అనగనగా..... సస్యశ్యామలంగా, పసుపక్ష్యాదులతో పాడిపంటలతో, వివిధ వృక్ష జాతులతో, ఆరు కాలాలు సుభిక్షంగా ఉండే రాజ్యమే కాంభోజ రాజ్యము. ఆ దేశానికి రాజు భోజుడు. శత్రుదుర్బేద్యమైన కోటలో ఉంటూ తన సుపరిపాలన సాగిస్తూ ఉంటాడు. ధర్మానికి కట్టుబడి తన పాలనలో సమస్యలు లేకుండా ప్రజలు అందరు సుఖసంతోషాలతో జీవించేలా జాగర్తలు తీస్కుంటు రాజపరంపరకు ఎటువంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఆ రాజ్యం ముఖ్యసేనాని విక్రమసేనుడు. అతనే రాజుకు ఆంతరంగిక అంగరక్షకుడు కుడా. ప్రతిరోజు రాత్రి రెండు జాముల వరకు రాజు మందిరం ముందర అతనే కాపలా ఉంటాడు. తెల్లవారుజామున రాజు వ్యాయామ కసరత్తులకు వెళ్ళగానే అతను ఇల్లు చేరతాడు. ఇది అతను రోజూ నిర్వర్తించే బాధ్యత. అలాగే రాజ్యంలో మిగిలిన సేనాధిపతులకు కావలిసిన నిర్దేశాలు చేస్తూ అందరిపట్ల విధేయతగా అందరిదగ్గర ఆదరాభిమానాలు పొందుతూ రాజ్య క్షేమం కోసం రాజు కోసం ప్రాణాలు కూడా తృణప్రాయంగా సమర్పించగల నమ్మకస్థుడని పేరు తెచ్చుకున్న వ్యక్తి అతను. వర్షాకాలం ఆకాశము చిల్లు పడిందా అన్నట్లు కుంభవృష్టి కురుస్తోంది. ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. ప్రతి రాత్రిలాగా ఆ రోజు కూడా మందిరం ముందు కాపలాగా విక్రమసేనుడు నిలబడి ఉన్నాడు. ఎవరక్కడ? అన్నాడు రాజు. నేను మహారాజా విక్రముడిని ఇక్కడే ఉన్నాను అని జవాబు ఇచ్చాడు. రెండవ జాము గంట కూడా కొట్టారు. వర్షంజోరు తగ్గలేదు. రాజు మళ్ళీ ఎవరక్కడ అని అంటే నేనే అన్న విక్రముడు జవాబు. కాసేపటికి ఎక్కడనుంచో ఒక ఏడుపు వినిపిస్తోంది. ఆ వినపడ్డ వైపుకి అడుగులు వేస్తూ చుట్టుపక్కల వెతుకుతూ నడుస్తున్నాడు విక్రముడు. అలా అలా ముందుకు నడుస్తూ వెళ్లగా వెళ్లగా కోటలో ఉన్న కోనేరు వద్ద ఒక అంతఃపుర కాంత కూర్చుని ఏడుస్తోంది. ఎవరమ్మా నువ్వు ఇలా వర్షంలో ఇక్కడ కూర్చుని బాధపడుతున్నావు? అని అడిగాడు విక్రమసేనుడు. నేను ఈ రాజ్యలక్ష్మిని. త్వరలోనే ఈ రాజ్యం పాలించే రాజుకు మరణం రానుంది. నేను మళ్ళీ ఎవరి చేతుల్లోకి వెళ్తానో అని బాధగా ఉంది అన్నది. విక్రముడు ఆశ్చర్యంతో రాజుకు మరణమా? ఏ విధంగా చూసినా అతనికి ఏ ప్రమాదం లేదు. ఆరోగ్యంగా ఉన్నాడు మరి ఎలా మరణిస్తాడు అని అడిగాడు. అతని తలరాత అలాఉంది, దానికి ఎవరు ఏమి చెయ్యగలరు అని ఆమె మళ్ళీ ఏడుస్తోంది. నువ్వే ఏదో ఒక దారి చెప్పమ్మా, మాకు మా రాజు క్షేమంగా ఉండాలి. నీకు నీ క్షేమం కూడా కావాలి కదా చెప్పు తల్లి, నువ్వు ఏమి చెయ్యమన్నా సిద్ధంగా ఉన్నాను అన్నాడు విక్రముడు. అప్పుడు ఆమె నాయనా ఒక్కటే దారి ఉంది. ఈ రాజ్యంలో ఎవరైనా తమ బిడ్డ ప్రాణాలు ఈ రాజ్యం ఇలవెలుపుకు బలి ఇస్తే రాజుకు పూర్ణాయుష్షు లభిస్తుంది అన్నది. విక్రముడు ఒక్క క్షణం ఆలోచించి అలాగేనమ్మ అని వడివడిగా అడుగులు వేస్తూ ఇంటిదారి పట్టాడు. తలుపు చప్పుడు విని విక్రముని భార్య ఎవరు అని అడిగింది. నేనే భవాని తలుపు తెరువు అన్నాడు. ఈ వేళలో ఎందుకు వచ్చాడో అని తలుపు తీసింది. వెంటనే జరిగింది చెప్పి మన బిడ్డ దత్తసేనుని తీసుకువెల్దామని వచ్చాను అంటాడు. భవానీ చలా సంతోషంగా అంతకంటే భాగ్యమా అని బిడ్డను నిద్ర లేపేలోపలే ఆ చిన్నారి అలాగే నాన్న రాజుగారి కోసం మనం ఏమైనా చెయ్యాలి అని తండ్రి వెంట సిద్ధం అయ్యాడు. భవాని మేము కూడా మీతో వస్తాము అని కూతురుని కూడా వెంటపెట్టుకుని అందరూ ఇలవేల్పు గుడికి చేరారు. కాళీమాత ముందు దణ్ణం పెట్టుకుని దత్తసేనుని నుదుట వీర తిలకం దిద్ది బలికి సిద్ధం చేసింది భవాని. విక్రమసేనుడు అమ్మ కాళీమాత మా రాజును మా రాజ్యాన్ని రక్షించు. ఇదిగో నీ బలి అని ఒక్క కత్తివేటుతో దత్తసేనుని తల అమ్మపాదల దగ్గర పడవేశాడు. అది కళ్ల చూసిన విక్రమసేనుడి కూతురు హడలిపోయి మరణించింది. భవాని వెంటనే తేరుకుని భర్తతో ఇప్పుడు సమయం లేదు నేను పిల్లలను అనుసరిస్తాను, మీరు మాత్రం రాజ్యక్షేమము గురించి దృష్టి పెట్టండి అని ఆమె అక్కడ ఉన్న ఖడ్గంతో తన ప్రాణాలు కాళీమాతకు అర్పించింది. వెంటనే విక్రముడు కాళీమాతకు నమస్కరించి అమ్మ నా కుటుంబం మొత్తం నీకు బలిగా ప్రాణాలు ఇస్తాము మా రాజును కాపాడు అని తన ప్రాణాలు కూడా అమ్మ పాదాలకి సమర్పించాడు. ఇంత త్యాగం ఆ పరమేశ్వరి కూడా తట్టుకోలేకపోయింది. వెంటనే ఆ నలుగురిని మరలా జీవితులను చేసి విక్రమసేనా నీవు నీ కుటుంబము చేసిన త్యాగం మెచ్చి నీకు వరం ఇస్తాను కోరుకో అన్నది. నాకు మా రాజు క్షేమం తప్ప ఏ వరాలు అవసరం లేదు తల్లి. నీ కరుణకు పాత్రులము అయ్యాము అంతే చాలు అన్నాడు. తల్లి సంతోషించి నీ రాజుకు పూర్ణాయుష్షు ఇస్తున్నాను ఇంక అతనికి ఏ ఆపద రాదు అని పలికింది. అందరూ అమ్మకి నమస్కరించుకుని తన భార్య పిల్లలను ఇంట్లో విడిచి విక్రమసేనుడు మళ్ళీ కోట చేరాడు. తెల్లవారింది, రాజు లేచి వ్యయమము చెయ్యటానికి అంతఃపురము నుండి బయటకు వచ్చేసరికి విక్రముడు తన స్థానంలో అలాగే నిలబడి ఉన్నాడు. పగలు అంతా యధావిధిగా సభలో సమావేశం అయ్యారు. ఆనాటి వ్యవహారాలు అన్ని చక్కబడ్డాక రాజు ఇవాళ ఒక ముఖ్య విషయం మీ అందరికి నేను చెప్పాలి అని సభను సావధానపరచి రాత్రి జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. అంతే కాకుండా తన రాజ్యంలో కొంత భాగాన్ని విక్రమసేనుడిని రాజుగా ప్రకటించి సకల సత్కారాలు చేసాడు. విక్రముడు రాజా! రాత్రి జరిగింది మీకు ఎలా తెలుసు అని అడుగగా భోజుడు ఇలా చెప్పాడు. కాపలా ఎవరు ఉన్నారని రాత్రి నేను పిలిచినప్పుడు నువ్వు రెండు సార్లు బదులు ఇచ్చావు. ఇంకాసేపటికి నాకు ఒక రోదన వినపడింది అది విని నిన్ను పిలిచాను కానీ నువ్వు పలకలేదు నిన్ను వెతుకగా నువ్వు కొనేరుగట్టున ఉండటం చూసి నిన్ను అనుసరించాను ఆలయంలో జరిగింది అంతా కళ్లారా చూసాను. నీ త్యాగానికి తగిన మెప్పు చేసే చోటు అది కాదు అని సభ చేరేవరకు ఆగాను. నీ వంటి స్వామిభక్తి కలవాడిని నేను చూడలేదు. కాళీమాత అనుగ్రహం నీపై సంపూర్ణంగా ఉంది. నీవల్ల ఆమె దర్శనం నాకు కూడా లభించింది అని విక్రమునికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ కథలో ఉన్న విక్రమసేనుడిలాగే మన దేశ రక్షణలో ఉన్న సైనికులు కూడా. వారి జీవితాన్ని భరతమాతకి అంకితం ఇచ్చి వారి సకల సంతోషాలు వదులుకుని మనకోసం, దేశం కోసం బాధ్యతగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. అందుకే అలాంటి వారికి జేజేలు పలుకుదాం. మన సైనిక వీరులకు మనసారా వందనం చేద్దాం.