"హాయ్!రాజా!" "హోయ్ రాణీ!" "ఏంటి సంగతులూ! ఏంచేస్తున్నారు రాణీగారూ! " "ఏంచేస్తాం!రొటీనే! మాకు ఏంఉంటాయ్? టిఫిన్ లు రెడీ చేయటాలూ! వంటలు చేయటాలూ! పిల్లలకు, భర్తలకు పెట్టుకోటాలూ! పైగా వంకలు పెడితే భరించటాలూ " "భలే చెప్పావ్! మీ టైగర్ ఇంటికొచ్చే టైం అయిందనుకుంటా! ఏంప్రిపేర్ చేస్తున్నావ్!" "పెసరట్టు,ఉప్మా!" "అబ్బ! నాకెంత ఇష్టమో!వచ్చేయనా! అయినా దేవిగారి అనుగ్రహం మామీద లేదుగా! ఎప్పుడూ ఇలా ఛాటింగ్ లో కలుసుకోటమే గానీ నేరుగా కలవనీయవుగా! ప్లీజ్! రానా! ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోతానూ! ఏం? " "అమ్మో! అదేం కుదరదనేగా! ప్రతిరోజూ అనేక కోణాల లో నావీ మా ఫామిలీ ఫొటోలు పెడుతూనేఉన్నా! తృప్తి లేదా? "లేదు! నీ మాటలు వింటుంటే ఎప్పుడెప్పుడు, నీ ఎదురుగా కూర్చుని కళ్ళల్లోకి చూస్తూ, కబుర్లు చెప్పలా అనిపిస్తోంది. అందులోనూ నీ ఫొటోలు మరీ ఊరించేస్తునాయ్. " "అహా! ఈ మాటలు మీ ఆవిడ విన్నదనుకో అప్పుడు అవుతుంది అయ్యగారి పెళ్ళి" "అబ్బా! మధ్యలో మీ ఆయన, మా ఆవిడ గోల ఎందుకూ? ఎప్పుడు కలుద్దాం చెప్పు" "వచ్చేనెల మా ఏలూరులో ఓ పెళ్ళి ఉంది. వెడతాను. నీది రాజమండ్రి అన్నావుగా! మధ్యలో విజయవాడ లో రైలు దిగేస్తాను. అక్కడ కొన్నిగంటలు నీతోనే ఉంటా !తర్వాత నీదారినీది నాదారినాది ,ఏమంటావ్! " "దేవిగారు వరమిచ్చారు అదేచాలు, ఇకనుండీ కలలుగంటూ క్షణమెుక యుగం గా గడుపుతా! నా మందాకినీని ఎప్పుడెప్పుడు చూస్తానా!? అనే ఆరాటంలో! "సరే బై! మా ఆయన వచ్చినట్లున్నారు ఉంటా! శ్యామ్ " "ఆయ్ ఆగు మళ్ళెప్పుడూ !ఛాటింగ్ దేవిగారు " "మళ్ళీ ఇదే సమయానికి సరే బై" ఛాటింగ్ క్లోజ్ చేసి తలుపుతీసింది మందాకిని. మందాకిని భర్త లోపలి కొస్తూ "ఏం చేస్తున్నావోయ్! "అన్నాడు. "ఆ~!ఏలూరు నుండి నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి. ఇదిగో శుభలేఖ! అదే విషయం గురించి ఫోన్ లో ఫ్రెండ్ తో చర్చిస్తున్నాను. ఏమండీ వెడతానండీ! ప్లీజ్ రెండు రోజులే పిల్లలేం పసిపిల్లలు కాదు. వాళ్ళ పనులు వాళ్ళే చూసుకోగలరు. ఆరెండు రోజులకు కావాల్సిన ఏర్పాట్లు చేసే వెడతానూ, ~ఏమండీ! " "సరేనోయ్! నీ యిష్టం నేనెప్పుడైనా కాదన్నానా? " "అబ్బ!మావారు ఎంత మంచివారో! " అన్నదే కానీ, ఆసమయంలో మందాకిని మనసులో శ్యాం మెదిలాడు. ఏడాది క్రితం సెల్ ఫోన్ ఫేస్ బుక్ లో కలిసాడు శ్యామ్ .రోజూ పర్సనల్ వాట్సప్లో ఛాటింగ్ లో గంటలుగంటలు గడిపేయటం మెుదలు పెట్టారు.తెగ ముద్దులు, ముచ్చట్లు ఇంట్లో భర్త ఆఫీస్ కు పిల్లలు స్కూల్ కీ వెళ్ళగానే . ఇద్దరూ వివాహితులే, పిల్లలున్నవాళ్ళే. నడివయస్సు వాళ్ళే.బంగారం లాంటి సంసారాలు. పండంటి కాపురాలూ ఆరోజు అనుకున్నట్లుగానే ~ మందాకిని శ్యామ్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, పిల్లలకు జాగ్రత్తగా అన్నీ అమర్చి బయలు దేరుతూ,భర్త ముఖంలోకి చూసింది. అలా ఎందుకు చూసిందో అర్ధంకాక భృకుటి ముడివేసి చూసాడు మందాకిని భర్తకూడా. రైలు ఎక్కబోతుంటే భయంతో కాళ్ళు ఒణికినాయ్. మనసు పరిపరి విధాల పోతోంది. ఎంత ఫోన్ లో ఛాటింగ్ లో గంటలుగంటలు గడిపినా, అతడు అపరిచితుడు. ఉన్నచోట ఉండక ఇంకో నలుగురిని వేసుకొచ్చి ఏదైనా అల్లరి పెడితే దిక్కా! మెుక్కా!? లేదూ! తనే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే? ఎన్ని వినలేదూ? చూళ్ళేదూ ఆన్ లైన్ మోసాలూ, నేరాలూ, తనదాక రాకపోతే, ఎవరూ దేనినీ, లెక్కపెట్టరా? జరిగాక నెత్తీ, నోరూ బాదుకుని, నేరమంతా అవతల వాళ్ళ మీదికి నెట్టేసీ, పోనీ రైలు దిగేస్తే?! అమ్మో అదీ రిస్కే. ఇదంతా నేనెందుకు చేస్తున్నాట్టూ! ఇంత ధైర్యం, తెగింపూ నాలో ఉన్నాయా! అశ్చర్యంగా ఉందే! ఆలోచిస్తూ ఉండగానే విజయవాడ వచ్చేసింది. స్టేషన్ లో దిగింది. శ్యామ్ వచ్చాడు. ఓ క్షణం తడబడ్డారు. ఓక్షణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని, నవ్వుకున్నారు. ఎవరో దారిచూపినట్లు. స్టేషన్ బయటకు నడిచి, ఓ రెస్టారెంట్ లో కూర్చున్నారు. "ఇప్పుడు చెప్పండి ఏమిటీ విశేషాలూ!" శ్యామ్ మెుదటిగా నోరు విప్పాడు. "మీరు చెబితే నేను వింటాను" అంది మందాకిని. "మా ఆవిడా అంతే! నేను మాట్లాడితే తను వింటాఅంటుంది. ఆడవాళ్ళంతా ఒకటే అనుకుంటా! గంటల తరబడి నేనే మాట్లాడాలి.తనకదే ఆనందం " నవ్వాడు శ్యామ్. "మా వారూ అంతే! ఆఫీసు నుండి రాగానే ముచ్చట్లు మెుదలెడతారు.ఆయన మాట్లాడుతూ ఉంటే భలేఉటుంది కాలమే తెలీదు. " అంది మందాకిని. "మెుదటిసారిగా కలిసాం !ఏం తీసుకుంటారూ!" శ్యాం అడిగాడు. "మంచినీళ్ళు తీసుకుంటా! " అని మందాకిని తనే స్వయంగా తెచ్చుకున్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు తాగింది. "మా ఆవిడా అంతే! ఎక్కడి కెళ్ళినా వాటర్ బాటిల్ ఉండాల్సిందే నేను ఇడ్లీ ఆర్డర్ ఇస్తానూ " అంటూ బేరర్ అని కేకేసాడు శ్యామ్. "మా వారూ అంతే! బయటి ఎక్కడి కెళ్ళినా ఇడ్లీ తప్ప, ఆయిలీ ఫుడ్ తినరు. " అంది మందాకిని . ఇదిగో ఇలా సాంబారు లో ఇడ్లీ ముంచుకుని తినటం అంటే మా ఆవిడ భలే ఇష్టపడుతుంది." "అబ్బో సూపర్!మా ఆయన గారైతే చట్నీలేకుండా, ఇడ్లీ అస్సలు తినరు. చట్నీ లేని ఇడ్లీ, మందాకిని లేని ఇల్లూ అని చమత్కరిస్తారు. " "మా ఆవిడైతే! ఏమండీ మీరు లేకపోతే ఇల్లు నిద్రపోతుందండీ అంటుంది" అన్నాడతను. ఇలా మందాకినీ, శ్యామ్ మాట్లాడుతూనే గమనించారు,వాళ్ళు వాళ్ళ గురించి కన్నా, తమ జీవిత భాగస్వాముల గురించే మాట్లాడుతున్నారు తప్ప విషయం ముందుకు సాగట్లా.పరిధిని ఇద్దరూ దాటే ప్రయత్నం చేయట్లేదనీ. బిల్ కట్టేసి, "నేను విజయవాడ లో పనిచూసుకుని వెడతాను మరిమీరూ" అన్నాడు. "నేను బస్టాండ్ కెళ్ళి,మా ఊరు వెళ్ళే బస్ ఎక్కేస్తాను.ఏలూరు పెళ్ళికెళ్ళే మూడ్ లేదు. వెనక్కి వెళ్ళిపోతాను." అంది మందాకిని. ఆటో ఎక్కుతూ అనుకుంది "హమ్మయ్య! అవాంఛనీయ సంఘటనలేం జరగలా!జరగాలనా? కూడదనా? ఏంఆశించితను ఇంత దూరం వచ్చినట్లూ!? ఐనా దొంగవెధవ! పెళ్ళాం గురించి తప్ప ఇంకే విషయమూ మాట్లాడడేం! జీడిపాకం ఫోన్ లో తెగ ప్రేమ ఒలకపోసి ఒకటివ్వరాదూ! ఏమీ గిఫ్ట్ లు లేవా! అని ఏమేమో ! " వెళ్ళిపోతున్న మందాకిని ఎక్కిన ఆటోను చూస్తూ శ్యాం ఇలా అనుకున్నాడు. " అబ్బో!పెద్ద ముదురుకేసు మెుగుడి గురించి తప్ప ఏం మాట్లాడదే! విషయం ముందుకు జరగనీయదే!టెక్కు! మనం కొంచెం ముందడుగు వేసామనుకో! నన్ను వెధవను చేద్దామనేగా!ఐనాఫోన్ లో అంత శృంగారం ఒలికించేదిగా గుంటనక్క" ఐతే ఇద్దరూ ఏకకాలంలో చేసినపని ఒకటి ఉంది,వాట్సప్ లో పరస్పరం ఎదుటివారి నెంబర్ డిలిట్ చేసేయటం.