‘కరోనా’ కష్టకాలంలో కాలు గడప బయట పెట్టడం లేదు పరంధామయ్య. దాని పేరు వింటేనే కడుపులో ఏదో తెలియని భయం ఆవహిస్తోంది.
ప్రతీరోజు పెందలాడే లేవడం.. కాలకృత్యాలు తీర్చుకుని, అలా దిగాలుగా వాలు కుర్చీలో వాలిపోవడం నిత్యకృత్యమయ్యింది. కాని ఈరోజు అతని వదనంలో ‘కరోనా’ భయం మరింత ఉధృతంగా ప్రతిబింబింస్తోంది.
అమెరికాలో ఉన్న తన ఒక్కగానొక్క కూతురు డాక్టర్ కుసుమ గురించి బెంగ అతణ్ణి మరింత కృంగదీస్తోంది.
పరంధామయ్య సతీమణి పార్వతమ్మ చాలా ధైర్యవంతురాలు. అలా అధైర్య పడొద్దని పరంధామయ్యకు తేప, తేపకు ధైర్యం నూరి పోస్తూంటుంది.
కుసుమ అమెరికా నుండి పంపించిన మినీప్యాడ్ను ఉపయోగించడంలో దిట్ట. ‘ఇంటర్నెట్’, ‘యూట్యూబ్’ లలో వెదుకుతూ.. దిన పత్రికలు చదువుతూ.. సమాజంలో తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తుంటుంది. తన అనుమానాలను నివృతి చేసుకుంటుంది. అందులో చూసిన అంశాలను పరంధామయ్యకు వివరించడం ఆమె కాలక్షేపం. నిత్యం ఎంతో ఆసక్తిగా వినే పరంధామయ్య ఈరోజు ఆవేదనతో కనిపిస్తున్నాడు. పరంధామయ్యకు టీవీ తప్ప మరో ప్రపంచము లేదు. అందులో వచ్చే ‘కరోనా’ వార్తలతో.. మరీ కుదేలై పోతున్నాడు.
సావిత్రమ్మ అతనిలోని ‘కరోనా’ భయాన్ని పారదోలడానికి రక, రకాల ప్రయోగాలు చెయ్యసాగింది. అందులో ముఖ్యంగా ‘కరోనా’ నుండి సులభ పద్ధతులతో కాపాడుకునే.. వ్యాయామ పద్ధతులు.. మన సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల పానీయాలు.
ఆ రోజు ఒక గ్లాసునిండా నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చటి నీళ్ళు తెచ్చి పరంధామయ్యకిస్తూ..
“ఏమండీ.. ముందుగా ఇది తీసుకోండి. అరగంట తరువాత కాఫీ సేవిద్దురు గానీ..” అంది.
“పార్వతీ.. అలా కూర్చో. నాకెందుకో భయంగా వుందిరా” అన్నాడు పరంధామయ్య.
“ఆ భయాలు పోవాలనే ఇది సేవించమంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా కాదు గదా..! దాని జేజమ్మ గూడా మనల్ని ఏమీ చెయ్యలేదు. అసలు మనుషుల చావుకు కారణం.. కరోనా కాదండీ.. భయం. భయమే మరణానికి మూలం. మనం వార్తల్లో చూడ్డం లేదూ..! ఒక యుక్తవయస్కుడు కరోనా బారినపడి మరణించడం.. అదే పేపర్లో.. ఒక పండు ముసలాయన కరోనాను ఓడించి.. తన శత జయంతి ఉత్సవాన్ని డాక్టర్ల మధ్య జరుపుకోవడం.. ఏమంటారు?. అలా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి గానీ.. ఇలా మనం భయపడడంలో అర్థం లేదు”
“భయం నాగురించి కాదు పార్వతీ.. నేనేమైనా ఫరవా లేదు గానీ, మన కుసుమ గురించి. కుసుమ పచ్చి బాలింత కదా..! పసి గుడ్డు ఆలనా, పాలనా చూసుకో కుండా.. కరోనా బాధితులకు సేవలందిస్తోంది” అంటుంటే పరంధామయ్య కళ్ళు జలపాతాలయ్యాయి.
పార్వతమ్మ చటుక్కున గ్లాసు టీ పాయ్ మీద పెట్టి.. పరంధామయ్య తలను తన ఒడిలోకి తీసుకుని ఒదార్చ సాగింది. పరంధాయ్యది చాలా సున్నితమైన మనసని తెలుసు.
“మరీ ఇంతగా బెంబేలు పడిపోతే ఎలాగండీ.. గుండె చిక్కబట్టుకోవాలి. కరోనా కష్టాలు ఎల్ల కాలముండవు. అమెరికాలో పరిస్థితి మరింత ఉధృతంగా ఉంది కాబట్టే.. పై అధికారులు లీవు తీసుకోమన్నా.. కుసుమ తీసుకోకుండా.. కరోనా బారిన పడిన వారికి సేవలందిస్తోంది. మనం ధైర్యంగా ఉంటూ.. కుసుమను ప్రోత్సహించాలి గాని.. ఇలా డీలా పడి పోవద్దండీ..” అంటూ ధైర్యం నూరిపోయసాగింది.
“అవునూ..! కుసుమ సహాయకురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందటగా!” అంటూ.. దీనంగా అడిగాడు పరంధామయ్య.
“నాకు తెలుసండీ.. వస్తే ఏం? పాజిటివ్ రాగానే.. ప్రాణం పోతుందా..!” అంటూ రెట్టించింది పార్వతమ్మ. “కుసుమ గూడా టెస్ట్ చేయించుకున్నదని చెప్పిందిగా..”
“అందుకేరా.. ఫలితం ఏమొస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది”
“మళ్ళీ అదే మాట.. మీ నోట భయం.. భయం.. భయం.
భయం అనే పదం తప్ప మరొకటి రాదా! ముందుగా ఈ గ్లాసు తీసుకోండి, చల్లారి పోతోంది” అంటూ పరంధామయ్య చేతికి గ్లాసు అందించింది పార్వతమ్మ.
పరంధామయ్య నిమ్మరసం త్రాగుతూండడం.. పార్వతమ్మ మనసు కాస్త తేలిక పడింది.
ఇంతలో పార్వతమ్మ ఫోన్ మ్రోగడంతో.. చూసి, వాట్సాప్ వీడియో కాల్ ఆన్ చేసింది.
“కుసుమా..! ఎలా ఉన్నావురా.. మీ నాన్న నీ కోసమే భయపడ్తున్నాడు. నేనెంత చెప్పినా మనసు కుదుట పర్చుకోవడం లేదు. ఒక సారి నాన్నతో మాట్లాడు.. నువ్వైనా కాస్త ధైర్యం చెప్పు” అంటూ పరంధామయ్య వాలు కుర్చీ పక్కకే తనూ స్టూలు లాక్కోని కూర్చుంది.
కుసుమను చూడగానే పరంధామయ్య ముఖం విచ్చుకుంది. తన కన్నీటి పొరలను కనబడనీయకుండా..
“కుసుమా.. నీ కరోనా టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయారా!” అంటూ మొదటి ప్రశ్ననే అలా సంధించడం.. పార్వతమ్మ ముసి, ముసి నవ్వులు నవ్వుతోంది.
“నెగెటివ్ నాన్నా.. నా అసిస్టెంట్ కు పాజిటివ్ వచ్చిందని తెలుసుగదా! ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. మీరు భయపడకండి. నాకు లీవు ఇచ్చారు. ఇంట్లోనే ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి”
“చాలా సంతోషం తల్లీ..!. ఇక నాకు ఏభయమూ లేదు. నా మనుమరాలు ఎలా ఉందిరా?”
“బాగానే ఉంది నాన్నా..” అంటూ.. వీడియోలో చూపించింది. పాలు కావాలి అన్నట్టు పెదవులు చప్పరిస్తూ.. కనబడుతున్న మనుమరాలిని చూసి ఇరువురికి ఆనందభాష్పాలు దొర్లాయి.
దాదాపు అరగంట సేపు తనివి తీరా మాట్లాడుకున్నారు.
***
కరోనా కాలం చెల్లింది.. నెమ్మది, నెమ్మదిగా కరోనా కరిగి పోతోంది. మామూలు జలుబు.. ఆవిరి పట్టుకుంటే చాలు.. హరీ! మంటోంది. సాధారణ జనజీవనం సాగిపోవడ మారంభమయ్యింది.
పరంధామయ్య ముడుచుకున్న కాళ్ళు విచ్చుకున్నాయి. వాటిని సాగదీయాలి అన్నట్టుగా.. అప్పుడప్పుడు మార్కెట్టుకు వెళ్లి కూరగాయలు తెస్తున్నాడు. కిరాణా కొట్టుకు వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులూ తెస్తున్నాడు.
ఆరోజు ఉదయం.. యధావిధిగా కాలకృత్యాలు తీర్చుకుని.. వాలు కుర్చీలో నడుం వాల్చున్నాడు.
పార్వతమ్మ పొగలు గక్కుతున్న రెండు స్టీలు గ్లాసుల నిండా కాఫీతో ప్రత్యక్షమయ్యింది.
“ఇది వేడి నీటిలో కలిపినా నిమ్మరసం కాదండీ. నిజంగా కాఫీనే..” అంటూ ముసి, ముసి నవ్వులు నవ్వుతూ.. పరంధామయ్యకు ఒక గ్లాసు అందించింది. తనూ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కాఫీ సేవించ సాగింది.
పరంధామయ్య పార్వతి చిరునవ్వులో తన చిరునవ్వు కలుపుతూ..
“అప్పుడప్పుడు అది సేవిస్తేనే ఒంటికి మంచిది.. పారూ..” అన్నాడు.. అలనాటి సినిమాలో దేవదాసులా.. “అందుకేగా బతికి బట్ట కట్టింది”
“దానికంటే ముఖ్యమైంది.. మరొకటి ఉంది’ అన్నది పార్వతమ్మ.
ఖాళీ కప్పును టీపాయ్ మీద పెడుతూ.. ఏంటది అన్నట్టుగా ప్రశ్నార్ధకంగా చూశాడు పరంధామయ్య.
ఇంతలో.. పార్వతమ్మ ఫోన్ వెలిగింది. అది వీడియో కాల్.. కుసుమ దగ్గరి నుండి..
“అమ్మా గుడ్ న్యూస్.. నాకు కాలిఫోర్నియా స్టేట్ నుండి ‘ది బెస్ట్ డాక్టర్’ అవార్డు వచ్చింది” అంటూ ఉద్వేగంగా చెప్పసాగింది. “కోవిడ్ ఇసోలేషన్ వార్డు ఇన్ చార్జీగా పనిచేసినంత కాలం.. నా అనుభవాలనే నూరి పోస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపేదాన్ని. ఒక్క పేషంట్ గూడా చనిపోలేదు. అందుకే నాకు ఈ అవార్డు దక్కింది”
పార్వతమ్మ ఆనందం ఆకాశాన్నంటింది. అభినందనలు తెలుపసాగింది.
పరంధామయ్య నోరు తెరిచాడు. అంత పెద్ద స్టేట్ లో కుసుమ మన భారతీయ డాక్టరమ్మకు అవార్డు దక్కడమంటే మాటలు కాదు. తనూ అభినందనలు తెలుపుతూ.. చిన్న పిల్లాడిలా నడుము వయ్యారంగా తిప్పసాగాడు.
“ముందుగా ఈ వార్త మీకే చెబుతున్నాను.. నాకు కాల్స్ ఇంకా వస్తున్నాయి.. నేను మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాను నాన్నా..” అంటూ వీడియో ఆఫ్ చేసింది కుసుమ.
కొద్ది క్షణాలు ఇద్దరి హృదయాలు ఆనందడోలికలలో ఊగిపోతూ.. మాటలు కరువయ్యాయి.
“అవునూ.. నా అనుభవాలానే నూరి పోస్తూ.. అంది కుసుమ. నాకర్థం కాలేదు” అంటూ పార్వతమ్మను విస్మయంగా అడిగాడు పరంధామయ్య.
పార్వతమ్మ చిరు నవ్వుతూ..
“ఇందాక నేనేమన్నాను. దాని కంటే ముఖ్యమైనది మరొకటి ఉందన్నాను..”
“అవునవును.. మధ్యలో కుసుమ కాల్ వచ్చింది”
“మీలో ధైర్యం నింపడం.. నిజం చెబితే మీరు తట్టుకోలేరని అబధ్ధం చెప్పాం. వాస్తవానికి కుసుమ సహాయరాలికి నెగెటివ్.. కుసుమకు పాజిటివ్ వచ్చింది. అయినా కుసుమ భయపడకుండా.. మన ఆయుర్వేద చిట్కాలు.. ఆవిరి పట్టుకోవడాలతో.. వారం రోజుల్లోనే కోలుకొని మళ్ళీ డ్యూటీలో జాయినయ్యింది. అక్కడి వారంతా ఆశ్చర్య పోయారట. ఆ అనుభావాలనే.. కోవిడ్ పేషంట్స్ స్ఫూర్తిగా తీసుకుని.. మన కుసుమ కనుసన్నల్లో మరణాలు సంభవించ లేదు. తన ప్రతిభకు గుర్తింపు దక్కడం.. మన అదృష్టం”
పరంధామయ్యకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది. మనిషికి భయమే.. మరణానికి మూలం *
-చెన్నూరి సుదర్శన్.
చరవాణి: 9440558748