కథానాయిక💕 - చాందినీ బళ్ల

The heroine

"ఏంటే, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావూ? అంతా బాగానే ఉందా!!" అడిగింది దామిని. అప్పటివరకు ఆలోచనల్లో మునిగిపోయి ఎదురుకుండా తనకి ఎంతో ఇష్టమైన బాబా వారి గుడి గోపురం, ఆ పైనే పున్నమి వెన్నెల్లో చంద్రుడు వైపు తదేకంగా చూస్తున్న సాగరిక ఆలోచనల నుండి బయటకు వచ్చింది. "ఏం లేదు అక్కా, మళ్ళీ ఇలా కూర్చుని చూసే రోజు వస్తుందా అని" అంది. "నీకు జరిగేది పెళ్ళి, చంద్రమండలం మీదకు ఏమి పంపటం లేదు నిన్ను" అంది నవ్వుతూ దామిని. "అవునులే, కానీ భయంగా ఉంది" అని నీరసంగా చెప్తున్న చెల్లెలి వైపు చూసింది. గారంగా, ఎంతో మంది ప్రేమానురాగాల మధ్య పెరిగిన సాగరిక, ఇప్పుడు పెళ్ళి అయి కొత్త ఇంటికి వెళ్ళాలి అంటే బాధగా ఉంది, చంద్రబింబంలా మెరిసే ముఖం ఇప్పుడు చిన్నబోయింది. "ఈ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎలా సమంజసం అక్కా!! ఇన్నాళ్ళు ఉన్న ఇల్లు వదిలి వెళ్ళడం, ఎవరో అపరిచితుల మధ్య గడపడం, ఎవరో తెలియని వ్యక్తితో జీవితం పంచుకోవడం, ఊహించుకుంటే చాలా భయంగా ఉంది" అని తల దించుకుని చెప్పింది. " ఈ భయం అందరిలో ఉండేదే" అంటున్న దామిని వైపు చురుకుగా చూసి "అందరూ ఇదే అంటున్నారు" అంది విసుగ్గా. "హ్మ్మ్, నీకు గుర్తుందా, మన చిన్నప్పుడు ఈ వెన్నెల్లో ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం అమ్మా, నాన్నతో కలిసి.." "హహ, మర్చిపోయేంత చిన్నవా ఆ జ్ఞాపకాలు, నేను ఎన్ని సార్లు పడిపోయాను ఆడుతూ, నువ్వెన్ని సార్లు తిట్లు తిని ఉంటావో" అంటూ చిన్నప్పటి కబుర్లు మాట్లాడుకుంటూ.. నెమ్మదిగా తన పెళ్ళి నాటి జ్ఞాపకాలు తీసుకు వచ్చింది దామిని. "నేను ముందు కొన్ని రోజులు నీలా బాధ పడుతూ ఏది సరిగ్గా ఆస్వాదించలేకపోయా!! పెళ్ళి మనకు ఒక కొత్త జీవితానికి నాంది, అలా అని పెళ్లే జీవితం అనను, కానీ పూర్తిగా మనకోసం ఒక తోడు, మనకంటూ ఒక ప్రాణ స్నేహాన్ని ఇచ్చేది పెళ్ళి మాత్రమే.. మొదట్లో నాకు చాలా భయంగా ఉండేది, కానీ అది మాంగల్య బలం అనుకుంటా, లేదా వివాహబంధ బలం ఏమో.. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ కుటుంబం కూడా మనదే అనిపిస్తుంది, చిన్నా చితక గొడవ వచ్చినా అమ్మా, నాన్న నేర్పిన సంస్కారం తిరిగి కలిసిపోయేలా చేస్తుంది. బయట ఎవరైనా ఏమన్నా అన్నా, మా అత్త, మా మామ, నా భర్త అన్న స్వార్థం వస్తుంది, ఆఖరికి అమ్మ, నాన్న వాళ్ళని ఏమన్నా అన్నా తట్టుకోలేనంతగా!! ఇది ఒక్క రోజులో తీరిపోయేది, అర్ధమయ్యేది కాదు, అందుకే నేనిచ్చే ఉచిత సలహా ఏంటి అంటే ఇక్కడ ఉండే ఈ కొన్ని రోజులు హాయిగా అందరితో గడుపు, మళ్ళీ ఇలా ఉండలేం నిజమే, కానీ అప్పుడు వేరే ఆనందాలు వస్తాయి.. పెళ్ళి సవ్యంగా జరగాలి, ఏ లోటూ రాకుండా చూడాలి అన్న తండ్రి తాపత్రయం, పిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఎంత త్వరగా ఎదిగిపోయింది అన్న అమ్మ అనురాగం, చెల్లెలు మరొక ఇంటికి వెళ్ళిపోతుంది, ఆ ఇంటిలో కూడా ఇక్కడలాగా తన ప్రేమతో అందరినీ కట్టిపాడేయాలనే తోబుట్టువు తపన.. అన్నింటినీ మించి మా అందరి ప్రేమని చూడు..ఈ కొన్ని రోజులు భయాలు పక్కన పెట్టు, మనం ఏది మార్చలేం, సరదాగా నవ్వుతూ తుల్లుతూ ఉండు, అదే మాకు కొండంత ధైర్యం, నీకు అందం కూడా..అసలే నీ పెళ్ళిలో నువ్వే కథానాయికవి..ఆలోచనలతో కళ పాడు చేసుకోకు" అంటూ ఉబికి వస్తున్న కన్నీటి చుక్కను చెల్లెలికి కనపడనివ్వకుండా అక్కడే ఆపేసింది బలవంతంగా. **** సంవత్సరం తర్వాత.... "త్వరగా రావే, ఇక్కడ ఏం చేస్తున్నావ్, వెళ్ళు వెళ్ళి స్నానం చేసి రా" అంటున్న అక్క మాటకి కిందకి వెళ్ళి తయారు అయి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున "పున్నమి" పూజ చేయించారు సాగరికకి, వాళ్ళ అమ్మ, అక్క దగ్గరుండి. చలిమిడితో చేసిన దీపం వెలిగించి, అద్ధంలో శరత్ చంద్రున్ని చూసిన సాగరికకు ఎంతో సంతోషంగా ఉంది,మళ్ళీ అక్కతో మాట్లాడిన సంభాషణ గుర్తు వచ్చింది. తిరిగి మళ్ళీ అత్తింటికి వెళ్ళాలి, పుట్టింటిని వదిలి అంటే బాధ వేసింది..కానీ ఉన్న కొన్ని రోజులు హాయిగా గడపాలి అని నిశ్చయించుకుంది, తను కొత్త బాధ్యతలను చేపట్టి, కొత్త బంధాలను అంగీకరించి జీవితంలోకి ఆహ్వానించింది. ఆ పున్నమి వెన్నెల్లో వాళ్ళ ఇద్దరి దగ్గరా ఆశీర్వాదం తీసుకుంది, తనకు కూడా వాళ్ళ లానే అలుపెరుగని ఓర్పు, ధైర్యం, ప్రేమ ఇమ్మని కోరుకుంది తన మనసులోనే.. "కాసేపు ఆ పున్నమి చంద్రుడ్ని చూద్దాం, రండి, కళ్ళకి ఎంతో మంచిది అంట" అంటున్న తల్లి దగ్గర ఇద్దరు కూతుళ్ళు పిల్లల్లా ఒదిగిపోయారు. ఈ సన్నివేశం చూసిన వెన్నెల విరిసింది, జాబిలి మురిసింది.... **** ఎన్ని సార్లు వచ్చినా, ఎంత ఎదిగినా ప్రతి సారి ఆడపిల్లకు పుట్టింటిని వదిలి వెళ్ళాలంటే..మదిలో ఏదో మెలి తిరిగిన బాధ..కానీ మెట్టినిల్లు మన ఇల్లు అవుతుంది..కాబట్టి తప్పదుగా..ఎందుకంటే మనమే కథానాయిక కదా!! చందమామ కూడా రోజూ సాయంత్రం తన ఇల్లు వదిలి మాయం అవ్వాలంటే మనలాగే బాధ పడుతుందేమో..తిరిగి మళ్ళీ రాత్రి వస్తా అన్న ఆశతో..

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు