గణపతి బప్పా మోరియా....!కథ "ఈరోజు వినాయక చవితి కాబట్టి నేను మన గోపాల్ సార్ ని మాఇంటికి పిలుస్తాను"అని అన్నాడు గోపి. "నేను కూడా పిలుస్తాను సార్ ని,మాఇంటిలో కూడా ఘనంగా గణపతిపూజ చేసుకుంటాం కదా"అని అన్నాడు రాజు "మీఇద్దరే కాదమ్మా! నేను కూడా గోపాల్ సార్ ని పిలుస్తాను,మాఇంటిలోనే భోజనం చెయ్యమంటాను సార్ ని"అని కాస్తా గొప్పగా అన్నాడు వినోద్. "మీరంతా పిచ్చోలులా వున్నారు ఖచ్చితంగా సార్ మా ఇంటికే వస్తారు,నేను ముందే చెప్పాను సార్ కి,మాఇంట్లో ఎన్నో రకాల వంటలు వుంటాయి,వినాయకచవితి విందుకు రండని"అని కాలర్ ఎగరేసాడు ఆనంద్. మోహన్ మౌనంగా ఉండిపోయాడు. గోపి,రాజు,వినోద్,ఆనంద్,మోహన్ మంచి మిత్రులు ఐదుగురూ ఐదో తరగతి చదువుతున్నారు. కోవిడ్ వైరస్ వ్యప్తి కారణం వల్ల ఇప్పుడు బడికి పిల్లలు రావడంలేదుకానీ బడిలో నాడూ నేడూ పనులు పర్యవేక్షణకు గోపాల్ సార్ ప్రతిరోజూ బడికి వస్తున్నారు. సార్ ని చూడటానికి ఈఐదుగురు మిత్రులూ బడికి వెళ్తుంటారు. "వినాయకచవితి రోజుకూడా నేను బడికి వస్తాను,ఆరోజు బడిగోడలపై బొమ్మలు వేయించే పనివుంది,ఆ రోజు తప్పితే మనకు చిత్రకారుడు దొరకడు"అని అన్నారు గోపాల్ సార్. "సార్ వినాయకచవితిరోజు మీరు భోజనం తెచ్చుకోవద్దు మీకు మేమే భోజనం ఏర్పాటు చేస్తాం"అని మాష్టారికి చెప్పారు శిష్యులు,"సరే అలాగే చేద్దాం కానీ పూజలు, భోజనాలు పేరిట పెద్ద ఖర్చులు,హంగామాలు వద్దు,పర్యావరణ హితం చూసుకోవాలి,ఇంట్లో ఆర్ధిక పరిస్థితి గమనించి మసలుకోవాలి"అని సార్ శిష్యులకు హితవు చెప్పారు. అది గుర్తుచేసుకొని"సార్ మా ఇంటిలో భోజనం చేస్తారు" అని ఒకడంటే "లేదు మా ఇంటిలోనే భోజనం చేస్తారు"అని మరొకడు అంటూ వంతులాడు కుంటున్నారు ఇప్పుడు మోహన్ తప్ప మిగతా మిత్రులు. మిగతా నలుగురు కన్నా మోహన్ చాలాపేదవాడు కాబట్టి,"మాలాంటి వారింటికి సార్ ఎలాగూ రారు" అని మనసులోనే అనుకోని మౌనంగా ఉండిపోయాడు మోహన్. వినాయక చవితిరోజు గోపాల్ సార్ బడికి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు సమయంలో ఐదుగురు శిష్యుల్ని పిలిచి "మీరందరూ నాకు సమానమే కానీ ఈ రోజు నేను మోహన్ ఇంటిలో భోజనం చేస్తాను సరేనా"అని అన్నారు. ఐదుగురు శిష్యులూ ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.మోహన ఆశ్చర్యం నుండి తేరుకొని"ఒరే మీరు సార్ ని మాఇంటికి తీసుకొని రండి నేను వెళ్లి మా అమ్మతో ముందుగా చెబుతాను"అంటూ ఇంటికి పరుగుపెట్టాడు. గోపాల్ సార్ మోహన్ ఇంట్లో భోజనం ముగించి,బడికి వచ్చి కాస్తా విశ్రాంతి తీసుకుంటుండగా...అతని శిష్యులు బడికి వచ్చారు. ఆనంద్ కాస్తా ధైర్యం తెచ్చుకొని"సార్ మా ఇంటిలో మీకోసం మంచి వంటలు చేయించాను,మీరు మోహన్ ఇంటిలో భోజనం చేశారేంటి!వాడి ఇంటిలో ఏముంతుంది సార్ ఈ రోజు పసుపు అన్నం వంకాయకూర తప్ప"అని అన్నాడు హేళనగా,ఆ మాటలకి మోహన్ తప్ప మిగతా వారందరూ గొల్లున నవ్వారు. "మీరు నేను చెప్పిన మాటలు వినలేదు కాబట్టి,నా మాటలు మీకు లెక్కలేదు కబాట్టి నేను మీకు స్నేహితుడిని కానట్టే కదా,ఇక మోహన్ నామాట విన్నాడు,అందుకే వాడి ఇంట్లో భోజనం చేశాను"అన్నారు గోపాల్ సార్. "ఇంతకీ మేము చేసిన తప్పేంటి,మోహన్ చేసిన ఒప్పు ఏంటి సార్"అని కొంటెగా అడిగాడు వినోద్. "పైసా ఖర్చు లేకుండా,పర్యావరణంనకు నష్టం లేకుండా వినాయక చవితి పండగ చెయ్యండిరా అంటే మీరు తలిదండ్రులన్ని ఇబ్బంది పెట్టి వాళ్ల దగ్గర డబ్బులు గుంజి రంగు రంగుల పెద్ద బొమ్మలు తెచ్చుకొని హంగూ ఆర్భాటాలతో పూజలు చేశారు,ఖర్చులతో కూడిన వంటలు ఎక్కువ చేయించి,ఒకేసారి వాటిని తినలేక, నిల్వచేయవీలులేక వృదాచేస్తున్నారు,మోహన్ కేవలం మట్టిని తెచ్చి,స్వయంగా గణపతి బొమ్మను చేసి తోటల్లో ఉచితంగా దొరికిన పత్రి,పండ్లు,పువ్వులతో పూజ చేసి,కేవలం పులిహోరా,వంకాయ కూరమాత్రమే అమ్మను కోరి,ఒకపక్క నామాటకు విలువఇచ్చి మరోపక్క తనఇంట్లో ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా నడుచుకున్నాడు,అందుకే వాడు చేసింది మంచిదే అని చెప్పడానికి,వాడిలోని ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టడానికి వాడింట్లో భోజనం చేసాను,మీరు గమనించలేదు కానీ నేను ఈరోజు బడికి వచ్చిన తరువాత మీ సీనియర్ శ్రీధర్ ని పిలిచి, రహస్యంగా మీఇళ్లకు పంపించి,నన్ను పూజకు పిలిచి నాకు భోజనం పెట్టి నన్ను మెప్పించడానికి మీరు ఇళ్లల్లో చేసిన హంగామా అంతా మీమీ తలిదండ్రుల్ని అడిగి తెలుసుకోమన్నాను,నాకు మొత్తం వివరాలు వచ్చాయి,ఇకపై మీరు ఎప్పుడూ పండగల పేరిట హంగామాలు చెయ్యకూడదన్న కనువిప్పు మీకు కలిగించడానికే ఇలా చేసాను.నేను భోజనానికి వస్తానని ఎదురుచూసి,నేను రాకపోయేసరికి మీమీ ఇళ్లల్లోవాళ్ళు నొచ్చుకుంటే నన్ను క్షమించమని చెప్పండి,ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం మరలా మనం మిత్రులం అయిపోదాం"అని అన్నాడు గోపాల్ సార్ నవ్వుతూ. "సారీ సార్ ఇకపై ఖర్చులు తక్కువ ఆనందం ఎక్కువ,పర్యావరణ పరిరక్షణ ఎక్కువ ఫ్లాస్టిక్ తక్కువ పనులు చేస్తాం సార్" అని అన్నాడు రాజు. గణపతి బప్పా మోరియా మోహన్ గాడే హీరో అయ్యాడయ్యా"అని అన్నాడు గోపి నవ్వుతూ... గోపాల్ మాష్టారితో సహా అందరూ గొల్లున నవ్వేశారు. ..........మీగడ వీరభద్రస్వామి 7893434721