విశిష్ట అద్వైతం.. - చాందినీ బళ్ళ

Distinctive Advaitam ..

కంప్యూటర్ ముందు వేసుకుని అన్ని వెబ్సైట్లు వెతుకుతుంది ఆద్య.. ఒక వెబ్సైట్లో బ్లాగు తనని ఆకర్షించింది..... *** pillaluchadhvulu.blog.com నమ్రత, ఆనంద్ కథ 15 సెప్టెంబర్ , 2020 రచన - వెన్నెల రాగ **** స్కూలు నుండి పాపని తీసుకు రావడానికి వెళ్ళిన నమ్రతకు బయట గోడ మీద ఉన్న ఒక అడ్వర్టైజ్ మెంట్ కాగితం తన దృష్టిని ఆకర్షించింది. వెంటనే దాని ఫోటో తీసుకుని నవ్వుతూ బయటకు వచ్చిన పాపని బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకు వెళ్ళింది. కొన్ని నెలల తర్వాత, "ఏవండీ, ఈ వారం దసరా సెలవులు కదా, సరదాగా ఢిల్లీ వెళ్ళి వద్దామా, పాపని ఎప్పుడూ ఎక్కడికి తీసుకు వెళ్ళడం అవ్వలేదు కదా!!అత్తయ్య వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు." అని ఎప్పుడూ ఏమి అడగని భార్య అడగగానే "సరే, తప్పకుండా" అని ఒప్పుకున్నాడు ఆనంద్. ఎక్కడెక్కడి వెళ్ళాలి,ఏమి చూడాలి, ఏమి చేయాలి అన్నీ ప్రణాళిక వేసుకున్నారు. ముందుగా తను అనుకున్న తారీఖు, ప్రదేశం రాగానే నమ్రత ఏమి ఎరుగని దానిలా "ఏవండీ, ఇంక అలసిపోయా, కాసేపు ఈ పక్క ఆడిటోరియం లో ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టు ఉంది, వెళ్ళి చూద్దామా, ఎలాగో సాయంత్రం రూం కి వెళ్ళడం కదా!! లోపల ఏ.సి లో కూర్చున్నట్టు ఉంటుంది." అంది. "సరే", అని లోపలికి వెళ్తుండగా టికెట్స్ అడిగారు సెక్యూరిటీ వాళ్ళు. తన హ్యాండ్ బాగ్ నుండి టికెట్స్ తీసి ఇచ్చిన నమ్రత నీ ఆశ్చర్యంగా చూసి "నీ దగ్గరకి ఎలా వచ్చాయి" అన్నాడు ఆనంద్. "పదండి, చెప్తాను" అంది. ఏమి అర్దం కానీ ఆనంద్, లోపలికి వెళ్ళాడు వాళ్ళ ఇద్దరితో కలిసి. కాసేపటికి అర్థమైంది, అది ఆల్ ఇండియా కలర్ కాంబినేషన్ కాంటెస్ట్, పిల్లలు చేసిన ఆర్టూ, క్రాఫ్ట్, వీడియో లో బహుమతులు ఇచ్చే కార్యక్రమం అని. తను ఎందుకు వచ్చానో ఆలోచించడం మాని వాళ్ళు ప్లే చేసిన సెలెక్ట్ అయిన వీడియోలు చూడసాగాడు. అకస్మాత్తుగా తను, పాప ఉన్న వీడియో, ఎప్పుడూ తీసింది, ఎలా అని ఆశ్చర్యపోయి నోరు ఆవలించి చూస్తున్నాడు, కళ్ళమ్మట ఆనంద భాష్పాలు మొదలు అయ్యాయి. విజేతలు అన్నౌన్స్ చేసే సమయం వచ్చింది, "అందరు చిన్నారులు చాలా బాగా చేసారు, అందరూ విజేతలు అనడంలో సందేహం లేదు, అయితే మన జడ్జీల, ఆడియెన్స్ ల మనసులు దోచేసిన వీడియో హైదరాబాద్ కి చెందిన క్రౌడ్ ఫేవరెట్ "డాడీ డాటర్" "అద్వైత, ఆనంద్" అని, అలాగే క్రాఫ్ట్ విభాగంలో ఎంతో అందమైన ప్లాస్టిక్ రి యుసబిల్ వస్తువులు వాడి ఏభయి గాజులు, బ్రాస్లెట్స్ తయారు చేసిన అద్వైత అని చెప్పడంతో వేల మంది ఉన్న ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. స్టేజి పైకి ఎక్కబోతున్న ఆనంద్, నమ్రతకు ఆనందంతో మాటలు రాలేదు. తిరిగి రూంకి వెళ్ళేక పాప నిద్ర పోతుంది. హోటల్ బాల్కనీలో కూర్చున్న ఆనంద్, నమ్రత ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉన్నారు.ఇద్దరికీ ఆనందంతో, బాధతో, తృప్తితో, సంతోషంతో ఏం మాట్లాడాలో తెలీలేదు, కన్నీళ్ళ రూపంలో జాలు వారాయి.. మనసు మాత్రం పదేళ్ళుగా జరిగిన అన్ని సంఘటనలు రీలు తిప్పినట్టు తిప్పి చూపిస్తుంది. అద్వైత కు నాలుగేళ్ల వయసప్పుడు "ఆటిజం" ఉందని డాక్టరు చెప్పగానే ఇద్దరికీ ఏమి చేయాలో తెలీలేదు. అసలు అంటే ఎంటో తెలీలేదు, చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం "ఎర్రి పిల్ల" అనడం మొదలు పెట్టారు.నాగులమ్మ తల్లి శాపం అని, ఇంజెక్షన్ తో పుట్టిన బిడ్డ అని, గత జన్మలో పాపం ఈ రకంగా కొట్టిందని ఎన్నో అంటుంటే కన్నతల్లిగా నమ్రత ఎంతో కుంగిపోయింది ఆ మాటలకు. కన్న ప్రేమ ఈ వేధింపులకు మానసికంగా తట్టుకోలేకపోయినా తమ బిడ్డ తమకి విశిష్ఠమైనది అని ఒకరికొకరు తోడు ఉండి, ధైర్యంగా ముందుకు వెళ్ళారు, ఇద్దరూ పాపకి ఎలా చెప్తే అర్థమవుతాయి అని తరగతులకు వెళ్ళడం మొదలు పెట్టారు. ఆ వయసు ఆటిజం ఉన్నవారికి నీలం, పచ్చ, వంగపువ్వు రంగులు అర్దం అవుతాయి, ఆకర్షిస్తాయి అని తెలుసుకుని వాటితో నేర్పించడం మొదలు పెట్టారు. నమ్రత అద్వైతకు తల్లిగానే కాదు, టీచర్ గా, స్నేహితురాలిగా, ప్రోత్సాహం ఇచ్చే మెంటార్ గా నిలిస్తే, భర్త ఆనంద్ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు,తను కూడా నేర్చుకుని అన్నింటిలో పాపకి ఆటలు, పాటలతో నేర్పించాడు. స్పెషల్ స్కూల్ కోసం హైదరాబాద్ వచ్చారు, అందరికీ దూరంగా. రంగులతో, సెన్సారీ ఆటలతో(నీళ్ళు పోసి సీసాలో దారాలు వేయడం, రంగులతో నూనె నింపిన సీసా) పాప తన పనులు తను చేసుకోగలిగే సామర్ధ్యం పెంపొందించారు. కొన్ని రోజులకు పాప గెలిచిన వాటి గురించి ఇంటర్వ్యూ కి రమ్మన్నారు దంపతులని "మేము పెద్దగా మాట్లాడ తలచికొలేదు, కానీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మా పాప మాకు ఒక వరం, మేమేమీ గత జన్మలో పాపం చేస్తెనో, వేరే కారణం వల్ల పుట్టింది అనుకోవటం లేదు, తను ఎలా ఉందో అలానే మాకు బంగారం, విశిష్టం.మా వంటి తల్లి తండ్రులకు ఒక విన్నపం, మనకే ఎందుకు ఇలా జరిగింది అని ఎప్పుడూ ప్రశ్నించు కోవద్దు, బిడ్డని ఆత్మీయంగా దగ్గరగా తీసుకోండి,అదే వారికి రక్ష..అదే వారికి శిక్షణ " అని ముగించారు. *** ఈ కథనం అంతా బ్లాగులో చదివిన ఆద్య తన కూతురు అంతా బాగున్నా మరొకరితో పోల్చి తను, తన భర్త ఎంత ఒత్తిడి పెడుతున్నారో అర్దం అయ్యి, మార్కులు రాకపోతెనేమి,దానికి అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పాలో మేము కూడా శ్రద్ద పెట్టాలి.. అని ఆలోచిస్తూ, అదెలా ఉన్నా మాకు విశిష్టమైంది అని నిశ్చయించుకుని స్కూలు నుండి పాప రావడానికి ఎదురు చూడసాగింది. PS: ఇది కల్పిత కథ మాత్రమే. ఇంక ఇంతకన్నా సందేశం కానీ, మంచి మాట కానీ కలపాలని అనుకోవట్లేదు. అర్థమయ్యింది అని ఆశిస్తూ.. సెలవు🙏

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు