ప్రేమబంధం - పద్మావతి దివాకర్ల

Love affair

'ఈ నెల పదకొండో తారీఖున నేను పెళ్ళి చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా హాజరు కావాలి సుమా! నీకు ఫోన్ కలవకపోవడంవల్ల సందేశం పెట్టాను.’ రామారావునుండి క్లుప్తంగా వచ్చిన మెసేజ్ చూసి క్రిష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. నమ్మలేక ఆ వచ్చిన సందేశాన్ని పదేపదే చదవసాగాడు. ఆ తర్వాత వెంటనే రామారావుకి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసాడు. నెట్‌వర్క్ బిజీగా ఉండటం మూలాన ఫోన్ కలవలేదు. మళ్ళీమళ్ళీ ప్రయత్నం చేసేసరికి చివరికి ఎలాగో రామారావుకి పోన్ తగిలింది.

"ఏమిటి రామారావు!...నువ్వు పంపిన మెసేజ్ చదివాను. నిజమా! నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా?" అని ఆశ్చర్యంగా అడిగాడు క్రిష్ణమూర్తి.

"ఏం! నేను మాత్రం పెళ్ళి చేసుకోకూడదా ఏమిటి?" నవ్వుతూ ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానమిచ్చాడు రామారావు.

"అదికాదు గానీ...నువ్వు మరి పెళ్ళి చేసుకోనని భీష్మించుకున్నావు కదా, అందుకు అడిగాను." అన్నాడు క్రిష్ణముర్తి.

"లేదు. ఇప్పుడు నేను పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నెల పదకొండో తారీఖునే నా పెళ్ళి. ఇంక అట్టే రోజులు లేవు. సరిగ్గా వారం రోజులలోనే ఉంది ముహూర్తం. నీలాంటి చాలా ముఖ్యమైన కొద్దిమంది స్నేహితులను మాత్రమే పిలిచాను. నువ్వు మాత్రం తప్పకుండా హాజరవ్వాలి. పెళ్ళి చాలా సింపుల్‌గా జరుగుతుంది ఆర్య భవనంలో. పెళ్ళి వెన్యూ, అడ్రస్ నీకు మెసేజ్ చేస్తాను. నువ్వు మాత్రం సాకులేవి వెతక్కుండా తప్పకుండా రావాలి సుమా." అని మరో మాటకి అస్కారం లేకుండా ఫోన్ పెట్టేసాడు రామారావు. రామారావు హడావుడిగా అన్నా అతని మాటల్లోని ఉత్సాహం గమనించాడు క్రిష్ణమూర్తి. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ రామారావులోని ఉత్సాహాన్ని ఇప్పుడే చూస్తున్నాడు క్రిష్ణమూర్తి.

ముందుగా ట్రైన్‌కి రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరాడు క్రిష్ణమూర్తి. ట్రైన్ఎక్కి తన సీట్‌లో కూర్చున్నాక అలోచనలో పడ్డాడు. ఎంతకీ అతని ఆలోచనలు తెగడం లేదు. అసలు రామారావు జీవితంలో మళ్ళీ పెళ్ళి ఊసెత్తుతాడని తను ఏమాత్రం ఊహించలేదు. రామారావు తల్లితండ్రుల అభ్యర్థన మేరకు చాలా సార్లు అతని వద్ద పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చాడు క్రిష్ణమూర్తి. అయితే ప్రతీసారీ సున్నితంగా తిరస్కరించాడు రామారావు.

క్రిష్ణమూర్తి మనసు గతంలోకి పరుగులు తీసింది. రామారావు, క్రిష్ణమూర్తి ఇద్దరూ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. చిన్నతరగతులనుండి కాలేజి వరకూ కలసి చదువుకున్నారు. ఇద్దరిమధ్యా ఏ మాత్రం అరమరికలు లేవు. చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా వారానికొక్కసారైనా కలుసుకునేవారు ఆ మిత్రద్వయం. మొదట్లో ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉద్యోగంచేయటం వల్ల వాళ్ళకి ఆ అవకాశం ఉండేది. ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరు ఊళ్ళకి బదిలీ అవడంతో పరస్పరం కలుసుకోలేక పోయినా తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూండేవారు.

కాలేజి చదివే రోజుల్లో రామారావు, క్రిష్ణమూర్తి ఇద్దరూ చదువులో పోటీ పడేవారు. సరిగ్గా అదే సమయంలో ఆ కాలేజీలో కొత్తగా చేరింది సరోజ. వాళ్ళ నాన్నగారికి ఆ ఊరికి బదిలీ అవడంతో. ఇప్పుడు వాళ్ళతో చదువులో పోటీకి సరోజ కూడా తయారయ్యింది. ఒక్క చదువులోనేకాక డిబేట్‌లాంటి మిగతా అన్ని విషయల్లోనూ ముగ్గురూ పోటీపడేవారు. కాలేజీ వార్షికోత్సవాల్లో నాటకాల్లో పాల్గొనేవారు. క్రమంగా రామారావు సరోజ ఒకరివైపొకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు. చదువులు పూర్తై ఉద్యోగాల్లో చేరిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనికూడా నిర్ణయించుకున్నారిద్దరూ.

కాని అప్పుడే విధి వక్రించింది. సరోజ తండ్రికి వాళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసింది. తమ కులంకాని రామారావుతో తన కూతురి వివాహం అతనికి ఆమోదయోగ్యం కాలేదు. వారి అంతస్థులో తేడా కూడా వాళ్ళ ప్రేమకి అడ్డుగోడలుగా నిలిచాయి. సరోజని మందలించారు ఆమె తల్లితండ్రులు. ఆమె వినకపోవడంతో కాలేజీ మార్పించి వాళ్ళిద్దరూ కలుసుకోకుండా కట్టుదిట్టం చేసాడు సరోజ తండ్రి. ఆమె చదువు పూర్తికాకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రహస్యంగా సరోజపెళ్ళి కూడా చేసేసాడు.

రామారావెంతో ప్రయత్నించాడు కానీ ఏం చేసినా ఆమె పెళ్ళికి ముందు సరోజని కలుసుకోలేకపోయాడు. తర్వాత ఆమె వివాహం జరిగిపోయిందన్న విషయం తెలిసింది రామారావుకి. తన ప్రేమ విఫలమవడంతో దాదాపు పిచ్చివాడయ్యాడు రామారావు. ఆ షాక్ నుండి అంత తొందరగా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ మరోలోకంలో ఉన్నట్లు ఉండేవాడు. రామారావుని మామూలు మనిషిని చేయడానికి క్రిష్ణమూర్తి ఎంతో కష్టపడ్డాడు. చాలా రోజులవరకూ మామూలు మనిషి కాలేకపోయాడు రామారావు. ఫలితంగా చదువులోనూ వెనకబడ్డాడు. ఎలాగోలా చదువు పూర్తైందనిపించుకున్నాడు.

ఉద్యోగంలో చేరిన తర్వాత రామారావు తల్లితండ్రులు అతని వివాహం చేయాలని ప్రయత్నించారు. సరోజని మరిచిపోలేక పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటికీ క్రిష్ణమూర్తి చేత చెప్పించారు కూడా. క్రిష్ణమూర్తి ఎంత నచ్చచెప్పినా లాభం లేకపోయింది. సరోజని మర్చిపోలేని రామారావు క్రిష్ణమూర్తి మాటలని చెవినపెట్టలేదు. అయిదేళ్ళ తర్వాత రామారావు పెళ్ళి చూడకుండానే అతని తల్లితండ్రులు ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతన్ని పెళ్ళిచేసుకోమని పోరేవాళ్ళుగానీ, పట్టించుకొనేవారు గానీ లేకపోయారు.

అదే సమయంలో క్రిష్ణమూర్తి కూడా ఇంకో ఊరికి బదిలీఅయి వెళ్ళిపోవడంతో రామారావుని పట్టించుకునేవారే లేరు. అయితే ఇద్దరూ తరచుగా ఫోనులో మాట్లాడుకునేవారు. పెళ్ళి చేసుకోవడానికి రామారావు పూర్తిగా విముఖంగా ఉండటంతో, మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు క్రిష్ణమూర్తి.

ఈ లోపు కాలం మరో పదేళ్ళు ముందుకి వెళ్ళింది. ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో పదోన్నతులు పొంది, బదిలీలు అయి దేశంలో చెరో మూలకి చేరుకున్నారు మిత్రులిద్దరూ. భౌతికంగా వారిద్దరి మధ్య దూరం పెరిగిందే కాని, మానసికంగా ఇద్దరు స్నేహితులూ పరస్పరం చేరువుగానే ఉన్నారు. వారానికొకసారైనా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. రామారావు జీవితంలో అసలు పెళ్ళి ఊసు ఎత్తడని భావించిన క్రిష్ణమూర్తికి ఇప్పుడు ఈ వార్త చాలా విస్మయాన్ని కలిగించింది. అందులోనూ, ఇన్నేళ్ళ తర్వాత వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. జీవితాంతం తోడు లేకుండా గడపడం అసాధ్యం అని ఇప్పటికైనా తన స్నేహితుడు గ్రహించినందుకు ఓ పక్క ఆనందంగా ఉంది కూడా. చాలా ఏళ్లు కావడంవల్ల సరోజ జ్ఙాపకాల్లోంచి బయటపడి మొత్తానికి రామారావు వివాహానికి సిద్ధమవడం క్రిష్ణమూర్తికి ఆనందాన్ని కలిగించింది.

మరుసటిరోజు ఉదయమే క్రిష్ణమూర్తిని ట్రైన్ గమ్యస్థానానికి చేర్చింది. స్టేషన్‌కి దగ్గరగా ఉన్న ఓ లాడ్జిలో దిగి స్నానాదులు ముగించుకొని రామారావుకి ఫోన్ చేసాడు. క్రిష్ణమూర్తి హోటల్లో దిగినందుకు రామారావు నొచ్చుకున్నాడు.

"ఒరే!...నువ్విప్పుడు పెళ్ళి పెద్దవి. హోటల్లో దిగి సరిగ్గా పెళ్ళి సమయానికి వస్తావనుకున్నావా ఏమిటి? నేను ఇక్కడ ఉంటున్న ఇల్లు చాలా పెద్దది. వెంటనే హోటల్ వదిలిపెట్టి ఇంటికి వచ్చేయ్!" అన్నాడు రామారావు.

రామారావు అభ్యర్థనమేరకు హోటల్ రూము ఖాళీ చేసి రామారావు ఉంటున్న ఇంటికి చేరాడు క్రిష్ణమూర్తి. ఇంటి వరండాలోనే ఎదురు చూస్తూ నిలబడ్డ రామారావు క్రిష్ణమూర్తిని ఆహ్వానించాడు. చాలా రోజుల తర్వాత రామారావులోని పూర్వపు ఉత్సాహాన్ని చూసాడు క్రిష్ణమూర్తి. ఆ ఉత్సాహం అతని వయసు తగ్గించింది కూడా. మొహంలో కొత్త కళ కూడా వచ్చింది.

"నువ్వు పరాయివాడిలా ఇంత ఆలస్యంగా రావడం ఏమీ బాగాలేదు. రేపే ముహూర్తం. ఇంకా కొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. షాపింగ్ చేయాలి. ఫలహారం చేసి, కాఫీ తాగి బయలుదేరదాం." అన్నాడు.

"ఇన్నాళ్ళకు పెళ్ళి చేసుకోవాలని నీకు బుద్ధి పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందిరా! మొత్తానికి నువ్వుకూడా ఓ ఇంటివాడవుతున్నావు." క్రిష్ణమూర్తి రామారావుని మనస్ఫూర్తిగా అభినందించాడు.

"చెల్లమ్మ ఫోటో ఒక్కసారి చూపించకూడదూ?" కుతూహలంగా అడిగాడు క్రిష్ణమూర్తి టిఫిన్ ముగించి కాఫీ తాగుతూ.

"రేపెలాగూ పెళ్ళిలో చూద్దువుగాని. అంతవరకూ ఓపిక పట్టు. ముందు షాపింగ్ చేసుకొని, పెళ్ళి ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయో ఓ సారి చూసి వద్దాం." చెప్పాడు రామారావు.

***** ***** ***** ***** ***** *****

ఆ మరుసటి రోజు ఉదయమే వాళ్ళిద్దరూ ఆర్య సమాజంకి వెళ్ళారు. అప్పటికే అక్కడికి రామారావు సహోద్యోగులు, ఇతర స్నేహితులు కొంతమంది చేరుకున్నారు. కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.

రామారావు చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు క్రిష్ణమూర్తి. రామారావు స్మృతిపధంనుండి సరోజ రూపాన్ని చెరిపివేసి అతన్ని మెప్పించి వివాహం చేసుకోబోతున్న ఆ అదృష్టవంతురాలెవరో తెలుసుకోవాలని క్రిష్ణమూర్తికి ఆత్రతగా ఉంది.

పెళ్ళి తంతు ఆరంభమైంది. అప్పుడే పెళ్ళిపీటలమిద కూర్చున్న పెళ్ళికూతుర్ని చూసి సంభ్రమానికి లోనయ్యాడు క్రిష్ణమూర్తి. కళ్ళు నులుముకొని మరీ చూసాడు, ఆమె ఇంకెవరో కాదు...సాక్షాత్తూ సరోజలానే ఉంది! ఆమె సరోజా లేక ముమ్ముర్తులా ఆమెనే పోలిన ఇంకెవరోనా తేల్చుకోలేకపోయాడు. ఇదెలా సంభవమైందో క్రిష్ణమూర్తికి ఎంత ఆలోచించినా తట్టలేదు. పెళ్ళి పీటలపై కూర్చున్న రామారావు వైపు చూసాడు విస్మయంగా. రామారావు చిరుదరహాసంతో 'నేను నీకు వివరంగా చెప్తాగా!' అన్నట్లు అనిపించింది క్రిష్ణమూర్తికి.

పెళ్ళి తంతు ముగిసేంతవరకూ అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాడు క్రిష్ణమూర్తి. క్రిష్ణమూర్తి ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. పెళ్ళి తంతు పూర్తైన తర్వాత అందరికీ తన భార్యని పరిచయం చేసాడు రామారావు. సరోజని దగ్గరనుండి చూసి, 'ఆమె సరోజే! సందేహం లేదు.' అనుకున్నాడు. క్రిష్ణమూర్తి వద్దకు వచ్చారిద్దరూ. "ఒరే! మనతోపాటు కాలేజీలో చదివే సరోజ నీకు బాగా గుర్తుంది కదా. నేనిప్పుడు వివాహం చేసుకున్నది ఆ సరోజనే, నేను ప్రాణపదంగా ప్రేమించిన సరోజనే!" ఉద్వేగంతో చెప్పాడు. సరోజ కూడా క్రిష్ణమూర్తిని గుర్తుపట్టింది. రామారావు కళ్ళల్లో ఆనందం, సరోజ కళ్ళల్లో మెరుపులు గమనించాడు క్రిష్ణమూర్తి. వాళ్ళిద్దర్నీ మనసారా అభినందించాడు, కాని అతని మనసులోని సందేహం మాత్రం ఇంకా తీరలేదు.

ఆ తర్వాత భోజనాలు చేస్తున్నప్పుడు రామారావు స్నేహితుడి సందేహం తీర్చాడు.

"ఆరు నెలల క్రితం నేను ఆఫీసు వ్యవహారాల్లో టూర్ వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా సరోజని కలవడం తటస్థించింది. ఆమె తండ్రి బలవంతాన వివాహం జరిపించాడు కానీ, ఆమె సౌభాగ్యం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన ఏడాదిలోపునే భర్తని పోగొట్టుకుందామె. భర్త పోయిన తర్వాత కొద్దిరోజలకే ఆ బెంగతో జబ్బుపడిన తల్లీతండ్రులను కూడా పోగొట్టుకుందా అ దురదృష్టవంతురాలు. ప్రైవేట్‌గా చదువు పూర్తి చేసి ఓ చిన్న ఉద్యోగంలో చేరిందామె. అనుకోకుండా కలసిన ఆమె గురించి అన్ని వివరాలు తెలిసాయి. ఆమె పెళ్ళయిపోయిన తర్వాత నేను మరి వివాహం చేసుకోలేదని తెలిసి ఆమె చాలా బాధపడింది. అప్పుడే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ముందు లోకానికి వెరచినా ఆ తర్వాత ఆమె కూడా దైర్యంగా నా జీవితంలోకి ప్రవేశించడానికి అంగీకరించింది. ఫలితంగా ఈ పెళ్ళిద్వారా ఇద్దరం ఒక్కటయ్యాం." అన్నాడు రామారావు.

అది విన్నాక, "చాలా మంచి పని చేసావు. మీ ప్రేమబంధం గట్టిది. ఆనాటి మీ ప్రేమబంధం ఇన్నాళ్ళకి ఈ నాడు వివాహ బంధంగా మారింది. మీ కాపురం కలకాలం చల్లగా వర్ధిల్లాలి." మనస్ఫూర్తిగా చెప్పాడు క్రిష్ణమూర్తి.

క్రిష్ణమూర్తి మాటలకి వత్తాసు పలుకుతూ గుడిగంటలు మంగళకరంగా మ్రోగాయి.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు