చదువు - చదివించు - చెన్నూరి సుదర్శన్

Read-Read

“తమ్ముడూ..! నాన్న నో మోర్.. ములుగుకు తీసుకెళ్తున్నాం” అని బిగ్గరగా ఏడుస్తున్నాడు అన్నయ్య. నా గుండె ఝల్లుమంది. నాలుగు రోజుల క్రితం పెద్దనాన్నాను ములుగు నుండి సికింద్రాబాదు యశోడ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించాడు. పెద్దనాన్నకు హై బి. పి. తో మెడ నరాలు చిట్లి పోయి కోమాలోకి వెళ్లి పోయాడు. నేను రాత్రే చూసి వచ్చాను. పూర్తిగా తెల్లవారక ముందే ఈ చెడు వార్త వినాల్సి వచ్చింది. నా కళ్ళూ కన్నీటి జలపాతాలయ్యాయి.

“అన్నయ్యా.. నేనూ బయలుదేరుతున్నాను. కాస్త ధైర్యం తెచ్చుకో.. పెద్దమ్మ మరీ దిగాలు పడిపోతుంది” అని ఫోన్ పెట్టేసి.. ఉన్నఫళంగా ములుగు బయలుదేరాను. ఈ మధ్యకాలంలో మా ఊరికి వెళ్లక చాలా సంవత్సరాలు కావస్తోంది. ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాను.

ములుగు బస్ స్టాండులో దిగే సరికి కాలనీ.. కాలనీ.. అంటూ ఆటో వాళ్ళ గోలతో ఆశ్చర్య పోయాను. లోగడ ఆటోలు లేవు. ఇప్పుడు ములుగు జిల్లా అయిన ప్రభావమనుకున్నాను. ఆటో ప్రధాన రోడ్డు నుండి మా కాలనీ వైపు పరుగెడుతుంటే.. పెద్దనాన్నవాళ్ళ బట్టల దుకాణం కనబడింది. అన్నయ్య, పెద్దనాన్నలతో నాకున్న అనుబంధాలు గుర్తుకు రాసాగాయి.

అన్నయ్య అంటే నా స్వంత అన్నయ్యేమీ కాదు. మేమంతా ఒకే కాలనీలో ఉండే వాళ్ళం. కులమతాలు మరచి వావి వరుసలతో పిలుచుకునే వాళ్ళం. ఎవరి పండుగ వచ్చినా మా కాలనీ సాంతం ఆత్మీయానురాగాలతో వెల్లివిరిస్తుంటుంది.

పెద్దనాన్నకు కాస్తో కూస్తో చదువు వచ్చు. అన్నయ్యను హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో చదివించాడు. ఇంజనీరింగ్­లో గోల్డ్ మెడల్ సాధించాడు.. బి.హెచ్. ఐ. ఎల్. ఉద్యోగమొచ్చింది. విద్యుత్తు ప్రిపెయిడ్ మీటర్స్ కనుగొన్నందుకు రాష్ట్రపతి అవార్డూ వరించింది.

అన్నయ్య నాకు మార్గదర్శకుడు. మా నాన్నకు చదువు రాదు. చేనేత వృత్తి. కాలనీలో సహకార సంఘంలో కూలికి బట్టలు నేసే వాడు. అన్నయ్య సలహా మేరకు నన్ను కష్టపడి చదివించాడు. వరంగల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ నుండి గణితశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాను. ఉద్యోగం వచ్చే వరకు పిల్లలకు, నాశ్రీమతికి ట్యూషన్ చెప్పాను. నాకు జూనియర్ కాలేజీలో లెక్చరర్­గా ఉద్యోగం రావడం ఊరు వదలాల్సి వచ్చింది. హైదరాబాదులో సెటిలయ్యాను.

నాశ్రీమతి టీచరుగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాకు మెదక్ జిల్లా నుండి రాష్ట్ర ఉత్తమ టీచరుగా అవార్డు వచ్చింది. మా అన్నయ్య, మా ఇంటి మధ్యలో మరో తమ్ముని ఇల్లు ఉంది. ఆ తమ్ముడూ నాదగ్గరే చదువుకున్నాడు. మా అడుగు జాడల్లో నడుస్తూ.. ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. హెడ్ మాస్టారుగా పదోన్నతి పొంది పాఠశాలను అత్యుత్తమంగా తీర్చి దిద్దినందుకు గాను రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఒకే ఊళ్ళో.. ఒకే కాలనీలో.. వరుసగా మూడిండ్లలోని వారికి ఇలా అవార్డులు రావడం అరుదనుకుంటాను. అది చదువుల తల్లి దీవెన అని మురిసి పోతుంటాను.

“సర్.. కాలనీ లోపలి వరకు ఆటో పోను వీలుగా లేదు. ఇక్కడే దిగండి” అనే సరికి నా ఆలోచనలు ఆగిపోయాయి. ఆటో అతనికి డబ్బులిచ్చి సమయం చూసుకున్నాను. దాదాపు పదకొండు కావస్తోంది. వడి, వడిగా అడుగులు వేశాను. దూరంగా టెంటు కనబడేసరికి నా కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.. దారి కనబడ్డం లేదు. ఎదలో నుండి దుఃఖం తన్నుకు వస్తోంది. దారి తెలిసిన కాళ్ళు గనుక నేరుగా పెద్దనాన్న ఇంటికి దారి తీశాయి. పెద్దనాన్న పార్థివ దేహం కాళ్ళ మీద పడి ఘొల్లుమన్నాను. నన్ను చూడగానే వాడలో ఉప్పొంగుతున్న దుఃఖసాగర అలలు ఉవ్వెత్తున ఎగిసాయి.

పెద్దనాన్న దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి దాదాపు నాలుగయ్యింది. నాతో బాటుగా కడదాకా పాడె మోసిన పాపయ్య మామ కొడుకు బాలయ్యలా కనబడ్డతను గుర్తుకు వచ్చాడు. సంప్రదాయ ప్రకారం అన్నయ్య వాకిట్లో మోతుకాకు దొప్పలో పెట్టిచ్చిన నాలుగు పచ్చిపులుసు మెతుకులు గతుకుతున్నాడు. నేనూ ఒక దొప్ప తీసుకుని బాలయ్య ప్రక్కకే వెళ్లి కూర్చున్నాను. “పాపయ్య మామా కొడుకువే కదా!. నీ పేరు బాలయ్య” అవునా అన్నట్టుగా చూశాను. బాలయ్య ఆశ్చర్య పోతూ.. అవునన్నట్టు తలూపాడు. మామ బాగోగులడిగాను. ఇంటికి వెళ్దామన్నాడు.

తినడం పూర్తికాగానే బాలయ్యతో వాళ్ళ ఇంటికి బయలు దేరాను. కాలనీలో చివరి ఇల్లు. దహనక్రియలో పాల్గొన్న వారు నేరుగా తమ ఇంటికే వెళ్ళాలి గాని మరొకరి ఇంట్లోకి వెళ్ళగూడడనే నియమం కనుక వాకిట్లో గడెంచె వాల్చగానే కూర్చున్నాను. బాలయ్య అరుగు మీద కూర్చుంటూ.. “నాయ్నా..” అంటూ పిలిచాడు. ఊతకర్ర పట్టుకుని బయటకు వచ్చిన పాపయ్య మామను చూడగానే నిలబడి రెండు చేతులా నమస్కరించాను. నన్ను తదేకంగా చూస్తూ.. “ఓ.. సుధాకరువా! ఎన్నాళ్ళాయే అల్లుడా నిన్ను సూసి.. అంత మంచేనా బిడ్డా!” అనుకుంట.. అరుగు మీద బాలయ్య ప్రక్క కాస్త ఎడంగా కూర్చున్నాడు. “నా మనుమడు భాస్కర్ ఏం చేత్తాండు“ అంటూ అడిగాడు. బాలయ్య అప్పుడు గుర్తు పట్టి “బావా..! నువ్వా! ఎక్కడ్నో చూసినా అనుకుంటాన” అంటూ నమస్కరించాడు. నేనూ ప్రతినమస్కారంచేశాను.

మా పెద్దబాబు భాస్కర్, బాలయ్య ఇద్దరూ ఒకే ఈడు వాళ్ళు. మూడేండ్ల ప్రాయంలో నా బాబుకు పోలియో వ్యాధి సోకింది. నేను గుండె పగిలేలా ఏడుస్తుంటే.. కాలనీ సాంతం కంట తడి పెట్టింది. ములుగు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ పోలియోకు నివారణ లేదని కేవలం బలానికి మందులు వాడాలి, ఎక్సర్­సైజులు చేయించాలని చెబుతూ.. హైదరాబాదులోని కళావతి ఫిజియో థెరెపిస్ట్ పేరు చెప్పి చిరునామా ఇచ్చాడు. ఏడుస్తూ.. కూర్చుంటే లాభం లేదని బాబును ఎలాగైనా నడిపించి తీరాలని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను.

నా శ్రీమతిని, బాబును తీసుకుని హైదరాబాదులో ఒక నెల రోజులపాటు ఉండి వ్యాయామ పద్ధతులు నేర్చుకుని వచ్చాము. ఇంట్లోనే బాబుకు వ్యాయామాలు చేయించసాగాము. కొద్ది రోజులకు బాబు పది సెకన్ల సేపు స్వతహాగా నిలబడగలుగుతున్నాడు. మా ఆనందానికి హద్దులు లేవు. కొద్ది రోజులకు తప్పటడుగులు వేయసాగాడు. కొంచెం ఊపిరి పీల్చున్నాను. కాలనీ వారంతా నా శ్రమను శ్లాఘించారు. ఇంతలో నాకు ఉద్యోగం రావడంతో హైదరాబాదుకు వెళ్లాను. ఆ తరువాత జరిగిన విషయం మామకు తెలియదని వివరంగా చెప్పసాగాను.

“మామా.. బాబును నేనున్న వాడకు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశాను. రోజూ ఎత్తుకుని వెళ్లి బడిలో దించి నేను కాలేజీకి వెళ్ళే వాణ్ణి. నా భార్య అదే స్కూల్లో అనుభవం రావాలని ఉచితంగా పాఠాలు చెప్పదానికి అనుమతి తీసుకున్నాను. నాకు కాస్త ధైర్యంగా వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు తీసుకు వచ్చే వాణ్ణి.

ఒక రోజు బాబును కళావతి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆమె కాలుకు కాలిపర్స్ సిఫారసు చేసింది. నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఖడ్గపతి చిరునామా ఇచ్చింది. అతను పరీక్షించి అదే ఆసుపత్రిలో కుడి కాలుకు చిన్న సర్జరీ చేయించాడు. ఆతరువాత కాలిపర్స్ తొడిగించి వాకర్ సాయంతో నడవడం ప్రాక్టీసు చేయించాడు. బాబు బడికి పోవడం కాస్తా సులభమయ్యింది.

వేసవి సెలవుల్లో వ్యాయామంలో భాగంగా సైకిలు తొక్కడం నేర్పించాను. వాడు స్వయంగా సైకిలు మీద బడికి వెళ్ళి, రావడం.. మా హృదయాలు తేలిక పడ్డాయి. నేను ఇంట్లో బాబుకు.. వాని స్నేహితులకు ట్యూషన్ చెప్పే వాణ్ణి. నాకు చదువన్నా.. చదివవించడమన్నా ప్రాణమని నీకు తెలుసుగదా మామా!. చదువు యొక్క ప్రాముఖ్యతను బాబుకు తరుచూ చెప్పే వాణ్ణి. నా భార్యకు గూడా ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా ఉద్యోగం రావడం వానిలో మరింత పట్టుదల పెరిగింది.

బాబు పదవతరగతి, ఇంటర్ మీడియట్, డిగ్రీ అన్నీ ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు. ఎం.బి.ఏ. కంప్యూటర్ కోర్సు అప్పుడు హైద్రాబాదులో లేదు. ఎంట్రాన్స్ వ్రాస్తే పూనే యూనివర్సిటీలో సీటు వచ్చింది. జాయిన్ చేసి వచ్చాను. యూనివర్సిటీలో ఐదవ ర్యాంకు వచ్చింది. ఇక వాడు ఇంటి ముఖం చూడ లేదు. క్యాంపస్ సెలెక్షన్­తో ఒక ప్రైవేటు బ్యాంకులో జాయినయ్యాడు. అదే బ్యాంకులో పనిచేసే అమ్మాయి బాబును ప్రేమించింది. బాబుగూడా ఇష్టపడ్డాడు. వివాహం జరిపించాను. ఆతరువాత అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకుని ఇద్దరూ ఎగిరి పోయారు. ఇప్పుడు వానికో కొడుకు” అంటూండగా మామ భోరుమని ఏడ్వడంతో.. నా నోటికి తాళం పడింది. బాలయ్య కళ్ళూ జలపాతాలయ్యాయి. నేను సంతోషంగా నా భాస్కర్ గురించి చెబుతుంటే వీళ్ళిలా ఏడ్వడం..! నిర్ఘాంత పోయాను.

“అల్లుడా.. నడువ లేని నా మనుమడు బాగా సదువుకుంటాండని తెలుసు గాని అమెరికా పోయిండంటే ఎక్కడలేని సంబురమైతాంది. అదంతా సదువు తెలివి. మీ నాయ్న శాన కట్ట పడి సదివిచ్చిండు. నువ్వు కొడుకు అవిటోడని అటేటు పెట్టకుంట బగ్గ సదివిచ్చినౌ. ఫాయిద దక్కింది” అనుకుంట భుజంమీద కండువాతో కళ్ళు తుడ్చుకోసాగాడు.

“మానాయ్న సుత నన్ను సదువుకొమ్మని నా పాణం తినేటోడు. నా దిమాక్ పని సెయ్యలే.. గాయిదిగ తిరిగి నా బతుకు నేనే కరాబు సేసుకున్న. ఇప్పుడు నా కొడుకు..” అనగానే బాలయ్య గుండె పగిలినట్టు దుఃఖం పొంగి పొర్లుతోంది. ఆ శబ్దానికి బాలయ్య భార్య గుమ్మంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె ఎద మీద దాదాపు ఆరేండ్ల అబ్బాయి. కాళ్ళు రెండూ బలహీనంగా కనబడుతున్నాయి. బాలయ్య, పాపయ్య మామల ఆవేదన అర్థమయ్యింది.

“చూడు బాలయ్యా.. ఇప్పటికైనా అర్థమయ్యిందా.. చదువు విలువ. చదువే సర్వస్వం. చదువుకు పేదరికం గానీ.. అంగవైకల్యం గానీ అడ్డురావు. మీరు ఒప్పుకుంటే ఒక సాయం చేస్తాను” అంటూ బాలయ్య దిక్కూ, మామ దిక్కూ చూశాను. వాళ్ళు ఆశ్చర్యంగా నా వంక దీనంగా చూడసాగారు..

“మేమిద్దరం ఉద్యోగారీత్యా బయటికి వెళ్ళడం.. ఇంట్లో పిల్లలెవరూ లేక పోవడం.. మాఅమ్మా, నాన్న బెంగటిల్లినట్టుగా ఉంటున్నారు. నా అల్లుణ్ణి హైదరాబాదు తీసుకెళ్తాను. అక్కడ నా కొడుకు మాదిరిగా నడిపిస్తాను.. చదివిస్తాను” అంటూ బాలయ్య చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాను. బాలయ్య రెండు చేతులు జోడించి దండం పెట్టసాగాడు. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు