అందరికీ తెలిసినా ఎవరికీ తెలియని నిజం మరొకటి ఉంది” అంటూ తన తల్లిని చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకో సాగింది. కమలమ్మ కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. కడకొంగు నోటికడ్డంగా పెట్టుకుని మౌనంగా ఏడువసాగింది. రంగనాథం ఆశ్చర్యంగా చూడసాగాడు.

ప్రమీల తన కడుపులో నుండి తన్నుకుంటూ వచ్చే దుఃఖాన్ని అదుపు చేసుకోలేక పోతోంది. కొద్దిసేపటికి తేరుకుని తిరిగి చెప్పసాగింది.

“మాఅక్కయ్య చనిపోడానికి మా నాన్ననే కారణం” అంది.

వెంటనే కమలమ్మ అందుకుంది..

“అవును సార్.. ఆ రోజు నా పెనిమిటి బాగా తాగి రోడ్డు మీద పడిపోతే నాలుగు చక్రాల తోపుడు బండి మీద పడుకోబెట్టి ఇంటికి తీసుకు వచ్చారు. అలా రావడం చూసి మా పెద్దమ్మాయి కుమిలి, కుమిలి ఏడ్చింది. అదే రాత్రి తెల్లవారు ఝామున ఉరేసుకుని చనిపోయింది. ‘నాన్న చేసిన పనికి మన కుటుంబ పరువు పోతున్నది. ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇకనైనా నాన్న మారాలని దేవున్ని కోరుకుంటున్నాను. చెల్లెను పెద్ద చదువులు చదివించండి’ అని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం విషయం బయటికి పొక్కనివ్వలేదు” అంటూ కంట తడి పెట్టింది కమలమ్మ.

“అందుకే కాదు సారూ.. పాపపు పని కూడా చేశాడు” అని ప్రమీల అనేసరికి రంగనాథం కొయ్యబారి పోయాడు.

”మాకు తెలుగు పాఠంలో ‘మేకవన్నె పులి’ అనే పాఠమున్నది. అలాంటి వాడే మానాన్న మహా దుర్మార్గుడు. ఆరోజు రాత్రి మా అక్కయ్య మీద చెయ్యేసి జాకెట్టు చించేశాడు. అక్కయ్య గట్టిగా కేకలు పెట్టింది. నాన్నను అమ్మ కొట్టింది. నేనూ చెయ్యి కొరికిన. దెబ్బకు అక్క మీది నుండి లేచి పోయి వేరే గదిలో తలుపులు పెట్టుకుని పడుకున్నాడు. మేము ఆ రాత్రంతా ఏడ్చుకుంటూనే కూర్చున్నాము. మా అక్కయ్య ఏడుపును ఆపడం మా వశంగాలేదు. బాత్­రూంకు పోయి వస్తానని వెళ్ళిన అక్కయ్య మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా వస్త లేదని అమ్మ తలుపు తియ్యబోతే రాలేదు. అవతల పక్క గొళ్ళెం పెట్టుకున్నది. ఇంటి వెనకాల వేపచెట్టుకు ఉరేసుకున్నది” అంటూ బిగ్గరగా ఏడ్వసాగింది ప్రమీల.

రంగనాథం ‘నిజమా!’ అన్నట్టు కమలమ్మను చూశాడు.

కమలమ్మ నిజమే అన్నట్లు తలూపింది.

రంగనాథం డ్యూటీ పరంగా ఎంతటి కఠినాత్ముడైనా.. ఒక తండ్రిగా ప్రమీల హృదయ ఘోష వింటుంటే.. కన్నీళ్ళు జల, జలా కారసాగాయి. సంఘంలో నీతి నియామాలు గంగలో కలుస్తున్నాయని మనసులో మదనపడసాగాడు.

“మా అక్కయ్య పోయాక నాన్న మారుతాడని అనుకున్నాం.. కాని మార లేదు. తాగడం తగ్గ లేదు. ప్రతీ రోజు తాగుడే.. తాగుడు. అమ్మ కష్టపడుతూ.. కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులు లాక్కునే వాడు. ఇవ్వకుంటే.. కొట్టేవాడు. ఇలా అయితే ఎలా? అని అమ్మ బాధ పడ్డం.. తట్టుకోలేక పోయాను. నిన్న రాత్రి అమ్మ మీద కొత్తగా నింద మోపాడు. అందుకే పరమయ్య మామతోని పెద్ద గొడవ అయ్యింది” అనుకుంటూ జరిగిదంతా పూసగృచ్చినట్టు చెప్పింది ప్రమీల.

“అయితే పరమయ్య మామనే చంపాడా!” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం.

కాదన్నట్టు తలూపుతూ.. తిరిగి చెప్పసాగింది ప్రమీల.

“రాత్రి పీకల దాకా తాగి వచ్చి ‘పమ్మీ.. తెల్లవారేసరికి మీ అమ్మ చావు ఖాయం.. పాడెకట్టి సాగతోలుతా..’ అని రాగాలు తీసుకుంటూ.. స్పృహ లేకుండా పడుకున్నాడు.

నాకు బాగా కోపమొచ్చింది. నాకు నిద్రపట్ట లేదు. నాకు అమ్మ కావాలి. నాన్న లేకున్నా ఫరవాలేదనుకున్నాను.

నులుక మంచంలో పడుకున్న నాన్న కాళ్ళ మీద దుప్పటి కప్పి కాళ్ళకట్టలో ఇరికించాను. రెండు చేతులకు టవల్ కట్టాను. తలకు ప్లాస్టిక్ కవరు తొడిగిచ్చాను. నాలుగు మడతలు పెట్టిన గొంగడి ముఖంమ్మీదేసి ఊపిరాడకుండ మీద కూర్చున్నాను. కొద్ది సేపటికి చనిపోయాడని నిర్థారించుకొని, అన్నీ సర్దేసి అమ్మ దగ్గరకు పోయి పడుకున్నాను” అంటూ రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని ఏడ్వసాగింది ప్రమీల.

నిర్ఘాంత పోయాడు రంగనాథం.

మరో ప్రక్క ఇది నమ్మశక్యంగా లేదని మనసు చెబుతోంది.

‘ఇది ప్రమీలకు సాధ్యమయ్యే పనేనా! లేక కమలమ్మను కాపాడాలని ప్రమీల కట్టు కథ చెబుతోందా..! ఏది ఏమైనా.. ఒక నీచుని పీడ వదిలింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే హంతకులెవరో తెలుసుకోవచ్చు గానీ..’

సందిగ్ధంలో పడి.. నుదురు నిమురుకోసాగాడు రంగనాథం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు