ఏవండీ!మంచి నీళ్లు కావాలా?" అంటూ చాపా,పక్కబట్టల్ని చుట్టగా చుట్టుకుని నీళ్ల గ్లాసు పట్టుకుని రాత్రి పన్నెండు గంటల వేళ మేడ మీదకి వచ్చింది రుక్మిణి. పిట్టగోడ మీద చేతులు ఆనించి మింటి చంద్రుడి వంక చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్న రామం భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. "దాహమేసినప్పుడు తాగుతా అక్కడ పెట్టు. కింద అందరూ పడుకున్నారా? వాళ్ళకి కావలసిన దుప్పట్లు అవీ ఇచ్చే వచ్చావుగా?" అన్నాడు రామం చదునుగా ఉన్న డాబామీద చాప పరుస్తూ. "ఆ..అంతా సర్దుమణిగినట్టే..హాయిగా నిద్ర పోతున్నారు.చూసే వస్తున్నాను.ఈ ప్రశాంతత మీ చలవేనండీ , పొద్దున ఇల్లంతా రణరంగంలా ఉంది. ఇంతకీ తప్పు మీ బావగారిదా, మీ చెల్లిదా?" అంది రుక్మిణి చాప మీద దుప్పటి పరచి పడుకున్న భర్త రామం పక్కనే కూర్చుంటూ. "మనలాంటి మధ్య తరగతి కుటుంబాల్లో అంతా బ్రహ్మ ప్రళయమే. ప్రతిదీ ఒక వివాదమే ,సమస్యే. కొత్తగా పెళ్ళైన చెల్లీ,బావా ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చేలాయించాలనే ధోరణే ఈ గొడవకు అసలు కారణం."అన్నాడు రామం. "అవును.వాళ్ళు గొడవ పడింది చాలక వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించి మీ అమ్మా నాన్నలను, మనల్ని కూడా ఎంత ఖంగారు పెట్టేసారో. విడిపోతారేమో అనిపించేంతగా కీచులాడుకున్నారు. మీరు కలగజేసుకుని సమస్యను ఇట్టే తేల్చేశారు. అయినా మీకు ఎలా వచ్చిందండీ ఆ ఆలోచన."అంది రుక్మిణి "ఉప్పు ద్రావణంలో నానబెట్టిన ఉసిరికాయల్ని సీసాతో తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చేసరికి ఇద్దరూ అయోమయంగా నా వంక చూసారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు మనుషుల్ని ఆలుమగలుగా కలిపి ఉంచే వివాహ బంధం గొప్పతనాన్ని వినూత్న రీతిలో తెలియచెప్పారు. సముద్రపు ఉప్పునూ,అడవిలో ఉసిరికాయనూ ఒక్క చోటకు చేర్చిన విధికి విలువిచ్చి కలిసిన బంధాన్ని గౌరవించి తల వంచాలని, ఉసిరికాయ ఎక్కడ పుట్టినా ఉప్పుతో కలిశాక దాని నాణ్యత,విలువ మరింత పెరుగుతాయి తప్ప తగ్గవనీ, ఉప్పుకల్లు కరిగి పోతేనే మరొక పదార్ధంతో మిశ్రమం చెంది మనగలదని సులభంగా ,విపులంగా చెప్పేసరికి ఇద్దరూ మారు మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్లిపోయారు. అమ్మా నాన్నా కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు."అన్నాడు రామం "కానీ నాదో చిరు సందేహం"అంది రుక్మిణి భర్త మొహంలోకి చిలిపిగా తొంగి చూస్తూ. "రాణి గారి సందేహ నివృత్తే మా తక్షణ కర్తవ్యం, చిత్తం దేవీ.అడగండి"అన్నాడు రామం భార్య నగుమోమును చూస్తూ . "మా ఇద్దరిలో ఎవరు ఉప్పు,ఎవరు ఉసిరికాయ అంటూ మీ చెల్లీ బావా మళ్లీ తగవు పడితే అప్పుడు ఏంచేసేవారు"?అంది రుక్మిణి.వస్తున్న నవ్వును పెదవి అంచునే అదిమి పడుతూ. "ఏముందీ.ఉడుకుమోతులెవరైతే వాళ్ళు ఉప్పు కల్లు, ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఉసిరికాయ అంటాను. ఉడుకుమోతులం నేను కాదంటే నేను కాదంటారు ఇద్దరూ. అయితే ఇద్దరూ ఉసిరికాయ అన్నట్టేగా. ఒకే జాతికి చెందిన వాళ్ళ మధ్య వైరం దేనికట. "అమ్మో చాలా గడుసు వారే." అంది రుక్మిణి "సముద్రంలో పుట్టిన ఉప్పుకి ఆ సముద్ర లక్షణాలే ఉంటాయి. సహన శీలి చెట్టు అందించే ఫలాలకు ఆ లక్షణాలే వున్నా రెండూ కలిసినప్పుడు సర్దుకుపోవటానికి కొంత సమయం పడుతుంది. ఆ మధ్యలో కొద్దిపాటి సంఘర్షణ తప్పదు. సయోధ్య కుదిరాక సత్ఫలితాలు కూడా అంతే మధురంగా ఉంటాయి.అది తెలుసుకున్న జంట మధ్యన గొడవలు రావు"అన్నాడు రామం భార్య ముంగురులను సవరిస్తూ. "అవునండీ!వేర్వేరు చోట్ల పుట్టి పెరిగిన ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్ధం చేసుకుంటే చాలు. పదేళ్ల మన దాంపత్య జీవితంలా, తొందర్లు లేని హాయి రాగంలా బతుకు నావ ప్రశాంతంగా సాగిపోతుంది కదూ" తననే చూస్తున్న భర్త రామం కళ్ళలో పైన విశాల ఆకాశంలోని చంద్రుని కాంతి ప్రతిఫలిస్తుంటే మురిపెంగా చూస్తూ గుసగుసగా అంది రుక్మిణి. భార్య వంక తృప్తిగా చూస్తూ ఉండి పోయాడు రామం.