తోడు - డా. శ్రీదేవి శ్రీకాంత్

Accompany

శ్రీమతి పుట్టింటి కి వెళితే ఎంతహాయి. రాణీ ఇండియా వెళ్తుందంటేనే మనస్సు అలా అలా గాలిలో స్వేచ్ఛగా తేలిపోయింది. 'ఇంటికి నేనే మహారాజును. నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లే' అనుకుంటూ సంబరపడిపోయాను. ఎంతో పెద్ద ఆసుపత్రికి సూపరింటెండెట్ని. కానీ, శ్రీమతి నేను ఓనిత్య విద్యార్థినని, ఆమె నాకు గురువు అని అనుకుంటుంది. అంబానీ అయినా,అప్పారావు అయినా..భార్య చేతిలో దాసులేగా!ఒకోసారి మోడీ గారిని తలుచుకుంటే ఈర్ష్య కలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒంటరిని, ఇక నాకు అడ్డుచెప్పేవాళ్ళు లేరు, చదువుకుంటూ...నా ఇష్టమైనంత ఆలస్యంగా పడుకోవచ్చు అనుకున్నాను. "ఎప్పుడూ...ఆపుస్తకాలేనా! కాస్త వంటింట్లోకి రావచ్చుగా!" అంటుంది రాణీ. ఏవో ప్రశ్నలు వేస్తూ...నేను జవాబు చెప్పేలోపు తనే జవాబుచెప్పి సంతృప్తి పడుతుంది. "బాగా చదువుకున్నా....ఇల్లాలు ఇల్లాలేగా?"అనేది నా వాదన. నన్నూ తనతో పాటు వంటింటికి అంకితం చేయాలనే ఆమె ఆరాటం నాకు నవ్వు తెప్పిస్తుంది. "ఎప్పుడు చూసినా ఆసుపత్రి నుండి ఇంటికి వస్తూనే పుస్తకాలు తెరుస్తారు"...అంటూ సనుగుకొంటూ వుంటుంది. నాకు నవ్వే నిత్య చుట్టం. అది చూసి ఉడుక్కోటం ఆమె నిత్య గట్టం. కానీ,ఇప్పుడు..ఆమె పుట్టింటికి వెళితే..నిశ్శబ్ధంగా గోడలన్నీ నాతో మాట్లాడుతున్నాయి. పాపం! ఇంట్లో ఉన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోపోయినా...ఏదో మూల ఇంట్లో రాణీ ఉంది అన్న సందడే నాకు నిండు తనంగా ఉండేది.ఇప్పుడు ఆరు నెలల వరకు రాదు. అవును పెళ్ళాం పుట్టింటికి వెడితే మొగవాడికి స్వాతంత్ర్యం అనుకుంటాము...కానీ... రైలు శబ్ధం లేనిదే నిద్ర రాని స్టేషన్ మాష్టారులాగా, జీతం వచ్చిన వారానికే పరుసు ఖాళీ అయిన చిరుద్యోగి లాగా ఉంది నా పరిస్థితి. భార్య ఇంట్లో లేని శూన్యం భరించి తరించే దేంవుండదు . ఆరు నెలలకు సరిపడా ఏసమాయానికి ఏమికావాలో అన్నీ నాకు సమకూర్చి పదార్థాల పైన పేరురాసి, చక్కగా పేర్చింది చల్ల పెట్టెలో. తనుంటే ఏదీ పట్టించుకునేవాడ్ని కాదు. ఇప్పుడు పెరుగు చెయ్యాలి. తోడులేక పోతే ఎలా? వంట చేయడం రాని నాకు... పెరుగు ఒక్కటి బాగా చేయడంలో కాస్త చెయ్యి తిరిగింది. తింటూ చదువుతూ.. ఏమరుప్పాటులో పాలు కు తోడు మిగల్చలేదు. తోడును తలుచుకుంటే....ఎంతో తాత్విక లోతుల్లోకి వెళ్ళింది నా మనస్సు. నాకుఇంట్లో తోడంటు లేకపోయినా పెరుగు తోడిపెట్టవచ్చు...తోడుంటే ఆధారే వేరు కదా! 'అవును .కాస్త చేంజ్ కూడా కావాలి నాకు. శనివారం వెంకట్ ఇంట్లోనే ఉంటాడు...పెరుగుకు తోడు తెచ్చుకోవచ్చు...కాసేపు వెంకట్ తో కాలక్షేపం చేస్తే?' అనుకున్నదే తడవు, వెంకట్ వాళ్ళ అమ్మగారికోసం ఒక జ్యూస్ డబ్బా తీసుకుని.. తలుపుకు తాళం పెట్టి...సెక్యూరిటీ వేసి మరొక్క మారు చూసుకున్నాను. రాణీ గుర్తొచ్చింది. బయటికి వెళ్తున్నప్పుడు...పదిసార్లు అనేది..."సెక్యూరిటీ వేసామో లేదో" అని. * . *. * వెంకట్ ఇంటి గేట్లో అడుగు పెట్టి కాలింగ్ బెల్ కొట్టాను. పని అమ్మాయి వచ్చి తలుపు తీసింది. నాకు విష్ చేసి కూర్చోమన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళింది. లోపలి నుండి మాటలు...స్పష్టంగానే వినబడుతున్నాయి. "అమ్మా! ఆయన వాళ్ళమ్మకు స్నానం చేయించి...రాగి సంకటి తినిపిస్తున్నారు....ఆవిడ ఈ దేశం వరకు ఎందుకు చెప్పు. ఈవిడ గారిని...ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయ్యొచ్చుగా? ఆమె గారిని చూసుకుంటానికి ఓ పనిమనిషి . దానికి నెల జీతం కాకుండా కాస్త ఎక్కువే ముట్ట చెబుతారు. ఈ రోజు పొద్దుటే లేచి....వాళ్ళ నాన్నకి .... పితృతర్పణo వదిలారు." వెంకట్ భార్య కంఠం గట్టిగా వినిపిస్తోంది. అవతలి గొంతు నాకు వినబడడం లేదు.అంటే ఫోన్ లో మాట్లాడు తోంది అన్నమాట. "బాగా చెప్పవమ్మా! ఈయన ప్రేమలే విచిత్రంగా వుంటాయి. పెద్ద బోడి తల్లి...ఈయనకే ఉన్నట్టు."ఆ మాటలు చాలా వెగటుగా అనిపించాయి నాకు. "అమ్మా! నిన్ను పెద్దయ్యాక నేను అలాగే ఓల్దేజ్ హోమ్ లో పెడతాలే!" కొడుకు అభిరామ్ గొంతు వినిపించింది నాకు. పిల్లవాడు అసాధ్యుడే అనుకున్నాను. పిల్లల్లో అవగాహన ఎక్కువ ఉంటుంది. పరిసరాలు మనుషుల అసంబద్ధ ప్రవర్తన పిల్లల జీవితాన్ని పాడుచెయ్య కూడదు. "ఒరేయ్! అక్కుపక్షి కూతలూ నువ్వూ నూ!... ఎనబై ఏళ్ళు నేను బతుకుతానేంటి?" అంది కొడుకుతో వెంకట్ భార్య సారిక తనపట్ల తనకున్న స్వీయ ఆరాధనా భావంతో. ఇంతలో పనమ్మాయి జేన్ "అమ్మా! పార్థసారథి డాక్టర్ గారు వచ్చారు." అంది. "సరే! నాకు చెబుతావే! మీ అయ్యగారికి చెప్పు" అంది విసుగ్గా. వెంకట్ భార్య సారిక మాటలు వింటూంటే "ఈవిడను నా భార్య రాణీ దగ్గర ట్రైనింగుకి పెట్టాలి. రాణీకి మా అమ్మా నాన్న అంటే ఎంతో గౌరవం. అమ్మ మాత్రం... రాణీ తో స్నేహితురాలిలా గంటలు గంటలు మాట్లాడుతుంది. మా నాన్న గారంటే ఎంత గౌరవంగా ఉండేది. మా నాన్నగారు చనిపోయినప్పుడు రాణీ ఎంతగా ఏడ్చిందో...తన తండ్రి పట్ల ఎంత ఆరాధనా భావ ముండేదో...అదే భావన మామగారి పట్ల చూపించేది. 'పెరుగు వద్దులే' అనుకుని వెనుతిరిగి గేటు దాకా వెళ్ళాను. "సారధిగారు! రండి" అంటూ పిలిచారు వెంకట్ వెనుకనుంచి. "మీరు బిజీగా ఉన్నారేమో మళ్లీ వద్దాములే అని వెళ్ళబోతున్నాను" అన్నాను. "అబ్బే! పెద్ద బిజీ ఏమీ లేదు. రండి" అన్నారు వెంకట్. "అమ్మగారు ఎలా ఉన్నారు"? అంటూ జ్యూస్ డబ్బా వెంకట్ చేతికిచ్చాను. "రెండు నిముషాలు కూర్చోండి...షర్ట్ వేసుకుని వచ్చేస్తాను" అని లోపలికి వెళ్లారు. "జేన్! అమ్మకు డైపర్ వెయ్యి. చూస్తూ ఉండు. ఈరోజు బాగా నీరసంగా ఉంది" అంటూ పని అమ్మాయికి చెప్పి...బయటికి వచ్చారు. "బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం" అన్నారు. "అలాగే."అన్నాను. ఇద్దరం నడుస్తూ వున్నాం. ఆ ఇంటి వాతావరణం...సారిక మాటలు....వాళ్ళ కొడుకు అభిరామ్ మాటలు...నా మస్తిష్కంలో....చిన్న అలజడిని సృష్టించాయి. "సారధి గారు! ఇండియాలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. మీ శ్రీమతి పిల్లలు ఎలా ఉన్నారు?" అన్నారు వెంకట్. "ఆమె ఇండియాలోనే ఉన్నా...నేను ఎలా ఉన్నాను? సమయానికి నిద్రపోయానా...ఇంకా చదువుతూనే ఉన్నానా, కరోనా సమయం కదా, నేను జాగ్రత్తలు తీసుకున్నానా, ఇవే ఆలోచనలు" అన్నాను. "మీరు అదృష్ట వంతులు" అన్నారు వెంకట్. "కాస్త తోడు పెరుగు కావాలి అని మీఇంటికి వచ్చాను" అన్నాను. "అయ్యో! మరి చెప్పలేదే? సరే వెళ్లేప్పుడు తీసుకుందురు. మహాలయ అమావాస్యకి మా నాన్న గారిపేర ప్రతి సంవత్సరం గుడిలో పంతులు గారికి పొత్తర ఇస్తాను. అమ్మే అన్నీ పెట్టి ఇచ్చేది. ఇప్పుడు అమ్మకు బాగోలేదు. అందుకే కాస్త డబ్బు పంతులుగారి చేతిలో పెడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ తండ్రి చలవే...చదువుకుని డాక్టర్ను అయ్యి ఇంత సంపాదిస్తున్నాను. మీకు ఇప్పుడు గుడికి రావడం కుదురుతుందా?" అన్నారు వెంకట్. " ఇంట్లో ఒక్కడినేగా. పనేమీ లేదు లెండి.."అన్నాను. "సారధి గారు! మధ్య తరగతి కుటుంబంలో అమ్మా, నాన్నల ప్రేమ బంధం....వారి త్యాగాల మధ్య పెరిగాను. ఈరోజు మీరు మా శ్రీమతి మాటలు వినే ఉంటారు. అమ్మకు ఒక వైపు కాలు, చెయ్యి పూర్తిగా పనిచెయ్యడం లేదు. అందుకే నేనే అన్నం తినిపిస్తాను. అభికి నాపోలికే. వాడు వాళ్ళ నానమ్మ మీద మాట పడనియ్యడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో అయ్యాయి అంటారు. బహుశా...నా పెళ్ళి అప్పుడు స్వర్గం చాలా బిజీగా ఉండడంతో నరకంలో అయ్యి ఉండొచ్చు" అన్నారు చెమర్చిన కళ్లతో. ఎప్పుడూ చాలా హుషారుగా ఉండే వెంకట్ ను ఇలా చూడడం ఇదే మొదటి సారి. నేను నిశ్శబ్ధంగా ఉన్నాను. "నాకు మీరు అత్యంత ఆత్మీయులు..నా విషయాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నా నా?"అన్నారు వెంకట్. "నాట్ ఎటాల్. చెప్పండి. చెబితే కాస్త రిలీఫ్ గా వుంటుంది"అన్నాను ఆయన భుజం తడుతూ. "సారధిగారు! సారికకు తెలిసిన వాళ్ళు....ఎవరో, కరోనా వచ్చినప్పుడు వాడిన మందుల లిస్ట్...వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందంట. వారం క్రితం......సారిక దూరపు బంధువుకు కరోనా వచ్చింది. ... వాట్సప్ లో వచ్చిన ఆలిస్టు, వాళ్ళ బంధువులకు పంపి వాడమందిట. ఆ కరోనా సోకినతను... హై బీపీ కి నిత్యం మందులు వాడుతున్న వ్యక్తి. ఈ కరోనా మందుల్లో...కొన్ని హై బీపీ ఉన్న వాళ్ళ గుండె వేగాన్ని పెంచుతాయని మీకు తెలుసుగా! ఆ బంధువుల ఇంట్లో వాళ్ళు...అతనికి...కరోనా వచ్చిన విషయం బయటి వారికి తెలిస్తే నా మోషిగా భావించి...ఆసుపత్రికి వెళ్లకుండా...మా శ్రీమతి ఇచ్చిన మందులు వాడారు. పాపం అతనికి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు."అన్నారు వెంకట్ బాధగా. "ఓ మై గాడ్" అప్రయత్నంగా నా నోట ఆ మాటలు వచ్చాయి. "ఆ విషయం తెలిసిన 'నేను.... సారికా! ఎవరో వాడిన మందుల లిస్ట్....నీకు వాట్సప్ లో వస్తే....నువ్వు అలా వాళ్ళకు వాడమని చప్పట మేమిటి?' అని... నిలదీసాను "అన్నారు వెంకట్. నేను మౌనం గా వింటున్నాను. ..."డాక్టర్ భార్యని...కాస్త గౌరవం పెరుగుతుందని ఆలిస్ట్ నేనే వాళ్ళకోసం రాశాను అని చెప్పాను" అంది తనను తాను సమర్థించు కుంటూ." నిర్ఘాంత పోవడం నా వంతు అయ్యింది.. "ఆవిడ అహంకారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది అన్నారు" బాధతో వెంకట్. " వెంకట్!ఈ వాట్సప్ వల్ల కొన్ని అరిష్టాలు కూడా జరుగుతున్నాయి" అన్నాను యేమి మాట్లాడాలో తెలియక. "నాన్నగారు చనిపోయాక... మా అమ్మను ఇక్కడికి తీసుకురావడం సారికకు ఇష్టం లేదు. నేను, అమ్మా నాన్న అనే ప్రేమ బంధంతో పెరిగాను. వాళ్ళు జీవన విలువల్ని బోధిస్తూ...మంచి వాతావరణంలో నన్ను,చెల్లిని డాక్టర్ చదివించారు." "వెంకట్! మన పేరెంట్స్ ప్రవర్తన , పెంపకం మన మీద ఉంటుంది" అన్నాను. "అమ్మ ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు... ఇంటిపనంతా చేసేది. ఇప్పుడు ఆమె నాకు చంటిపిల్లతో సమానం. సారికకు...మా అమ్మ పక్క మేద కూర్చోడం కూడా అసహ్యమే. ఏమిటీ రొంపి అని ఈసడించు కుంటుంది. అమ్మకున్న శారీరక బాధకంటే...నా భార్య సారిక మాటలు ఆమెను ఈటెల్లా పొడస్తున్నాయి. మా అమ్మనుద్దేసించి "ఈ తద్దినం ఎప్పుడు వదులుతుందో" అంటుంది. అమ్మకు నిత్య నరకం చూపిస్తుంది.నేను చేతగాని వాడిలా వుండవలసి వస్తోంది." "మీ బాధ నేను అర్థం చేసుకోగలను. సారికను ఒకసారి....సైకాలజిస్ట్ కు చూపిస్తే...బిహేవియర్ తెరపీ ఇస్తే...."అన్నాను కాస్త సందేహిస్తూ... "అదీ అయ్యింది...నాకేమన్నా పిచ్చాఅంది" అన్నారు వెంకట్ నిరుత్సాహంగా. "అమ్మ పనులు నేనూ, నా కొడుకు అభి చూసుకుంటాము. నా కూతురికి మళ్లీ వాళ్ళమ్మ పోలికే వచ్చింది. రోజూ నా కూతురికి...బిహేవియర్ థెరపీ ఇస్తున్నాను. ఇల్లాలికి చీడలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు...ఇంటికి చీడ వదలడం...చాలా కష్టం" అన్నారు వెంకట్ మథన పడుతూ. "పనమ్మాయి అమ్మకు సాయం చేస్తుందని,నాకు తెలియకుండా...ఏదో పెద్దమొత్తంలోనే ముట్టచెబుతున్నారు అని సాధింపు. యేమి చెయ్య మంటారు?" "........." "ఇంకో విషయం....మా నాన్నకు పాపం మధుమేహం వల్ల...కళ్ళ సమస్యలు ఉదృతంగా వచ్చి అంతగా కనిపించేది కాదు. ఆయన నడుస్తుంటే....కఱ్ఱ అడ్డుపెట్టిందని విన్నాను. ఆయన ముందుకు పడిపోయారు. ఆ పడిపోవడం...వారం రోజుల్లోనే కాలం చేశారు. ఈరోజు వరకు....ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. అమ్మానాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సారిక నన్ను నానా మాటలు అంటుంటే అమ్మ బాధ వర్ణనాతీతం. ఏమంటే నా మొగుడూ నా ఇష్టం" అంటుంది.ఏనాడో మేం విడిపోవలసిందే..కానీ పిల్లలకోసం..." "వెంకట్! మీరు....భార్య పెట్టే ఇంతటి మానసిక క్షోభతో ఉన్నారు అని ఎప్పుడూ అనుకోలేదు. ఆసుపత్రిలో...ఎంతో ఉత్సాహంగా ఉండే మిమ్మల్ని అందరూ ఆదర్శంగా భావిస్తారు" అన్నాను. "ఇంటి సమస్యలను పని చేసే ప్రాంతానికి చేర వేస్తే పనికి న్యాయం చేకూర్చలేముగా" అన్నారు వెంకట్ నవ్వుతూ.. "సారధిగారు!...."నేను, చెల్లి ఇద్దరం మా అమ్మా నాన్న చేత ఏనాడు ఒక్క దెబ్బ తినలేదు. సారిక పెద్దగా అరుస్తూ పిల్లల్ని గొడ్డును బాధినట్లు బాధుతుంటే....అమ్మ అడ్డు వెళ్ళింది. మా అమ్మను ఒక్క తోపు తోసేసింది. నిజం చెప్పాలంటే.... సారిక తోసినప్పుడు...అమ్మ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది, కాలు తొంటి విరిగింది." "అయ్యో! ఎంతపని?" "అమ్మకు నైటీలు ఇష్టం ఉండదు. చీరలు ఎందుకు...ఈమె గారిని ఎవరైనా చూస్తారా!" అని నైటీ వేసుకోమంటుంది. "అమ్మ పొడవాటి జుట్టుని... కత్తిరించి..పూర్వ కాలం భర్తలు పోయినవారు గుండు చేయించుకునే వారు ఈ కాలంలో జనాలకి షోకులు ఎక్కువయ్యాయి' అంటుంది" అని....చెబుతున్న వెంకట్ గారి కనులనుండి నీరు పొంగింది గోదారి వరదలా.... నా గొంతు పెగలటం లేదు. కానీ... ఓదార్పుగా... "బాధ పడకండి వెంకట్!"..అన్నాను. గుడి వచ్చేసింది... కాళ్లు కడుక్కుని గుడిలో ప్రవేశించాము. కరోనా అయినప్పటికీ.... మహాలయ అమావాస్య...పితృదేవతల పేరు మీదుగా దానం చేసేవారు లైనులో ఉన్నారు. వారిలో ఎంతమంది తల్లిదండ్రులని ఉద్దరించారో తెలియదు. పంతులు గారికి వెంకట్ పారితో షికాన్ని ఇస్తుంటే నేనూ ఇచ్చాను ....పితృదేవతలు తృప్తి పడినట్లనిపించి తేలికయ్యాయి ఇద్దరి మనస్సులు. పితృకార్యాలకు తోడు లేక పోయినా చెయ్యొచ్చు.శుభకార్యాలకు తోడుండాలి. ఇంతలో నా తోడు రాణీ నుండి ఫోను..."శ్రీవారు! ఈ రోజు మహాలయ అమావాస్య,...మామయ్య గారి పేరున పొత్తర్లు ఇచ్చి... అనాథాశ్రమంలో భోజనానికి డబ్బు కట్టాను. వెజిటేరియన్ భోజనమే చెయ్యండి" అంది. రాణీ మాటలు విన్న వెంకట్ "చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.మీకు అనుకూలవతి అయిన తోడు దొరికింది..అదృష్టవంతులు."...వెంకట్ నిధానంగా అంటున్న మాటలు నా చెవిని సోకాయి.పాలు కు తోడు కోసం ఇంక వెంకట్ ఇంటికి వెళ్లబుద్ది కాలేదు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు