ఆదివారం ఉదయం టివి వీక్షణంలో మునిగి ఉన్న శశిధర్ సెల్ మోగడంతో ఫోన్ ఎవరినుండి వచ్చిందో చూసాడు. అది కొత్త ఫోన్ నంబర్ కావడంతో సందేహంగా చూసి ఎత్తాడు.
"హల్లో నేనురా శశిధర్! ఎలా ఉన్నావు?" అన్న మాటలు విన్న శశిధర్‌కి మాట్లాడింది ఎవరో అర్థం కాలేదు. కంఠస్వరం కూడా గుర్తుపట్టలేకపోయాడు.
అందుకే అడిగాడు, "ఎవరు మాట్లాడుతున్నారు?" అని.
"అదేంటిరా! నేను శ్రీకాంత్‌ని. నన్ను గుర్తు పట్టలేదా!" అవతల కంఠంలో ఆశ్చర్యం.
అప్పుడు గుర్తు వచ్చింది శశిధర్‌కి. శ్రీకాంత్ తన చిన్నప్పటి స్నేహితుడు. ఒకే ఊళ్ళో కలసి చదువుకున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత విడిపోయారు. శ్రీకాంత్ ముంబైలో ఓ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకాంత్ కుటుంబం అంతా శశిధర్‌కి బాగా తెలుసు. ఊరికి వచ్చినప్పుడల్లా తనను కలసుకొనేవాడు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా వాళ్ళమధ్య మంచి స్నేహానుబంధమే ఉంది. చాలా రోజులైంది ఇద్దరూ కలసి అయినా, మధ్యమధ్య ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఫోన్ వచ్చింది కొత్త నంబర్ నుండి.
"ఒరే! శ్రీకాంతూ! నువ్వట్రా, ఈ కొత్త నంబర్ ఏమిటీ? పాత నంబర్ నా వద్ద ఉందికానీ ఈ నంబర్ లేదే! మరి నీ గొంతు ఏమిటి ఏదోలా ఉంది, జలుబు గాని చేసిందా! నీ గొంతు గుర్తు పట్టలేకపోయాను సుమీ!" అన్నాడు శశిధర్ నొచ్చుకుంటూ.
చిన్నగా దగ్గి, "అవున్రా! జలుబు చేసింది రెండు రోజులనుండి. కొద్దిగా దగ్గు కూడా ఉంది. ఈ మధ్యే జ్వరం వచ్చి తగ్గింది. అందుకే బహుశ గొంతు గుర్తుపట్టకపోయి ఉంటావు." అన్నాడు.
"అవునవును, అందుకే గుర్తుపట్టలేకపోయాను. జలుబూ దగ్గు అంటున్నావు, మందులు సరిగ్గా వేసుకుంటున్నావా? అసలే ఈ మధ్య కరోనా భయం కూడా ఉంది. జాగ్రత్తగా మందులు వేసుకో, ఏమాత్రం అలక్ష్యం చేయకు. ఆరోగ్యం జాగ్రత్త!" ఆదుర్దా పడుతూ స్నేహితుడి ఆరోగ్యపరిస్థితి చూసి సలహా ఇచ్చాడు శశిధర్.
"అలాగేలేరా! మందులు వేసుకుంటూనే ఉన్నాను. అయితే ఇప్పుడు నీకు ఫోన్ చేయడానికి ఓ ముఖ్యమైన కారణం ఒకటుంది. నువ్వు మాత్రమే ఈ సహాయం చెయ్యగలవని నీకు ఫోన్ చేస్తున్నాను." చెప్పాడు.
"అలాగే, చెప్పు నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను" అన్నాడు శశిధర్.
"ఏం లేదు, మా అక్కయ్య, బావగారు అక్కడే ఉంటున్నారు కదా! మా బావగారికి హార్ట్ఎటాక్ వస్తే కళింగ హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళవద్ద పెద్దగా డబ్బులు లేకపోవడంతో నేను కొంత పంపాను. ఇంకా ఓ యాభైవేలు తగ్గాయి. అర్జెంటుగా నువ్వు ఆ యాభైవేలు సర్దావంటే, వారం రోజుల్లో నీకు తీర్చేస్తాను. నేను వాళ్ళ అకౌంట్ నంబర్ పంపుతాను. అందులో డబ్బులు జమ చేస్తే సరి. నేను వీలు చూసుకొని వద్దామనుకుంటున్నాను. వస్తే నిన్ను కలుస్తాను. డబ్బులు మాత్రం వీలైనంత త్వరగా వేయు సుమా. ఆ డబ్బులు అందితేనే ఆపరేషన్‌కి ఏర్పాటు చేస్తారు హాస్పిటల్‌వాళ్ళు.” అన్నాడు.
"అయ్యో! హాస్పిటల్లో ఉన్నారా మీ బావగారు? నేను వెంటనే డబ్బులు ఏర్పాటు చేస్తాను. ఇంతమాత్రానికి నువ్వు మరీ మరీ చెప్పాలట్రా! తప్పకుండా సర్దుతాను." చెప్పాడు శశిధర్ స్నేహితుడి బావ పరిస్థితికి ఆందోళన చెందుతూ.
"చాలా ధన్యవాదాలురా! నువ్వు తప్పకుండా సాయం చేస్తావని నీకు ఫోన్ చేసాను. సరే ఉంటాను. డబ్బులు మాత్రం త్వరగా పంపే ఏర్పాటు చెయ్యు." అని ఫోన్ పెట్టేసాడు.
రెండు నిమిషాల్లో డబ్బులు పంపవలసిన ఆకౌంట్ నంబర్ వచ్చింది సందేశంలో.
డబ్బులు వెంటనే పంపుదామని అనుకున్నవాడల్లా ఎందుకైనా మంచిది కళింగ హాస్పిటల్‌కి వెళ్ళి శ్రీకాంత్ బావగారిని ఓ సారి చూసి వస్తే బాగుంటుందని అనిపించింది శశిధర్‌కి. శ్రీకాంత్ అక్కయ్య కూడా తనకి బాగా తెలుసు. శ్రీకాంత్ బావగారికి పెద్ద వయసేమీ లేదు. ఈ మధ్యే యాభై ఏళ్ళు వచ్చుంటాయి. అంత తక్కువ వయసులో పాపం ఈ గుండెజబ్బెలా వచ్చిందో అని అనుకొని, అయితే ఈ రోజుల్లో జబ్బులకి వయసుతో నిమిత్తం లేదులే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు? డబ్బు సాయం మాత్రమే చేస్తే చాలదు. అక్కడే ఉండి వాళ్ళకి ధ్యైర్యం చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ తన బావగారి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎలాగూ ఇచ్చాడు. అందులో పేరు ఎలాగూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోవచ్చు. శ్రీకాంత్ బావగారిని చూసినట్లూ ఉంటుంది, అక్కడే డబ్బులు కూడా ఇచ్చేయవచ్చని భావించాడు శశిధర్. భార్యకి విషయం చెప్పి, వెంటనే ఏటిఎంకి వెళ్ళి తనవద్ద ఉన్న మూడు కార్డులూ వాడి డబ్బులు తీసి, బైక్‌లో హాస్పిటల్‌కి బయలుదేరాడు.
అరగంటలో కళింగ హాస్పిటల్ చేరి శ్రీకాంత్ బావగారి పేరు చెప్పి ఎంక్వైరీ చేసాడు. అక్కడ కౌంటర్‌లో ఉన్న అతను శశిధర్ చెప్పిన వివరాలు విని కంప్యూటర్‌లో చూసాడు. ఎంత చూసినా ఆ పేరుకనపడకపోతే, శ్రీకాంత్ అక్కపేరు కూడా చెప్పాడు, కానీ కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ఏమీ చెప్పలేకపోయాడు. ఆ పేరు గలవాళ్ళు హాస్పిటల్లో చేరలేదని చెప్పాడతను.
బహుశ తను హాస్పిటల్ పేరు తప్పుగా విన్నాడేమోనని సందేహించి ఉదయం వచ్చిన నంబర్‌కి ఫోన్ చేసాడు. అయితే ఎన్న సార్లు చేసినా, అటువైపు నుండి ప్రతిస్పందన లేదు. కొన్నిసార్లు ఎంగేజ్ వస్తే, కొన్నిసార్లు రింగైనా ఫోన్ ఎత్తడం లేదు. చివరికి విసుగు చెంది తన వద్ద ఉన్న శ్రీకాంత్ పాత నంబర్‌కి ఫోన్ చేసాడు. ఆశ్చర్యం, వెంటనే ఫోనెత్తాడు శ్రీకాంత్.
"ఏమిట్రా! చాలా రోజులకి ఫోన్ చేసావు! ఎలా ఉన్నావు? మా చెల్లెమ్మ ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు?" ఒకేసారి అన్ని కుశల ప్రశ్నలెదురవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు శశిధర్.
"మా క్షేమసమాచారాల సంగతి తర్వాత, ముందు ఈ సంగతి చెప్పు? మీ బావగారిని కళింగ హాస్పిటల్లో చేర్చారా, లేక ఇంకే హాస్పిటల్లో ఉన్నారా? ఉదయం నువ్వు ఫోన్ చేయగానే నేను డబ్బులు ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్‌కి వచ్చానుగాని, ఇక్కడ రిసెప్షన్‌లో ఉన్నవాళ్ళు అతని గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు." చెప్పాడు శశిధర్.
"ఏమిట్రా, తెలివి ఉండే మాట్లాడుతున్నావా? మా బావగారు హాస్పిటల్‌లో చేరడమేమిటీ? నేను ఉదయం ఫోన్ చెయ్యడమేమిటి? డబ్బులు సర్దమనడమేమిటి? నువ్వు చెప్పేదేమిటో నాకు ఒక్కముక్క అర్ధం కావడంలేదు. మా అక్క, బావగారు నిక్షేపంగా ఇక్కడ మా వద్దే ఉన్నారు." ఆశ్చర్యంగా అన్నాడు శ్రీకాంత్.
ఈసారి ఆశ్చర్యపోవడం శశిధర్ వంతైంది.
"అదేంటి! ఉదయం నువ్వు ఇంకో నంబర్ నుండి ఫోన్ చేసి మీ బావగారికి హార్ట్ఎటాక్ వచ్చిందని, మన ఊర్లోనే కళింగ హాస్పిటల్‌లో చేర్చారని, డబ్బులు సర్దుబాటు అవలేదని, యాభైవేలు ఓ ఎకౌంట్‌లో వెయ్యమని చెప్పావు కదా! అప్పటికీ నీ గొంతులో తేడా ఉంటే కొద్దిగా జలుబు, దగ్గు ఉందన్నావు కూడా!" ఆందోళనగా అన్నాడు శశిధర్.
ఆ మాటలు విని పెద్దగా నవ్వాడు శ్రీకాంత్.
"నా వద్ద ఉన్నది ఈ ఫోను నంబర్ ఒక్కటే. నీకెవడో టోపి వేయాలని చూసాడు. మా అక్కా, బావగారు ఇక్కడే చదువుకుంటున్న మా మేనల్లుణ్ణి చూడాలని వారం క్రితం ఇక్కడికి వచ్చారు. నీ ఫోన్ నంబర్ వాడెలాగో సంగ్రహించి మోసం చేయాలని చూసాడు. ఇంకా నయం, నువ్వు హాస్పిటల్‌కి వచ్చావు కాబట్టి నిజం తెలిసింది. బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసి ఉంటే డబ్బులకి రెక్కలొచ్చిఉండేవి. ఇదో కొత్తరకం మోసం. మన పేర్లు, ఫోన్ నంబర్లు సంగ్రహించి ఇలాంటి మోసాలకి పాల్పడుతున్నారు. పోనీ నిజం తెలుసుకోవడానికి నా ఈ నంబర్‌కి చేయలేకపోయావా?" అన్నాడు శ్రీకాంత్.
విషయం తెలిసిన తర్వాత శశిధర్ ఆందోళన తగ్గింది.
"అమ్మయ్య! అయితే మీ బావగారు బాగున్నారన్నమాట! ఇప్పుడు నా ప్రాణానికి హాయిగా ఉంది. ఆ కబురు విన్న వెంటనే నా కాళ్ళు చేతులూ ఆడలేదు. ఇంకేం నాకు తట్టలేదు. నేను డబ్బులు సర్దకపోతే ఆపరేషన్ ఆలస్యం అవుతుందని ఆందోళనలో ఇంకేం ఆలోచించలేకపోయాను. ఇంకా నయం! ఆ అందోళనతోనే డబ్బులు ఎక్కౌంట్‌లో వెయ్యకుండా, హుటాహుటిన హాస్పిటల్‌కి పరిగెట్టుకొచ్చాను. ఇక్కడికొచ్చి విషయం తెలిసిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తోంది. ఒక్కోసారి రింగైనా ఫోన్ ఎత్తలేదు ఆ ఫోన్ చేసిన వాడు. ఉండు, ఇప్పుడు వాడికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇంత ఆందోళనకు గురి చేసినందుకు, మోసం చేయాలని ప్రయత్నించినందుకు ఛడామడా తిడతాను." అన్నాడు శశిధర్.
శశిధర్ మాటలు విన్న శ్రీకాంత్ మళ్ళీ పెద్దగా నవ్వాడు.
"వాడి ఫోన్ ఎంగేజ్ వస్తోందంటే మళ్ళీ ఎవరికో ఎసరు పెడుతుంటాడు. ఫోన్ రింగైనా ఎత్తడు కూడా. ఫోన్ చేయడమే కాని ఫోన్ ఎత్తడమంటూ చేయరు అలాంటివాళ్ళు. ఫోన్ చేసి ఇరుకున పెట్టి ఆకౌంట్ నంబర్లిచ్చి డబ్బులు అర్జెంట్‌గా జమ చేయమంటాడు. ఇలా ఓ వంద మందికి చేస్తే ఓ నలుగురైనా వలలో పడరా అని వాడి ఆశ, కాదు కాదు దురాశ." చెప్పాడు శశిధర్.
"మరి ఈ మోసాలకి అంతే లేదా?"
"సైబర్ క్రైం వాళ్ళకి ఫిర్యాదు చెయ్యొచ్చు. ఆ తర్వాత మరో అవతారమెత్తి ఇంకో రకమైన కొత్త మోసం ఆరంభిస్తారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం ఉత్తమం." చెప్పాడు శ్రీకాంత్.
"నువ్వు అన్నది నిజంరా! అయితే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిస్తే కదా జనం జాగ్రత్తపడతారు. సరే! మీరందరూ క్షేమమే కదా! ఇక ఉంటానురా!" అని ఫోన్ పెట్టేసాడు.
ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్‌కి ఆ రోజునుండి వారం రోజులవరకూ సమయం దొరికినప్పుడల్లా కాల్ చేస్తూనే ఉన్నాడు కాని, ఒక్కసారి కూడా దొరకలేదు ఆ మోసగాడు.
-పద్మావతి దివాకర్ల