తరలి వచ్చిన వసంతం - sannihith

Spring has arrived

వెన్నెల విరగ కాస్తోంది. చల్లగా మంచు కురుస్తోంది. ప్రకృతి అంతా వెండి వెన్నెలలో తడిసి ముద్దవుతోంది. అటువంటి అద్భుతమైన వేళలో ఇంటి పెరటి తోట లో నుండి లీలగా వినవస్తున్న మధురమైన మురళీ గానం ! ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయి ..ఎవరో మంత్రం వేసినట్లు, ఇంకెవరో పిలిచి నట్లు కదిలి అటు వెళ్ళింది . ' ఈ నడికి రేయి వెన్నెల ఎద చలించు ..పిలుపెదొ నా సఖా యని వేగిరించు ! ' ... అప్పుడే చదివిన కృష్టశాస్త్రి భావుకత ఆమెను ఇంకా వెంటాడుతోంది.

అక్కడ ..పెరటి చెట్టు ఆకుల సందుల్లో నుండి జారుతున్న వెన్నెలలో గంధర్వుడి లా కూర్చుని ఉన్నాడు శ్రీకాంత్‌ ... దీక్షగా వేణుగాన సాధన చేస్తున్నాడు. ఆమె పద సవ్వడికి అతడికి తపో భంగమైంది.

కళ్ళు తెరిచి "నువ్వా ! " అంటూ ఆశ్చర్యపోయాడు

" అవును నేనే ! ఏం రాకూడదా ? " అంది .

" అలాగని కాదు ...ఈ వేళలో..." అతడి గొంతులో సందిగ్ధం.ఆ సందిగ్థతకి కారణం ఉంది. అతడు ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్‌ కూతురు ఆ అమ్మాయి. ఈ మధ్యనే వారిద్దరి చూపులు కలుసుకున్నాయి. తర్వాత మనసులు కలిసాయి. అది కాస్త ముదిరి ప్రేమ గా మారింది. ఆ చనువుతోనే ఆమె ఇప్పుడు అతడిని సమీపించింది... కానీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని అతడి భయం.

ఆమె " నేను వచ్చేదేమిటి శ్రీ... నీ మురళీ గానమే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది. " అంటూ అతడి సరసనే కూర్చుంది. అతడు ఆమెని వారించలేక అందమైన ఆమె ముఖారవిందాన్ని చూస్తున్నాడు. కలలాంటి ఆమె సన్నిధి అతడిని అచేతనుడిని చేసింది. వెన్నెలలో ఆమె సౌందర్యం ఏ దేవకాంతనో తలపింపజేస్తోంది. ఆమె తన ప్రేయసి కావడం ఎన్ని జంమల పుణ్యమో అనుకుంటూ పరవశంగా ఆమెనలాగే పొదివి పట్టుకున్నాడు. వెచ్చటి ఆమె ఊపిరి అతడి ముఖానికి తగులుతోంది. మెత్తటి ఆమె స్పర్శ ' హాయి ' కి నిర్వచనం చెబుతోంది. అంతవరకు ' మురళి ' ని ముద్దాడిన అతడి పెదవులు అప్రయత్నంగా ఆమె అధరాల్ని చేరుకున్నాయి. అడ్డు చెప్పకుండా తన్మయంగా అల్లుకుపోయిందామె. నింగిలోని జాబిలమ్మ ' సిగ్గుపడి ' పరుగెత్తుకుంటూ వెళ్ళి మబ్బు చాటున దాక్కొంది.

* * *

ప్రశాంతంగా రూములో కూర్చుని టేప్‌ రికార్డర్లో ప్లే అవుతున్న ఒక ఇంగ్లీషు పాటను వింటూ నొటేషన్‌ వ్రాసుకుంటున్నాడు శ్రీకాంత్‌. దాన్ని కీ బోర్డ్‌ మీద వాయిస్తూ సరిచూసుకుంటున్నాడు...

కాకినాడ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లో మూడో సంవత్సరం విద్యార్థి అతను . తండ్రి పోరు పడలేక ఇంజనీరింగ్‌ లోకొచ్చాడు.చదువు కంటే సంగీతం మీదే అతడికి ఇంట్రెస్ట్‌ ఎక్కువ. మంచి గాయకుడు.తబల, గిటార్‌, కీబోర్డ్‌ మొదలైన ఇంస్ట్రుమెంట్స్‌ లో మంచి ప్రవేశం ఉంది. ఒక ఇంజనీర్‌ గా కంటే తన మనసుకి నచ్చిన సంగీత రంగం లోనే వృద్ధిలోకి రావాలన్నది అతడి అభిలాష. అందుకే చదువు మీద అంత దృష్టి నిలపలేకపోతున్నాడు . ప్రొఫెసర్స్‌ , తల్లిదండ్రులు కొంతకాలం మందలించారు. కానీ అతడు వినలేదు. ఇక చెప్పడం మానుకున్నారు. అతడికది మేలే చేసింది... తనదైన ప్రపంచంలో మునిగిపోవడానికి.

"టక్‌..టక్‌..టక్‌..టక్‌.."

తలుపు మీద ఎవరో నాక్‌ చేస్తున్న చప్పుడు. శ్రీకాంత్‌ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా ఇంటి ఓనర్‌ పరబ్రహ్మం !

శ్రీకాంత్‌ ని దాటుకుంటూ లోపలికి వచ్చి , అటూ ఇటూ చూసి ' రూం ని కాస్త శుభ్రంగా ఉంచుకోవయ్యా ! ' అంటూ కుర్చీలో సెటిలయ్యాడు. శ్రీకాంత్‌ కి ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా పరబ్రహ్మం అతడి రూముకి రాడు. నెల చివర్లో అద్దె డబ్బులకోసం మాత్రం ఠంచను గా వస్తాడు. ప్రస్తుతం నెలాఖరు కూడా కాదు. అందుకనే ' విషయమేంటో చెప్పండి ' అన్నట్లు విసుగ్గా చూసాడు.

పరబ్రహ్మం సూటిగా శ్రీకాంత్‌ నే చూస్తూ గొంతు సవరించుకొని చెప్పాడు.

" చూడు బాబూ శ్రీకాంత్‌ ! వయసులో నీవు నా కంటే చాలా చిన్న వాడివి.కనీసం ఆ గౌరవంతో నైనా నేను చెప్పేది వింటావని నమ్ముతున్నాను. నా కూతురుని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను...ఏ లోటూ రాకుండా చూసుకున్నాను. అలాంటిది నీవు ప్రేమ అనే వల వేసి ఆమెను ఎగరేసుకు పోవాలనుకుంటే చూస్తూ ఊరుకోను. చదువు మీద శ్రద్ధ పెట్టు...లేదా నీకిష్టమైన సంగీతం మీదైనా శ్రద్ధ పెట్టు...పైకొస్తావు. అంతే గాని నా కూతురి మీద శ్రద్ధ పెట్టకు... అధః పాతాళానికి జారిపోతావు... జాగ్రత్త ! " అని హెచ్చరించి వచ్చినంత తొందరగా వెళ్ళిపోయాడు. చిన్నగా నిట్టూర్చాడు శ్రీకాంత్‌. గుండె ముక్కలైన ఫీలింగ్‌ కలిగింది శ్రీకాంత్‌ కి !

ఆమెను ప్రేమిస్తూ ..ఆ ఆనందం ఇచ్చే ప్రేరణ తో లక్ష్యం వైపు పయనించాలనుకుంటున్న అతనికి , పరబ్రహ్మం ఇచ్చిన వార్నింగ్‌ అశనిపాతమైంది.పనిగట్టుకుని తనకే వచ్చి చెప్పాడంటే ఇక సొంత కూతురి ని ఇంకెంత కట్టడి చేసాడో ! అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించి లాభం లేదు. ముందు తను ఆమె జీవితం నుండి తప్పుకోవాలి...తన ప్రేమని మొగ్గ దశ లోనే తుంచెయ్యాలి... లేకపోతే అది ఆమెకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది...అని అనుకున్నాడు . చాలా ఆలోచించాక ఇంజనీరింగ్‌ చదువుకి ఫుల్‌ స్టాప్‌ పెట్టేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇష్టం లేని చదువు చదివి ఇప్పుడు ఏదో విధంగా ఇంజనీరింగ్‌ పూర్తిచేసినా భవిష్యత్‌ లో తను అందులో రాణించలేడని అర్థమైంది. తనకిష్టమైన సంగీత ప్రపంచంలోనే కష్టపడి సినిమాల్లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా పైకి రావాలని అనుకున్నాడు. అందుకే చదువుని అర్థాంతరంగా వదిలేసి... పెట్టే బేడా సర్దుకుని... రూము ఖాళీ చేసి రైల్వే స్టేషన్‌ కి వెళ్ళాడు. ప్లాట్‌ ఫాం మీద నిలబడి హైదరాబాద్‌ వెళ్ళే రైలు కోసం ఎదురు చూడసాగాడు .

* * *

నాలుగేళ్ళ తర్వాత ...

సాయంకాలపు గాలులు చల్లగా వీస్తున్నాయి. పేంట్‌ జేబులో చేతులు పెట్టుకుని టాంక్‌ బండ్‌ మీద నడుస్తున్నాడు శ్రీకాంత్‌ !

" కాలేజిలో మారాజులు ఆ గేటు దాటాక ప్రజలవుదురు " అని ఎవరో సినిమా కవి అన్నది ఎంత నిజమో అర్థం కాసాగింది అతనికి. కాలేజీలో ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ హీరో లా ఉండేవాడు. విద్యార్థి జీవితం వదిలి హైదరాబాద్‌ వచ్చి చాలా కాలం అయింది. ఒక చిన్న రూములో అద్దెకుంటూ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కడా అవకాశాలు రాలేదు. సంగీతం పట్ల ఉన్న అభిరుచి పది మంది పెద్ద నిర్మాతలని కలవడానికి అయితే ఉపయోగపడింది కానీ కడుపు నింపే దారి చూపడం లేదు. " ఇష్టమున్నా లేకున్నా కష్టపడి ఇంజనీరింగ్‌ పూర్తిచేసినా పోయేది, ఏదో ఒక జాబ్‌ దొరికి బ్రతుకు బండి నడిచేది " అని కొన్ని వేల సార్లు అనుకుని బాధ పడ్డాడు. కానీ విధి అనేది ఒకటుంటుందని, దాని ప్రకారమే మనిషి జీవితం నడుస్తుందని అతడికి తెలీదు.

" రేయ్‌ ...శ్రీకాంత్‌ ! " అని ఎవరో పిలుస్తుండటంతో ఆగి వెనక్కి తిరిగి చూసాడు.అక్కడ తన క్లాస మేట్‌ హరీష్ ! బైక్‌ మీద కూర్చుని తననే పిలుస్తున్నాడు.

" రేయ్‌ నువ్వా ! ...ఎంత కాలమైంది నిన్ను చూసి ...బాగున్నావా ? " అంటూ ఆప్యాంగా పలకరించాడు శ్రీకాంత్‌ .

" బాగున్నానురా ...నువ్వెలా ఉన్నావు ? సంగీత దర్శకుడివి అయ్యావా ? నీ లక్ష్యం చేరుకున్నావా ? " అభిమానంగా అడిగాడు.

" లేదురా ...ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను. " నిరాశగా చెప్పాడు. " సరే ...ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ? "

" కాలేజ్‌ లో ఉండగానే కేంపస్‌ ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయ్యాను.ఇక్కడే సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా పని చేస్తున్నాను. " ఎంతో గొప్పగా చెప్పాడు.

" మంచిది రా ...చక్కగా సెటిల్‌ అయ్యావు. నా పరిస్థితే అగంయ గోచరంగా ఉంది " అంటూ నవ్వేసాడు.

" సరే పద...ముందు నా రూం కి వెళదాము " అంటూ బైక్‌ మీద వెనక కూర్చో బెట్టుకుని గేర్‌ మార్చి ముందుకు ఉరికించాడు హరీష్ !

* * *

ఒకరికి విశాలం గాను, ఇద్దరికి ఇరుకుగాను ఉంది హరీష్ రూము.సిటీకి కొంచెం దూరంగా ఉండటంతో ప్రశాంతంగా ఉంది.ఎందుకో చాలా సాంత్వనగా అనిపించింది శ్రీకాంత్‌ కి. తిరునాళ్ళలో తప్పి పోయిన పిల్లాడికి ,సడన్‌ గా తెలిసిన వాళ్ళు కనిపిస్తే కలిగే భరోసా లాంటిదది.

రెండు టీ కప్పులతో వచ్చి కూర్చున్నాడు హరీష్. ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుకోసాగారు.

" నా పెళ్ళి సెటిల్‌ అయ్యింది రా..ఎంగేజ్మెంట్‌ కూడా అయిపోయింది ....తను మన కాకినాడ అమ్మాయే ! " ఆనందంగా చెప్పాడు హరీష్.

" కంగ్రాట్స్‌ రా " అభినందించాడు శ్రీకాంత్‌. తన సెల్‌ ఫోన్‌ తీసి ఆ అమ్మాయి ఫోటో చూపించాడు హరీష్. లైట్‌ గా షాక్‌ అయ్యాడు శ్రీకాంత్‌. ఎందుకంటే ఆ ఫోటో లో ఉన్నది అతను ప్రేమించిన అమ్మాయి. అయినా బయట పడలేదు శ్రీకాంత్‌. మౌనంగా ఉండిపోయాడు.

" ఏంట్రా అలా సైలెంట్‌ అయిపోయావు...అమ్మాయి బాగాలేదా ? " నవ్వుతూ అడిగాడు హరీష్

" అబ్బే అదేం లేదురా ...సడన్‌ గా ఏదో ఆలోచనలో పడ్డాను " అని చెప్పి తప్పించుకున్నాడు.ఇక అక్కడ ఉండలేక వీడ్కోలు తీసుకొని బయటపడ్డాడు.

రోడ్డు మీద నడుస్తున్నాడన్న మాటే గానీ మనసు మనసులో లేదు శ్రీకాంత్‌ కి. నాలుగేళ్ళ క్రితం తను కాకినాడ నుండి ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయి వచ్చాడు. కనీసం తనను ఎంతో ప్రేమించిన అమ్మాయికి కూడా ఒక్క మాటైనా చెప్పకుండా వచ్చేసాడు. తర్వాత ఏం జరిగిందో కూడా తను కనుక్కోలేదు. బహుశా అది తన కెరీర్‌ లోని ఆటుపోట్లవల్ల కావచ్చు. లేదా తనలో అంతర్గతంగా ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల కావచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అది తనను బాధించే విషయమైంది. బహుశా ఆమె తనను మర్చిపోయి ఉంటుంది . అందుకేనేమో హరీష్ తో పెళ్ళికి సిద్ధపడుతోంది. అవునులే.... తన లాంటి తాడూ బొంగరం లేనివాడి కోసం ఎవరు ఎదురు చూస్తారు ? ఎందుకు పెళ్ళిచేసుకుంటారు ? బాధతో కన్నీళ్ళు తిరిగాయి శ్రీకాంత్‌ కి. అలా ఆలోచిస్తూ..ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న బస్‌ కింద పడ్డాడు శ్రీకాంత్‌. కెవ్వున కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయాడు. కానీ అప్పటికే ఆలస్యం అయింది, బస్‌ అతన్ని గాయపరచి ముందుకెళ్ళిపోయింది. రోడ్డు మీద పడి రక్తమోడుతున్న అతడిని ఎవరో ధర్మాత్ములు హాస్పిటల్‌ లో జాయిన్‌ చేసారు. సెల్‌ ఫోన్‌ లో ఉన్న నంబర్‌ చూసి అతని తల్లి దండ్రులకి ఇన్ఫార్మ్ చేసారు. జరిగిన ఈ సంఘటన అతన్ని ఏ దరికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.

* * *

శ్రీకాంత్‌ మూడీ గా అయిపోయి తన రూములోనుండి వెళ్ళిపోవడం హరీష్ అబ్జర్వేషన్‌ నుండి దాటిపోలేదు. అదీ తన కాబోయే భార్య ఫోటో చూసాక ! గతంలో శ్రీకాంత్‌ అద్దెకున్నది వాళ్ళ ఇంట్లోనే అని కాబోయే అత్తమామలు ఒక సారి మాటల్లో చెప్పారు. అంటే ..తన వుడ్‌ బీ తో శ్రీకాంత్‌ కి పరిచయం ఉండే ఉంటుంది. అయితే అది కేవలం పరిచయమేనా లేక అంతకంటే ఎక్కువా అన్నది తెలియాలి . అనుమానించడం తప్పు అని అతనికి తెలుసు. కానీ పెళ్ళయ్యాక అనుమానంతో ఆమెను వేధించడం ఇంకా తప్పు కదా ! పెళ్ళికి ముందే అనుమానాలు తొలగి పోతే బెటర్‌ కదా ... అందుకే జరిగింది తెలియాలంటే తను కాకినాడ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రమే బయలుదేరి కాకినాడ వెళ్ళాడు.

కాకినాడలో ...

హరీష్ సడన్‌ గా తమ ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయారు పరబ్రహ్మం దంపతులు !

" రా బాబూ ...బాగున్నావా ? " అంటూ ఆహ్వానించారు.

" బాగున్నాను ...తను లేదా ? " ప్రశ్నిస్తూ చుట్టూ చూసాడు.

" లేదు బాబూ... ఆఫీసుకి వెళ్ళింది. సాయంత్రం వస్తుంది ...కూర్చో బాబూ " అంటూ కాబోయే అల్లుడికి మర్యాదలు చేయసాగారు . సోఫా లో కూర్చుంటూ ఆలోచించాడు హరీష్. తను తెలుసుకోవాలనుకుంటున్నది చాలా డెలికేట్‌ విషయం. తన అనుమానం నిజం కావచ్చు లేదా కేవలం అపోహ కావచ్చు. నిజం కాకపోతే మాత్రం వీళ్ళందరూ హర్ట్‌ అవుతారు. అందుకే జాగ్రత్తగా డీల్‌ చెయ్యాలి అని అనుకున్నాడు.

" కాఫీ తీసుకో బాబూ " అంటూ కప్పు టీ పాయ్‌ మీద పెట్టింది కాబోయే అత్త గారు. కాఫీ తాగుతూ నెమ్మదిగా ఆమె రూములోనికి వెళ్ళాడు హరీష్. రూము చాలా నీట్‌ గా సర్ది ఉంది. పరిశీలనగా చూసాడు. తన అనుమానాన్ని బలపరిచే వస్తువులేవీ అక్కడ కనబడలేదు. అయినా ఆశ చావక జాగ్రత్తగా చూడ సాగాడు. చివరికి బుక్స్‌ రేక్‌ లో ఉన్న ఒక అందమైన డైరీ అతడి దృష్టిని ఆకర్షించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని తెరిచాడు.

మూడేళ్ళ కిందటి డేట్‌ వేసి ఉంది ..దాని కింద -

" మసక బారిన వెన్నెల నీ జ్ఞాపకం.

మరల రాని వసంతం నీ పరిచయం

నిదుర రాని రాతిరి నీపై కలవరం

నా మదిలో చెరిగి పోలేనిది నీ సంతకం "

అందమైన అక్షరాలతో పొందిగ్గా వ్రాయబడి ఉంది కవిత. చిన్నగా నవ్వుకున్నాడు హరీష్ . ' ఆమె మనసులో ఎవరో ఉన్నారు అన్నది స్పష్టమైంది. . అతను శ్రీకాంత్‌ కావచ్చు లేదా ఇంకా ఎవరైనా కావచ్చు . తను మాత్రం కాదు.' అనుకుంటూ అక్కడి నుండి వచ్చేసాడు.

* * *

సెల్‌ రింగయితే లిఫ్ట్‌ చేసి " హలో ! " అన్నాడు హరీష్.

" నేనండీ ...ఇంటికొచ్చి వెళ్ళారంట ...అమ్మ చెప్పింది " అటు నుండి అతని కాబోయే భార్య స్వరం.

" అవును.. కొంచెం పని ఉండి వచ్చాను. మిమ్మల్ని కలవడం మాత్రం కుదర్లేదు. మీరే రావచ్చు కదా హైదరాబాద్‌ "

" వీలు చూసుకొని వస్తాను లెండి "

" ఓకే బాయ్‌ ! " అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసాడు.

ఎందుకో సడన్‌ గా శ్రీకాంత్‌ గుర్తొచ్చాడతనికి. మాట్లాడదామని అతని సెల్‌ కి రింగ్‌ చేసాడు. అటునుండి ఎవరో పెద్దావిడ ఫోన్‌ ఎత్తింది.

" శ్రీకాంత్‌ ఉన్నాడా అండీ ? "

" ఉన్నాడు బాబూ...నేను వాడి అమ్మని ...ఫోన్‌ ఇస్తానుండు " అని చెప్పి ఫోన్‌ కొడుక్కి ఇచ్చింది.

" హలో ..ఎవరూ ? " బలహీనంగా పలికింది శ్రీకాంత్‌ స్వరం

" నేను రా ...హరీష్ ని...ఎలా వున్నావు..నీరసంగా ఉంది గొంతు "

" ఎలా వుంటాను రా ...నిన్ను కలిసాక వస్తుంటే ఏక్సిడెంట్‌ అయింది...దేవుడి దయ వల్ల బ్రతికి బట్ట కట్టాను.బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటున్నాను " .

షాక్‌ అయ్యాడు హరీష్. అయినా బయట పడకుండా -

" మైగాడ్‌ ...నువ్వేమీ భయపడకు...నేను వచ్చి కలుస్తాలే ! " అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసాడు .

తర్వాత కాసేపు ఆలోచించాడు. ' ఎలాగూ తను వస్తానంటుంది కాబట్టి శ్రీకాంత్‌ ని చూడటానికి వెళుతూ తనని కూడా తీసుకెళితే మంచిది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందో లేదో అన్నది అక్కడ బయట పడుతుంది ' అనుకుంటూ రిలీఫ్‌ గా ఫీల్‌ అయ్యాడు.

* * *

హాస్పిటల్‌ వాతావరణం వచ్చీ పోయే రోగులతో హడావుడిగా ఉంది. హరీష్ ఆమెతో కలిసి వెతుక్కుంటూ శ్రీకాంత్‌ ఉన్న వార్డ్‌ లోనికి వెళ్ళాడు. తను మొదట రానంది, కానీ అతను బలవంతం చేయడంతో అయిష్టంగానే ఒప్పుకుంది.

బెడ్‌ మీద మగతగా నిద్ర పోతున్నాడు శ్రీకాంత్‌. వాళ్ళ రాకని చూసి అతడిని నిద్ర లేపి బయటకు వెళ్ళింది వాళ్ళమ్మ. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసాడు . అతని చేతి మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమిరాడు హరీష్.శ్రీకాంత్‌ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. నెమ్మదిగా అతని దృష్టి హరీష్ పక్కన నిల్చున్న ఆమె మీద పడింది. క్షణం తర్వాత అతడి మొహలో కొట్టొచ్చినట్లు కనిపించిన ఆనంద రేఖలు ! ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఆరాటం !. కానీ ఆమె మొహం లో మాత్రం ఎటువంటి భావాలు లేవు.

ఇది గమనించాక వారిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉంది అన్న విషయం హరీష్ కు నిర్థారణ అయింది.వారిద్దరికీ ఏకాంతాన్ని కలిగించడానికి అన్నట్లు ఫోన్‌ మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడి నుండి తప్పుకున్నాడు.

* * *

హరీష్ నడుపుతున్న కారు రైల్వే స్టేషన్‌ వైపు స్మూత్‌ గా వెళుతోంది. పక్క సీట్లో ఆమె మౌనంగా కూర్చుని ఉంది. ఇప్పుడు ఆమె తిరిగి కాకినాడ వెళ్ళిపోతోంది . ఎక్కువగా మాట్లాడటం లేదు. హాస్పిటల్‌ లో శ్రీకాంత్‌ ని కలిసినప్పటి నుండి ఆమెది ఇదే స్థితి. నెమ్మదిగా ఆమెని కదిపాడు.

" ఎంత తొందరగా నిన్ను పెళ్ళి చేసుకుంటానా అని ఉంది నాకు ...ఏమంటావు ? "

" చేసుకుందాం...ఎందుకంత తొందర ? నేనేమైనా నిన్ను కాదని అంటానని భయపడుతున్నావా ? "

" కాదు...ఈ లోగా నీ మనసు మారుతుందేమో అని భయం " నిర్మొహమాటంగా చెప్పాడు

" అంత సీన్‌ లేదు...నా మనసు ఎప్పుడో ఫ్రీజ్‌ అయిపోయింది "

" నా మీదేనా ? " ఆశగా అడిగాడు.

ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. " మీరు మా ఇంటికొచ్చినప్పుడు నా డైరీ చదివారని తెలుసు ..శ్రీకాంత్‌ ని చూడటానికి వెళుతూ నన్ను కూడా ఎందుకు తీసుకెళ్ళారో నాకు అర్థం అయింది " అంది. విస్తుపోవడం హరీష్ వంతయింది !

స్టేషన్‌ లో ఆమెని ట్రైన్‌ ఎక్కించి వచ్చేస్తుండగా ఒక లెటర్‌ ఇచ్చిందామె. ఆశ్చర్యపోతూ " ఏమిటిది ..పెళ్ళికి ముందు ప్రేమ లేఖా ? " అని అడిగాడు.

" కాదు...శ్రీకాంత్‌ చెబుతుంటే నేను వ్రాసాను ... స్నేహితుడి ప్రేమ లేఖ ...నీకు ఇమ్మన్నాడు " అంది . షాక్‌ అయ్యాడు హరీష్ .

ట్రైన్‌ వెళ్ళిపోయింది. ఉత్తరం తెరిచాడు.

" హరీష్ -

నీ అనుమానం కరక్టే ! నేనూ ' వసంత ' గతం లో ప్రేమించుకున్నాం . కానీ మా ప్రేమ ఆమె నాన్నగారికి ఇష్టం లేదు. అందుకే నిశ్శబ్దంగా ఆమె జీవితం నుండి తప్పుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ ఆమెను డిస్టర్బ్‌ చెయ్యలేదు. నన్ను మర్చిపోయి తను ఆనందంగా బ్రతికితే చాలు అన్నది నా ఆశ. కానీ భౌతికంగా ఆమె నుండి దూరం జరిగినా నా మనసులో మాత్రం ఎప్పటికీ ఆమె ఒక చెరగని జ్ఞాపకం. ఆ జ్ఞాపకాల స్పూర్తి తోనే ఇన్నాళ్ళూ బ్రతికేసాను. ఇక మీదట కూడా అలాగే బ్రతకగలను. ఎందుకంటే అటు చదువు పూర్తి చెయ్యలేక ..ఇటు కెరీర్‌ లో స్థిర పడక ..ఏక్సిడెంట్‌ అయి ..జీవఛ్చవం లా ..బ్రతుకుతున్న నాకు.. ఒకానొక స్టేజ్‌ లో జీవీతం మీద ఆశ ఆవిరై ఇంకా ఎందుకు బ్రతికున్నానా అని నిస్పృహ లో ఉన్న నాకు ...ఊపిరి అందింది. ఎందుకో తెలుసా ? మోడు వారిన తోట లాంటి నా జీవితం లోకి మళ్ళీ నువ్వు వసంతాన్ని తీసుకొచ్చావు. నా మధురమైన జ్ఞాపకాన్ని నా ముంగిట నిలిపావు. ఒక జీవిత కాలానికి సరిపడా స్ఫూర్తి ని నాలోకి నింపావు. చాలు మిత్రమా .. నీ అనుమానం నాకు మేలు చేసింది. నా బ్రతుక్కి అర్థాన్ని ..నా గమ్యాన్ని నాకు చూపించింది. ఇక ఎంత కష్టమైనా పడి నన్ను నేను గొప్పగా మలుచుకుంటాను. ఇక పోతే .... ' వసంత ' మనసు నిండా ప్రస్తుతం నువ్వే ఉన్నావు. చాలా అదృష్టవంతుడివి. అది కాపాడుకో . నేను గొప్ప ప్రేమికుడి ని కావచ్చు కానీ ఆమెను అందుకునే అర్హత మాత్రం నీకే ఉంది. కాబట్టి ఎటువంటి అనుమానాలకు తావివ్వకు. ఈ లెటర్‌ కూడా నేను చెబుతుంటే తనే వ్రాసింది... విష యు హేపీ మేరీడ్‌ లైఫ్‌ !

- శ్రీకాంత్‌ "

చిన్నగా నిట్టూర్చాడు హరీష్ ! ... అనుమానం పొరలు తొలగిపోయాయి. మబ్బులు వీడిన ఆకాశంలా అయింది అతని మనసు. సంతోషం ముప్పిరిగొనగా... ' వసంత ' ఇప్పుడు తన జీవితానికి కూడా ' తరలి వచ్చిన వసంతమే ' అనుకుని పార్కింగ్‌ లో ఉన్న కారు వైపు కదిలాడు .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు