కర్మన్యేవాధికారిస్తే...!!! - కొత్తపల్లి ఉదయబాబు

karmanyevadhikaraste

సూర్యారావుని చూడటం అదే మొదటి సారి. ఎలక్షన్ డ్యూటీ లో అతని కింద నన్ను మొదటి పోలింగ్ ఆఫీసర్ గా వేసారు. రెండవ ఎలక్షన్ క్లాసు ప్రారంభం లో నా పక్కన కూర్చున్న మాస్టారి ని అడిగాను. అతను సూర్యారావు దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నాడట.

“ పెద్ద తిక్కలోడు.జాగ్రత్త. అన్ని నీచేత చేయించి తానే చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. అన్నింటికీ ‘అలాగే’ అని తలూపు, నీకు వర్క్ అంతా తెలిసినా సరే. ఎం.ఎల్. ఎ. గారి చుట్టమని బలుపు ఎక్కువ. చస్తున్నాం రోజు స్కూల్లో. అసలు డ్యూటీ తప్పించేసుకోవదానికి చాలా ప్రయత్నించాడు . ఎలక్షన్ ఆఫీసర్ ఒప్పుకోలేదు.ఇపుడు చచ్చినట్టు ఈ ఎలక్షన్ క్లాసు కి వచ్చాడు.తిక్కకుదిరింది ..”అని ఒక బూతు పదం వాడి అన్నాడతను విసుగ్గా మొహం పెట్టి.

“ అంత బాగా చెప్పేస్తారా ఆ మాస్టారు పాఠాలు?” అడిగాను అమాయకంగా.

నా దృష్టిలో ఎవరు విద్యార్ధుల్ని మెప్పించేలా పాఠం చెబుతాడో ఆయనే అచ్చమైన ఉపాద్యాయుడు. మరి నేనెంత పేరు తెచ్చుకున్నానో నాకైతే తెలీదు.

“నామొహం .అక్షరం ముక్క రాదు.ఎపుడు చూడు క్లాస్ లో నిద్ర పోతుంటాడు. చెప్పేది సోషలు సబ్జక్ట్.ఎపుడూ వంద శాతమే.అదేం అదృష్టమో. ఇంకో విషయం తెలుసామీకు?” అడిగాడతను.

“ఏమిటది” ప్రశ్నించాను.

“వాడికి ఈ వుద్యోగం టాలెంట్ మీద రాలేదు. ‘మా బంధువుల అమ్మాయిని చేసుకుంటే పోస్ట్ క్షణాల్లో వేయిస్తాను.‘అన్నాడట ఎం.ఎల్.ఎ. గారు.

“ముందు పోస్ట్ వేయించండి ..చేసుకుంటాను.” అన్నాడట ఈ అందగాడు.

అతను పోస్ట్ వేయించాకా ఏడవ నెల గర్భం తో ఉన్న ఒక అమ్మాయిని ఎం.ఎల్.ఎ. గారి దగ్గరకు తీసుకెళ్ళి ‘నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. ఇపుడు ఈ అమ్మాయికి ఏడవ నెల.ఈ అమ్మాయికి అన్యాయం చేసి మీ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాను’ అన్నాడట.

ఎం.ఎల్.ఎ.కి వీడి దెబ్బకి కళ్ళు తిరిగిపోయాయట. వేయించింది ప్రభుత్వ ఉద్యోగం. ఎలా పీకించ గలడు? కసిదీరా రౌడీలని పెట్టించి కొట్టిద్దామనుకున్నాడట. కులపెద్దలు అడ్డుపడి ‘మనకులపోడిని మనమే కొట్టుకుంటే ఎంత అప్రదిష్ట? ‘ అని సవర దీసి ఆపారట.లేకపోతే ఇత్తడైపోయేది మీ గురువు గారికి “ అని పకపకా నవ్వాడతను.

“ నాగురువేంటి? మీ ప్రధానోపాధ్యాయుడు కదా..” అన్నాను నేను.

“ ఈ ఎలక్షన్ డ్యూటీ అయ్యేంతవరకు మీ గురువే..” అన్నాడతను మళ్ళీ నవ్వి. నేను నవ్వాను.

“కానీ మరో ఘోరం జరిగింది బాసు. “ అన్నాడతను సీరియస్ గా ముఖం పెట్టి.

“ మళ్ళీ ఏమైంది” అడిగాను ఆత్రుతగా.

“ఇతను పెళ్లి చేసుకుంటాడని నమ్ముకున్న ఆ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది “

నాకు మైండ్ బ్లాక్ . ఎంత ఘోరం.

“ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు “ అన్నాడతను

“తప్పు. అలా అనుకోవడం. మనకెందుకు లెద్దూ.” తెల్చేసాను నేను.

క్లాసు పూర్తీ అవబోతుంటే ఏ పి.ఓ.కి ఏ ఎ.పి.ఓ.ని కేటాయించారో మైక్ లో చదివి వారిద్దరిని కలుసుకుని ఫోన్ నంబర్స్ పరస్పరం మార్చుకుని ఒకరికొకరు ఎలక్షన్స్ పరిసమాప్తం అయేంతవరకు సహకరించుకోవలసింది గా అధికారులు ప్రకటించి అప్పటికి తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. నా పక్కనున్న మాస్టారు ‘రండి .మావాడికి మిమ్మల్ని పరిచయం చేస్తాను ‘ అని తీసుకెళ్ళి పరిచయం చేసాడు.

“ అహ. నువ్వేనటోయ్...పద్మరాజు అంటే...చాల కష్టపడి పాఠాలు చేబుతావట. పిల్లలచేత మంచి యాక్టివిటీస్ చేయిస్తావట. మంచి కధారచయితవట గా... నీలాంటి వాడు తోడుగా ఉంటె నాలాంటి వాళ్ళు హాయిగా తన్ని పెట్టుకుని పడుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో.” అని తనది చెప్పి నాది తీసుకున్నాడు.

అతని అసిస్టంట్ చెప్పింది నిజమే.ఎలక్షన్ వర్క్ అంతా నాచేత చేయించి నాకు తను వర్క్ అంతా నేర్పించి చేయించుకున్నట్టు తెలిసినవారందరికీ చెప్పాడు.నేను నవ్వు కున్నాను.విడిపోయేటప్పుడు అన్నాడు. “ఈ మండలం లోనే వేరే వేరే చోట్ల పనిచేస్తున్నా ఉండేది టౌన్ లో కాబట్టి కలుసుకుంటూ ఉందాం లే “

‘ సరే సర్ ‘ అన్నాను నేను.

* * *

సీనియారిటీ పెరగడం తో నేను ప్రదానోపాద్యాయుడిని అయ్యాను. భార్య ఇద్దరు పిల్లలతో నా వ్రుత్తి – ప్రవ్రుత్తి చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాను. నా భార్య కాలక్షేపం కోసం ప్రైవేటు కాన్వెంట్ లో ఉపాద్యాయురాలిగా చేరింది.

ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయితో ఉన్న మరో అబ్బాయిని చూపించి “ వీడు శ్రీహర్ష అండీ. మనవాడితోనే కలిసి చదువుతున్నాడు.మనవాడికి నాలుగో రాంక్ వస్తే వాడికి మొదటి రాంక్ వస్తూ ఉంటుంది. మనవాడితో నైట్ స్టడీ చెయ్యడానికి నేనే రమ్మన్నాను. అన్నట్టు వీళ్ళ నాన్నగారు మీకు తెలుసట. పేరు సూర్యారావట.” అంది నా భార్య.

“ఓహో...” అని వాళ్ళ కుటుంబ విషయాలు అడిగాను.వాళ్ళ అమ్మగారికి గుండె నీరసం అని.. ఎపుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారని , అమ్మమ్మ తాతయ్య తమ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకుంటారనీ చెప్పాడు ఆ బాబు.

దాదాపు నెల్లాళ్ళు నైట్ స్టడీ కి వచ్చిన ఆ బాబు మళ్ళీ రాకపోయేసరికి కారణం అడిగాను నా భార్యని.

“ అయ్యో మీకు తెలీదా ...వాళ్ళమ్మగారు పోయారట.” అంది.

హతాశుడినయ్యాను. వెళ్లి పలకరించి వచ్చాను.

మరో 15 రోజుల తరువాత మరో వార్త చెప్పింది.

నిర్ఘాంతపోయాను. సూర్యారావు రెండవపెళ్ళి చేసేసుకున్నాడు తమ బంధువుల తాలూకు అమ్మాయిని. బజార్లో కనిపించినపుడు కంగ్రాట్స్ చెప్పాను. అతను ఏదో చెప్పబోయి వెళ్ళిపోయాడు.

* * *

అందమైన, అన్నోన్యమైన నా సంసారం చూసి సమాజానికే కన్ను కుట్టిందో...నేను చేసిన గత జన్మ పాపమో నాభార్య కి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయి ఇంటికి తీసుకు వచ్చేటంత లోనే తిరగబెట్టి మరణించింది.

ఏడాది పాటు మనిషిని కాలేకపోయాను.తను ఉండగానే పిల్లల పెళ్ళిళ్ళ బాధ్యతలు తీరిపోవడంతో తను లేని లోటు తప్ప మరే ఇబ్బందీ లేదు. తను లేనప్పుడు భోజనానికి ఇబ్బంది పడతానని ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ పెట్టుకుని కర్రీస్ – కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకోవడం నేర్పింది నా భార్య. అదే నాకు జీవనాధారమైంది. పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు.

సూర్యారావు నన్ను పలకరించడానికి వచ్చాడు. “నాలాగా పెళ్లి చేసేసుకో రాజూ.మగాడివి ఎంతకాలం చెయ్యి కాల్చుకుంటావ్? ఇంకా అయిదేళ్ళు సర్వీస్ ఉందిగా.” అన్నాడు.

నవ్వేసి ఊరుకున్నాను. కానీ నా పిల్లలు ఊరుకోలేదు.

“మీ సాహితీ కృషి నిర్విరామంగా సాగాలంటే మీరు పెళ్లి చేసుకోండి నాన్న.మీకీ వయసులో తోడూ చాలా అవసరం.మా సంసారాల గొడవలో మేము మిమ్మల్ని పొరపాటున నిర్లక్ష్యం చేస్తే మీరు బాధపడతారు.” అంటూ వాళ్లే మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. పద్మిని నాకు భార్యగా దొరకడం నాకు దేవుడిచ్చిన వరం అని తరువాత అర్ధమైంది నాకు.

మరో మూడేళ్ళలో సూర్యారావు రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ కి పిలిచాడు వెళ్లి గార్లెండ్ చేసాను.

ఒకరోజు బజార్ లో కనిపించి “ నువ్ రచయితవి కదా .ఒక సలహా ఇస్తావా? “ అని అడిగాడు.

“వివరంగా చెప్పండి” అన్నాను.

“నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నలభై లక్షల దాకా వచ్చాయి. అవి నా పిల్లవాడికే చెందాలంటే ఏంచెయ్యాలి?”

అడిగాడు.

“ అది నా కష్టార్జితం.నా పిల్లవాడి కే ఇస్తాను. అని చెప్పండి.” అన్నాను

“ రాజూ. నా మొదటి భార్య నన్ను ఏంతో ప్రేమగా చూసేది.తల్లిలా ముందు నా పొట్టచూసేది.నేను డబ్బుతో ఏమైనా చెయ్యగలననే అహంకారంతో ఆమె కు సరి అయిన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేసాను.ఆమె పోయాకా నా కన్న తల్లిదండ్రులు, అన్న దమ్ములు అంతా ‘ఆమె చావుకునువ్వే కారణం’ అంటూ నన్ను వెలివేశారు. పెదకార్యం అయ్యాక ఒక్కరూ నా ముఖం చూడలేదు.వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ముఖాన తలుపేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఆకలి బాధని మించిన బాధ మరేదీ లేదు రాజూ. నాకు వంట రాదు.నాకు ఆస్మా ఉంది.బయట తినలేను.పడదు.అన్నం పెట్టె దిక్కులేక దూరపు బంధువుల సహకారంతో రెండో పెళ్లి చేసేసుకున్నాను. పెళ్ళికి ముందే నా పిల్లవాడికి నా ఆస్తంతా ఇచ్చేసాను.

నా కొడుకు మంచి వాడే.’నా దగ్గరే ఉండు నాన్న’ అంటాడు.కానీ నా కోడలు వాడు ఆఫీసుకు వెళ్ళిపోయాక ‘ఎపుడు వెళ్తారు మావయ్య’ అని అడిగేసేది...ఏ ముఖం పెట్టుకుని ఉండను చెప్పు?...ఈ రెండో ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు. ఇపుడు వచ్చే నలభై లక్షలలో ఇరవై తన పేర పెట్టాలట..నామినీ తనకోడుకుని పెట్టాలట.మిగతా ఇరవై మా ఇద్దరి పేరా జాయింట్ గా పెట్టి ఎవరు ముందు పోయినా మిగతావారు పిల్లలిద్దరికీ చెరొక పది లక్షలూ ఇవ్వాలట.ఇది న్యాయంగా ఉందా చెప్పు.” సూర్యారావు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగి మాసిపోయిన గడ్డం లోకి ఇంకిపోయాయి.

“ అది అన్యాయం .మీరు ఒప్పుకోకండి సర్.” అన్నాను సీరియస్ గా...

“ అలా చేస్తే ఇంక నాకు ఈ అన్నం కూడా దొరకదు రాజూ” అని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు .

నా గుండెలు ఎవరో పిండేసినట్టయింది. ఎలక్షన్ క్లాస్ నాడు వాళ్ళ అసిస్టంట్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

“ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు “...!!!

సమాప్తం

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు